వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ కరవు

వైసీపీ

• అబద్దపు హామీలతో మహిళలను మోసగించిన శ్రీ జగన్మోహన్ రెడ్డి
• రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్ గా మార్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుంది
• రాష్ట్రంలో గంజాయి, మద్యం ఏరులై పారుతోంది
• జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో జనసేన, టీడీపీ, బీజేపీ మహిళ నేతలు
వైసీపీ అరాచక పాలనలో ఆంధ్ర రాష్ట్రం అధోగతి పాలైందని జనసేన, టీడీపీ, బిజెపి రాష్ట్ర మహిళా నేతలు విమర్శించారు . శనివారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి కీర్తన, ఏపీ డ్వాక్రా , అంగన్వాడి సంఘాల అధ్యక్షురాలు, టిడిపి మహిళా నేత శ్రీమతి ఆచంట సునీత, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి సాదినేని యామినీ శర్మ పాల్గొన్నారు.
• మహిళలకు జగన్ సమాధానం చెప్పాలి: శ్రీమతి కీర్తన, జనసేన
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముఖ్య కారకులైన మహిళల్ని మోసగించిన ఘనుడు సిఎం శ్రీ జగన్మోహన్ రెడ్డి. నవరత్నాల పేరుతో ప్రజల్ని నయవంచన చేశారు. అమలు సాధ్యం కానీ అసత్య హామీలతో ప్రజల్ని మోసగించారు. మద్య నిషేధం పేరుతో మహిళల ఓట్లు దండుకొని సిఎం శ్రీ జగన్ అధికారం చేజిక్కించుకున్నారు. ప్రభుత్వం మద్యం వ్యాపారం చేసి వేల కోట్లు దండుకొని పేదల కుటుంబాల్లో చీకటి నింపింది. రాష్ట్రంలో మహిళలపై విపరీతమైన దాడులు పెరిగిపోయాయి. మహిళలపై ఏటేటా అఘాయిత్యాలు పెరిగిపోతూ ఆందోళన కలిగించేలా రాష్ట్రంలో పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 30 వేలమందికి పైగా ఆడ బిడ్డలు, మహిళలు మిస్సయ్యారు. వీటిపై సిఎం శ్రీ జగన్ నేటికీ స్పందించలేదు. కనీసం ఈ ఘటనలపై పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష జరపలేదు. మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా పని చేసిన వాసిరెడ్డి పద్మ గారు మహిళలపై జరుగుతున్న దాడులపైన, మిస్సింగ్ కేసులపైనా ఏనాడు స్పందించలేదు. ఆడబిడ్డలను వ్యభిచార కూపంలోకి నెట్టేస్తున్నా ఆమె స్పందించకపోవడం దారుణం. సిఎం శ్రీ జగన్ మహిళల్ని కేవలం ఓటు బ్యాంకు గానే పరిగణిస్తున్నారు. మహిళలకు అన్యాయం జరిగితే గన్ను కన్నా జగన్ ముందుకొస్తానని మాట ఇచ్చి మహిళల్ని నమ్మించి మోసం చేశారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై సిఎం సమాధానం చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు మహిళా లోకానికి భరోసాగా నిలిచారు కాబట్టే శ్రీ జగన్ వెన్నులో వణుకు మొదలైంది. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు నిరోధించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలం. మహిళల రక్షణ కోసం ఏర్పాటైన చట్టాలు కఠినంగా అమలుకావడం లేదు.
• మహిళాలోకం కూటమి వెంట నడిచేందుకు సిద్ధం: శ్రీమతి యామినీ శర్మ , బీజెపీ
