• వ్యాపారాలు ప్రశాంతంగా చేసుకొనే పరిస్థితి కల్పిస్తాం
• పిఠాపురం ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులతో శ్రీ పవన్ కళ్యాణ్ సమావేశం
‘గాంధీ మహాత్ముడిలోని పోరాట పటిమ, పొట్టి శ్రీరాములు గారి త్యాగనిరతి చూశాం. వారిలోని సంకల్ప బలం, పోరాట పటిమ ఆర్య వైశ్యులలో ఉంది. ప్రశాంతంగా వ్యాపార వాణిజ్యాలు చేసుకొంటూ ఆర్థిక వృద్ధిలో భాగం అవుతున్నారు. వైసీపీ పాలనలో వారికి రక్షణ కరవైంది ‘ అని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. మంగళవారం సాయంత్రం చేబ్రోలులో పిఠాపురం నియోజక వర్గం ఆర్య వైశ్య సంఘం ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమంలో నియోజక వర్గం టీడీపీ ఇంచార్జీ శ్రీ వర్మ గారు పాల్గొన్నారు. ఆర్య వైశ్య సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న మా జీవితాల్లోకి వైసిపి ప్రభుత్వం వచ్చి ప్రశాంతత లేకుండా చేసింది, రాక్షసులను అంతం చేసేందుకు దేవతలు ఏకం అయినట్లు ఎన్డీయే కూటమిగా మీరు ముందుకు వచ్చి మమ్మల్ని కాపడుతున్నందుకు ధన్యవాదాలు అన్నారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “వ్యాపారస్తులను ఇబ్బందిపెట్టిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం పోవాలి, మీకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. మీరు ప్రశాంతంగా వాణిజ్య వ్యాపారాలు చేసుకొనే పరిస్థితి తీసుకువస్తాం. ఆర్య వైశ్యులకు అండగా ఉంటాం. దేశం ఇంత బలంగా ఉంది అంటే ఆర్యవైశ్యుడైన మహాత్మ గాంధీ గారి పోరాటం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది అంటే అర్యవైశ్యుడైన పొట్టి శ్రీరాములు గారు త్యాగ ఫలితం. మీ బలం మీరు తెలుసుకోవాలి. దక్షిణాఫ్రికాలో రైల్వే స్టేషన్లో రైలు నుండి గాంధి గారిని గెంటేస్తే, ఆయన మన దేశం నుంచి బ్రిటీష్ వారిని గెంటేశారు. ఆర్యవైశ్యులు తాలూకు బలం అలాంటిది. మీరు భయపడకూడదు. ధైర్యంగా ఉండాల్సిన వారు మీరు. పెనుగొండలో వాసవి కన్యకాపరమేశ్వరి దేవి ఆలయ ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానిస్తే నేను వెళ్ళాను. ఆర్యవైశ్యులతో నా అనుబంధం చిన్ననాటి నుండి ఉంది. నెల్లూరులో నా స్నేహితుడు రమేష్ పుస్తకాలు ఇవ్వడం వల్లనే నేను జ్ఞానం సంపాదించాను. అతను ఒక వైశ్యుడు. ఆర్యవైశ్యులకు రక్షణ కల్పించేందుకు, వారిపై దాడులు లేకుండా చేసేందుకు అట్రాసిటీ తరహా చట్టాలు తీసుకురావాలి అనుకుంటున్నాను. మీరు కోరుకునేది ఆత్మగౌరవం. వాసవి కన్యకాపరమేశ్వరి దేవి ఆత్మగౌరవం కోసం ఆత్మబలిదానం చేసుకుంది. అలాంటి ఆత్మగౌరవాన్ని మీకు తీసుకొస్తాను. ప్రజాసేవ కోసం కృషి చేసే వారిలో ఆర్యవైశ్యులు ముందుంటారు, మీరు సమాజం కోసం చేసే సేవలు నాకు తెలుసు. గతంలో భీమవరం వెళ్ళినప్పుడు మావుళ్లమ్మ తల్లికి సేవ చేసుకునే అవకాశం కల్పించమని ఆర్యవైశ్యులు కోరారు. అలాగే ఇక్కడ శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి వారి సేవలో భాగస్వామ్యం అడిగారు. నేను మీ ఆకాంక్షను మన ప్రభుత్వం వచ్చాక అమలు జరిగేలా చూస్తాను” అన్నారు.