• ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకొనే బాధ్యత మాది అని అనకాపల్లి నూకాలమ్మ తల్లి సాక్షిగా చెబుతున్నా
• 25 వేల కిలోల డ్రగ్స్ వైసీపీ పాలకులకు తెలియకుండా వస్తాయా..?
• క్రిమినల్ పాలన రాష్ట్రానికి పెనుశాపంగా మారింది
• ఈ ముఖ్యమంత్రి సారా, ఇసుక వ్యాపారి, భూ బకాసురుడు
• వైసీపీ పాలన అంతం అయితేనే రాష్ట్ర భవిష్యత్తు
• యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు మెరుగుపరుస్తాము
• చెరకు విస్తృతంగా పండే అనకాపల్లి ప్రాంతంలో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు… శ్రీ మోడీ విజన్ 2047కి అనుగుణంగా అభివృద్ధి
• ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి నిధులు పూర్తి స్థాయిలో వెచ్చిస్తాం
• అనకాపల్లి వారాహి విజయభేరి యాత్ర సభలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్
‘వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ ను దేశానికి గంజాయి రాజధానిగా చేశారు. యువశక్తిని నిర్వీర్యం చేసేలా, యువతను గంజాయికి అలవాటు చేసేలా వైసీపీ పాలన సాగింది. ఇలాంటి వైసీపీ పాలనకు చరమగీతం పాడి, రాష్ట్రాన్ని డ్రగ్స్ క్యాపిటల్ గా మార్చిన ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఈడ్చి రాష్ట్రం అవతల పారేస్తాం. రాష్ట్రాన్ని రక్షించుకోవడమే నా ముందున్న లక్ష్యం. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకొంటామని అనకాపల్లి నూకాలమ్మ తల్లి సాక్షిగా చెబుతున్నాను. అధికారం ఇచ్చి చూస్తే ఏ వ్యక్తి వ్యక్తిత్వం అయినా బయటపడుతుంది అంటారు. ఈ ముఖ్యమంత్రికి అధికారం ఇస్తే ఏం చేశాడో రాష్ట్ర ప్రజలకు ఈపాటికే అర్ధం అయింది. అందుకే ఎన్నికలు ఎప్పుడు వస్తాయా… కూటమి ప్రభుత్వాన్ని ఎప్పుడు తెచ్చుకుందామా అనే ఆశ ప్రజల కళ్లలో కనిపిస్తుంది. అది అతి త్వరలోనే సాకారం కాబోతోంద’ని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఆదివారం అనకాపల్లిలో నిర్వహించిన వారాహి విజయభేరి యాత్ర సభలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. అశేష జన వాహినిని ఉద్దేశించి ప్రసంగిస్తూ అనకాపల్లి శాసన సభ స్థానం నుంచి పోటీలో ఉన్న జనసేన అభ్యర్థి శ్రీ కొణతాల రామకృష్ణ, లోక్ సభ స్థానం నుంచి పోటీలో ఉన్న బీజేపీ అభ్యర్థి శ్రీ సి.ఎం.రమేశ్ లను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “రాష్ట్ర భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలని, రాబోయే తరం బాగుపడాలనే తపనతోనే జనసేన పార్టీ వెనక్కు తగ్గింది. ఏ పార్టీ అయినా పెరిగిన ప్రజాబలాన్ని మరింత పెంచుకొని, ఎన్నికల్లో ఎక్కువ సీట్లు అడగాలని భావిస్తుంది. జనసేన పార్టీ మాత్రం తనకు తాను తగ్గించుకొని రాష్ట్ర భవిష్యత్తు కోసం రెండు పార్టీలను కలిపి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంది.
