అసెంబ్లీని ప్రజా సమస్యలపై చర్చకు అద్భుత వేదికగా మలుస్తాం

అసెంబ్లీ

• ప్రజల కోసం ఆలోచించే నాయకులు ఎలా పని చేస్తారో చూస్తారు
• సొంత చెల్లెళ్ళు కూడా నమ్మని వ్యక్తి మనకెలా రక్షణ ఇస్తాడు..?
• 30 వేల మంది ఆడపడుచులు అదృశ్యం అయితే దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు
• అన్ని వర్గాలకు అండదండగా కూటమి ప్రభుత్వం
• పాలనలో జవాబుదారీతనం తీసుకొస్తాం
• ప్రతి చేతికీ పని.. ప్రతి చేనుకీ నీరు అన్నదే నినాదం
• నిడదవోలు వారాహి విజయభేరీ సభలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్
      ‘ప్రజాగళానికి వేదిక అయిన అసెంబ్లీలో ప్రజల కోసం పని చేసే నాయకులు ఎలా మాట్లాడతారో, పని చేస్తారో కూటమి ప్రభుత్వంలో ప్రజలు చూడబోతున్నారు. ప్రజా సమస్యల మీద, వారు పడే బాధల మీద చట్టసభలో సహేతుకమైన చర్చ ఎలా ఉంటుందో కూటమి ప్రభుత్వంలో చూస్తారు. ప్రజల బాధలపై, సమస్యలపై పరిష్కార మార్గాలను ప్రజా ప్రతినిధులు ఎలా కనుగొంటారో, 5 కోట్ల మంది మూకుమ్మడి ప్రజాగళంగా అసెంబ్లీ ఎలా నడవాలో కూటమి ప్రభుత్వంలో ప్రజలకు అర్థం అవుతుంది. ప్రజల గురించి ఆలోచించే నాయకులు వారి కోసం ఏం చేయబోతున్నారో తెలుస్తుంది. ఆ దిశగానే కూటమి ప్రభుత్వంలోని ప్రతి సభ్యుడు బాధ్యత తీసుకుంటాడ’ని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అసెంబ్లీని అద్భుతమైన ప్రజా సమస్యల చర్చా వేదికగా మారుస్తామని స్పష్టంగా చెప్పారు. ప్రజాస్వామ్య విలువలతో నడిచేలా, ప్రజల కోసం, ప్రజలు కోరుకున్నట్లుగా అసెంబ్లీని నడుపుతామని హామీ ఇచ్చారు. నిడదవోలులో బుధవారం జరిగిన వారాహి విజయభేరీ సభలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ‘‘పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందని అడిగితే మంత్రి అబ్బని తీయని దెబ్బ అంటూ పాటలకు డాన్సులు వేస్తుంటాడు. పోలీసులకు ఇవ్వాల్సిన టీఏ, డీఏ, సరెండర్ లీవులు ఇవ్వమని కోరితే దానికి వైసీపీ ప్రభుత్వం నుంచి సమాధానం ఉండదు. డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు అని ప్రశ్నించినా, సీపీఎస్ రద్దు చేయడానికి ఇంకెత కాలం అని అడిగినా దానికి వైసీపీ నాయకుల నుంచి సమాధానాలు ఉండవు. కేవలం బూతులు మాత్రమే వైసీపీ నాయకుల సమాధానం. ప్రశ్నించిన నాపై, శ్రీ చంద్రబాబు గారిపై, శ్రీమతి పురంధేశ్వరి గారిపై వ్యక్తిగత దూషణలు చేస్తారు. అదే వారికి తెలిసిన పరిపాలన. ఇలా బూతులు తిట్టే వారిని కూటమి ప్రభుత్వంలో తాట తీసి కూర్చొబెడతాం. అయిదేళ్ల వైసీపీ పాలనలో అసెంబ్లీలో ప్రజల గురించి, వారు పడుతున్న బాధల గురించి చర్చించిన దాఖలాలు లేవు. రాబోయే కూటమి ప్రభుత్వంలో మాత్రం అసెంబ్లీని ఓ అద్భుతమైన ప్రజా సమస్యల చర్చా వేదికగా తయారు చేస్తాం. అన్ని ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులు చర్చలో పాల్గొనేలా చేసే బాధ్యతను తీసుకుంటాం.
• సొంత చెల్లిని గోడకేసి కొట్టాడు
సొంత చెల్లి ప్రశ్నిస్తేనే తట్టుకోలేని వాడు. ఆమెను గోడకేసి కొట్టిన వాడు. చెల్లెళ్లు ఇద్దరూ నమ్మనివాడు మనల్ని ఎలా రక్షిస్తాడో ప్రజలు ఆలోచించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 30 వేల మంది యువతులు అదృశ్యం అయ్యారని చెబితే, కనీసం దానిపై సమీక్షించడానికి కూడా సమయం లేని వాడు ఆడబిడ్డల రక్షణ ఏం చూస్తాడు..? సొంత బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసిన వాళ్లను వెనకేసుకొచ్చే వ్యక్తి మనకెలా దన్నుగా నిలుస్తాడు..? దీన్ని ప్రజలు ఆలోచించాలి. వారి ఇంట్లో ఆడ బిడ్డలకే రక్షణ ఇవ్వలేని వ్యక్తి మన ఇంట్లోని ఆడపడుచులను ఎలా రక్షిస్తాడో కాస్త ఆలోచించండి. కూటమి ప్రభుత్వంలో కచ్చితంగా మహిళల రక్షణకు మొదటి ప్రాధాన్యం ఇస్తాం. మహిళలకు పూర్తిస్థాయిలో అండదండగా నిలుస్తాం.
