జనసేనకు జగ్గుభాయ్ కీ మధ్య పోరాటమిది

జగ్గుభాయ్

* వాలంటీర్లే వైసీపీకి ప్రైవేటు సైన్యం
* రాష్ట్రం తమదే అనే భ్రమలో జగ్గుభాయ్ గ్యాంగ్ ఉన్నారు
* త్వరలోనే ఆ భ్రమలు తొలగిస్తాం
* సాక్షి పేపర్ కోసం ఏటా రూ. 48 కోట్లు ప్రజాధనం లూటీ
* అర్హతలేని వాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏలుతున్నాడు
* తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన పార్టీ శ్రేణుల సమావేశంలో అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్

           ‘వాలంటీర్లు సేకరిస్తున్న సున్నితమైన డేటా ఎక్కడికి వెళ్తుంది.. ఎటుపోతోంది..? దానివల్ల జరిగే దుష్పరిణామాల మీదే నా పోరాటం. రోజుకు కేవలం రూ.164.38 పైసలు వేతనం ఇస్తూ జగ్గు భాయ్ చేయిస్తున్న పాడు పనిలో భాగం కావొద్దు అని వాలంటీర్లకు చెప్పడమే నా ఉద్దేశం. వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తే కేంద్రం తీసుకువచ్చిన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం శిక్ష తప్పదు. దీన్ని వాలంటీర్లు తెలుసుకోండి. వారికి అర్థం కాకపోతే వాలంటీర్ల తల్లిదండ్రులు అయినా మీ బిడ్డలకు చెప్పండి. వాలంటీర్లతో నాకు ఇబ్బంది కాదు. జనసేనకు – జగ్గు భాయ్ కి మధ్య జరిగే యుద్ధమిది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నాకు జరిగే సున్నితమైన అంశం’ అని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. గురువారం ఆలంపురంలోని జయ గార్డెన్స్ లో తాడేపల్లిగూడెం నియోజకవర్గ వీర మహిళలు, జనసైనికుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ… “ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు. దౌర్జన్యంతో కూడిన క్రిమినల్ రాచరికం రాజ్యమేలుతుంది. దీనికి ప్రైవేటు ఆర్మీ.. వాలంటీర్లే. పంచాయతీ వ్యవస్థ బలంగా ఉన్నప్పుడు గ్రామ సచివాలయ వ్యవస్థను ఎందుకు తీసుకొచ్చారు? ముఖ్యమంత్రి జగ్గు భాయ్, వాళ్ల గ్యాంగ్.. ఏపీ తమదే అనే భ్రమలో ఉన్నారు. త్వరలోనే ఆ భ్రమలు తొలగిస్తాం.
* బలమైన న్యాయ పోరాటం చేస్తాం
           వాలంటీర్ల డేటా సేకరణ, అది నిక్షిప్తం చేస్తున్న చోటు, ఈ మొత్తం తతంగంపై జనసేన న్యాయ పోరాటం చేస్తుంది. నా దిష్టి బొమ్మలు తగలబెడితేనో, నా ఫోటోలను చెప్పులతో కొడితేనో నేను వెనక్కు తగ్గే వ్యక్తిని అసలు కాదు. నేను వాలంటీర్లు అందరినీ అనడం లేదు. తప్పు చేస్తున్న వారినే అంటున్నాము. అందరూ భుజాలు తడుముకోవాల్సిన అవసరం లేదు. వాలంటీర్లు సేకరించిన డేటా వాట్సప్ గ్రూపుల్లో బయటకు వెళ్తోంది. మీరు అందరూ సేకరించిన డేటా హ్యాక్ చేయడానికి ఒక్క వ్యక్తి చాలు. అయినా ప్రజల ఇంటి గుట్టు వాలంటీర్లకు ఎందుకు తెలియాలి..? వారి పరిధిలోని ఇళ్లలో ఎవరు పుష్పవతి అయినా, గర్భవతి అయినా వాలంటీర్లకు తెలియాల్సిన అవసరం ఏంటి..? మీరు ఏ పార్టీకి ఓటు వేస్తారు అనేది వాలంటీర్లకు ఎందుకు..?