• సమర్థత ఉన్న నాయకుల సమూహం జనసేన
శ్రీ కొణతాల రామకృష్ణ గారు, శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారు వంటి అనుభవం, సమర్థత ఉన్న నాయకులు గెలిచి అసెంబ్లీలో ప్రజల కోసం మాట్లాడాలి. ప్రజల సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న ఇలాంటి నాయకులు అసెంబ్లీలో ప్రజల కోసం పాలసీలు తీసుకొస్తే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని బలంగా నమ్ముతున్నాను. కచ్చితంగా పూర్తి రాజకీయ అవగాహన, ప్రజల కోసం ఆలోచించే నాయకులు ఆంధ్రప్రదేశ్ బాగు కోసం నిలబడతారు. దశాబ్దకాలం పాటు ఎంతో నిబద్ధతతో పార్టీని నడిపాను. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారితో ఉన్న సాన్నిహిత్యం ఉపయోగించుకొని ఓ మంత్రి పదవి తెచ్చుకోవడం పెద్ద లెక్క కాదు. కాని ప్రజల భవిష్యత్తు కోసం బలంగా నిలబడాలనే తలంపుతోనే ముందడుగు వేశాను. 2019 ఎన్నికల ముందు అమ్మఒడి పథకం ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలో 83 లక్షల మంది పిల్లలకు పథకం వర్తించాలి. అయితే వైసీపీ ప్రభుత్వం పాలన మొదలుపెట్టాక ఇంట్లో ఒక్కరికి మాత్రమే అమ్మఒడి ఇస్తామని మాట మార్చారు. కేవలం 44 లక్షల మందే లబ్ధిదారులుగా చూపించారు. మొదటి సంవత్సరం రూ.15 వేలు అమ్మఒడి డబ్బులు వేస్తే, రెండో సంవత్సరం వేయి తగ్గించి రూ.14 వేలు వేశారు. మరో సంవత్సరం రూ.13 వేలకు తగ్గించారు. 2021-22 సంవత్సరానికి పూర్తిగా ఎగ్గొట్టారు. మొత్తం వైసీపీ పాలనలో అమ్మఒడి పథకానికి రూ.19,600 కోట్లు వెచ్చిస్తే, మద్యపాన నిషేధం అని చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీ పథకం ‘‘నాన్నబుడ్డి’’ పథకం కింద కల్తీ మద్యం అమ్మి రూ. లక్ష కోట్లు ఆర్జించింది. ఇది వైసీపీ ప్రభుత్వం చేసే న్యాయం. ఈ ముఖ్యమంత్రి సారా వ్యాపారి… ఇసుక వ్యాపారి.. భూ బకాసురుడు. అన్ని విధాలా రాష్ట్రాన్ని నాశనం చేసిన పాలకుడు.
• అనకాపల్లి కోడిగుడ్డు
గతంలో అనకాపల్లి బెల్లానికి ప్రపంచవ్యాప్తంగా పేరుండేది. అయితే ఇప్పుడు కోడిగుడ్డు ఫేమస్. కోడిగుడ్డు మంత్రి తన హయాంలో కట్టుకథలు చెప్పడం తప్పితే, కిలోమీటరు రోడ్డు వేయలేకపోయారు. 2018లో జనసేన పోరాట యాత్రలో భాగంగా అనకాపల్లి నియోజకవర్గంలోని తుమ్మపాల షుగర్ ఫాక్టరీకి వెళ్లాను. స్థానికులంతా షుగర్ ఫాక్టరీ తెరిపించాలని కోరారు. దీనివల్ల వారికి ఉపాధి మెరుగవుతుందని చెప్పారు. ఇప్పటి ముఖ్యమంత్రి అప్పట్లో పాదయాత్ర చేసి ఈ చక్కెర కర్మాగారాన్ని అభివృద్ధి చేస్తాను అని చెప్పాడు. అయితే పాలనలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం ఈ షుగర్ ఫాక్టరీని రూ.300 కోట్లకు రియల్ ఎస్టేట్ వారికి అమ్మేయాలని పన్నాగం పన్నింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సహకార షుగర్ ఫాక్టరీల గురించి ఆలోచిస్తాం. కచ్చితంగా వాటిని బతికించేలా, మళ్లీ లాభాల బాటలోకి తీసుకెళ్లేలా ప్రణాళికలు ఉంటాయి.
