పేకాట క్లబ్బులు కావాలా…? ఉద్యోగాలు కావాలా?

ఉద్యోగాలు

* వైసీపీ సర్కార్ 4,709 పాఠశాలలు మూసేసింది
* 3 లక్షల 88 వేల మంది విద్యార్థులు స్కూళ్లు మానేశారు
* తండ్రి లేని బిడ్డనంటూ రాష్ట్రాన్ని దోచేస్తున్నాడు
* జగన్ డ్రామాలకు ఈసారి జనం మోసపోతే రాష్ట్రం అధోగతి పాలు
* 30 వేల మంది మహిళలు అదృశ్యమైనా, 62 వేల మంది విద్యార్థులు మరణించినా జగన్ కు చీమ కుట్టినట్లు లేదు
* పిల్లల పుస్తకాల దగ్గర నుంచి ప్రజల ఆస్తుల వరకు జగన్ బొమ్మలే
* చదువు చెప్పే గురువులకు మద్యం దుకాణాల డ్యూటీలు వేసిన వ్యక్తి జగన్
* పోలీసులకు మా నాన్నకు ఇచ్చే గౌరవం ఇస్తాను
* ఎస్సీ, బీసీ సబ్ ప్లాన్ నిధులు సక్రమంగా వినియోగిస్తాం
* ఇంట్లో ఎంతమంది స్కూలుకు వెళ్ళే పిల్లలుంటే అంతమందికీ ఏటా రూ.15 వేలు
* ఉంగుటూరు నియోజకవర్గం గణపవరంలో వారాహి విజయభేరి బహిరంగ సభలో శ్రీ పవన్ కళ్యాణ్
‘రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసింది. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసింది. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే మన ఆస్తులను మనమే తగలబెట్టుకున్నట్లు. కోనసీమ రైతాంగం క్రాప్ హాలీడే ప్రకటించినట్లు… వైసీపీకి ప్రజలు పొలిటికల్ హా లీడే ప్రకటించడం రాష్ట్రానికి చాలా అవసరమ’ని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. తండ్రి లేని బిడ్డను, మీ ఇంట్లో వాడినమ్మా అంటే నమ్మి ఒక్కసారి ఓటు వేసినందుకు, మన పొలాలు లాక్కుంటున్నాడు… మద్యం ఏరులై పారిస్తున్నాడు… ఇసుకను దోచుకుంటున్నాడని అన్నారు. జగన్ సింపతి డ్రామాలకు మరోసారి జనం మోసపోతే రాష్ట్రం అధోగతి పాలవుతుందని చెప్పారు. సోమవారం సాయంత్రం వారాహి విజయభేరి యాత్ర బహిరంగ సభ ఉంగుటూరు నియోజకవర్గం గణపవరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ… “ఎన్ని గొప్ప చట్టాలు తీసుకొచ్చినా పాలించే వాడి బుద్ధి వక్రంగా ఉంటే సమాజానికి మేలు జరగదు. జగన్ బుద్ధి వక్రంగా ఉంది. కనుకే యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దూరం చేశాడు. మెగా డీఎస్సీ పేరిట యువతను మోసం చేశాడు. సీపీఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చి ఉద్యోగులను మోసం చేశాడు. విద్యార్థులకు ఫీజురీయంబర్స్ మెంట్ ఇవ్వకుండా వేధిస్తున్నాడు.
• సొంత ఊరికి దారి వేయించుకోలేని వ్యక్తి ఎమ్మెల్యే
13 రోజుల్లో మనకి ఎన్నికలు ఉన్నాయి. 2014 నుంచి దశాబ్ద కాలంగా రాజకీయాల్లో యుద్ధం చేస్తున్నాం. జన సైనికులు వీర మహిళల మద్దతుతో పొత్తును ముందుకు తీసుకువెళ్లాగలిగాము. ఉంగుటూరులో ఎమ్మెల్యే వాసుబాబు మళ్లీ కావాలా? సొంత ఊరికి, తన ఇంటికీ దారి వేయించుకోలేని వ్యక్తి ఆయన. సొంత ఇంటికి దారి వేయించుకోలేని వ్యక్తి మన దారులేం ఏర్పరుస్తాడు. ఎమ్మెల్యేకి సరదాగా పేకాట క్లబ్బులు నడపాలని ఉంటుంది. ఆయన బాగా పేకాట క్లబ్బులు నడిపినందుకు రూ. 30 లక్షల విలువ చేసే కారు కూడా బహుమతిగా ఇచ్చారంట. మరి ప్రజలకు ఏం కావాలి. కావాల్సింది పేకాట క్లబ్బులా? డీఎస్సీ నోటిఫికేషనా? ఉపాధి అవకాశాలు కావాలా? అసలు ఈ ప్రభుత్వమే పేకాట ప్రభుత్వం.
