కూటమి ప్రభుత్వం పెద్దన్నలా పని చేస్తుంది

కూటమి

• అన్ని కులాలను, మతాలను, వర్గాలను కలుపుకొని వెళ్తాం
• హెలీప్యాడ్లు తవ్వేసే ఉగ్రవాద వైసీపీని ఇంటికి పంపాలి
• బయటికి క్లాస్ వార్ అనే జగన్, చేసేదంతా గుత్తాధిపత్యమే
• జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు జీవో ఎందుకు తెచ్చారు?
• చెల్లికే ఆస్తులివ్వని వాడు మనకేం న్యాయం చేస్తాడు
• పోలవరం గురించి అడిగితే డ్యాన్సులు చేసే మంత్రి మనకు వద్దు
• పొన్నూరు వారాహి విజయభేరి సభలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్
కూటమి ప్రభుత్వం వస్తే సంక్షేమ పథకాలు మొత్తం రద్దవుతాయని జగన్ విష ప్రచారం మొదలుపెట్టాడు. సంక్షేమ పథకాలు ఏవీ జగన్ తాత సొత్తు కాదు. ప్రజల నుంచి తీసుకున్న పన్నుల ద్వారానే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాడు తప్ప జగన్ ఇంట్లో సొమ్ము ఇవ్వడం లేదు. కూటమి ప్రభుత్వంలో మెరుగైన సంక్షేమ పథకాలు అందిస్తాం. కూటమి మేనిఫెస్టో పూర్తి స్థాయిలో అమలయ్యే బాధ్యత తీసుకుంటాం’ అని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. వృద్ధులకు ఇచ్చే పింఛను తనే తీసుకువచ్చినట్టు జగన్ చెబుతున్నాడు… దళిత ముఖ్యమంత్రి శ్రీ దామోదరం సంజీవయ్య గారు తన హయాంలో తల్లి చెప్పిన చిన్న మాటను ఆలోచనగా తీసుకుని వృద్ధులకు పింఛన్ పథకం తీసుకువచ్చారు. దీన్ని జగన్ చెప్పడు. మొత్తం అన్నీ నేనే తీసుకువచ్చాను. సంక్షేమ పథకాలు అన్నీ తనే పంచుతున్నానని చెప్పుకుంటాడ’న్నారు. కూటమి ప్రభుత్వంలో ఏ వర్గానికి అన్యాయం జరగదనీ, కులాలు, మతాలు దాటి అందరినీ సమంగా చూసే పాలన ఉంటుందని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఒక పెద్దన్న బాధ్యత తసుకుంటుందని స్పష్టం చేశారు. ఆదివారం పొన్నూరులో జరిగిన వారాహి విజయభేరీ సభలో ప్రసంగించారు. పొన్నూరు అసెంబ్లీ అభ్యర్థి శ్రీ ధూళ్లిపాళ్ళ నరేంద్ర, గుంటూరు లోక్ సభ అభ్యర్థి డా. పెమ్మసాని చంద్రశేఖర్ లను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ.. “జగన్ నేను నాన్ లోకల్ అని చెబుతున్నాడు. మా నాన్న ఒక ప్రభుత్వ ఉద్యోగి కావడం వల్ల మా కుటుంబం పలు ప్రాంతాల్లో ఉండాల్సి వచ్చింది. నేను పుట్టింది బాపట్లలో, పెరిగింది పల్నాడు, నెల్లూరుల్లో. నేను గుంటూరు కారం లాంటి వాడిని. అది జగన్ గుర్తు పెట్టుకోవాలి.
• హెలీప్యాడ్ తవ్వేయడం ఉగ్రవాద చర్య
నేను వస్తున్నానని తెలియగానే వైసీపీ నాయకులు రాత్రికి రాత్రి నా హెలీకాప్టర్ దిగే హెలీప్యాడ్ తవ్వేశారు. దాన్ని ఎవరూ చూసుకోకుండా ఉంటే జరిగే నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు. హెలీప్యాడ్ తవ్వేయడం అనేది ఉగ్రవాద చర్య కిందకు వస్తుంది. దీనిపై కూటమి ప్రభుత్వం రాగానే కచ్చితంగా తగిన చర్యలు తీసుకుంటాం. కూటమి ప్రభుత్వంలో శాంతి భద్రతలు చాలా బలంగా ఉంటాయి. సహజ వనరులపై వైసీపీ నాయకులు గుత్తాధిపత్యం చెలాయిస్తున్నారు. ఇసుక, మద్యం, ఎర్రమట్టి ఆఖరికి డెయిరీల్లో కూడా వీరిదే గుత్తాధిపత్యం ఉండాలి. ప్రజా సభల్లో క్లాస్ వార్ అని చెప్పే జగన్ చేసేవన్నీ గుత్తాధిపత్యం పనులే. తప్పు జరిగితే కచ్చితంగా ప్రజలే తిరగబడాలి. సహజ వనరులు ఏ ఒక్కరివీ కాదు. అవి జాతి సంపద.
• పోలవరం గురించి అడిగితే డ్యాన్సులు వేసే మంత్రి
జలవనరులు శాఖ మంత్రికి ప్రాజెక్టుల మీద పూర్తి అవగాహన ఉండాలి. మన నోటి పారుదల శాఖ మంత్రికి మాత్రం ప్రాజెక్టుల గురించి తెలియదు. డ్యాముల గురించి అర్ధం కాదు. పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తావంటే నాకేం తెలుసు అని సమాధానం ఇస్తారు. సినిమా పాటలకు డాన్సులు వేస్తారు. పోలవరం ధ్వంసం గురించి ప్రశ్నిస్తే అది నా పరిధిలో లేదంటాడు. 1.60 లక్షల మంది పోలవరం నిర్వాసితుల గురించి ఒక్కసారి కూడా మాట్లాడని వ్యక్తి మన జలవనరుల శాఖ మంత్రి. ప్రశ్నించిన వారిపై దాడులు చేయడానికి, ఎవరైనా వస్తే హెలీ ప్యాడ్లు తవ్వించడానికి వీరికి మంత్రి పదవులు ఇవ్వలేదు. మంత్రి పదవి అనేది ఒక బాధ్యత. ఆ బాధ్యతను సక్రమంగా నిర్వహించాలి. అంబటి రాంబాబు అల్లుడే ఆయనకు ఓటు వేయొద్దని చెబుతున్నాడంటే ఇంట్లోని వారు వీరి ప్రవర్తనతో ఎంత విసిగిపోయారో అర్ధం చేసుకోవాలి. వైసీపీ నాయకులు పూర్తి స్థాయిలో కులాలను తిట్టడానికి మాత్రమే వాడుకుంటున్నారు. రాజకీయాల్లో వ్యక్తిగత దాడులు, హత్యలు, అసభ్యంగా మహిళలను దూషించడాలు వంటివి తీసుకువచ్చిన ఘనత వైసీపీకే దక్కుతుంది.
• ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రద్దు చేస్తామంటున్న జగన్ జీవో ఎందుకు తెచ్చారు?
వైసీపీ ప్రభుత్వం గత నెలలో జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు అమలుపై జీవో తీసుకువచ్చింది. పైలెట్ ప్రాజెక్టును ప్రకటించింది. ఇప్పుడు జనంలో ఈ చట్టం గురించి అవగాహన వస్తుండడంతో సజ్జల రామకృష్ణారెడ్డి ఈ దుర్మార్గ చట్టాన్ని రద్దు చేస్తామని చెబుతున్నారు. అసలు రద్దు చేసే చట్టానికి జీవో తీసుకువచ్చి ఎందుకు అమలు చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల వేళ ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత, తిరుగుబాటు చూసి చట్టాలను రద్దు చేస్తామని చెబుతున్నారు. కేంద్రం ముసాయిదా పంపితే దానికి జగన్ కు అనుకూలమైన నిబంధనలు విధించి ప్రజల ఆస్తులు దోచుకోవడానికి ఈ చట్టం ముసుగులో పన్నాగం పన్నారు. ఈ చట్టం వస్తే ఎవరి వద్ద ఒరిజినల్ డాక్యుమెంట్లు ఉండవు. మొత్తం జగన్ చేతిలోనే ఉంటాయి. మన ఆస్తులు ఎవరైనా అక్రమిస్తే కోర్టులకు వెళ్లడానికి లేదు. జగన్ మనుషులే పంచాయితీలు చేస్తారు. మన ఆస్తులన్నీ గాలిలో దీపాల్లా ఆరిపోతాయి.
• విద్యా, వైద్యం, ఉపాధి, సాగు, తాగునీరు, శాంతిభద్రతలకు ప్రాధాన్యం
సగటు మనిషికి అవసరం అయ్యే వాటిని కూటమి ప్రభుత్వంలో ప్రాధాన్య అంశాలుగా తీసుకుంటాం. విద్య, వైద్యం, సాగు, తాగునీరు, శాంతిభద్రతలు కాపాడేందుకు కూటమి ప్రభుత్వంలో ప్రాధాన్యత ఇస్తాం. దాడులు, దోపిడీలు, గోతులు అడిగితే బూతులు తిట్టే ఈ వైసీపీని ఇంటికి పంపాల్సిన అవసరం ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ప్రణాళికాబద్దంగా అమలు చేస్తాం. కులాలకు అతీతంగా రాజకీయం చేస్తాం. కులాన్ని వాడుకుని ఎదిగే వ్యక్తిని నేను కాదు. వైసీపీ పాలనలో రెక్కలు వంగి మగ్గం నేస్తున్న చేనేత కార్మికులు జీఎస్టీ కట్టాలిగాని రూ. 41 వేల కోట్లు మద్యంలో దోచుకున్న వారు మాత్రం జీఎస్టీ కట్టరు. సమాజం అంతా గౌరవించే గురువులను మద్యం దుకాణాల వద్ద డ్యూటీ వేసిన ప్రభుత్వం ఇది. రోడ్డు సెస్ పేరిట పెట్రోల్ ధరలు పెంచి దోచుకున్న ప్రభుత్వం ఇది. రేషన్ బియ్యం మాఫియాని పెంచి పోషించిన పాలన ఇది.