• అనకాపల్లి బెల్లాన్ని టి.టి.డి.వాళ్ళు ఎందుకు తీసుకోవడం లేదు?
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు ఈ ప్రాంతానికి వరం. శ్రీ కొణతాల రామకృష్ణ వంటి నాయకులు ఇలాంటి గొప్ప ప్రాజెక్టు ఆవిష్కరణకు తోడ్పడ్డారు. అయితే ఉత్తరాంధ్రను సస్యశ్యామలం చేసే ఈ ప్రాజెక్టుకు వైసీపీ ప్రభుత్వం రూ.5 కోట్లు విదిల్చింది. ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు కనీస ఆసక్తి చూపలేదు. కూటమి ప్రభుత్వంలో నిధులు వెచ్చించి, ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేలా కృషి చేస్తాం. అనకాపల్లి బెల్లానికి గ్లోబల్ ట్యాగ్ వచ్చేలా చూస్తాం. మార్కెటింగ్ సదుపాయాలను విస్తృతం చేయడమే కాకుండా, తిరుమల శ్రీవారి ప్రసాదాలకు బెల్లం వాడేలా చర్యలుంటాయి. వైసీపీ రాక ముందు ఇక్కడి నుంచి టీటీడీ బెల్లాన్ని తీసుకొనేది. ఇప్పుడు ఎందుకు తీసుకోవడం లేదు? అనకాపల్లి బెల్లం ప్రయోజనాలను విస్తృతం చేసి, దాని ఎగుమతులు పెరిగేలా చేస్తాం. చెరకు ఎక్కువగా పండే ఈ ప్రాంతంలో ఇథనాల్ తయారీ పరిశ్రమలను ప్రొత్సహిస్తే నరేంద్ర మోడీ గారి విజన్ 2047 ప్రణాళికకు అనుగుణంగా ముందుకు వెళ్లవచ్చు. ఉపాధి అవకాశాలను సృష్టించవచ్చు. అనకాపల్లి ప్రాంతానికి కోడిగుడ్డు ప్రభుత్వం, కోడిగుడ్డు నాయకులు కావాలా..? లేక సుస్థిరమైన ప్రభుత్వం కావాలా అన్నది ప్రజలు ఆలోచించాలి.
• ప్రజల కోసం బాధ్యతతో పని చేస్తాం
పాలనలో జవాబుదారీతనం తీసుకురావడమే కాదు… ప్రజల కోసం ఒళ్లొంచి, బాధ్యతతో పని చేస్తాం. అధికారాన్ని బాధ్యతగా తీసుకుంటాం. ప్రజలు అప్పగించిన బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్తాం. విస్సన్నపేట ప్రాంతంలో 600 ఎకరాలకు పైగా భూములను దోచుకున్న కోడిగుడ్డు మంత్రులను చట్టం ముందు నిలబెడతాం. శ్రీ నరేంద్ర మోదీ గారి 2047 విజన్ కు తగినట్లుగా యువతలో పూర్తిస్థాయి నైపుణ్యాన్ని పెంచేందుకు తగిన విధంగా ప్రయత్నాలు చేస్తాం. యువత అభిరుచి, వారి ఆసక్తి, ప్రతిభ, సమర్థతపై సర్వే చేయించి దానికి అనుగుణంగా వారికి తగిన నైపుణ్యాలు అభివృద్ధి చేసేలా ప్రణాళికలు ఉంటాయి. రాష్ట్రాన్ని స్కిల్ డవలప్మెంట్ హబ్ గా తీర్చిదిద్ది భవిష్యత్తు అవసరాలకు యువతను సంసిద్దం చేస్తాం.