• వేలాది మంది విద్యార్ధులు చనిపోతే కారణం చెప్పరా?
ఎన్నికల ముందు జగన్ రోడ్ల మీద తిరిగి.. ‘‘నేనున్నాను. ఒక్క ఛాన్స్’’ అంటే నమ్మి ఓటు వేశారు. రాజ్యాంగం మీద అవగాహన ఉన్న వ్యక్తులను ఎన్నుకోవాలి. ఎన్నుకోకపోతే పోయేది మీ భవిష్యత్తే. రోడ్లు వేయకపోతే పోయేది మన భవిష్యత్తే. ఈ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో నాడు నేడు పేరిట ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చేశామని చెబుతోంది. స్కూళ్లు ఏమో గాని పేకాట క్లబ్బులు, మద్యం, ఇసుక దోపిడీ మాత్రం బాగా జరిగింది. జగన్ నాయకత్వంలో ఎయిడెడ్ స్కూళ్లు మూసివేసింది. రాష్ట్రవ్యాప్తంగా 4,709 పాఠశాలల్ని మూసేసింది. 3 లక్షల 88 వేల మంది విద్యార్థులు స్కూళ్లు మానేశారు. ఐదేళ్ల నుంచి 18 సంవత్సరాల మధ్య వయసున్న విద్యార్థులు 62 వేల మంది చనిపోయారు. ఈ విషయం ఏదీ బయటకి రాదు. ముఖ్యమంత్రి జగన్ ప్రెస్ మీట్ పెట్టడు. కారణం ఏంటీ అనేది హెల్త్ సర్వే కూడా చేయించింది లేదు. చివరకు పిల్లలకు ఇచ్చే చిక్కీల కవర్ల మీద కూడా రూ. 67 కోట్లు దోచేసిన వ్యక్తి జగన్. స్కూలు పిల్లలకు ఇచ్చే నోట్ బుక్స్ మీద భగత్ సింగ్, అంబేద్కర్, మహాత్మా గాంధీ వంటి వారి ఫొటోలు వేస్తే స్ఫూర్తిని రగిలిస్తాయి. అలాంటిది జగన్ ఫోటో వేసుకున్నాడు.
• పోలీస్ శాఖను నియంత్రించే సీఎం ఐదేళ్లుగా బెయిల్ మీదున్నాడు
ఈ ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాల నుంచి బెయిల్ మీదున్న వ్యక్తి. 39 కేసులున్న వ్యక్తి. పాస్ పోర్టు కావాలంటే పోలీస్ వెరిఫికేషన్ అవసరం. ఆ పోలీసుల్ని నియంత్రించే వ్యక్తి ఐదేళ్లుగా బెయిల్ మీదున్నారు. అవినీతిని నిలువరించే ఏసీబీ మీద ఆధిపత్యం చెలాయించే ముఖ్యమంత్రి మీద ఈడీ కేసులు ఉన్నాయి. ఐదేళ్లుగా బెయిల్ మీద ఉన్నాడు. ఓటు వేసే ముందు ముఖ్యమంత్రి మనవాడా తనవాడా అని కాదు.. మంచివాడా కాదా అన్నదే ఆలోచించాలి. ప్రజలకు ఒకటే చెబుతున్నా క్రిమినల్స్ ని భుజాన పెట్టుకుంటే జీవితాలు నాశనం అయిపోతాయి.
• ఉంగుటూరు ఎమ్మెల్యే పేకాట క్లబ్బుల్లో బిజీ బిజీ
ఉంగుటూరులో ఆక్వా రైతాంగం ఉంది. దేశం మొత్తం మీద 35 శాతం ఆక్వా ఎగుమతులు ఏపీ నుంచే జరుగుతాయి. ఆక్వా వల్ల తాగునీటి ఇబ్బంది ఉంది. గ్రామాల్లో తాగునీరు లేదు. ఇక్కడేమో ఎమ్మెల్యే పేకాట క్లబ్బుల్లో బిజీగా ఉన్నారు. అందుకే ఉంగుటూరులో మన కోసం పని చేసే వ్యక్తి కావాలన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే అభ్యర్ధిగా శ్రీ ధర్మరాజు గారిని నిలబెట్టాం. ఎంపీ అభ్యర్ధిగా శ్రీ పుట్టా మహేష్ యాదవ్ గారిని పెట్టాం. వారిని గెలిపించండి.
