వైసీపీ ప్రభుత్వం ప్రజల్ని వంచిస్తోంది

వైసీపీ

• సంక్షేమం ముసుగులో హక్కుల్ని కాలరాస్తోంది
• ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక అమలు ఊసే లేదు
• ప్రభుత్వం వద్ద నిధులున్నా పాలకులకు మనసు లేదు
• మధ్యతరగతి వారిని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు
• హక్కులపై పార్టీలకు అతీతంగా పోరాటం చేద్దాం
• అమలాపురంలో మేధావులు, విద్యావేత్తలు, వివిధ సంఘాల నాయకులతో శ్రీ పవన్ కళ్యాణ్

             ‘వైసీపీ ప్రభుత్వం సంక్షేమం ముసుగులో ప్రజల హక్కులను కాలరాస్తోంది.. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ని సవ్యంగా అమలు చేస్తే వీళ్లకి నవరత్నాలతో అవసరం ఏముంది? సబ్ ప్లాన్ ని ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది. ముఖ్యమంత్రి సబ్ ప్లాన్ ను పట్టించుకునే స్థితిలో కూడా లేర’ని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రభుత్వం దగ్గర నిధులు ఉన్నా పాలకులకు ప్రజలకు మంచి చేయాలన్న మనసు లేదని చెప్పారు. ఓటు వేసిన ప్రతి ఒక్కరూ నిలదీయాలి.. ఓ సమస్య మీద పోరాడేటపుడు పార్టీలు, కులాలకు అతీతంగా చేయాలని సూచించారు. మనవాడు తనవాడు అన్న భావన లేకుండా పాలకులపై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు. వారాహి విజయ యాత్రలో భాగంగా గురువారం మధ్యాహ్నం అమలాపురం నియోజకవర్గంలో ప్రముఖులు, మేధావులతో సమావేశమయ్యారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ పాలసీలు, వాటి అమలు తీరుపై వారితో చర్చించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “ఎస్టీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఇష్టానికి మళ్లించేస్తుంటే అడిగే వారు లేరు. సబ్ ప్లాన్ నిధులు ఇతర అవసరాలకు మళ్లించరాదన్న నిబంధన ఉన్నా దాన్ని పాలకులు పట్టించుకోరు. సబ్ ప్లాన్ సవ్యంగా అమలు అవుతుందా? లేదా? ఎందుకు అమలు కావడం లేదు? అనే అంశాలు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఒక సమూహంగా పోరాటం చేయాలి. ఒకప్పుడు మధ్యతరగతి చాలా బలమైన ఆలోచన కలిగి ఉండేది. ఎవ్వరికీ భయపడకుండా బయటికి వచ్చి మాట్లాడే వారు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు.
* ఆర్బీకేల ద్వారా మోసం

     ఆంధ్రప్రదేశ్ రైస్ బౌల్ గా పేరున్న ఉభయ గోదావరి జిల్లాల్లో క్రాప్ హాలిడే ప్రకటిస్తే ఒక్క అధికారి కూడా పరిస్థితిపై లోతుగా అధ్యయనం చేసి రైతులతో మాట్లాడలేదు. నేను వచ్చినప్పుడు మాత్రమే పనులు జరుగతాయంటే ఎలా? ఎవరికి వారు వ్యక్తిగతంగా తమ బాధ్యతలు నిర్వర్తించాలి. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు నిబంధనలు సడలించాలన్న నిబంధన ఉన్నా.. దాన్ని అమలు చేయరు. రైతు భరోసా కేంద్రాల పేరు చెప్పి అడ్డంగా మోసం చేస్తున్నారు. మిల్లర్ ఎవరిదో ఫోన్ పే నంబర్ ఇచ్చి బస్తాకి రూ. 100 లంచం తీసుకుంటున్నాడు. వ్యవసాయం లాభసాటిగా లేదు. సామాన్యుడికి న్యాయం చేసే ప్రభుత్వ పథకాలు ఎన్నో ఉన్నాయి. వాటిని సరిగా అమలు చేస్తే రోజు వారీ వ్యాపారాలు చేసుకునే వారు వడ్డీ వ్యాపారుల బారిన పడాల్సిన అవసరం ఏముంది..? ఇలాంటి అన్ని అంశాల మీద దీర్ఘకాలిక అధ్యయనం అవసరం. ప్రాంతీయ అవసరాలను బట్టి సబ్సిడీలు అమలు చేయాలి.
* గంజాయి హబ్

