• అధికారంలోకి రాగానే వైసీపీ కంటే మెరుగైన సంక్షేమ పథకాలు అందిస్తాం
• ఏ సంక్షేమ పథకానికీ కోత పడదు
• సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అమలు చేస్తాం
• పోలవరాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తాం
• ఆటో డ్రైవర్ల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా మహిళలకు ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉచితం చేస్తాం
• ఆక్వా సాగుకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకుంటాం
• రాష్ట్రంలో అందరూ స్వేచ్ఛగా జీవించేలా ఎన్డీయే కూటమి ప్రభుత్వం చేస్తుంది
• ఎన్డీయే కూటమికి మద్దతుగా మాట్లాడినందుకు మెగాస్టార్ శ్రీ చిరంజీవిపై వైసీపీ అవాకులుచవాకులు పేలుతోంది
• జగన్ పొగరెక్కి మాట్లాడుతున్నాడు
• నరసాపురం వారాహి విజయభేరి బహిరంగ సభలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్
“ప్రతి చేతికి పని… ప్రతి చేనుకు నీరు” లక్ష్యంతో జనసేన- తెలుగుదేశం- బీజేపీ కూటమి పని చేస్తుందని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. అధికారంలోకి రాగానే వైసీపీ కంటే మెరుగైన సంక్షేమ పథకాలు అందించడంతో పాటు అభివృద్ధిపై దృష్టి పెడతామని చెప్పారు. ఏ సంక్షేమ పథకానికీ కోత పడదని హామీ ఇచ్చారు. రాష్ట్రానికి జీవనాడిలాంటి పోలవరాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామని… నదులను అనుసంధానం చేసి బీడు భూములను సస్యశ్యామలంగా మారుస్తామని అన్నారు. చేతి వృత్తులు, కుల వృత్తులకు పెద్దపీట వేస్తామని, 50 ఏళ్లు దాటిన ప్రతి బీసీకి ఒకటో తేదీనే రూ. 4 వేలు ఫించన్ అందిస్తామని హామీ ఇచ్చారు. ఆదివారం నరసాపురంలో వారాహి విజయ భేరి బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ… “నరసాపురంతో నాకు ఎంతో అనుబంధం ఉంది. ఎన్నో తీపి గుర్తులు నాకు ఈ ప్రాంతంతో ఉన్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బొమ్మిడి నాయకర్ గారు చాలా తక్కువ ఓట్లతో ఓడిపోయారు. ఈసారి ఆయన్ను ఇక్కడ నుంచి భారీ మెజార్టీతో గెలిపించి శాసనసభకు పంపించాలి. జనసేన పార్టీ దశాబ్ద కాలం పాటు ఎన్నో కష్టాలు, ఒడిదుడుకులు ఎదుర్కొని నిలబడింది. మధ్యతరగతి నుంచి వచ్చిన నాలాంటి వాడికి డబ్బు మదం, గుండాగిరి, దోపిడీ వ్యవహారాలు చేసే జగన్ పార్టీని ఎదుర్కోవాలంటే ఎంత సత్తా కావాలో ఒక్క సారి ఆలోచించండి. చిన్న చిన్న టౌన్లలో పెరిగాను. సామాన్యుడు పడుతున్న కష్టాలు తెలుసు. రెండు చోట్ల ఓడిపోయినా ఈ రోజు మీముందు నిలబడ్డాను అంటే దానికి కారణం మీరు చూపించిన ప్రేమ, అభిమానాలే.
• సంక్షేమం, అభివృద్ధిని జోడెద్దుల్లా పరిగెట్టిస్తాం
2024 సార్వత్రిక ఎన్నికలు చాలా కీలకమైనవి. మన భవిష్యత్తును నిర్దేశించే ఎన్నికలు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రం సపోర్టు చాలా అవసరం. అందుకే బీజేపీని కూటమిలోకి తీసుకొచ్చాం. జగన్ మీద ఉన్నట్లు మా మీద అవినీతి కేసులు లేవు. మేము కేంద్రాన్ని ఏదైనా అడిగితే ఏపీ అభివృద్ధి గురించి అడుగుతాం తప్ప… వ్యక్తిగత సహాయాలు అడగాల్సిన అవసరం లేదు. కూటమిలోకి రాకముందు బీజేపీ పెద్దలను ఒకటే అడిగాను… 5 కోట్ల మంది ఆంధ్రులకు అండగా నిలబడాలి అని అడిగితే పెద్ద మనసుతో వాళ్లు ముందుకొచ్చారు.
