కరెంటు ఛార్జీలు తగ్గాలంటే వైసీపీ ఫ్యాను ఆపాలి

వైసీపీ

• జగన్ పాలనలో.. రాష్ట్రం గంజాయి, దేశద్రోహం కేసులు, ఉపాధి హామీ నిధుల దోపిడీలో నంబరు 1 అయింది
• అన్ని వర్గాలను దోపిడీ చేస్తూ వైసీపీ పాలన
• పెత్తందారులంటే ప్రజల డబ్బును దోచుకునే జగన్ మాత్రమే
• పది మంది పచ్చగా ఉంటే ఓర్వలేడు
• శ్రీ తారకరామ తీర్థ సాగర్ ను వేగంగా పూర్తి చేస్తాం
• నెలిమర్ల నియోజకవర్గ అభివృద్ధికి అండగా ఉంటాం
• నెల్లిమర్ల వారాహి విజయభేరి సభలో శ్రీ పవన్ కళ్యాణ్

‘జగన్ హయాంలో ఎన్టీఆర్ యూనివర్సిటీ నిధులు రూ.450 కోట్లు దోచేశాడు. ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్ ను వారికే తెలియకుండా మళ్లించి రూ.800 కోట్లు మాయం చేశాడు. పంచాయతీల కోసం కేంద్రం ఇచ్చిన రూ.8 వేల కోట్లు నిధులు పక్కదారి పట్టించాడు. ఆఖరికి చెమటోడ్చి కష్టపడే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి రూ.450 కోట్లు అడ్డగోలుగా తీసుకున్నాడు. ఆడబిడ్డల అభయ హస్తం ప్రీమియం నిధులు రూ.2 వేల కోట్లు ఎప్పుడు తీసుకున్నాడో తెలియకుండా తీసుకున్నాడు. ధరల స్థిరీకరణ నిధి నుంచి రూ.500 కోట్లు కాజేశాడు’ అని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసిన జగన్ అనే పెత్తందారుడి పాలనలో రాష్ట్రం ఎంత దిగజారిందంటే… దేశంలోనే గంజాయి రవాణాలో నంబరు 1 అయింది. తనను ఎదురించిన వారిపై దేశ ద్రోహం కేసులు పెట్టడంలో నంబరు 1గా నిలిచింది. జాతీయ ఉపాధి పథకం నిధుల దోపిడీలో నంబరు 1గా రికార్డులకెక్కిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల అప్పుల్లో దేశంలోనే మూడు రెట్లు అప్పు ఎక్కువ అయింది.. రైతు ఆత్మహత్యల్లో మూడో స్థానం, మానవ అక్రమ రవాణాలో 3వ స్థానంలో రాష్ట్రం నిలిచిందని తెలిపారు. స్టార్టప్ ఆలోచనలు ప్రొత్సహించే వారు లేక, యువత నైపుణ్యాన్ని తెలుసుకునే వారు లేక దేశంలోనే స్టార్టప్స్ వ్యాపారాల్లో 15వ స్థానంలో, బీహార్, ఒడిశాల కంటే వెనుకబడ్డామని చెప్పారు. ఇదీ జగన్ చెబుతున్న క్లాస్ వార్. పేదోడిని మరింత పేదోడిగా మార్చడమే ఆయన పాలనలో జరిగిన గొప్ప పని అని ఎద్దేవా చేశారు. బుధవారం నెల్లిమర్ల నియోజక వర్గం సింగవరంలో జరిగిన వారాహి విజయ భేరీ యాత్ర సభలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… “జగన్ మానసిక స్థితి సైకో పాత్ తో పాటు సోషియో పాత్ అని చెప్పొచ్చు. సమాజంలో ఎవడైనా నవ్వుతూ ఉన్నా, బాగా డబ్బులున్నా, ఆరోగ్యంగా ఉన్నా జగన్ చూడలేడు. ప్రజలంతా తన కనుసన్నల్లో ఉండాలి. విమర్శించే వారంతా జైల్లో ఉండాలని ఆలోచించే రకం. అందుకే ఇలాంటి వ్యక్తి పాలన పోవాలని, ప్రజలంతా సుభిక్షంగా ఉండాలనే ఆలోచనతోనే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని బలంగా భావించాను. నాలుగు దశాబ్దాల పాటు రాష్ట్రానికి అండగా ఉన్న పార్టీకి కష్ట సమయంలో అండగా నిలిచి చంద్రబాబు గారిని పరామర్శించిన తర్వాత కూటమి ప్రకటించాను. చాలా మేరకు తగ్గించుకొని, త్యాగాలకు సిద్ధపడి ముందుకు వచ్చాను. ప్రతి ఒక్కరినీ మోసం చేసిన ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపకపోతే ప్రజలు చాలా నష్టపోతారనే బలమైన సంకల్పంతోనే ఇప్పుడు ఎన్నికల బరిలో బలంగా పోరాడుతున్నాం.