* ఆడబిడ్డలున్న వారు జాగ్రత్త
             వ్యక్తిగత సమాచారం ప్రాథమిక హక్కు అని 2019లో జస్టిస్ కె.ఎస్. పుట్టు స్వామి దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఓ కేసుకు సంబంధించి పూర్తిగా వివరించారు. జగన్ లేనప్పుడు, వాలంటీర్లు లేనప్పుడు పింఛన్లు ఇవ్వలేదా..? శ్రీ దామోదరం సంజీవయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పట్లోనే పింఛన్లు అందరికీ అందేవి. ఈ వాలంటీర్లు వచ్చాకే పింఛన్లు ఇస్తున్నారా..? నేను మరీ మరీ చెబుతున్నాను.. ఆడబిడ్డలు ఉన్నవారు చాలా జాగ్రత్త. మన ఇంటి ఆడబిడ్డ బయటకు వెళ్తేనే మనం ఎప్పుడు వస్తుందా అని భయపడతాం. ఒక్కసారి నేను చెప్పే విషయాల మీద శ్రద్ధ పెట్టి ఆలోచించండి. మనం ఇచ్చే సమాచారమే జగ్గు భాయ్ ఆస్తి, బలం. వాలంటీర్లు ఆధార్, ఓటర్ కార్డ్, పాన్ కార్డు, ఆదాయ ధ్రువపత్రం, కుల ధ్రువపత్రం, బిల్డింగ్ డీటెయిల్స్, ఇంట్లోని వారి పూర్తి వివరాలు, వారి ఫోన్ నెంబర్లు, ఒంటరి, వితంతు మహిళల వివరాలు, యువతుల వివరాలు, వేలిముద్రలు, ఐరిస్, వంశ పారంపర్యం కూడా తెలుసుకుంటున్నారు. డేటా తీసుకోవడానికి వాలంటీర్లకు కనీసం నియమ నిబంధనలు, మోరల్ కోడ్ కూడా లేవు. వాలంటీర్ల విషయంలో నాకు ఎలాంటి వ్యక్తిగత ఇబ్బంది లేదు. మనం ఒకరికి ఇల్లు అద్దెకు ఇవ్వాలంటేనే ఎన్నో ఆలోచిస్తాం. అలాంటిది మన ఇంట్లోకి నేరుగా వచ్చేస్తున్న వాలంటీర్లను ఎందుకు అడ్డుకోలేకపోతున్నాం. డేటా ఇవ్వకపోతే సంక్షేమ పథకాలు రద్దు చేస్తామంటే కుదరదు. సంక్షేమ పథకాలు పొందడం అనేది పౌరునిగా ప్రాథమిక హక్కు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం కచ్చితంగా సంక్షేమం అందించాల్సిందే. ప్రభుత్వం అందించే సంక్షేమం వ్యక్తిగత వ్యవహారం కాదు అది ప్రజల ఉమ్మడి వ్యవహారం.
* మీది బాబాయ్ మర్డర్ టీం
      రాజకీయాల్లో ప్రలోభాలు ఉంటాయి. వాటన్నింటిని దాటుకొని నైతిక విలువలతో కూడిన రాజకీయం చేయడం వల్లే ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం. మనపై దాడులు చేస్తున్నారంటే మనం బలవంతులు అని అర్ధం. పండ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు తగులుతాయి. సోషల్ మీడియాలో వైసీపీ వాళ్లు దాడులకు దిగితే ఎదురు దాడి చేయడం నేర్చుకోండి. మనల్ని వాళ్లు బీ టీం అంటే వాళ్లు బాబాయ్ ని మర్డర్ చేసిన టీం. జగన్ జైల్లో ఉన్నప్పుడు పార్టీ కోసం ఊరువాడా తిరిగిన షర్మిల గారిని ఈ రోజు ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు. వైసీపీ మద్దతుదారులు వాళ్ల పార్టీని, అధినాయకుడిని ఎంతలా వెనకేసుకొస్తారు అంటే ప్రకృతి వనరులు దోచేసినా వెనకేసుకొస్తారు. మర్డర్లు చేసినా వెనకేసుకొస్తారు. మన కార్యకర్తలది మధ్యతరగతి మనస్తత్వం. దాని నుంచి మనం బయటకు రావాలి. ధీటుగా ఎదుర్కోవాలి.