• విషాన్ని మద్యం రూపంలో అమ్మిన ప్రభుత్వం
గత ప్రభుత్వ హయాంలో రూ. 60 ఉన్న క్వార్టర్ మద్యం బాటిల్ వైసీపీ ప్రభుత్వంలో రూ. 200 అయ్యింది. అంటే రూ. 140 జగన్ గ్యాంగ్ జేబులోకి వెళ్లిపోతున్నాయి. అత్యంత హానికరమైన మద్యాన్ని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్మి ప్రత్యక్షంగా ప్రజల మరణాలకు కారణం అవుతున్న ప్రభుత్వం ఇది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం మరణాలతో ఎన్నో కుటుంబాలు రోడ్డునపడ్డాయి. మనుషులు కళ్ల ముందే చనిపోతున్నారు. కిడ్నీ, క్లోమ గ్రంధి, లివర్, కంటి సమస్యలతో మద్యం మనుషుల ప్రాణాలు తోడేస్తుంది. ఐదుసార్లు శుద్ది చేయాల్సిన మద్యాన్ని వైసీపీ ప్రభుత్వం ధనార్జనకు అలవాటు పడి కేవలం రెండుసార్లు శుద్ధి చేసి ప్రజలకు అందిస్తోంది. మూడు వేల బాటిళ్లు తయారు కావాల్సిన చోట 8 వేల బాటిళ్లు తయారు చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మహిళలు 70 శాతం తమ ప్రాంతంలో వద్దు అంటే మద్యం దుకాణాలు ఎత్తి వేస్తాం. నాణ్యమైన మద్యాన్ని ప్రజలకు అందిస్తాం. కల్తీ మందు వ్యాపారులపై రౌడీ షీట్లు తెరుస్తాం.
• ఎర్రమట్టిలో రూ. 2 వేల కోట్లు దోచేశారు
శ్రీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు సీనియర్ నాయకులు. అలాంటి వ్యక్తులు, వారి కుటుంబ సభ్యులు జగన్ తో జతకట్టాక ఈ ప్రాంతంలో రూ. 2 వేల కోట్లు ఎర్రమట్టిలోనే సంపాదించారంటే ఎంత అవనీతి జరిగిందో అర్ధం చేసుకోవచ్చు. జగన్ అనే చెత్త బుట్టలోకి వెళ్తే మంచి కూడా చెడుగా మారుతుంది. పొన్నూరుకు సంబంధించి కాలువల పూడిక తీత, సాగునీటి పారుదల సరిగా అమలయ్యే బాధ్యత తీసుకుంటాం. ఈ ప్రాంతంలో రేషన్ బియ్యం వ్యాపారాన్ని నిలదీసిన దళిత యువకుడిని అన్యాయంగా హత్య చేశారు. రేషన్ బియ్యం మాఫియా ఈ ప్రాంతంలో నిరాటంకంగా సాగుతోంది. దానిపై ఉక్కుపాదం మోపాలి. రైతుల వద్దనే రూ. 20 కోట్లు కమిషన్ తీసుకున్న వైసీపీ నాయకుల్ని వదిలిపెట్టం. కూటమి ప్రభుత్వంలో బ్రాహ్మణ సమాజాన్ని తగిన విధంగా గౌరవించుకుంటాం. మైనారిటీలకు అండగా నిలుస్తాం. బీజేపీ కూటమిలో ఉందని మైనారిటీలు అపోహపడాల్సిన అవసరం లేదు. హజ్ యాత్రకు ముస్లింలు ఎక్కువ మొత్తం వెళ్లేలా చొరవ తీసుకుని సౌదీ యువరాజుతో మాట్లాడి ఒప్పించిన గొప్పనాయకుడు శ్రీ మోదీ గారు. ముస్లింలకు పూర్తి స్థాయి భద్రతను బీజేపీ కల్పించింది. ఏ ఒక్క పథకాన్ని ఆపలేదు. కూటమి ప్రభుత్వంలో కూడా ముస్లిం మైనారిటీలకు పూర్తి స్థాయిలో అండగా ఉంటాం. కులాలు, మతాలు చూడకుండా పాలన చేస్తాం. యువతకు నైపుణ్యం కల్పించి వారికి ఇష్టమైన పని కల్పిస్తాం. ఆరోగ్య శ్రీని నిర్వీర్యం చేసి రూ. 1200 కోట్లు బకాయిలు పెట్టిన వైసీపీ ప్రభుత్వానికి భిన్నంగా ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల ఆరోగ్య బీమా అమలు చేస్తాం. జ్యూలియస్ రెబెరో పోలీస్ సంస్కరణలు అమలు చేసి రాజకీయ జోక్యాన్ని తగ్గిస్తాం. కూటమి ప్రభుత్వం విజయం ఇప్పటికే ఖాయం అయ్యింది. మెజారిటీ ఎంత ఇస్తారన్నది ప్రజల చేతులో ఉంది. ఈ ప్రాంతం కోసం ఎంతో కష్టపడే శ్రీ దూళిపాళ్ల నరేంద్ర గారిని కూటమి ఎమ్మెల్యే అభ్యర్ధిగా సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలి. అలాగే కూటమి ఎంపీ అభ్యర్ధిగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారిని గెలిపించాలి” అన్నారు.