వైసీపీ డిక్షనరిలో అ అంటే అఘాయిత్యాలు, అరాచకాలు .. ఆ అంటే ఆగని దాడులు, ఇ అంటే ఇంటింటికి భద్రత ఉందా అనేలా పరిస్థితులున్నాయి. వైకాపా పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇక్కట్లకు గురయ్యారు. పేదల రక్తాన్ని తాగేలా ప్రభుత్వం మద్యాన్ని ఏరులై పారిస్తుంది. నేనున్నాను ..నే విన్నాను అని చెప్పిన సిఎం శ్రీ జగన్ మోహన్ రెడ్డికి పేదల సమస్యలు పట్టడం లేదు. ఇసుకను సామాన్యులకు అందనీయకుండా 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్టగొట్టారు. అసంఘటిత రంగాన్ని నమ్ముకున్న లక్షలాది మంది పేదలు రోడ్డున పడ్డారు. మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చిన వైసీపీ ప్రభుత్వంలో అవినీతి, అరాచకం రాజ్యమేలుతోంది. ప్రధాని శ్రీ నరేంద్ర మోడి గారు మహిళల అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తూ దేశంలోనే అత్యున్నతమైన రాష్ట్రపతి, గవర్నర్ పదవులు మహిళలకు కేటాయించి వారికి సముచిత స్థానం కల్పించారు. రాజ్యాంగ పదవుల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికే దక్కుతుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి, జనసేన, బిజెపి మహిళా నేతలు, కార్యకర్తలపైనా అనేక దాడులు జరుగుతున్నాయి. దేశంలో అభివృద్ధి పాలన జరుగుతుంటే రాష్ట్రంలో అరాచక పాలన రాజ్యమేలుతోంది. మహిళల ఆర్ధికాభివృద్ధికి జగన్ సర్కార్ చేసింది శూన్యం. రాష్ట్రంలో హోం మంత్రులుగా పని చేసిన ఇద్దరు మహిళలు రబ్బర్ స్టాంపులే. రాష్ట్రంలో ఆడ బిడ్డల అదృశ్యంపై శ్వేత పత్రం విడుదల చేయాలి. అంగన్వాడి, ఆశా వర్కర్లు, అమరావతి మహిళా రైతులపై మగ పోలీసులతో భౌతిక దాడులు చేయించిన ప్రభుత్వం ఇది. తమ శాఖల విధులు తెలియని మంత్రులు బూతు పురాణాల్లో నిష్ణాతులు, బూతులు మాట్లాడే కొందరు మంత్రుల్ని, ఎమ్మెల్యేలను సిఎం శ్రీ జగన్ సౌమ్యులు అని సంభోధించడం సరికాదు. కేంద్రం వికసిత్ భారత్ గా ఉంటే ఏపీలో వినాష్ ఆంధ్ర పాలన నడుస్తోంది. వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కూటమిని స్వాగతిస్తున్నారు.
• మహిళలను మోసం చేయడంలో మాస్టర్ జగన్: శ్రీమతి ఆచంట సునీత, టీడీపీ
మహిళల్ని మోసం చేయడంలో జగన్ మాస్టర్స్ చేశారు. ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నిస్తే దాడులు, అక్రమ కేసులు ఎక్కువయ్యాయి. ఒక్క ఛాన్స్ పేరుతో సిఎం శ్రీ జగన్మోహన్ రెడ్డి అధికారం చేజిక్కించు కున్నారు. అంగన్వాడీ, ఆశా, డ్వాక్రా మహిళల్ని ప్రభుత్వం మోసగించింది. కోటి మంది మహిళల్ని ఆసరా పేరుతో ఋణ మాఫీ చేస్తానని మోసగించారు. డ్వాక్రా సంఘాల్లోని సభ్యులను వైసీపీ మీటింగులకు తరలించేందుకే వినియోగిస్తున్నారు. సిద్ధం పేరుతో సిఎం శ్రీ జగన్ చేపట్టిన యాత్రలకు ప్రజాదరణ కరవైంది. డ్వాక్రా మహిళల్ని బెదిరించి మీటింగులకు తరలిస్తున్నారు. డ్వాక్రా సంఘాల మహిళలు దాచుకున్న పొదుపు సొమ్ము రూ. 30 వేల కోట్లు ప్రభుత్వం దొంగిలించి ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసింది. అభయ హస్తం ద్వారా మహిళలు దాచుకున్న రూ. 2500 కోట్లు ప్రభుత్వం కొల్లగొట్టింది. 130 సంక్షేమ పథకాలు ప్రభుత్వం ఎత్తి వేసింది. గత ప్రభుత్వం రూ. 23 వేల కోట్లు ఋణ మాఫీ చేసింది. ప్రభుత్వం మద్యపాన నిషేధం చేయకపోగా నాసిరకం మద్యాన్ని విక్రయించి పేద కుటుంబాలను కొల్లగొడుతున్నారు. దిశా చట్టానికి చట్టబద్దత రాలేదు. ఈ విషయంలోనూ స్త్రీలను మోసగిస్తోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరవయ్యాయి. సిఎం శ్రీ జగన్ తన సొంత చెల్లెళ్ళకు న్యాయం చేయకుండా కాలం వెళ్లదీస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితంపై సిఎం మాట్లాడటం సరికాదు. రానున్న కాలంలో ఎన్డీయే కూటమిలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు కానుంది.

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్