• మనలో మనం కొట్టుకు చస్తే… జగన్ పండగ చేసుకుంటాడు
భారతదేశంలో శ్రీరాముడిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. నేను అన్ని మతాలను సమానంగా చూసే వ్యక్తిని, అన్ని ధర్మాలను పాటించే వ్యక్తిని. దేశంలో ఎక్కడా రామాలయం లేని ఊరు ఉండదు. అలాంటిది జగన్ పాలనలో నెల్లిమర్ల నియోజకవర్గంలోని పుణ్య క్షేత్రం రామతీర్థంలో దుండగులు శ్రీరామచంద్రుల వారి తల నరికి, దాన్ని కోనేరులో పడేసినపుడు నాకు బాధేసింది. ఆ తలను అర్చకుడు చేతులతో పట్టుకొని తెస్తూ, ఆయన పెట్టిన కన్నీరు నన్ను కదిలించింది. రామతీర్థం ఘటనలో ఇప్పటి వరకు నిందితులెవరో తెలీదు.. ప్రభుత్వం ఆ కేసులో తీసుకున్న చర్యలు లేవు. అసలెవర్నీ ఇప్పటికీ పట్టుకోలేదు. జగన్ పాలనలో 200కు పైగా హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి. ఏ కేసులోనూ పురోగతి కనిపించదు. ఏ కేసులోనూ నిందితులు బయటకు రారు. జగన్ కు కావాల్సింది ఏమిటంటే మతాల మధ్య గొడవలు సృష్టించాలి. ఆ గొడవల్లో పాలన గురించి ఎవరూ పట్టించుకోరు. మనం కొట్టుకోవాలి. ఆయన సంతోషపడాలి. శాంతిభద్రతలను కాపాడటంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఎన్టీయే కూటమి ప్రభుత్వంతో శాంతిభద్రతల పరిరక్షణకు మొదటి ప్రాధాన్యం ఇస్తాం.
• జగన్ ది ద్వంద నీతి
జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నపుడు విశాఖపట్నం విమానాశ్రయంలోనే ఈగలు తోలుకుంటుంటే ఇప్పుడు భోగాపురం అవసరమా అన్నాడు. భోగపురం రద్దు చేస్తానని చెప్పాడు. విమానాశ్రయం పేరిట భారీగా భూ కుంభకోణాలు, ఇన్ సైడర్ ట్రేడింగ్ లు జరిగాయి అని చెప్పాడు. దీంతో భోగాపురంతోపాటు చుట్టుపక్కల భూముల ధరలు అమాంతం పడిపోయాయి. ఇదే అదనుగా తన అనుచర వర్గంతో భూములన్నీ తక్కువ ధరకే కొనుగోలు చేయించాడు. దొరికిన భూమి దొరికినట్లు కొన్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత చెల్లికి చేయాలి మళ్లీ పెళ్లి అన్నట్లు చంద్రబాబు గారు ఎక్కడైతే శంకుస్థాపన చేశారో, మళ్లీ అక్కడే భోగాపురం గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రాయానికి శంకుస్థాపన చేశాడు. రివర్స్ టెండరింగ్ అని కలరింగ్ ఇచ్చిన వ్యక్తి… చంద్రబాబు గారి హయాంలో ఇచ్చిన జీఎంఆర్ కంపెనీకే మళ్లీ టెండరు కట్టబెట్టాడు. జగన్ ది అంతా ద్వందనీతి. అమరావతి విషయంలోనూ అలాగే మాట్లాడాడు. రాజధానికి 50 వేల ఎకరాలు కావాలని విపక్షంలో చెప్పిన వ్యక్తి, అధికారంలోకి రాగానే మూడు రాజధానుల డ్రామాకు తెరలేపాడు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం అన్నాడు. ఇప్పటికీ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడు. జగన్ చేసే పనులను ‘‘నవనందులు’’ చేసే పనులు అంటారు. పూర్వం మగధ రాజ్యంలో చాణుక్య, చంద్రగుప్తుల కాలంలో నవనందులు చాలా హింస చేసేవారు. అల్లకల్లోలం చేసేవారు. అలాంటి నవనందుల ఆలోచనలున్న జగన్ ను ప్రజలే ఎదుర్కోవాలి. వచ్చే ఎన్నికల్లో సరైన వ్యూహం వేసి, వైసీపీతో పోరాటం చేయాలి.
• తొమ్మిదిసార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు
జగన్ పాలనలో 9 సార్లు కరెంటు ఛార్జీలను పెంచాడు. రకరకాల పేర్లతో ఛార్జీలను వేశాడు. సామాన్యుడు స్విచ్ వేయాలంటేనే భయపడుతున్నాడు. కరెంటు తీగను పట్టుకుంటే కాదు.. కరెంటు స్విచ్ షాక్ తగులుతుందని భయపడాల్సిన పరిస్థితులు వచ్చాయి. దీని కోసం ఇంట్లో ఉన్న ఏసీలను, ఫ్రిజ్ లను వేసవిలో ఆపాల్సిన పనిలేదు. మే 13వ తేదీన ఫ్యాను ను ప్రజలంతా కలిసి ఆపితే ఈ విద్యుత్ బాదుడు తప్పుతుంది. చిన్న గులకరాయికి పెద్ద ప్లాస్టర్ వేయించుకొని జగన్ తిరుగుతున్నాడు. రామతీర్థంలో రాముల వారి విగ్రహం తల నరికేస్తే అది గాయం కాదు.. కడపలో బాబాయ్ మీద గొడ్డలి వేటు పడితే అది గాయం కాదు.. అమర్నాథ్ అనే 15 ఏళ్ల బాలుడ్ని తగులపెట్టేస్తే అది గాయం కాదు.. తనకు తగిలితేనే గాయం… ఆయనకి మాత్రమే బాధ.
• నెల్లిమర్లకు తోడుగా నిలుస్తాం
ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం నాకు తెలుసు. ఇక్కడి ప్రతి సమస్య నాకు తెలుసు. మూడు జిల్లాల్లో వలసలు ఆగి, స్థానికంగా ఉపాధి పెరగాలి. నెల్లిమర్ల జూట్ మిల్లు అవాంతరాలు లేకుండా తిరగాలి. ప్రతి చేనుకీ నీరు – ప్రతి చేతికీ పని అనేది కూటమి ఉమ్మడి లక్ష్యం. భోగపురాన్ని ఆనుకొని ఉన్న కీలకమైన ప్రాంతం నెల్లిమర్ల. వైసీపీ నాయకులు ఇక్కడికి వచ్చి ఏం దోచుకోవాలని, ఎంత దోచుకోవాలి అన్న కుతంత్రాలు వేస్తారు. స్థానికులు ఇళ్లు కట్టుకుందామంటే స్థలం లేకుండా పోయింది. జగన్ తో పాటు అతడి నాయకులు వేల ఎకరాలు కొనేసి, వారి దగ్గర పెట్టుకున్నారు. స్థానికులకు స్థలాలు కరవయ్యాయి. తారకరామ తీర్థ సాగర్ ఈ ప్రాంతవాసులకు తీరని కల. పూసపాటిరేగ, భోగాపురానికి సాగునీరు, తాగునీరు కోసం మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టును వైసీపీ గత అయిదేళ్లలో కన్నెత్తి చూడలేదు. కూటమి ప్రభుత్వంలో ఈ ప్రాజెక్టును ఆగమేఘాల మీద పూర్తి చేస్తాం. నష్టపోయిన ప్రతి రైతుకు ఆర్ అండ్ ఆర్ ప్రోగ్రాం కింద న్యాయం చేస్తాం. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ సమస్యలు ఉన్నట్లే మన్యాలపేటలో కిడ్నీ వ్యాధి గ్రస్తులు ఎక్కువ అయ్యారు. నీటిలో సెల్స్ ఫ్లోరైడ్, మెగ్నీషియం ఉందని తేలింది. ఇక్కడ స్థానిక వైద్యం మెరుగుపడాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పడకల ఆస్పత్రి తీసుకొస్తాం. చంపావతి ఇసుక దోపిడీకి చరమగీతం పాడాలి. ఇసుక దోపిడీ ఆపాలంటే కూటమి ప్రభుత్వం రావాలి. పంచాయతీ అనుమతులు లేకుండానే ఇసుకను ఇష్టానుసారం దోచేస్తున్నారు. ఉన్న వాడి దగ్గరే డబ్బులు పెరుగుతున్నాయి. సామాన్యుడు సామాన్యుడిలాగే ఉండిపోతున్నాడు.
• సబ్ ప్లాన్ నిధులు మళ్లించము
స్థానిక ఎమ్మెల్యే బొడ్డుకొండ అప్పలనాయుడి భూ అక్రమాలకు చెక్ పెడతాం. మత్స్యకారులకు చెందిన భూములు లాక్కున్నారు. పాలనలో ఒక్క రోడ్డు వేయలేదు. కొండలు, గుట్టలు మొత్తం దోచేశారు. 2019లో భోగాపురం కడుతున్నాం అని తెలియగానే, భూముల్లో అవకతవకలు జరిగాయి. ఇతడి అక్రమాలకు కళ్లెం వేస్తాం. కూటమి ప్రభుత్వంలో సబ్ ప్లాన్ ఫండ్స్ ను వారికే ఖర్చు చేస్తాం. ఎస్సీలకు చెందిన 27 పథకాలు పునరుద్ధరిస్తాం. అంబేద్కర్ విదేశీ విద్యా పథకం పేరును అలాగే అమలు చేస్తాం. తూర్పుకాపులు ఇతర ప్రాంతాల్లో ఓబీసీల్లో చేర్చాలని కోరుతున్నారు. దీనిపై ప్రత్యేకంగా మాట్లాడి, తగిన విధంగా పరిష్కరిస్తాం. వ్యర్థాలను శుద్ధి చేయకుండా బయటకు వదిలే వారిపై చర్యలు తీసుకుంటాం. మత్స్యకారులకు తగిన ఉపాధి చూపించే బాధ్యత తీసుకుంటాం. చింతపల్లిలో జెట్టి రావాల్సిన అవసరం ఉంది. ప్రతి 30 కిలోమీటర్లకు చిన్న, పెద్ద జెట్టీలు తీసుకొచ్చేలా చూస్తాం. యువతకు స్కిల్ డవలప్ మెంట్ గణన చేస్తాం. తాగు, సాగు నీరుకు స్థానికంగా 4 చెక్ డ్యాంలు అవసరం ఉంది. అవి నిర్మించేలా చొరవ తీసుకుంటాం. స్టీవ్ జాబ్స్ చెప్పినట్లు నీకు ఏం కావాలో అది అడగాలి అంటారు. నేను అడుగుతున్నాను.. నేను ప్రజల్ని అభ్యర్థిస్తున్నాను. 25 సంవత్సరాల భవిష్యత్తు మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడండి’’ అన్నారు.

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్