• హామీల అమలుకు జనసేన బాధ్యత తీసుకొంటుంది
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలనే ఒకే ఒక్క లక్ష్యంతో కూటమి పని చేస్తుంది. అధికారంలోకి రాగానే స్కూలుకి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ. 15,000 చొప్పున ఎంతమంది స్కూలుకు వెళితే అంతమందికి అందిస్తాం. ప్రతి రైతుకు ఏటా రూ. 20,000 ఆర్థిక సాయం చేస్తాం. ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, ప్రతి మహిళకి నెలకు రూ. 15 వందలు ఇస్తాం. ఆటో డ్రైవర్ల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తాం. పేదల కడుపునింపడానికి అన్న క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం ఉన్న బీసీల రిజర్వేషన్లను వైసీపీ 24కు తగ్గించింది. దీంతో చాలా మంది బీసీలు రాజకీయ ప్రాధాన్యం కోల్పోయారు. కూటమి అధికారంలోకి రాగానే బీసీల రిజర్వేషన్లను తిరిగి 34 శాతానికి పెంచుతాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల నిధులను వారి సంక్షేమం, అభివృద్ధి కోసమే వినియోగిస్తాం. ఇక్కడ మహిళలు క్రొయేషియా లేసులు తయారీ చేస్తారు. ఇంట్లో అల్లికలు చేసేవారు. ఒకప్పుడు వేలలో ఉండేవారు, ఇప్పుడు ప్రోత్సాహం లేక వందల్లో ఉన్నారు. వారికి మార్కెటింగ్ సదుపాయాలు కల్పించి మహిళలకు ఆర్థిక సాధికారత కలిగేలా చూస్తాం. జగన్ మాదిరి వెంటనే చేస్తాను, రెండు నెలల్లోనే చేసేస్తాను అని మాయ మాటలు చెప్పడం లేదు. మా కూటమి మాట తప్పదు. హామీల అమలు బాధ్యతను జనసేన తీసుకొంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా రాష్ట్రంలో ప్రజలు స్వేచ్ఛగా జీవించేలా ఎన్డీయే కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఇక్కడ చిరంజీవి గారు, రజినీకాంత్ గారి లాంటి స్టార్స్ కూడా స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు చెప్పలేని పరిస్థితి ఉంది. వారు తమ అభిప్రాయాలు పంచుకోగానే వైసీపీ ఇష్టానుసారం మాట్లాడి వేధిస్తోంది.
• ఆక్వా రంగాన్ని వైసీపీ నిలువునా ముంచేసింది
వశిష్ట గోదావరిపై వారధి నిర్మించాలని ఈ ప్రాంత వాసుల దశాబ్ధాల కల. ఆ కలను కూటమి ప్రభుత్వం సాకారం చేస్తుంది. వశిష్ట వారధి నిర్మించకుండా ఓట్లు అడగబోమని వైసీపీ నాయకులు గత ఎన్నికల్లో చెప్పారు. వాళ్లు ఓట్లు అడగడానికి మన ఇంటికి వస్తే వంతెన నిర్మించ లేదు ఓట్లు అడిగే హక్కు లేదని చెప్పండి. వైసీపీ ప్రభుత్వం ఆక్వా పరిశ్రమను నిండా ముంచింది. ఏటా వేలాది కోట్లు విదేశీ మారకద్రవ్యం తెచ్చిపెట్టే ఆక్వా రంగాన్ని జగన్ ప్రభుత్వం సర్వనాశనం చేసింది. మద్దతు ధర సంగతి పక్కనబెడితే, ఇవ్వాల్సిన రాయితీలకే జగన్ ప్రభుత్వం ఎగనామం పెట్టింది. ఆక్వా సాగు చేసే రైతులకు యూనిట్ 1.50 పైసల చొప్పున విద్యుత్ రాయితీ ఇచ్చేవారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక దానికి పరిమితులు విధించారు. రొయ్య హేచరీస్ యూనిట్ ధర రూ. 