• పచ్చటి కోనసీమ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టారు
• దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేస్తున్నారు
• ప్రభుత్వ ఉద్యోగులకు భరోసా లేదు
• ఐదేళ్ల నరకానికి స్వస్తి పలికే సమయం ఆసన్నమైంది
• ప్రజాస్వామ్య పరిరక్షణకు ముందుకు వచ్చిన కూటమిని గెలిపించండి
• పి.గన్నవరం వారాహి విజయభేరి సభలో టీడీపీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు
‘ఐదేళ్లుగా రాష్ట్రంలో విధ్వంస పాలన సాగింది. అడుగడుగునా అరాచకం రాజ్యమేలింది. ఐదేళ్ల నరకానికి, ప్రజలు పడుతున్న సమస్యలకు చెక్ పెట్టే సమయం ఆసన్నమైంద’ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు. ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో ఏ ఒక్కరి జీవితంలో మార్పు వచ్చింది లేదు.. ఏ ఒక్కరికీ న్యాయం జరిగింది లేదు.. ఏ వర్గానికీ, కుటుంబానికీ న్యాయం జరగలేదన్నారు. పచ్చటి అందాల కోనసీమలోనూ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి చిచ్చుపెట్టారన్నారు. కశ్మీర్ మాదిరి పరిస్థితులు తెచ్చారు. ఇలాంటి ప్రభుత్వం అవసరమా? అని ప్రశ్నించారు. సంక్షేమం, అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ ధ్యేయంగా కూటమిగా మీ ముందుకు వచ్చాం. రాష్ట్రాన్ని నిలబెట్టుకోవడానికి, ప్రజలను గెలిపించుకోవడానికి, మన బిడ్డల ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. గురువారం సాయంత్రం పి.గన్నవరం నియోజకవర్గం, అంబాజీపేటలో నిర్వహించిన వారాహి విజయభేరీ సభలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో కలసి పాల్గొన్నారు. పి.గన్నవరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థి శ్రీ గిడ్డి సత్యనారాయణ, అమలాపురం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న శ్రీ గంటి హరీష్ లను గెలిపించాలని ఇరువురు నాయకులు ప్రజలను కోరారు. ఈ సందర్భంగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ..”వైసీపీ తన ఐదేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలకు నరకం చూపించింది. రూ. 200 ఉన్న విద్యుత్ ఛార్జీలు రూ. 2 వేలకు పెంచి 99 శాతం హామీలు నెరవేర్చానని గొప్పలు చెప్పుకుంటున్నారు ఈ ముఖ్యమంత్రి. ఇలాంటి ప్రభుత్వం మీకు కావాలా? గత ఐదేళ్లలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. సామాన్యుడు కడుపు నిండా తిండి తినే పరిస్థితి లేదు. ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి. పన్నులు పెరిగాయి. చెత్త మీద కూడా పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి జగన్. రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు ఉన్నాయా? జగన్ జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా? రాష్ట్రంలో యువతకు జాబు రావాలి అంటే కచ్చితంగా కూటమి ప్రభుత్వం రావాల్సిందే. అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం మెగా డీఎస్పీ ఫైలు మీద పెడతాం.
• 40 లక్షల మంది పొట్టకొట్టి ఒక్క వ్యక్తి పొట్టనింపుకుంటున్నాడు
గోదావరి తీరంలో ఉన్నా మీ ప్రాంతంలో ఇసుక దొరుకుతుందా? టీడీపీ హయాంలో ట్రాక్టర్ ఇసుక రూ. వెయ్యి ఉంటే, ఇప్పుడు రూ. 5 వేలు. ఈ డబ్బు మొత్తం ఎవరికి చేరుతుంది. ఎవరు తినేస్తున్నారు? 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టి ఒక వ్యక్తి పొట్టనింపుకోవడం సబబా అని ప్రశ్నిస్తున్నా. ఎక్కడ చూసినా ఇసుక దందా, ఇసుక మాఫియా. మద్యం పరిస్థితి చూస్తే టీడీపీ హయాంలో క్వార్టర్ రూ. 60 ఇప్పుడు రూ. 200. వ్యత్యాసం రూ.140. ఈ డబ్బు మొత్తం ఎవరి జేబులోకి చేరుతుందో ప్రజలు ఆలోచించాలి.
• పోలీసుల నిధులు మింగేశారు
రాష్ట్రంలో కనీసం ప్రభుత్వ ఉద్యోగులు బాగున్నారా? అంటే అదీ లేదు. ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగి అంటే భద్రత, గ్యారెంటి ఉండేవి. ఇప్పుడు వారి జీతానికి, జీవితానికి గ్యారెంటీ లేదు. విశాఖలో కానిస్టేబుల్ శ్రీ శంకర్ రావు తీవ్రమైన ఒత్తిడిలో కాల్చుకుని చనిపోయే పరిస్థితి తెచ్చారు. జగన్ పోలీసులకు ఇవ్వాల్సిన నిధులు ఇచ్చాడా? సరెండర్ల లీవులు, డీఏలు, టీఏలు అన్నీ పెండింగ్ పెట్టాడు. ఇవ్వాల్సిన పెన్షన్ కూడా ఇవ్వలేదు. చివరికి శ్రీ శంకర్ రావు ఒత్తిడిలో తుపాకితో కాల్చుకుని చనిపోయాడు.
• గంజాయి రాజ్యమేలుతోంది
గతంలో గన్నవరంలో గంజాయి ఉందా? ఇప్పుడు గంజాయి, డ్రగ్స్, జె. బ్రాండ్ లిక్కర్ రాజ్యమేలుతోంది. యువత గంజాయి బారినపడి చెడు దారి పట్టే పరిస్థితి తీసుకువచ్చింది ఈ వైసిపి సర్కార్. కోనసీమ ప్రజల్లో బాధ, ఆవేదన, ఆక్రందన, అభద్రత భావం పెరిగిపోయింది. ఈ పరిస్థితుల్లో మీకు భరోసా ఇవ్వడానికి, మీ జీవితాల్లో వెలుగులు నింపడానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను వచ్చాం. సిద్ధం.. సిద్ధం అంటున్న వారికి మరిచిపోలేని యుద్ధం ఇద్దామని శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపును స్వీకరించేందుకు మీరు సిద్ధంగా ఉండండి.
• చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ కోసం పోరాటం
మహాత్మా జ్యోతిరావు పూలే, శ్రీ బాబు జగ్జీవన్ రామ్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సాక్షిగా బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాం. కూటమి తీసుకువచ్చిన బీసీ డిక్లరేషన్ తో బీసీల తలరాత మారుతుంది. బీసీలకు సబ్ ప్లాన్ ద్వారా ఏడాదికి రూ. 30 వేల చొప్పున ఇచ్చి ఆర్ధికంగా పైకి తీసుకువచ్చే బాధ్యత తీసుకుంటాం. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్ పునరుద్దరించే బాధ్యత మాది. చట్ట సభల్లోనూ బీసీ రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తాం. కేంద్రంలో అది సాధించే వరకు పోరాటం చేస్తాం. చట్టబద్దంగా కులగణన జరుపుతాం. బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకువస్తాం. ఆదరణ పథకానికి రూ. 5 వేల కోట్లు ఖర్చు చేస్తాం. బీసీలకు పూర్తి స్థాయిలో న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాం.
• వైసీపీ మళ్లీ గెలిస్తే ప్రజల్ని చంపి డోర్ డెలివరీ చేస్తారు
కోనసీమ ప్రాంతంలో దళితులు ఉన్నారు. ఐదేళ్ల పాలనలో ఏ దళితుడికి అయినా ఈ ప్రభుత్వంలో న్యాయం జరిగిందా? 27 సంక్షేమ పథకాలు ఈ ప్రభుత్వం రద్దు చేసింది. భూమిని కొని దళితులకు ఇచ్చే కార్యక్రమాన్ని నిలిపివేశారు. డీకేటీ పట్టాలు రద్దు చేసి ఇతరులకు ఇచ్చుకున్నారు. బెస్ట్ అవేలబుల్ స్కూళ్లు రద్దు చేశారు. ఇది దళిత ద్రోహి ప్రభుత్వం. మా ప్రభుత్వంలో దళిత పిల్లలకు ఇన్నోవాలు ఇచ్చాం. అంబేద్కర్ గారి పేరిట విదేశీ విద్య పథకం తీసుకువస్తే.. దానికి జగన్ పేరు పెట్టుకున్నారు. ఒక్కరికీ విదేశీ విద్య అందించకుండా దెబ్బ తీశారు. ఈ ప్రభుత్వంలో దళితులు నోరు విప్పే పరిస్థితులు లేవు. నోరు విప్పితే దాడులు చేస్తారు. ఆరు వేల కేసులు పెట్టారు. 180 మందిని చంపేశారు. గోదావరి జిల్లాల్లోనే ఎమ్మెల్సీ దళితుడిని చంపేసి డోర్ డెలివరీ చేశారు. మళ్ళీ వీళ్లు వస్తే ప్రజల్ని చంపి డోర్ డెలివరీ చేసినా దిక్కు ఉండదు. కూటమి అధికారంలోకి వస్తేనే సామాజిక న్యాయం సాధ్యం. ఈ ప్రాంతంలో మాల సామాజిక వర్గానికి మూడు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ సీటు ఇచ్చాం. మాదిగ సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ ఇస్తాం. సామాజిక న్యాయాన్ని బాధ్యతగా తీసుకుంటాం. ఎస్సీ వర్గీకరణ ద్వారా జనాభా దామాషా ప్రకారం అందరికీ న్యాయం జరిగేలా చూస్తాము.
• మా కులం వారితోనే బూతులు తిట్టిస్తారు
కోనసీమ ప్రాంతంలోని కాపుల్లోనూ పేదరికం ఉంది. వారి కోసం సంవత్సరానికి వెయ్యి కోట్లు ఖర్చు చేసిన పార్టీ టీడీపీ. ఈ ముఖ్యమంత్రి రూ. 2 వేల కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ. 10 వేల కోట్లు ఖర్చు చేస్తానన్నాడు. పది కోట్లు కూడా ఖర్చు చేసింది లేదు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఆయన కులం వారితో దాడి చేయిస్తారు. నేను మాట్లాడితే నా కులం వారితో బూతులు తిట్టిస్తారు. ఇలాంటి వారిని రాష్ట్రం నుంచి సాగనంపాలి. మీరు కొట్టే దెబ్బ జగన్ కి అదిరిపోవాలి. ఇంటి నుంచి బయటకి రాకుండా చితక్కొట్టే బాధ్యత గన్నవరం ప్రజలు తీసుకోండి.
• ఈ ఎన్నికలు వన్ సైడే
శ్రీ గిడ్డి సత్యనారాయణ గారు గన్నవరం నియోజకవర్గ సమస్యలు మా దృష్టికి తీసుకువచ్చారు. నదీ పరివాహక ప్రాంతంలో లంక గ్రామాలు వరదల సమయంలో కోతకు గురవుతున్నాయని చెప్పారు. ఆయా గ్రామాల్లో రివిట్మెంట్ కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం. కాజ్ వేలు నిర్మించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. అప్పనపల్లిలో లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు ఏర్పాటు చేసి సాగు, తాగు నీరు ఇప్పిస్తాం. కొబ్బరి ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసి కోనసీమ కొబ్బరికి పూర్వ వైభవం తీసుకువస్తాం. వరికి మద్దతు ధర ఇప్పిస్తాం. మేము సూపర్ సిక్స్ తో వచ్చాం. శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరో నాలుగు అంశాలు చేర్చారు. మొత్తం పది అంశాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యతను స్వీకరిస్తాం. శ్రీ పవన్ కళ్యాణ్ గారు 2014 లో పోటీ చేయకుండా ఎన్డీఏకి సహకరించారు. అప్పుడు గోదావరి జిల్లాల్లో ఎన్నికలు వన్ సైడ్ గా జరిగాయి. ఇప్పుడు ఇద్దరం కలిశాం. ప్రధాని శ్రీ మోదీ గారి ఆధ్వర్యంలోని బీజేపీని మూడో పార్టీగా కలుపుకున్నాం. జగన్ కి మా ముందు నిలబడే దమ్ము లేదు” అన్నారు.