* ఉపాధ్యాయులను గౌరవించని జగన్
మనమంతా గురువులకు దణ్ణం పెడతాం. జగన్ మాత్రం గురువులతో బాత్ రూములు కడిగించాడు. పాఠాలు చెప్పాల్సిన గురువుల్ని మద్యం షాపుల్లో క్యూలు సరిచేయమన్నాడు. ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన బకాయిలు మాత్రం ఇవ్వడు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీపీఎస్ వ్యవహారంలో బలమైన పరిష్కారం చూపిస్తాం. గణపవరంలో వైసీపీ నాయకులు- జన సైనికుల్ని, టీడీపీ కార్యకర్తల్ని ఓటు వేస్తే మీ అంతు చూస్తాం, వేళ్లు నరికేస్తాం అని బెదిరిస్తున్నారని తెలిసింది. జగన్ ఆధ్వర్యంలో నడిచే వైసీపీ గూండాలకు, ఉంగుటూరు వైసీపీ గూండాలకు, రాష్ట్రం మొత్తం ఉన్న వైసీపీ గూండాలకు మేమిచ్చే బదులు ఒక్కటే.. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు మేము బెదరం. మా వీర మహిళలు చెంగు మడత పెడితే మామూలుగా ఉండదు. ఓటు వేసే విషయంలో బెదిరింపులకు దిగితే తాట తీసి ఉంగుటూరు రోడ్ల మీద మోకాళ్లతో నడిపిస్తాం. మనకు మట్టి, కంకర లారీ రూ. 8 వేలకు అమ్ముకునే నాయకుడు కాదు. ధర్మరాజు లాంటి దమ్మున్న నాయకుడు కావాలి. మనకి రక్షిత మంచినీరు తెచ్చే నాయకుడు కావాలి. భూమి పిచ్చి పట్టిన ఈ వైసీపీ నాయకులు ఎవరైనా భూమిలోకి దిగిపోవాల్సిందేనన్న విషయం గుర్తుంచుకోవాలి. చేపల చెరువులు ఎక్కువగా ఉన్న కొల్లేరు ప్రాంతవాసులు కాంటూరు సమస్యతో ఇబ్బందిపడుతున్నారు. వైఎస్ హయాంలో కాంటారు పెంపులో చెరువు గట్లు కూల్చేసినప్పుడు జిరాయితీ భూముల్లో ఉన్న చెరువుల్ని ధ్వంసం చేశారు. వారికి పరిహారం ఇప్పించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. కొల్లేటి కాలుష్యం పెరిగి మత్స్య సంపద దెబ్బతింటోంది. ఏటా ఇక్కడికి వలస వచ్చే సైబీరియన్ పక్షులు రావడం మానేశాయి. కూటమి ప్రభుత్వంలో నీటి కాలుష్యాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటాం. నీటిని శుద్ది చేసిన తర్వాతే కొల్లేరులోకి వదిలేలా ప్రణాళికలు రూపొందిస్తాం. నారాయణపురం, గుండుగొలను గ్రామాల్లో వంతెనలు పునర్నిర్మిస్తాం. ఊరూరా మద్యం దొరుకుతోంది.. కానీ ప్రజలకు గుక్కెడు నీరు దొరకదు. ఉంగుటూరు నియోజకవర్గం పరిధిలోని 81 గ్రామాల్లో 64 గ్రామాలకు తాగునీటి ఇబ్బంది ఉంది. అధికారంలోకి రాగానే శాశ్వత రక్షిత మంచినీరు అన్ని గ్రామాలకు అందిస్తాం.
• ఆక్వా రంగాన్ని అగాధంలోకి తోసేశారు
ఈ ప్రభుత్వం ఆక్వా రైతాంగానికి చేయూత ఇవ్వాల్సింది పోయి అగాధంలోకి తోసేసింది. కరెంటు ఛార్జీలు పెంచారు. సీడు, ఫీడు ధరలు పెంచేశాడు. గత ప్రభుత్వ హయాంలో యూనిట్ కరెంటు రూపాయిన్నరకి ఇస్తే, ఈ ప్రభుత్వం 5 రూపాయిలకు యూనిట్ ధరను పెంచింది. గతంలో రూ. 1600 ఉన్న ఫీడు బస్తా రూ. 2750కి పెంచేశారు. బస్తాకి రూ. 1150 పెంచిన వైసీపీ కావాలా? విద్యుత్ సబ్సిడీ ఇచ్చే కూటమి కావాలా ఆలోచించాలి. ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్రానికి రావాల్సిన విదేశీ మారక ద్రవ్యం తగ్గిపోతుంది. ఆక్వా రైతు సరకు మీద కూడా కేజీకి రూ. 50 నష్టపోతున్నాడు. ఆక్వా రైతుల టాక్సుల సొమ్ముతో సారా వ్యాపారం చేసుకుంటున్నాడు ఈ ముఖ్యమంత్రి. పోలవరం పూర్తయితే తాగు, సాగునీరు సమస్యలు తీరుతాయి. చివరకు ఏలూరు కాలువ పూడిక తీసే పరిస్థితి కూడా లేదు. క్రాప్ ఇన్సూరెన్స్ కట్టకుండా ఈ ప్రభుత్వం రైతుల్ని ముంచింది. ఫసల్ బీమా యోజన పథకానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కట్టాల్సిన ప్రీమియం కట్టకుండా తప్పించుకుంది. రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లించకపోవడం వల్ల పంట నష్టం వాటిల్లిన రైతుల్లో పది శాతం మందికి కూడా పరిహారం అందలేదు. ఉంగుటూరులో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉంది. దేశంలో అత్యధిక రోడ్డు ప్రమాదాలు కూడా ఏపీలోనే జరుగుతున్నాయి. పల్నాడు జిల్లాకు చెందిన శ్రీ ఆనంద్ బాబు నలుగురు పిల్లలతో సహా చనిపోతే, కాకినాడలో భవన నిర్మాణ కూలి శ్రీ సత్తిబాబు, చిత్తూరు గొంటిపల్లిచెరువు వద్ద శ్రీ కరుణాకర్ రెడ్డి రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారు. నెల్లూరు జిల్లా మునుగోలులో బీజేపీ నాయకులు శ్రీనివాసరెడ్డి ప్రాణలు కోల్పోయారు. ఇలా వేలాది మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారు. కనీసం గుంతలు కూడా ప్రభుత్వం పూడ్చలేదు.
* మీ తాతలా గనులు కొట్టేయడం మాకు చేతకాదు
సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయం సాధించబోతుందని వైసీపీ అధినేతకు అర్ధమైపోయింది. అందుకే ఏం మాట్లాడాలో తెలియక నాన్ లోకల్ అంటూ కామెంట్ చేస్తున్నాడు. జగన్ తెలుసుకోవాల్సింది… నేను బాపట్లలో పుట్టాను. తిరుపతిలో నాకు నామకరణం చేశారు. ఒంగోలు, నెల్లూరు ప్రాంతాల్లో పెరిగాను. మొగల్తూరులో మాకు సొంత ఇళ్లు, పొలాలు ఉండేవి. నేను చిన్న ప్రభుత్వ ఉద్యోగి కొడుకుని. జగన్ లా మానాన్న ముఖ్యమంత్రి కాదు. వాళ్ల తాతలా గనుల యజమాని దగ్గరకు కూలికి వెళ్లి ఆ గనులు లాక్కోలేదు. కడపలో బైరెటీస్ గనులను బలిజ కులానికి చెందిన వెంకటనర్సయ్య గారు మైనింగ్ చేసేవారు. ఆయన దగ్గర కూలికి వెళ్లి ఆ గనులను జగన్ తాత లాక్కున్నాడు. మేము అలా చేయలేదు. కష్టపడి పనిచేసి, వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాం.
• చెల్లి కట్టుకున్న చీర మీద ఏ అన్నయినా మాట్లాడతాడా..?