• ప్రతి ఒక్కరి కళ్లలో ఆనందం… ప్రతి రంగం అభివృద్ధి
కూటమి ప్రభుత్వంలో మహిళల రక్షణకు… రైతుల శ్రమకు భరోసా ఉంటుంది. యువత కలలకు, వారి ఉపాధికి హామీ ఉంటుంది. ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు తగిన గౌరవం ఉంటుంది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి చేతికి పని… ప్రతి ఎకరా భూమికి నీరు సమృద్ధిగా అందేలా పాలన ఉంటుంది. దానికి తగిన ప్రణాళికలతో ముందుకు వెళ్తాం. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి కళ్లలో ఆనందం, ప్రతి రంగం అభివృద్ధికి తగిన ప్రాధాన్యం ఇస్తాం. రాష్ట్రాన్ని వెనక్కు నెట్టేసిన వైసీపీ నుంచి విముక్తం చేస్తాం. అన్ని విధాలుగా రాష్ట్రాన్ని నాశనం చేసిన వైసీపీ పాలనకు చరమగీతం పాడుతాం. ఈ వైసీపీ రౌడీ రాజ్యం పోవాలి… రామ రాజ్యం రావాలి.. ధర్మం గెలవాలి.
• వైసీపీ పాలనలో 5 కోట్ల మంది భవిష్యత్తుకు 5 మందే నిర్ణేతలు
వైసీపీ పాలనలో 5 కోట్ల మంది ఆంధ్రుల భవిష్యత్తును వైసీపీలోని 5 మంది నాయకులు నిర్ణయిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతాన్ని జాగీరుగా చేసుకొని వీరు పాలన సాగిస్తున్నారు. అడ్డగోలు దోపిడీ, సహజ వనరుల విధ్వంసం చేస్తూ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. ఇలాంటి సమయంలో రాష్ట్ర భవిష్యత్తే ప్రధానంగా అందరూ కాస్త వెనక్కు తగ్గాం. సీట్ల విషయంలో భేషజాలకు పోకుండా చూసుకున్నాం. ఒకరికి ఒకరుగా ఉమ్మడిగా కలిసి వైసీపీ నుంచి రాష్ట్రాన్ని విముక్తం చేయడానికి ముందుకు వచ్చాం. కూటమిని ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించాలి. ఎదిరించేవాడు లేకపోతే, బెదిరించే వాడిదే రాజ్యం అన్నట్లుగా వైసీపీ దాష్టీకాలపై జనసేన 5 సంవత్సరాల నుంచి బలంగా పోరాడింది. వీర మహిళలు, జనసైనికులు బలంగా పోరాడారు. రాష్ట్రానికి ఇప్పుడు అంతిమ పోరాటంలోకి వచ్చాం. వచ్చే నెల 13వ తేదీన బలంగా వేయబోయే ఓటు రాష్ట్ర భవిష్యత్తుకు బంగారు బాట కావాలి.
• నిడదవోలు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
నిడదవోలు నియోజకవర్గం అభివృద్ధికి జనసేన పార్టీ కట్టుబడి ఉంది. నియోజక వర్గంలో ఎప్పటినుంచో పెండింగ్లో ఉండిపోయిన సమస్యలపై కచ్చితంగా దృష్టి సారిస్తాం. నిడదవోలులో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేస్తాము. డంపింగ్ యార్డ్ సమస్య, నిడదవోలుకు గోదావరి జలాల తరలింపు అంశాలపై ప్రధానంగా దృష్టి పెడతాం. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే నిడదవోలు నియోజకవర్గంలో రోడ్లను అందంగా తీర్చిదిద్దే బాధ్యతను తీసుకుంటాం. ముఖ్యంగా ప్రజలకు పూర్తిస్థాయిలో జవాబుదారీ పరిపాలన అందేలా చర్యలు తీసుకుంటాం’’ అన్నారు. ఈ సందర్భంగా నిడదవోలు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కందుల దుర్గేష్ గారినీ, రాజమండ్రి ఎంపీ అభ్యర్థి శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారినీ గెలిపించాలని కోరారు.

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్