• ప్రజల ఆశలు వమ్ము చేసింది
• రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ గెలవాలి
• రాజానగరంలో ట్రిపుల్ ఇంజిన్ విజయం అవసరం
• కోరుకొండ వారాహి విజయభేరి సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి
‘ప్రతి ఇంట్లో ఫ్యాను ఉండాలి. కానీ ఫ్యాను స్పీడు నాలుగు మించరాదు. రాష్ట్ర ప్రజలు దాన్ని 151కి పెంచేశారు. ఫలితంగా ఇళ్లు, గోడలు కూల్చేసి ఓట్లేసిన జనాన్ని శిధిలాల మధ్య కూర్చోబెట్టింద’ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, కూటమి బలపరచిన రాజమండ్రి బీజేపీ పార్లమెంటు అభ్యర్ధి శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి స్పష్టం చేశారు. ఐదేళ్ల క్రితం ప్రజలు ఎన్నో ఆశలతో అధికారం కట్టబెట్టిన ప్రభుత్వం అదే ప్రజల్ని నానా ఇబ్బందులు పెట్టిందన్నారు. వైసీపీ పాలనలో ఏ రంగానికి, ఏ వర్గానికి న్యాయం జరిగింది లేదని తెలిపారు. శనివారం రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ గ్రామంలో నిర్వహించిన వారాహి విజయ భేరీ సభలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీమతి పురంధేశ్వరి మాట్లాడుతూ “ఒకప్పుడు అభివృద్ధికి మారుపేరుగా ఉన్న రాష్ట్రం వైసీపీ దెబ్బకి తలలేని మొండెంలా, రాజధాని లేని రాష్ట్రంగా మిగిలింది. జగన్ రివర్స్ టెండరింగ్ దెబ్బకి పోలవరం నిర్మాణమే రివర్స్ అయిపోయింది. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతుల జీవితాలు బజారున పడ్డాయి.
• యువతను, మహిళలను మోసం చేశారు
మెగా డీఎస్సీ పేరు చెప్పి యువతను మోసం చేశారు. నాణ్యత లేని మద్యం అమ్ముతూ శవాల మీద పేలాలు ఏరుకుంటున్నారు. రాష్ట్రంలో ఏటా 15 నుంచి 20 శాతం మహిళల మీద దౌర్జన్యాలు పెరిగిపోయాయి. రైతులకు ధరల స్థిరీకరణ నిధి ఇస్తానని మాట తప్పారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఆదుకుంటానన్నారు చేసింది లేదు. ఇలాంటి ప్రభుత్వం మనకి అవసరమా? డబుల్ ఇంజిన్ సర్కారు అవసరమా ఆలోచించుకోవాలి. మోదీ గారి నాయకత్వంలో దేశం దూసుకుపోతోంది. పేదల కోసం నిలబడ్డ శ్రీ మోదీ గారి నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి మరోసారి అధికారంలోకి రావాలి.
• హత్య జరిగితే కేసు పెట్టే దిక్కు లేదు
రాజానగరంలో కావాల్సింది.. డబుల్ ఇంజిన్ కాదు ట్రిపుల్ ఇంజిన్ విజయం. ఇక్కడ లా అండ్ ఆర్డర్ లేదు. గాంధీ బొమ్మసెంటర్ లో హత్య జరిగితే కేసు కూడా పెట్టలేని పరిస్థితి. 1200 ఎకరాల ఆలయ భూములు రిజిస్ట్రేషన్ సమస్యతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. గెలిచాక కోరుకొండలో మార్కెట్ యార్డు నిర్మించలేని జక్కంపూడి రాజా, గెలిచాక తాను మాత్రం బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకున్నారు. ఇలాంటి పరిస్థితులు మారాలి. రాష్ట్రం తిరిగి అభివృద్ధి బాట పట్టాలంటే దేశంలో, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలి” అన్నారు.
• శ్రీ పవన్ కళ్యాణ్ నమ్మకాన్ని వమ్ము కానివ్వం : శ్రీ బత్తుల బలరామకృష్ణ
రాజానగరం జనసేన అభ్యర్ధి శ్రీ బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ.. “మొట్టమొదట సీటుగా ప్రకటించినందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాజానగరం ప్రజల మీద ఉంచిన నమ్మకాన్ని మనమంతా నిలబెట్టుకోవాలి. జనసేన, టీడీపీ, బీజేపీ నేతలు సమిష్టిగా, ఐకమత్యంగా పోరాడి సీటు గెలిపించుకోవాలి. శ్రీ పవన్ కళ్యాణ్ గారు యువత, రైతులు, మహిళల భవిష్యత్తు కోసం పడుతున్న తపన చూసి జనసేన జెండా పట్టాను. నా నమ్మకం వమ్ము కాదు. గోదావరి పక్కనే ఉన్నా రాజానగరం నియోజకవర్గానికి తాగు, సాగు నీటి సమస్య తీవ్రంగా ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గ సమస్యలు తీర్చాల”ని నియోజకవర్గ సమస్యలను శ్రీ పవన్ కళ్యాణ్ గారికి విన్నవించారు. ఈ సభలో మాజీ మంత్రి, తూర్పు గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీ కె.ఎస్.జవహర్, టీడీపీ ఇంఛార్జి శ్రీ బొడ్డు వెంకట రమణ చౌదరి, బీజేపీ నేతలు శ్రీ నీరుకొండ వీరన్న చౌదరి, శ్రీ బొమ్ముల దత్తు తదితరులు పాల్గొన్నారు.
• భారీ ర్యాలీగా సభకు జనసేనాని
వారాహి విజయభేరీ సభకు తరలివచ్చిన ఆశేష జనవాహినితో కోరుకొండ జన సంద్రంగా మారింది. జన సైనికులతో పాటు టీడీపీ, బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి జయజయధ్వానాలతో మద్దతు తెలిపారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హారతులు పట్టారు. పూల వర్షం కురిపించారు. సభ ఆద్యంతం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా జెండాలు ప్రదర్శిస్తూ నినాదాలతో హోరెత్తించారు. అంతకు ముందు మధురపూడి విమానాశ్రయం నుంచి కోరుకొండ వరకు జనసైనికులు భారీ ర్యాలీ నిర్వహించారు. వందలాది బైకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి వాహన శ్రేణిని అనుసరిస్తూ మద్దతుగా నినాదాలు చేశారు. కూడళ్లలో మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో రోడ్ల మీదకు వచ్చి పూల వర్షంతో శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించారు.