• శ్రీ నాగబాబు పర్యవేక్షణలో ఎన్నికల ప్రచార ప్రక్రియ
• నెల రోజులుగా పిఠాపురంలోనే మకాం వేసిన శ్రీ నాగబాబు
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తోన్న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. నాగబాబు గారు గత నెల రోజులుగా పిఠాపురంలోనే ఉంటూ ఎన్నికల ప్రచార ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గం పుర వీధుల్లో ఏ మూలన చూసినా “జై జనసేన.. గాజు గ్లాసు గుర్తుకు మీ ఓటు..పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి..” అనే నినాదాలు మారు మ్రోగుతున్నాయి. ముఖ్యంగా మెగా కుటుంబం పిఠాపురం ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించారు. నియోజకవర్గం వ్యాప్తంగా శ్రీ నాగబాబు గారు చేపడుతోన్న రోడ్ షోలకు స్పందన లభిస్తోంది. శ్రీ నాగబాబు గారు నియోజకవర్గం అంతా పర్యటిస్తూ ప్రజల దృష్టిని ఆకర్షిస్తూ ఓటు అభ్యర్తిస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలను తమ కుటుంబ సభ్యులుగా భావిస్తూ, ప్రతీ ఒక్కరినీ పలకరిస్తూ ప్రచారం చేపడుతున్నారు. ఇప్పటికే మెగా ప్రిన్స్ శ్రీ కొణిదెల వరుణ్ తేజ్, శ్రీ వైష్ణవ్ తేజ్ పిఠాపురం ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనగా, ఈ నెల 5 న శ్రీ సాయి ధర్మ తేజ్ కూడా పిఠాపురంలో ప్రచారం చేయనున్నారు. మరో వైపు శ్రీ నాగబాబు గారు సతీమణి శ్రీమతి పద్మజా గారు పిఠాపురంలోనే ఉంటూ డోర్ టు డోర్ ప్రచారంలో భాగంగా ప్రతీ రోజూ ఒక్కో గ్రామంలో ప్రజలందరినీ కలుస్తూ ఓటు అభ్యర్తిస్తున్నారు. జనసేన స్టార్ క్యాంపెయినర్లు…. ప్రముఖ సినీ నటులు శ్రీ హైపర్ ఆది, శ్రీ సాగర్ (అర్.కె. నాయుడు), శ్రీ జాని మాస్టర్, శ్రీ సుడిగాలి సుధీర్, శ్రీ గెటప్ శ్రీను, శ్రీ రైజింగ్ రాజు, శ్రీ దొరబాబు, శ్రీ సద్దాం, శ్రీ హరి, మరి కొంతమంది టెలివిజన్, సినీ నటులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి అభ్యర్థుల కోసం స్వచ్చందంగా ప్రచారం చేస్తూనే అవకాశం దొరికినప్పుడల్లా పిఠాపురంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.