* పార్టీ నడపడానికి ధన బలం ఒక్కటే సరిపోదు
           తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ షర్మిల గారు పార్టీ పెడితే మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలిపాను. ఎక్కువ మంది రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించాను. ఆమె తన పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నారని కొందరు మాట్లాడుకుంటుంటే విన్నాను. అది ఎంత వరకు నిజమో మనకు తెలియదు. ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే పార్టీ నడపడం చిన్న విషయం కాదు. పార్టీ నడపాలంటే వేల కోట్లు ఉంటే సరిపోదు. బలమైన భావజాలం, సైద్ధాంతిక బలం, రాజ్యాంగంపై సంపూర్ణ అవగాహన, మనం దేని కోసం రాజకీయాల్లోకి వచ్చామో దానిపై పూర్తి అవగాహన, మనల్ని నమ్మే సమూహం ఉంటే పార్టీ నడపొచ్చు. చిన్నప్పుడు క్యామిలిన్ పెన్సిల్ కొనుక్కోవడానికే మా నాన్న జీతం గురించి ఆలోచించేవాడిని. సమాజం కోసం ఇప్పటికీ రూ. కోటి ఇవ్వడానికి నాకు మనసు వస్తుంది కానీ నా కోసం ఇప్పటికిప్పుడు రూ. 10 వేలు ఖర్చు పెట్టాలన్నా ఎందుకులే అనుకునే మధ్యతరగతి మనస్తత్వంలోనే ఉండిపోయాను. అది నాకు ఎంతో ఇష్టం కూడా. ఆ మధ్యతరగతి మనస్తత్వం ఉండబట్టే జనం కోసం ఆలోచిస్తూ జనాన్ని నమ్ముకొని పార్టీని నడుపుతున్నాను.
* నిన్ను అందుకే జగ్గు భాయ్ అంటాను
            వనరుల్ని దోచుకుంటావ్.. ఆడపిల్లల్ని నీ మూకలతో బెదిరిస్తావ్. దోపిడీని అవినీతిని బహిరంగం చేశావు. బ్యూరోక్రసీని పోలీసు వ్యవస్థల్ని కాళ్ళ కింద పెట్టుకుంటావు. నిన్ను ప్రశ్నించిన ప్రతి ఒక్కరి మీద కక్ష తీర్చుకోవాలని చూస్తావ్. పాత సినిమాల్లో ఇలాంటి లక్షణాలున్న విలన్ కు బుగ్గపై నల్ల చుక్క పెట్టి, కత్తి గాటు పెట్టి జగ్గు భాయ్ గా పిలిచేవారు. ఇప్పుడు నువ్వు చేస్తున్న దానికి నిన్ను జగ్గు భాయ్ అనడమే కరెక్ట్. అర్హత లేని వాడు అందలం ఎక్కితే ఎలా ఉంటుందో చూపిస్తున్నావ్. నాకు నన్ను ఎన్ని మాటలు అన్నా నా కుటుంబాన్ని అన్న కోపం రాదు. జనాన్ని అంటే కోపం వస్తుంది. నా ఆడబిడ్డల్ని నోటికి వచ్చినట్లు మాట్లాడితే కోపం వస్తుంది.