• అనకాపల్లి సమస్యలపై ప్రధాన దృష్టి
గత వైసీపీ హయాంలో అనకాపల్లి సమస్యలు ఏ మాత్రం తీరలేదు. కనీస సౌకర్యాలు దగ్గర నుంచి మౌలిక వసతుల ఊసే లేదు. అనకాపల్లి నూకాలమ్మ తల్లి జాతరను రాష్ట్ర పండుగగా వేడుకగా నిర్వహించే బాధ్యత తీసుకుంటాం. పిఠాపురంలో గెలిచిన తరవాత ఆ తల్లి దీవెనలు అందుకొని ప్రమాణస్వీకారానికి వెళ్తాను. ఎస్ఈజడ్ లో పని చేసేందుకు స్థానిక యువతకు నైపుణ్యం పెంచుతాం. ఇక్కడ 7 వేల మంది బీటెక్ పట్టభద్రులు ఉంటే, కేవలం 1300 మందికే ఉపాధి దక్కింది. స్థానిక యువతలో స్కిల్స్ పెంచి ఎస్ఈజడ్ లలో ఉపాధి లభించే ఏర్పాటు చేస్తాం. శారదా నది తీరాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతాం. సహకార విద్యుత్ సంస్థలను మళ్లీ స్వతంత్రంగా తీర్చిదిద్దుతాం. ఉద్యోగాల పేరుతో రూ.కోట్లు కొల్లగొట్టిన వారిని వదిలేది లేదు. బొజ్జన్నకొండను బుద్దిస్ట్ సర్క్యూట్ గా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దవచ్చు. దానిపై ప్రణాళికలు రూపొందిస్తాం. టిడ్కో ఇళ్లు స్థానిక లబ్ధిదారులకు పంచేలా చూస్తాం. డంపింగ్ యార్డు సమస్యలకు శాశ్వత పరిష్కారం ఆలోచిస్తున్నాం. స్థానిక ఆస్పత్రి నుంచి రోజూ వైజాగ్ కు రిఫరల్స్ లేకుండా ఈ ఆస్పత్రి సమస్యలను పూర్తిగా తొలగించే బాధ్యత తీసుకుంటాం. వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ భవనాలను తాకట్టు పెట్టడం తప్ప కొత్త భవనాలను కట్టింది లేదు. కూటమి ప్రభుత్వంలో కొత్త జిల్లాల్లో అద్దె భవనాలు లేకుండా, శాశ్వత భవనాలను కట్టేలా చొరవ తీసుకుంటాం. కశింకోటలో శారద నదిపై వంతెన మధ్యలోనే ఆగిపోయింది. వంతెన పూర్తి చేశాకే ఓట్లు అడుగుతానని కోడుగుడ్డు మంత్రి అప్పట్లో చెప్పారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఓట్లు అడగడానికి వస్తే… వంతెన సంగతి ఏంటని నిలదీయండి. ల్యాండ్ పూలింగ్ పేరిట పేదల భూములు సేకరించారు. వారికి సరైన నష్టపరిహారం ఇప్పటి వరకు ఇవ్వలేదు. భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేస్తాం. కొణతాల గారు మంత్రిగా ఉన్న సమయంలో సంతోషిమాత ఆలయం వద్ద రైతు బజారు ఏర్పాటు చేశారు. దానిని వైసీపీ ప్రభుత్వం వినియోగంలోకి తీసుకురాలేకపోయింది. దానిని పునరుద్దరించడంతో కొత్త రైతు బజారును ఏర్పాటు చేస్తాం. ఆసియాలో బెల్లం ఎగుమతులకు అనకాపల్లి ఫేమస్. కానీ.. ఇప్పుడు సంక్షోభం వైపు నడుస్తోంది. అనకాపల్లి బెల్లానికి పూర్వవైభవం తీసుకొస్తాం. అన్నమయ్య ఉద్యానవనం, పరమేశ్వరి, గాంధీనగర్, రఘురాం కాలనీల్లో ఉద్యానవనాలు, పార్కులను నిర్మిస్తాం. యువత కోసం ప్రత్యేక క్రీడా స్థలాలు, పెద్దలకు వాకింగ్ ట్రాక్ లు నిర్మిస్తాం. టీటీడీ ఆధ్వర్యంలో కళ్యాణమండపం నిర్మిస్తాం. వైసీపీ ప్రభుత్వ హయంలో అన్ని అర్హతలు ఉన్న పెన్షన్లు, రేషన్ కార్డులు తీసేశారు. అవన్ని పునరుద్దరిస్తాం. అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మిస్తాం. పూడిమడక, చోడవరం రహదారులతో పాటు అంతర్గత రహదారులు అన్ని పెద్ద పెద్ద గుంతలతో చిధ్రంగా మారాయి. వాటన్నింటికి మరమ్మతులు చేస్తాం. అక్రమ మైనింగ్ కు అనకాపల్లి నియోజకవర్గం అడ్డాగా మారింది. అనకాపల్లి ఏడీ పరిధిలో వందల క్వారీలు ఉండగా పదుల సంఖ్యలో క్వారీలకు మాత్రమే పర్యావరణ అనుమతులు ఉన్నాయి. ఈ అక్రమ క్వారీలన్ని స్థానిక నాయకుల కనుసన్నల్లో నడుస్తున్నాయి. అక్రమ క్వారీల వల్ల స్థానిక ప్రజల్లో కిడ్నీ సమస్యలు తలెత్తున్నాయి. వాటన్నింటిని అధికారంలోకి రాగానే మూసేస్తాం.