• వైసీపీని క్లీన్ బౌల్డ్ చేద్దాం.. రాష్ట్రాన్ని కాపాడుదాం : శ్రీ అంబటి రాయుడు
టీమిండియా క్రికెటర్, జనసేన పార్టీ స్టార్ క్యాంపెయినర్ శ్రీ అంబటి రాయుడు మాట్లాడుతూ “కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మన ప్రాంతం బాగుపడుతుంది. పొన్నూరు బిడ్డగా చెబుతున్నా వైసీపీ తప్పుడు ప్రచారాలు ఎవరూ వినవద్దు. యువతకు మంచి చేయడానికి వారు సిద్ధంగా లేరు. వైసీపీకి తెలిసింది బానిసత్వం ఒక్కటే. ప్రజలంతా పేదరికంలో, అభివృద్ధి లేకుండా బతకడమే వైసీపీ బలం. ఈ ఎన్నికల్లో కూటమికి ఓటు వేస్తే శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేసినట్టే. కూటమి గెలుపు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావడానికి తొలి మెట్టు. ఎవరికీ ఏదీ తేలిగ్గా రాదు. మనకి ఇప్పుడు సమయం వచ్చింది. కుల, మతాలకు అతీతంగా రాష్ట్ర భవిష్యత్తు కోసం నిలబడండి. కోస్తా ప్రాంతాన్ని అభివృద్ధిలో వెనుకబడేలా చేసిన వైసీపీని క్లీన్ బౌల్డ్ చేసే అవకాశం మనకి దక్కింది. కూటమికి మద్దతు ఇచ్చి రాష్ట్రాన్ని కాపాడండి” అన్నారు. కూటమి బలపర్చిన గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్ధి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. “వైసీపీకి ఒక్క ఛాన్స్ ఇస్తే రాజధాని లేదు. పోలవరం లేదు. ఒక్క ఇండస్ట్రీ లేదు. ఉద్యోగం లేదు. ఉన్న ఉద్యోగానికి జీతం లేదు. ప్రజల ఆస్తికి భద్రత లేదు. బతుక్కి భరోసా లేకుండా ప్రజల జీవితాలు చిన్నాభిన్నం చేశారు. ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ అభ్యర్ధులు కులం పేరు చెబుతున్నారు. గుణంలేని పాలకులు కులం గొడుగు పడతారు. ప్రజలు అభివృద్ధి కావాలో అరాచకం కావాలో తేల్చుకోవాలి” అన్నారు.
• విధ్వంస పాలనను అంతం చేసేందుకు కదిలిన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్: ధూళిపాళ్ల నరేంద్ర
పొన్నూరు ఎమ్మెల్యే అభ్యర్ధి శ్రీ ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ “రాష్ట్రంలో అరాచకాన్ని ఆపేందుకు, దోపిడీ, విధ్వంస పాలనను అణచివేయడానికి ముందుకు వచ్చిన నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. వైసీపీ అరాచకం పరాకాష్టకు చేరి శ్రీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేస్తే.. అరాచకాల వైసీపీని భూస్థాపితం చేసేందుకు కలసి నడుద్దాం అని కూటమి కట్టి నడిపించిన నాయకుడు. హెలీప్యాడ్ తవ్వేస్తే ఆయన రారు అనుకున్నారు. మీరు తవ్వింది హెలీప్యాడ్ కాదు మీ గొయ్యి అని ఇక్కడికి వచ్చిన జనాన్ని చూస్తే తెలుస్తుంది” అన్నారు.

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్