కేసులున్న ముఖ్యమంత్రి కేంద్రంతో ఏం మాట్లాడతాడు..?

ముఖ్యమంత్రి

• రాష్ట్రానికి వైసీపీ తెల్లదోమలా తయారైంది.
• రైతాంగాన్ని అన్నీ విషయాల్లోనూ వైసీపీ మోసం చేసింది
• వైసీపీని 70 శాతం ప్రజలు వ్యతిరేకిస్తున్నారు
• ప్రతిపక్షాల్లోని అనైక్యత పోవాలి
• సమాజంలోని అన్ని కులాలూ బాగుండాలన్నదే నా ఆకాంక్ష
• డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జిల్లా పేరును జనసేన మనస్ఫూర్తిగా స్వాగతించింది
• కుట్ర కోణంలోనే వైసీపీ అరాచకం సృష్టించింది
• వారాహి విజయయాత్ర ముమ్మిడివరం బహిరంగసభలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్

        ‘తనపై తట్టెడు కేసులు పెట్టుకొని కేంద్రంతో ఈ ముఖ్యమంత్రి ఏం మాట్లాడతాడు..? రాష్ట్రానికి ఏం సాధిస్తాడు అనేది ఆలోచించాలి’ అని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ప్రజలను కోరారు. రాష్ట్రం గురించి, ప్రజల గురించి ఏ మాట్లాడతాడో ఒకసారి బాగా ఆలోచించండన్నారు. నేను రైతులకు ఏ అన్యాయం జరిగినా ముందుండి పోరాడుతాను.. కేంద్రం నుంచి ఏం రావాలన్నా ధైర్యంగా అడుగుతాను అని చెప్పారు. నన్ను నమ్మండి.. పవన్ కళ్యాణ్ మీ వాడు.. మీకు మేలు చేసేవాడని తెలిపారు. రాజకీయాలు చేయాలంటే పెట్టి పుట్టక్కర్లేదు… గుండెనిండా మానవత్వం నింపుకొని ప్రజల కష్టాలను వినే తత్వం ఉంటే చాలన్నారు. జనానికి న్యాయం చేసే మనసు ఉండాలని తెలిపారు. ఒక్కసారి ఒక్కసారి అంటూ అడిగితే, నమ్మిన పాపానికి ఈ ముఖ్యమంత్రి ఏం చేశాడో గుర్తుపెట్టుకోవాలని సూచించారు. వారాహి విజయయాత్రలో భాగంగా బుధవారం ముమ్మిడివరం బహిరంగసభలో శ్రీ పవన్ కళ్యాణ్ మాట్లాడారు. భారీ సంఖ్యలో హాజరైన జనవాహినిని ఉద్దేశించి శ్రీ పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ “అధికారం కోసం ప్రజల్ని అంధకారంలోకి నెట్టేశాడని తెలుసుకోండి. నన్ను రైతాంగం అంతా ఒక్కసారి విశ్వసించండి. మీ బతుకుల్లో వెలుగులు తెచ్చే బాధ్యతను నేను తీసుకుంటాను. నేను ప్రజల తరఫున బలంగా పోరాడాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి వచ్చాను. వైసీపీ ప్రభుత్వ తప్పులను భరించలేక విసిగిపోయి, తెగించి గొడవ పెట్టుకోవాలనుకుంటున్నాను. నా దగ్గర అవినీతి సొమ్ము లేదు… గూండాలు లేరు. నాకు ఆ తల్లి వారాహి అమ్మే రక్షణ.
* కులాల గురించి మాట్లాడితే వైసీపీ వాళ్ళకి కోపం వస్తోంది
         రాష్ట్రంలో రెండే కులాలు అధికారం… ఆర్థిక వ్యవస్థలను చేతుల్లోకి తీసుకుంటామంటే కుదరదు. సాగరాన్నే నమ్ముకున్న మత్స్యకారుడు… స్వేదం చిందించి కుటుంబానికి చుక్కానిగా మారే దళిత సోదరుడు… చెట్టు ఎక్కి బతుకు సాగించే గీత కార్మికుడు… డొక్కలు ఎండిపోయేలా మగ్గం లాగే నేత కళాకారుడు… కళను రంగరించి కుండలు చేసే శాతవాహనుడు… కొలిమిలోని నిప్పుతో అద్భుతమైన ఆభరణం చేసే విశ్వబ్రాహ్మణుడు.. పది మందికీ మంచిని పంచే ముస్లిం సోదరులు… ఇలా ఉత్పత్తి కులాలన్నీ బాగుపడాలి. వారికి ఆర్థిక దన్ను రావాలి. అధికారం చేతపట్టేలా చూడాలి. వారి ఆలోచనలు సమాజానికి పంచాలి. ఇదీ జనసేన కోరుకుంటున్న అసలు లక్ష్యం. నేను కొద్ది రోజులుగా కులాల గురించి, కులాల ఐక్యత గురించి మాట్లాడుతుంటే చాలామంది వైసీపీ నాయకులకు కోపం వస్తోంది. అమరావతి అనే రాష్ట్ర రాజధానిని కుల రాజధాని అని మీరు అభివర్ణిస్తే తప్పు లేదు కానీ… కులాలన్నీ కలిసి రావాలి. అధికారం అందరికీ అందాలని నేను మాట్లాడుతుంటే మాత్రం మీకు గిట్టదు. నేను అన్నీ కులాలకు సమానమైన న్యాయం జరగాలని బలంగా నమ్మే వ్యక్తిని. మీరు మాత్రం మా ఇళ్లలోని మహిళలను బూతులు తిట్టించవచ్చు.. మహిళల మీద దాడులకు పురిగొల్పవచ్చు. నేను వైసీపీ నేతలకు ఇష్టం లేని కులాల ఐక్యత గురించి మాట్లాడితే మాత్రం వైసీపీ వారికి ఎక్కడ లేని కోపం వస్తోంది.
* దళితుడిని చంపిన ఎమ్మెల్సీ భుజం తట్టాడు