8 పెంచేశారు. సీడు రేటు గతంలో కంటే 11 వందలు పెరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆక్వా సాగుకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు ఆక్వా రైతులకు ఇస్తున్న రూ.1.50 పైసల విద్యుత్ సబ్సిడీ అమలులో జోన్ పరిధి నిబంధన తొలగిస్తాం. నాణ్యమైన సీడు రైతులకు లభించేలా చూస్తాం. గుజరాత్ తర్వాత ఎక్కువ తీర ప్రాంతం మన రాష్ర్టంలోనే ఉంది. మత్స్యకారులు పక్క రాష్ట్రాలకు వలసపోకుండా జెట్టీలు నిర్మిస్తాం. 70 లక్షల మంది మత్స్యకారుల కడుపుకొట్టడానికి వైసీపీ ప్రభుత్వం జీవో నెంబర్ 217 తీసుకొస్తే… దానిని బలంగా వ్యతిరేకించాం. దానిని నరసాపురం వేదికగానే చింపేశాం. కూటమి అధికారంలోకి రాగానే ఆ జీవోను రద్దు చేస్తాం. 56 మత్స్యకార సొసైటీలకు లోన్లు ఇవ్వలేదు. ఎన్డీఏ కూటమి రాగానే లోన్లు వచ్చేలా బాధ్యత తీసుకుంటాం. మత్స్యకారులకు ప్రమాదబీమా రూ. 10 లక్షలు అందిస్తాం. విశాఖ హార్బర్ లో అగ్నిప్రమాదం జరిగి బోట్లు కాలిపోతే ప్రతి బోటుకు రూ. 50 వేలు ఆర్థిక సాయం అందించాను. జనసేన ఇచ్చిన ఆర్థిక సాయం తీసుకుంటే ప్రభుత్వం నుంచి రావాల్సిన నష్టపరిహారం ఇవ్వమని బెదిరించినా పట్టించుకోకుండా నా వెనక మత్స్యకారులు నిలబడ్డారు. మీ కోసం బలంగా నిలబడతాను. చాలా మంది మత్స్యకారులు అంతర్జాతీయ జలాల్లోకి పొరపాటున వెళ్లి పక్క దేశాల జైల్లో మగ్గిపోతున్నారు. నాకు ఉన్న సత్సంబంధాలను ఉపయోగించి మిమ్మల్ని మీ ప్రాంతాలకు తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాను.
• జగన్ పెంపుడు కుక్కలు మొరుగుతాయి
అన్ని కులాలు, వర్గాలు బాగుండాలి అని కోరుకునే వాడిని నేను. ఏ ఒక్క కులం, వర్గం కోసం జనసేన పార్టీని స్థాపించలేదు. అలా పెడితే అది ఎంతోకాలం నిలబడదు. స్థానిక ఎమ్మెల్యే ప్రసాద రాజు గారు ఒక సామాజిక వర్గం మీద కక్ష పెట్టుకున్నారని నా దృష్టికి వచ్చింది. అందులో భాగంగా ఆ సామాజికవర్గానికి చెందిన 40 మంది అధికారులను బదిలీ చేయించడం చాలా అన్యాయం. మనం పుట్టిన కులంతో పాటు అన్ని కులాలను గౌరవిస్తేనే సమాజం బాగుపడుతుంది. ప్రపంచంలో నేను ఏ మూలకు వెళ్లినా కులాలు, మతాలకు అతీతంగా ప్రేమిస్తారు. అందరివల్ల ఎదిగిన నేను ఏ ఒక్క కులం కోసమో ఎందుకు పని చేస్తాను..? జగన్ చిల్లర రాజకీయాలు చూస్తే జాలేస్తుంది. నన్ను నా కులం నాయకులతో తిట్టిస్తాడు. ఆయన శివశివాని స్కూల్లో పేపర్లు లీక్ చేస్తున్నప్పుడు నేను విప్లవ నాయకుల గురించి చదువుతున్నాను. నన్ను మీరెంత కవ్వించినా సహనం కోల్పోను. రాజ్యాంగం నమ్మినవాడు రాజకీయం చేస్తే ఎలా ఉంటుదో జగన్ కు చూపిస్తాను. ఏ సామాజకవర్గానికి చెందిన నాయకుడైనా జగన్ చెంతకు వెళ్లగానే రౌడీలు, గూండాల్లా మారిపోతున్నారు. నేను ఏదైనా మాట్లాడితే నా సామాజికవర్గానికి చెందిన జగన్ పెంపుడు కుక్కలు బయటకు వచ్చి మొరుగుతాయి. మేము మేము కాపులం ఏమైనా అనుచ్చు అనుకుంటున్నారేమో… నాలుక పీకేస్తా జాగ్రత్త.