• 25 వేల కిలోల డ్రగ్స్ పాలకుల ప్రమేయం లేకుండా వచ్చాయా..?
ఇటీవల విశాఖ పోర్టులో బయటపడిన 25 వేల కిలోల డ్రగ్స్ వైసీపీ పాలకులకు తెలియకుండా, ప్రమేయం లేకుండా వచ్చే అవకాశం లేదు. వైసీపీ పాలన మొదలయ్యాక రాష్ట్రం పూర్తిగా డ్రగ్స్ తో నిండిపోయింది. ఇలాంటి క్రిమినల్ ప్రభుత్వం వద్దు అనే – ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా తగిన విధంగా కూటమితో ముందడుగు వేశాను. ఆంధ్రప్రదేశ్ ను మళ్లీ పూర్తిస్థాయి కట్టుదిట్టమైన రాష్ట్రంగా, శాంతిభద్రతలు చక్కగా అమలు అయ్యేలా తగిన బాధ్యతను తీసుకుంటాం. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ ను సాధిస్తాం. సీపీఎస్ రద్దు కోసం ప్రభుత్వ ఉద్యోగులు మా కూటమి ప్రభుత్వ ప్రణాళికను అడుగుతున్నారు. కచ్చితంగా ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం లోగా సీపీఎస్ రద్దు విషయంలో తగిన నిర్ణయం తీసుకుంటాం. మేధావులతో, నిపుణులతో చర్చించి ఉద్యోగులకు అనుకూలమైన నిర్ణయం తీసుకుంటామని ఓ ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా మాట ఇస్తున్నాను.
• అవినీతిలో అధినేతను మించాడు
వైసీపీ అధినాయకుడే అవినీతిపరుడు అనుకుంటే… ఈ కోడిగుడ్డు నాయకుడు అవినీతిలో వాళ్ల అధినాయకుడినే మించిపోయాడు. ఈయన అవినీతిని చూసి వాళ్ల నాయకుడే ఇక్కడ టికెట్ కూడా కేటాయించలేకపోయాడు. కొండల్ని కొల్లగొట్టి మట్టి, కంకర అమ్ముకోవడంలో సిద్ధహస్తుడు. రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించి కమీషన్లు మింగడంలో ఈయన అనుచరులు దిట్ట. కశింకోట మండలంలో విస్సన్నపేట గ్రామంలో తన బినామీలతో వందల ఎకరాలను కాజేశాడనే ఆరోపణలు ఉన్నాయి. అర్హతకు సంబంధం లేకుండా పదుల సంఖ్యలో యువకుల దగ్గర రూ. 6 లక్షల చొప్పున తీసుకొని గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ(ఆర్ఈసీఎస్)లో ఉద్యోగాలు ఇప్పించారనే ఆరోపణలు ఉన్నాయి. కోవిడ్ సమయంలో రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి బంజర భూములను జిరాయితీ భూములుగా మార్చేసి అమ్మేశారు. జాతీయ రహదారికి పక్కన ఉన్న గ్రామాల్లో ఇనాం భూములు, అసైన్డ్ భూములను దోచేశారు. జగనన్న కాలనీల కోసమని రైతుల దగ్గర తక్కువ ధరకు భూములు కొనుగోలు చేసి వాటిన అధిక ధరలకు అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు. మంత్రి అనుచరులు చాలా మంది క్రికెట్ బెట్టింగ్, మైనింగ్ మాఫియాకు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముందుగా మంత్రి గారి బినామీల భరతం పడతాం. ప్రజల వద్ద దోచుకున్న సొత్తును చివరి రూపాయితో సహా కక్కిస్తాం.
