“డ్యాములు ఎందుకు కడుతున్నానో.. భూములు ఎందుకు దున్నుతున్నానో నాకే తెలియదు!
నా బ్రతుకొక సున్నా.. అయినా నడుస్తున్నా!
చెట్టుగా ఉంటే ఏడాదికొక్క వసంతమైనా దక్కేది..
మనిషినై అన్ని వసంతాలు కోల్పోయాను!” అంటారు కవి గుంటూరు శేషేంద్ర శర్మ గారు.
కార్మికులను చూసినప్పుడల్లా ఎందుకో నాకు ఈ కవిత గుర్తుకు వస్తుంది. ఈ మే డే రోజున ఈ మాటలు మరోసారి స్ఫురణకు వచ్చాయి అని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో తెలిపారు.
కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకునే ఏకైక వేడుక ‘మే డే’. కష్టే ఫలి అంటారు. ఎక్కడ కష్టం ఉంటుందో.. ఎక్కడ స్వేదం చిందుతుందో అక్కడ సౌభాగ్యం విలసిల్లుతుందనేది జగమెరిగిన సత్యం. కార్మికులు, కర్షకులు లేని దేశం ఉండదు. కార్మికులు లేని దేశం మనజాలదు. వారే దేశానికి రథ సారథులు. ఎండనక వాననక, అన్ని కాలాలు, ప్రతికూల పరిస్థితుల్లో సైతం తమ రక్తాన్ని స్వేదంగా మార్చి దేశానికి, ప్రజలకు సంపదను సమకూర్చే కార్మికులందరికీ మే డే శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. శ్రమైక జీవనంలో తరించే ప్రతీ ఒక్కరికీ నమస్కరిస్తున్నాను అని జనసేనాని పేర్కొన్నారు.