* పెళ్లిళ్ల గురించి కాదు పాలసీల గురించి మాట్లాడు
             నేను మర్చిపోయిన పాత విషయాలను జగన్ మర్చిపోకపోవడం విశేషం. నిత్యం అతడికి నా పెళ్లిళ్ల గురించి తప్ప పాలసీల గురించి మాట్లాడే కనీస పరిజ్ఞానం లేదు. నాకు వ్యక్తిగత జీవితాలు అవసరం లేదు. మీ ఎంపీ న్యూడ్ షోలు, మీ ఎమ్మెల్యేల అరగంట గంట కబుర్లు నాకు అనవసరం. సమాజానికి అవసరం అయిన విషయాల మీద మాత్రమే మాట్లాడుతాను. సమాజంలోనూ దీనిపై మార్పు రావాలి. మనకి వ్యక్తిగత విషయాలు పనికిమాలిన విషయాలు మీద పెట్టే శ్రద్ధ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది..? మన బతుకులు శాసించే వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయి అన్నదాని మీద లేదు. జగన్ వాడే భాష సరికాదు. అత్యున్నత పదవిలో ఉన్నవారు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. గతంలో ఇరిగేషన్ పనుల్లో ఆరు శాతం వాటాగా ఇచ్చేవాళ్ళమని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. అంటే లక్ష కోట్ల పని జరిగితే, రూ. 6,000 కోట్లు నాయకుల జేబుల్లోకి వెళ్తాయి. ఆ డబ్బు ఖజానాకు వెళ్తే ఎన్నో పనులు జరుగుతాయి. పేదల జీవితాలు మారుతాయి. తెలుగువారిలో ఉదాసీనత పెరిగిపోయింది. ప్రశ్నించడం మర్చిపోయారు. తప్పు చేసిన వారిని గట్టిగా అడిగే ధైర్యం ఉండాలి. రూల్ ఆఫ్ లా అనేది అందరికీ వర్తించాలి. నేను తప్పు చేసినా కచ్చితంగా శిక్షపడేలా చట్టాలు పనిచేయాలి.
* జగ్గు భాయ్ అండ్ గ్యాంగ్ కు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి
              ఏ మాత్రం విలువలు లేకుండా నేరస్తులను వెనకేసుకొస్తూ జగన్ పరిపాలిస్తున్నాడు. వాలంటీర్లు కచ్చితంగా సాక్షి పేపర్ ని కొనాలి అని బహిరంగంగా జీవో జారీ చేసి మరి అవినీతి తంతు నడిపిస్తున్న వ్యక్తి. వ్యవస్థల్లోని పోలీసులు, రెవెన్యూ, ఇతర శాఖల సిబ్బంది ఏదైనా అవినీతికి పాల్పడితే వారి మీద ఏసీబీ ఉంది. మరి ప్రజల్ని పాలించే ఎమ్మెల్యేలు తప్పు చేస్తే ఏ ఏసీబీ లేదు. జగన్ ఇప్పుడు కోరలు చాచి ఎవరూ బతకకూడదు మాట్లాడకూడదు ప్రశ్నించకూడదు అనే కోణంలోకి వెళ్ళిపోయాడు. విశాఖపట్నంలో ఓ ఆడపడుచు జనసేన సిద్ధాంతాలను మెచ్చి పార్టీలో జాయిన్ అయి, ఒక ఫ్లెక్సీ కట్టిన పాపానికి ఆమె మీద హత్యాయత్నం కేసు పెట్టారు. అంటే ప్రజలు ఎవరూ తమకు నచ్చినట్లు బతకకూడదు. జగ్గు భాయ్ కి నచ్చినట్లు మాత్రమే బతకాలి. జగన్ దగుల్బాజీ.. దోపిడీదారు.. అవినీతిపరుడు. రూ.48 కోట్లు ప్రత్యేక ప్రజాధనం నుంచి బలవంతంగా సాక్షి పేపర్ కు దోపిడీ చేస్తున్న నువ్వు, నీతిమంతమైన పాలన ఎలా ఇస్తావు.. మేం దాన్ని ఎలా నమ్మాలి. కష్టపడకుండా నీకు ఇన్ని కోట్లు ఎలా వచ్చాయో లెక్క చెప్పు. వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు నీకు ఇచ్చిన ఆస్తి ఎంత.. ప్రజలు కానీ, ప్రత్యర్థులు గాని ఏం చేస్తున్నారు అనేది జగ్గు భాయ్ కి తెలుసుకోవాలని ఆత్రుత. కెమెరాలు నవరంద్రాల్లోనూ పెట్టుకో. నీవు తెలుసుకునేది కొత్తగా ఏమీ ఉండదు.