       రాష్ట్రంలో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదు.. వర్షం కురిస్తే పడవలు తిరిగే రహదారులు.. రాష్ట్రం మొత్తం గంజాయి హబ్ గా మార్చేశారు. యువతను నిర్వీర్యం చేసేశారు. ఇన్ని సమస్యల మధ్య ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. మార్పు అనేది ఆరంభంలో ఎవరికీ కనబడదు. అది ఒక స్థాయికి వచ్చే సమయానికి అంతా తలో చేయి వేస్తారు. పదేళ్లుగా ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పార్టీని ముందుకు తీసుకువెళ్తున్నాం. పార్టీ నిర్మాణం ఒక్క రోజులో జరిగిపోదు. సమాజం పట్ల బాధ్యత ఉన్న వారి కోసం, నిలబడే వారి కోసం జనసేన పార్టీ అన్వేషిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల మధ్య ముందుకు రావడానికి చాలా మందికి రకరకాల భయాలు ఉంటాయి. జనసేన పార్టీని, పార్టీ సిద్ధాంతాలను ప్రజాక్షేత్రంలోకి తీసుకువెళ్తున్నాం. క్షేత్ర స్థాయిలో పార్టీకి బలం ఉండబట్టే ఇంత దూరం ప్రయాణించగలిగాం. వచ్చే ఎన్నికల సమయానికి ఖచ్చితంగా జనసేన పార్టీ అధికారం చేపట్టే స్థాయికి బలపడుతుందన్న నమ్మకం నాకుంది అని అన్నారు.
• మహిళా సాధికారిత.. సమానత్వం సాధించాలి

       అమలాపురానికి చెందిన మేధావులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో చర్చ సందర్భంగా అడ్వకేట్, దళిత బహుజన మహిళాశక్తి సంస్థ సభ్యురాలు శ్రీమతి కొంకి రాజామణి మహిళలు, బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలు, వాటిపై పోరాడుతున్న సమయంలో ఎదురవుతున్న ఇబ్బందులు, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ని ప్రభుత్వం ఏ విధంగా నిర్వీర్యం చేసింది అనే అంశాలను ప్రస్తావించారు. స్వేచ్ఛ.. సమానత్వం.. సమభాగం.. ఆత్మగౌరవం అనే అంశాంలపై ఆమె చేస్తున్న పోరాటాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. గిరిజన ప్రాంతాల్లో ఉండే సంక్షేమ హాస్టళ్లలో బాలికలు తీవ్ర అభద్రతా భావంతో ఉన్న అంశం.. మచిలీపట్నంలో బాలికపై జరిగిన అఘాయిత్యం జరిగిన అంశాలను స్వయంగా ప్రస్తావించారు. శ్రీ ఎ.బి. నాయుడు అనే విద్యావేత్త విద్యా వ్యవస్థలో లోపాలను ప్రస్తావించారు, శ్రీ అడ్డాల గోపాలకృష్ణ కొబ్బరి రైతుల సమస్యలు, కొబ్బరి ఉత్పత్తుల ఆవశ్యకత రైతుల సమస్యలను శ్రీ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. టిడ్కో గృహ లబ్దిదారులకు ముఖ్యమంత్రి శ్రీ జగన్ రెడ్డి రూ. 50 వేల రీఎంబర్స్ చేస్తానని మోసం చేసిన అంశం, కోటిపల్లి-అమలాపురం రైల్వే లైన్ తదితర అంశాలను పలువురు ప్రముఖులు ప్రస్తావించారు. కోస్తా రైల్వే కారిడార్ అంశంపై రాజమండ్రిలో పార్టీ తరఫున ప్రత్యేక వర్క్ షాప్ నిర్వహించనున్నట్టు ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ చర్చా గోష్టిలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేష్, అమలాపురం ఇంఛార్జ్ శ్రీ శెట్టిబత్తుల రాజబాబు పాల్గొన్నారు.
• శ్రీ పవన్ కళ్యాణ్ కి కొబ్బరి పీచు బొమ్మలు
        కోనసీమ ప్రాంతానికి చెందిన మహిళలు కొబ్బరి పీచుతో తయారు చేసిన అందమైన బొమ్మలను శ్రీ పవన్ కళ్యాణ్ కి బహూకరించాలంటూ చర్చా గోష్టిలో పాల్గొన్న ప్రముఖులకిచ్చి పంపారు. కొబ్బరి పీచుతో అందంగా తీర్చిదిద్దిన కలశం, వినాయకుడు, గుర్రం, ఏనుగు, పిచ్చుకగూడు లాంటి బొమ్మలు శ్రీ పవన్ కళ్యాణ్ ని ఆకట్టుకున్నాయి. తనకోసం కళాకృతులు పంపిన ఆడపచులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్