సర్వే జనా సుఖినోభవంతు అనే ఆకాంక్షతో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తలపెట్టిన యాగం నేటి సాయంసంధ్యా సమయంలో జరిగిన పూర్ణాహూతితో పరిపూర్ణమయ్యింది. కైలాస ప్రస్థార మృత్తికా లింగ మహా శివార్చనతో యాగశాల భక్తి పారవశ్యంతో ఓలలాడింది. నేటి ఉదయమే విశేష పూజలతో రెండో రోజు యాగం ఆరంభమయ్యింది. యాగశాలలో ప్రతిష్టాపితమైన గణపతి, చండీ, శివపార్వతులు, సూర్యుడు, మహావిష్ణు మూర్తులకు శ్రీ పవన్ కళ్యాణ్ గారి చేత రుత్వికులు పుష్పార్చన చేయించారు. సమీకృత పుష్పాలతోపాటు ప్రత్యేకంగా కమలాలతో దేవతా మూర్తులకు అర్చన చేశారు. మరోపక్క గణపతి హోమంతోపాటు సంపుటిత హోమాలు, వేదమంత్ర నాదంతో రుత్వికులు నిష్టా నియమాలతో సంప్రదాయబద్దంగా కొనసాగించారు. దేవకాంచన వర్ణమిళిత వస్త్రాలను శ్రీ పవన్ కళ్యాణ్ గారు ధరించారు.
• భక్తి పారవశ్యంతో పూర్ణాహుతి
తుది దశగా సాయం సంధ్య సమయాన పూర్ణాహుతి ఘట్టం ప్రారంభమైంది. తొలుత గోమాతకు పూజ చేసి కదళీఫలాలను ఫలహారంగా అందచేశారు. ఐదు హోమ గుండాలకు హారతులు ఇచ్చి, సుగంధ ద్రవ్యాలను శ్రీ పవన్ కళ్యాణ్ గారు అర్పించారు. యాగ నిర్వహణ పరిసమాప్తి సూచకంగా యజ్ఞజలంతో శ్రీ పవన్ కళ్యాణ్ గారికి రుత్వికులు పుణ్యస్నానంగావించారు. అనంతరం వేద ఆశీర్వచనాన్ని అందచేశారు. యాగ పరిసమాప్తి కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పాల్గొన్నారు. హోమం నుంచి జ్వలించిన అగ్నిశిఖలు యాగశాలను దేదీప్యమానంగా ప్రకాశింప చేశాయి. హోమ ద్రవ్యాల భస్మం నుంచి వెలువడిన సువాసనలు భక్తి పారవశ్యంలోకి తోడ్కొని వెళ్లాయి. పూర్ణాహుతి సందర్భాన ధవళ వస్త్రాలను శ్రీ పవన్ కళ్యాణ్ గారు ధరించారు. ఆద్యంతం భక్తి పారవశ్యంతో ఆయన యాగంలో తాదాత్మ్యత చెందారు.