* ప్రశ్నించడం మన హక్కు
            సక్రమంగా ఏడాది పాటు సినిమాలు తీస్తే దాదాపు రూ. 1000 కోట్లు సంపాదిస్తాను. రాజకీయాల్లోకి రాకపోతే నన్ను ఏ ఒక్కరు పల్లెత్తు మాట మాట్లాడరు. నా భార్య, బిడ్డలు మాటలు పడాల్సిన అవసరం ఉండదు. నన్ను వ్యక్తిగతంగా దూషించినా, నా తల్లిని తిట్టినా ఎందుకు భరిస్తున్నాను అంటే సమాజం అంటే పిచ్చి, ప్రేమ. నా కంటే వేలకోట్ల ఆస్తిపరులు, పేరు ప్రఖ్యాతులు కలిగినవారు ఉన్నారు. వాళ్లు ఇన్ని ఇబ్బందులు భరించలేరు కనుకే రాజకీయాల్లోకి రారు. ప్రాథమిక హక్కులు కాపాడుకోవడం మన బాధ్యత. ఓటు వేయకపోతే పెన్షన్ తీసేస్తాం అని బెదిరిస్తే… నువ్వు ఎవడివిరా పెన్షన్ తీయడానికి అని ప్రశ్నించాలి. తప్పు జరిగితే ప్రశ్నించడం మన హక్కు. పొద్దున్న స్నానం చేద్దామంటే నీళ్లు కంపు కొడుతున్నాయి. ఇవే నీటిని ప్రజలు తాగుతున్నారు. ఏలూరు వింత వ్యాధితో దాదాపు 300 మంది ఆస్పత్రి పాలయ్యారు. ఇప్పటి వరకు అక్కడ వచ్చిన వ్యాధి ఏంటో తెలుసుకోలేకపోయారు. పదవుల కోసమే నా తాపత్రయం అయితే ఏదో ఒక జాతీయ పార్టీలో చేరి పదవులు తీసుకునేవాడిని. వ్యవస్థలో ఉన్న లోపాలను సరిచేయడానికి రాజకీయాల్లోకి వచ్చాను. ఎన్ని చట్టాలు, ఎన్ని సమాతర వ్యవస్థలు పెట్టినా ప్రజలకు మేలు చేసే గుణం లేకపోతే అవన్ని నిష్ప్రయోజనం.
* నిరసన తెలియజేస్తే కొట్టే హక్కు పోలీసులకు ఎక్కడిది?
              శ్రీకాళహస్తిలో నిన్న శాంతియుతంగా నిరసన చేస్తున్న జన సైనికుడు సాయిని ఓ పోలీసు అధికారిణి రెండు చెంపలపై బలంగా కొట్టారు. అంత బలంగా పోలీసు అధికారిని కొడుతున్నా, ఆ జన సైనికుడు స్థిరంగా నిలబడిపోయాడు. ఆ ధైర్యం అనేది సిద్ధాంత బలంతో ఒళ్ళు గట్టి పడిపోవడం వల్ల వచ్చిన ధైర్యం. జగ్గు భాయ్ గుర్తుపెట్టుకో మాది విప్లవకారుల సమూహం. సిద్ధాంతాల కోసం నిలబడిపోతాం. తెగించి పోరాడుతాం. ప్రాణం మీద ఆశ లేకుండా అంత బలంగా పోరాడకపోతే నీ క్రిమినల్ కోటలను బద్దలు కొట్టలేం అనేది మాకు తెలుసు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న జన సైనికుడిని కొట్టే హక్కు పోలీసులకు ఎక్కడిది..? రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కూడా పోలీసులు కాలరాస్తారా..? దీనిపై తేల్చుకునేందుకు నేనే వస్తున్న..? నాకు సమాధానం చెప్పండి. నా జన సైనికుడిని కొడితే నన్ను కొట్టినట్లే భావిస్తాను. జన సైనికులకు, వీర మహిళలకు నేను చెప్పేది ఒక్కటే. పోరాడితే పోయేదేమీ లేదు. నేను చెప్పే ప్రతి అంశం సున్నితమైనది. జన సైనికులు వీర మహిళలు దీనిని ప్రజల్లోకి తీసుకువెళ్లండి.. వారిని చైతన్యవంతం చేయండి. జరుగుతున్న అక్రమాన్ని ప్రజలకు పూర్తిగా తెలియజేయండి” అన్నారు.