ఈ వైసీపీ నాయకుడు- ఎంపీని బెదిరించగలడు.. దళితుడ్ని చంపి ఇంటికి పార్శిల్ పంపిన ఎమ్మెల్సీ భుజం తట్టగలడు. వారు ఏం చేసినా తప్పు కాదు.. మనం మాట్లాడిందే తప్పు. 70: 30 సర్కారు ఇదీ. వందమంది ప్రజల్లో 70 మంది కష్టపడి సంపాదించిన సొమ్మును వైసీపీ సర్కారు తనకు కావాల్సిన 30 మందికి పంచుతూ ఓటు బ్యాంకును పెంచుకుంటోంది. కేవలం రాజకీయం కోసం మాత్రమే ప్రభుత్వ పథకాలను వాడుకుంటోంది. వైసీపీ ఓ ఉప్మా పార్టీ. వసతిగృహంలో రోజువారీ ఉప్మా పెడుతుంటే, అంతా ఎదురు తిరిగారు. మాకు ఉప్మా వద్దని నిరసన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరికి ఏం కావాలో ఓటింగ్ పెట్టారు. 18 మంది యధావిధిగా ఉప్మా కావాలని కోరితే, మిగిలిన 82 మంది వివిధ రకాల టిఫిన్ల పేరు చెప్పారు. అయితే ఉప్మా కోరుకున్న వారి సంఖ్యే అన్నిటి కంటే ఎక్కువ ఉండటంతో మళ్లీ ఉప్మా దిక్కు అయింది. వైసీపీ కూడా ఉప్మా తరహా పార్టీనే. వైసీపీ వద్దు అనుకుంటున్న వారిలో ఐక్యత అవసరం. విపక్షాల్లోని అనైక్యతే వైసీపీకి బలం. అనైక్యతను వీడి ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తే కచ్చితంగా వైసీపీ ఇంటికి వెళ్లడం ఖాయం.
* కులాల మధ్య చిచ్చుపెట్టడం వైసీపీ లక్షణం