తోడబుట్టిన చెల్లికి గౌరవం ఇవ్వని వ్యక్తి జగన్. మన ఆడబిడ్డలకు గౌరవం ఏమి ఇస్తాడు..? చెల్లి కట్టుకున్న చీర మీద, ఆమె సంసారం మీద ఏ అన్న అయినా బహిరంగంగా మాట్లాడతాడా..? ఈ పెద్ద మనిషి మాట్లాడతాడు. రాష్ట్రంలో 30 వేల మంది ఆడబిడ్డలు అదృశ్యమైతే స్పందించని వ్యక్తి జగన్. ఆడబిడ్డలు అత్యాచారానికి గురైతే… ఒకటి రెండు జరుగుతాయి ఆమాత్రం దానికే ఏమైపోతుందని వైసీపీ మంత్రులు మాట్లాడతారు. ఇలాంటి వారికి ఇంకోసారి అధికారం ఇస్తే మన ఆడబిడ్డల మాన, ప్రాణాలకు సంరక్షణ ఉండదు. పూర్వం దున్నేవాడిదే భూమి అనేవారు. ఇప్పుడు దున్నని భూమి, వాడని స్థలాలు అంతా జగన్ కు వెళ్లిపోతాయి. అత్యంత ప్రమాదకరమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను జగన్ తీసుకొచ్చాడు. మన ఆస్తులు తాలుకు ఒరిజినల్ దస్తావేజులు మన దగ్గర ఉండవు. మన దగ్గర కేవలం జిరాక్స్ లు మాత్రమే ఉంటాయి. రేపు మన ఆడబిడ్డలకు పసుపు, కుంకుమ కింద అల్లుడికి ఇవ్వాలంటే కుదరదు. తాకట్టు పెట్టుకోవాలన్నా కుదరదు. భారతదేశపు పాస్ పోర్ట్ మీద ప్రధాని నరేంద్ర మోడీ బొమ్మ ఉండదు. మన దేశ రాజముద్ర ఉంటుంది. అలాగే మన పట్టదారు పాస్ పుస్తకాలపై మన రాష్ట్ర రాజముద్ర ఉండాలి కానీ… జగన్ బొమ్మ ఎందుకు..? కూటమి ప్రభుత్వం రాగానే మన పాస్ పుస్తకాలపై రాష్ట్ర రాజముద్రను వేయిస్తాం. జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయండి. వైసీపీకి ఓటు వేస్తే మాత్రం మన ఆస్తులను మనమే పెట్రోల్ పోసి తగలబెట్టినట్లే.
• సేవా నాయకత్వం తీసుకొస్తాం
కూటమి ప్రభుత్వం తరఫున మాట ఇస్తున్నాం. మీకు సేవా నాయకత్వం తీసుకొస్తాం. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ ప్రకటిస్తాం. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. యువతకు స్కిల్ నేర్పించి వారి కాళ్ల మీద వాళ్లు బతికేలా తీర్చిదిద్దుతాం. సాగునీటి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా మారుస్తాం. చేతి వృత్తులు, కుల వృత్తులకు పెద్దపీట వేస్తాం. 50 ఏళ్లు దాటిన ప్రతి బీసీకి ఒకటో తేదీనే ఇంటి దగ్గర రూ. 4 వేలు ఫించన్ అందిస్తాం. స్కూలుకి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ. 15,000 చొప్పున ఎంతమంది స్కూలుకు వెళితే అంతమందికి అందిస్తాం. ప్రతి రైతుకు ఏటా రూ. 20,000 ఆర్థిక సాయం చేస్తాం. ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, ప్రతి మహిళకి నెలకు రూ. 1500 ఇస్తాం. ఆటో డ్రైవర్ల జీవనభృతికి ఇబ్బంది లేకుండా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తాం. పేదలకు కడుపునింపడానికి అన్నా క్యాంటీన్లతోపాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం ఉన్న బీసీల రిజర్వేషన్లను వైసీపీ 24కు తగ్గించింది. దీంతో చాలా మంది బీసీలు రాజకీయ ప్రాధాన్యం కోల్పోయారు. కూటమి అధికారంలోకి రాగానే బీసీల రిజర్వేషన్లను తిరిగి 34 శాతానికి పెంచుతాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మెనార్టీల నిధులను వారి సంక్షేమం, అభివృద్ధి కోసమే వినియోగిస్తాం. పోలీస్ శాఖకు గౌరవం ఇవ్వడం అంటే మా నాన్నకు గౌరవం ఇచ్చినట్లే అని భావిస్తాను. వాళ్లకు రావాల్సిన టీఏ, డీఏలను అందిస్తాం. రూ. 750 కోట్లు బకాయిలు ఉన్నాయి. అధికారంలోకి రాగానే మేమే ఇస్తాం. పోలీసులకు వారంతపు సెలవు పద్దతి తీసుకొస్తాం. రాష్ట్రంలో జగన్… ఇక్కడ వాసు బాబు ఓడిపోవడం ఖాయం. ధర్మరాజు గారు ఉంగుటూరు ఎమ్మెల్యే అవ్వగానే వాసు గారి ఇంటికి రోడ్డు వేసే బాధ్యత మేమే తీసుకుంటాం. ఏలూరు లోక్ సభ స్థానం నుంచి కూటమి అభ్యర్థిగా శ్రీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, ఉంగుటూరు శాసనసభ స్థానం నుంచి కూటమి అభ్యర్థిగా శ్రీ పత్సమట్ల ధర్మరాజు పోటీ చేస్తున్నారు. వారిని భారీ మెజార్టీతో గెలిపించాల”ని కోరారు.

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్