* పన్నులు వేస్తారు.. యువతకు పని కల్పించలేరు : శ్రీ నాదెండ్ల మనోహర్
             పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “సామాజిక పరివర్తన రాజకీయాల ద్వారానే సాధ్యం. అలాంటి మార్పు రావాలంటే స్థానికంగా మనం బలపడాలి. స్థానిక సంస్థల ఎన్నికల ద్వారానే అది సాధ్యం. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జనసేన శ్రేణులు ప్రత్యర్ధులకు ధీటుగా నిలబడ్డారు. ఎక్కడా రాజీపడకుండా ముందుకు వెళ్లారు. భవిష్యత్తులోనూ అంతే బలంగా పని చేయాలి. రాష్ట్రంలో ఉన్న సమస్యలు అర్ధం చేసుకోండి. రాజధాని లేని రాష్ట్రం.. పరిపాలన చేతకాని ముఖ్యమంత్రి. బటన్లు నొక్కడం మినహా ఏమీ చేతకాదు. నాలుగున్నర సంవత్సరాల పాలనలో ఒక్క బైపాస్ రోడ్డు వేయలేకపోయారు. పన్నులు మాత్రం విచ్చలవిడిగా వేసేస్తారు. జె టాక్స్ కి తోడు ఇక్కడ కె టాక్స్ ఉంది. పన్నుల వడ్డింపు గురించి చేసే ఆలోచన యువతకు పని కల్పించడంపై లేదు. పార్టీని బలోపేతం చేస్తూ ప్రతి ఒక్కరు ఎన్నికల కోసం సమాయత్తం కావాలి. ప్రతి గ్రామంలో జనసేన జెండా ఎగురవేయాలి. ప్రతి ఒక్కరు ఓటర్ లిస్టుపై అధ్యయనం చేయండి. 20వ తేదీ ఎన్నికల సంఘం ప్రత్యేక మీటింగ్ ఏర్పాటు చేసింది. తర్వాత క్షేత్ర స్థాయి పర్యటనలు ఉంటాయి. అందులో మీరు పాల్గొనండి. జనసేన పార్టీ నుంచి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే కాదు, శ్రీ బొలిశెట్టి శ్రీను లాంటి 50 మంది ఎమ్మెల్యేలు అయ్యే బలమైన నాయకులు పార్టీలో ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో కష్టపడి పని చేయండి. క్రమశిక్షణతో ముందుకు వెళ్లండి. అక్రమ కేసుల వ్యవహారంలో పార్టీ మీకు అండగా ఉంటుంది. ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలిగినా ప్రతి ఒక్కరినీ ఆదుకునే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ప్రతి చోటా జనసేన జెండా ఎగిరేలా కృషి చేయాలి. సభకు భారీగా తరలివచ్చిన వీర మహిళలకు, ర్యాలీతో తాడేపల్లిగూడెం పట్టణాన్ని జనసముద్రంగా మార్చిన యువతకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియ చేస్తున్నాను” అన్నారు. ఈ సమావేశంలో పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ కొటికలపూడి గోవిందరావు, తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇంఛార్జ్ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్, రాష్ట్ర, జిల్లా కార్యవర్గం సభ్యులు, పెద్ద సంఖ్యలో వీర మహిళలు, జన సైనికులు పాల్గొన్నారు.

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్