• సజ్జల గారు … ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడండి
అజాతశత్రువు లాంటి చిరంజీవి గారిపై సజ్జల రామకృష్ణ రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. కూటమి అభ్యర్థులైన అనకాపల్లి ఎంపీ శ్రీ సీఎం రమేష్, పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ పంచకర్ల రమేష్ లకు మద్దతుగా చిరంజీవి గారు మాట్లాడితే … ఆయనపై అవాకులు చవాకులు పేలుతున్నారు. డబ్బు, అధికార మదం ఎక్కువై కొట్టుకుంటున్నారు. ఆ రోజు రజనీకాంత్ గారు చంద్రబాబు గారి గురించి రెండు ముక్కలు మంచిగా మాట్లాడితే ఓర్చుకోలేకపోయారు. ఆయన్ను ఇష్టమొచ్చినట్లు తిట్టారు. ఇప్పుడు చిరంజీవి గారి మీద పడుతున్నారు. ఎంతమంది కలిసి వచ్చినా సింహం సింగిల్ గానే వస్తుందని మాట్లాడుతున్నారు. వీళ్ల మొహం ఎప్పుడైనా అద్దాల్లో చూసుకున్నారా..? వీళ్లు సింహాలంట. వీళ్లు సింహాలు కాదు గుంట నక్కలు. మీతో పోరాడుతున్నది సింహం అని గుర్తు పెట్టుకోండి. సజ్జల గారు … మా అన్నయ్య చిరంజీవి గారి జోలికి రావొద్దు. ఆయన కాంగ్రెస్ లో ఉంటారో ఇంకో పార్టీకి మద్దతు ఇచ్చుకుంటారో ఆయనిష్టం. మీ పాలసీలు బాగున్నాయి అని ఆయన మాట్లాడినప్పుడు పొగిడిన మీరు … ఇప్పుడు వేరే వాళ్లకు మద్దతు ఇస్తే ఓర్చుకోలేకపోతున్నారు. ఆయన ఎవరికైనా మద్దతు ఇవ్వొచ్చు ఆ స్వేచ్ఛ ఆయనకు ఉంది. అది అర్ధం చేసుకున్నాను కనుకే ఆనాడు ఆయన వైసీపీకి మద్దతుగా మాట్లాడితే నేను వ్యతిరేకించలేదు. ఇంకోసారి చిరంజీవి గారి గురించి, రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. సజ్జల పులివెందుల నుండి వచ్చి ఉండొచ్చు… ఒక విప్లవ నాయకుడు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో నేను చేసి చూపిస్తాను.
• కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి
జగన్ పొగరెక్కి కొట్టుకుంటున్నాడు. ఇన్నాళ్లు ఆయనకు ఎదురు మాట్లాడేవాడు లేకపోవడంతో అలా తయారయ్యాడు. ఆ రోజులు పోయాయి. నాకు అధికారం ఉన్నా లేకపోయినా ఒకేలా మాట్లాడతాను. జగన్ కులాలను విడగొడితే నేను ఏకం చేస్తాను. దళితుడిని చంపి డోర్ డెలివరీ చేస్తే … చంపిన వ్యక్తిని జక్కంపూడి రాజా భుజాల మీద ఎత్తుకొని ఊరేగించాడు ఇది ఎంత దురహంకారం. బ్లేడ్ బ్యాచ్ లు, రౌడీమూకలను పెట్టి ప్రజలను నియంత్రించాలని చూస్తున్నారు. విప్లవ భావాలు ఉన్న వ్యక్తి రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. సామాజిక మాధ్యమాల్లో పిచ్చి పిచ్చి వాగుడు వాగితే మరిచిపోయే వ్యక్తిని కాదు. మైనార్టీలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. వాళ్ల మీద ఈగ కూడా వాలనివ్వం. ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో అన్యమత ప్రచారాలు వద్దని చెప్పాను తప్ప … మత ప్రచారం తప్పు అని ఏనాడు చెప్పలేదు. నరసాపురం లోక్ సభ అభ్యర్థిగా కూటమి తరఫున శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ, నరసాపురం శాసనసభ నుంచి శ్రీ బొమ్మిడి నాయకర్ పోటీ చేస్తున్నారు. వారిని భారీ మెజార్టీతో గెలిపించాల”ని కోరారు.