          ప్రజాస్వామ్య దేశంలో విభిన్నమైన ఆలోచనలు, అభిప్రాయాలు ఉండటం సహజం. వైసీపీ ప్రభుత్వం అమలాపురం లోక్ సభ స్థానానికి అంబేద్కర్ కోనసీమ జిల్లాగా నామకరణం చేయడానికి సమయం తీసుకోవడం కూడా కుట్రలో భాగం. మొదటే జిల్లాకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని ప్రకటించకుండా, మొత్తం అన్నీ జిల్లాలకు పేర్లు పెట్టిన తర్వాత ప్రత్యేకంగా సమయం తీసుకొని నోటిఫికేషన్ విడుదల చేసింది. జనసేన పార్టీ మొదటి నుంచి మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరును స్వాగతించింది. అయితే ప్రజాస్వామ్య ప్రభుత్వంలో రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. ఆ పేరు సమాజంలోని ఓ వర్గానికి నచ్చకపోతే వారిని పిలిచి ప్రభుత్వం మాట్లాడి ఒప్పించాల్సిన బాధ్యత ఉంది. నచ్చజెప్పి అందరినీ ఏకతాటిపైకి తీసుకురావాలి. దాన్ని వైసీపీ గాలికి వదిలేసింది. కులాల మధ్య చిచ్చు రేపి చలికాచుకోవాలనేది వైసీపీ ప్లాన్. కులాలను వీడదీసే వాడు నాయకుడు కాలేడు… కలిపేవాడే నాయకుడు. ప్రజల్ని విడదీసే పార్టీ వైసీపీ. జనసేన తరఫున మేం శెట్టి బలిజలు, కాపులకు ఆత్మీయ సమావేశాలు నిర్వహించాం. మత్స్యకారులకు అండగా మత్స్య అభ్యన్నత యాత్ర చేశాం. కోనసీమ ముందుకు వెళ్లాలంటే శ్రీ జీఎంసీ బాలయోగి గారి వంటి దళిత నాయకుల బాటలో నడవాలి. అలాంటి వారి స్ఫూర్తితో కోనసీమను పూర్తిస్థాయి అభివృద్ధి చేసే వరకు విశ్రమించను.
* రైతులను నిలువునా మోసం చేసిన ముఖ్యమంత్రి

             రైతు సహకార సంఘాల్లో రుణాలు తీసుకున్న రైతులకు సున్నా వడ్డీ ఆశ చూసిన ముఖ్యమంత్రి దాన్ని నెరవేర్చలేకపోయారు. 7 శాతం వడ్డీలో రాష్ట్ర వాటా 4 శాతంను చెల్లించడంలో ప్రభుత్వం తన హామీని బుట్టదాఖలు చేసింది. ఫలితంగా రియంబర్సుమెంటు రైతులకు అందలేదు. కేవలం 30 శాతం మందికే తూతూమంత్రంగా రియంబర్సుమెంటు అందింది. ఇక రూ.6,300 కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు అవసరం అయిన ఏ పని జరగడం లేదు. అక్కడ సిబ్బంది కూడా అందుబాటులో ఉండటం లేదు. వ్యవసాయ బీమా కడతామని చెప్పిన ప్రభుత్వం రైతులను మోసం చేసింది. ఫలితంగా రైతు నష్టపోయాడు. ధాన్యం తరలించే రైసు మిల్లులు దూరంగా ఉంటున్నాయి. రైతులను కష్టపెట్టాలనే భావనతోనే దూరంగా ఉండే రైసుమిల్లులను ధాన్యం తరలింపు నిమిత్తం కేటాయిస్తున్నారు. రైతులను ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులు పెడుతూ ఆనందం పొందుతున్నారు. నాకు వ్యవసాయం మీద పూర్తి అవగాహన ఉంది. ఇటీవల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించిన వెంటనే వారికి సహాయం అందింది. జనసేన ప్రభుత్వంలో పూర్తిస్థాయిలో రైతులకు మేలు చేసే నిర్ణయాలుంటాయి.
* కష్టం రైతులది… కోట్లు ఆదాయం ద్వారంపూడి కుటుంబానికి

           కొబ్బరి రైతులు నాకు కష్టాలు చెబుతూ తెల్లదోమ సోకడం వల్ల దిగుబడి తగ్గిపోయిందని, బాగా నష్టాల్లో ఉన్నామని చెప్పారు. ఈ రాష్ట్రానికి తెల్లదోమలా వైసీపీ తయారైంది. రైతులను అన్ని విధాలా మోసం చేస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సాగు చేస్తున్న ప్రతి ఎకరా నుంచి ఓ బస్తా ద్వారంపూడి కుటుంబానికి వెళ్తోంది. రైతు కుటుంబాల కన్నీటి మీద ద్వారంపూడి కుటుంబం వ్యాపారం చేస్తోంది. కష్టం రైతులది అయితే.. దాన్ని అమ్ముకొని అధికారం చెలాయిస్తోంది మాత్రం ద్వారంపూడి కుటుంబమే. అధికారం మీరు అనుభవిస్తూ.. రైతులను అంధకారంలోకి నెట్టేస్తున్నారు. రైతు కన్నీరు మంచిది కాదు జాగ్రత్త.
* పోరాటం చేసేవాడిని చూస్తే ప్రభుత్వానికి భయం

           పెట్టుబడి ఖర్చులు పెరిగిపోయాయి… దిగుబడులు తగ్గుతున్నాయి… మద్దతు ధర దక్కడం లేదు. కూలీల కొరత.. సాగునీటి పారుదలలో ప్రతిబంధకాలు.. డ్రెయిన్ల సమస్యలు.. సకాలంలో జమకాని ధాన్యం సొమ్ము.. ఇలా అనేక సమస్యలతో కోనసీమ రైతులు ఖరీఫ్ లో 50 వేలు నుంచి 60 వేల ఎకరాల్లో పంట విరామం ప్రకటించారు. ముఖ్యంగా కాలువల్లో పూడికలు తీయకపోవడంతో రైతాంగం తీవ్రంగా నష్టపోతోంది. మొన్న కురిసిన అకాల వర్షాలకు ధాన్యం రంగు మారిపోయింది. కొన్ని చోట్ల మొలకలు కూడా వచ్చాయి. ధాన్యం కొనుగోలులో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపడంతో రైతులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అన్నం పెట్టే అన్నదాతకు అండగా ఉండాలని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించాను. నేను వస్తున్నాను అని తెలియగానే ప్రభుత్వ అధికారులు రాత్రికి రాత్రే రైతులను నుంచి ధాన్యం కొనుగోలు చేశారు. ప్రశ్నించేవాడు, పోరాటం చేసేవాడు అంటే ఈ ప్రభుత్వానికి భయం. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఒక్కసారి జనసేన వైపు చూడండి. మీకు అండగా నిలబడతాం. నియోజకవర్గంలో ఇసుకను అడ్డగోలుగా దోచేస్తున్నారు. నదిలో యంత్రాలతో తవ్వకాలు జరుపుతున్నారు. యంత్రాలు చేసిన గుంతల్లో కార్తీక మాసం పూజలు చేసుకునే భక్తులు పడి మృత్యువాత పడుతున్నారు. రెవెన్యూ వ్యవస్థ కానీ, పోలీస్ వ్యవస్థ కానీ ఇసుక దోపిడీని అరికట్టలేకపోతోంది. రాష్ట్రంలో ఇసుక మొత్తాన్ని ముగ్గురు దోచుకుంటున్నారు. రేషన్ బియ్యాన్ని ఒక కుటుంబం దోచుకుంటోంది. లక్షల మంది కష్టార్జితాన్ని ఒక కుటుంబం, ఒకరిద్దరు దోచుకుంటే ఆ దోపిడీ వ్యవస్థపై నేను కచ్చితంగా పోరాటం చేస్తాను.
* లక్ష మంది యువతకు రూ. 10 లక్షల చొప్పున ఇస్తాం

         జనసేన పార్టీ అధికారంలోకి వస్తే యువతకు పెద్దపీట వేస్తాం. ప్రతి ఏటా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడంతో పాటు పది మందికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి తీసుకెళ్తాం. అందుకు ప్రతి నియోజకవర్గానికి 500 మంది చొప్పున యువతను గుర్తించి వారికి రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తాం. వాళ్లు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టి పదిమందికి ఉపాధి కల్పించేలా ప్రోత్సహిస్తాం. ఇలా ఏడాదికి లక్ష మంది చొప్పున యువతకు రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక చేయూత అందిస్తాం.
* పదవులన్నీ ఒక్క కులానికి కట్టబెట్టడం కరెక్టా?

           శెట్టిబలిజ, తూర్పుకాపు.. ఇలా చాలా బీసీ కులాలను తెలంగాణ రాష్ట్రంలో బీసీ జాబితా నుంచి తొలగించారు. రాష్ట్రంలోని ఒక్క బీసీ నాయకుడు కూడా దీనిపై మాట్లాడలేదు. ఎవరి కులాన్ని వారు గౌరవించుకుంటూనే ఆంధ్రులం అనే భావన మనలో రాకపోతే నష్టపోతాం. కులాల గురించి ప్రస్తావిస్తుంటే కొంతమంది వైసీపీ పెద్దలు బాధపడుతున్నట్లు నా దృష్టికి వచ్చింది. చాలా కీలకమైన పదవులు అన్ని ఒక్క రెడ్డి సామాజికవర్గానికి ఇవ్వడం కరెక్టా? రాష్ట్రంలో కాపులు లేరా? శెట్టిబలిజలు లేరా? యాదవులు లేరా? అగ్నికుల క్షత్రియులు లేరా? అధికారంలో ఉన్నాం కదా అని ఒక్క కులానికే ప్రాధాన్యత ఇస్తే మిగతా కులాల పరిస్థితి ఏంటి? మీకు చేతులెత్తి జోడించి అడుగుతున్నా మిగతా కులాలకు న్యాయం చేయండి. అప్పుడు నేను కులాల గురించి మాట్లాడటం మానేస్తాను.
* నాకు ఎలాంటి ఈగో లేదు… అందరు హీరోలూ ఇష్టమే

          సినిమా అనేది వినోదం. రాజకీయం వేరు. సినిమాల పరంగా మీరు నచ్చిన హీరోను ఇష్టపడండి… రాజకీయాలకు వచ్చేసరికి మాత్రం ఒక్కసారి జనసేన వైపు చూడండి. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఇలా అందరు హీరోలు నాకు ఇష్టమే. వాళ్ల సినిమాలు నేను కూడా చూస్తాను. కలిసినప్పుడు సరదాగా మాట్లాడుకుంటాం. ప్రభాస్, మహేష్ గారు నాకంటే పెద్ద హీరోలు, రామ్ చరణ్ , తారక్ ప్రపంచ స్థాయికి వెళ్లిపోయారు. వాళ్లు నాకంటే పెద్ద హీరోలు అని చెప్పడానికి నాకు ఎలాంటి ఈగోలు లేవు. నా వరకు సగటు మనిషి బాగుండాలి అనుకుంటాను. సినిమాపరంగా మీరు ఏ హీరోని ఇష్టపడినా రాజకీయం పరంగా మాత్రం మద్దతు జనసేనకు ఇవ్వండి.
* ఉద్యోగాల భర్తీ చేసి.. పోలీసులపై ఒత్తిడి తగ్గిస్తాం

           పోలీసులు ఎంత ఒత్తిడి తీసుకుంటున్నారో నేను అర్ధం చేసుకున్నాను. నిజాయతీగా పని చేద్దాం అన్నా వైసీపీ ప్రభుత్వంలో పనిచేయలేకపోతున్నారు. నిద్రాహారాలు, సెలవులు లేవు. టి.ఏ, డి.ఏ.లు సకాలంలో ఇవ్వడం లేదు. జీతాలు టైమ్ కు రావడం లేదు. జనసేన ప్రభుత్వం రాగానే పోలీసులకు వారాంతపు సెలవులు కచ్చితంగా ఇస్తాం.. ఒత్తిడి తగ్గిస్తాం. కొత్తగా రెగ్యులర్ ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుడతాం’’ అన్నారు.

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్