• పోలవరం గురించి అడిగితే రోడ్డు మీద డ్యాన్సులు వేస్తాడు
ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి పోలవరం. సంబంధిత మంత్రి గారికి దాని గురించి మాట్లాడే సత్తా, సమర్ధత లేదు. డ్యాన్సులు చేయమంటే మాత్రం రోడ్ల మీద డ్యాన్సులు కడతాడు. కేంద్రం సహాయ సహకారాలతోనే పోలవరం సాధ్యమవుతుంది. అందుకే అనకాపల్లి పార్లమెంట్ సీటు మొదట జనసేనకు కేటాయించినా… బీజేపీ అడగడంతో త్యాగం చేశాం. బీజేపీ తరఫున సీఎం రమేష్ గారు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. వారిని గెలిపిద్దాం. ఆయన మన గొంతును బలంగా పార్లమెంటులో వినిపించేలా చేద్దాం. వైసీపీ నాయకుల్లా మేము పోలవరాన్ని రెండు నెలల్లో పూర్తి చేస్తాం… మూడు నెలల్లో పూర్తి చేస్తాం అని చెప్పము. సాధ్యమైనంత తక్కువ కాలంలో పూర్తయ్యేలా కృషి చేస్తాం. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ ప్రజల భావోద్వేగాలతో ముడిపడింది. దీన్ని ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకుందాం. కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు అన్ని బలంగా నిలబడితే ప్రైవేటీకరణ కాకుండా కాపాడే బాధ్యత తీసుకుంటాం. ఇక్కడ నుంచి సీఎం రమేష్ గారిని గెలిపించుకుంటే ఆయన జాతీయ నాయకులతో మాట్లాడి సొంత గనులను కేటాయించేలా చేస్తారు. కూటమి తాలుకా లక్ష్యం, కోరిక కూడా అదే. కచ్చితంగా ప్రజాభివృద్ధి పాలనకు కూటమి ప్రభుత్వంలో ముందడుగు పడుతుంది. కూటమిని ప్రజలంతా నిండు మనసుతో ఆశీర్వదించాలి. జనసేన పార్టీకి 50 స్థానాల్లో పోటీ చేసే సత్తా ఉన్నా 21 స్థానాలు మాత్రమే తీసుకున్నాం. తీసుకున్న 21 స్థానాల్లో కూడా బలమైన నాయకులను పోటీకి పెట్టాం. ఒక్కో నాయకుడు అసెంబ్లీని గడగడలాడించే నాయకుడు. అనకాపల్లి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న శ్రీ కొణతాల రామకృష్ణ గారు అలాంటి నాయకుడే. అలాంటి నాయకులను గెలిపిస్తే ఉత్తరాంధ్ర గళాన్ని అసెంబ్లీలో బలంగా వినిపించగలరు. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా కూటమి తమ అభ్యర్థులను నిలబెడుతోంది. వారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ ను రక్షించే బాధ్యత, అభివృద్ధిపథంలో ముందుకు తీసుకెళ్లే బాధ్యత తీసుకుంటాము. పిఠాపురంలో గెలిచిన తరవాత, ప్రమాణ స్వీకారానికి ముందు నూకాలమ్మ తల్లి ఆశీర్వాదం తీసుకుని వెళ్తాను. రాజకీయాల్లో జవాబుదారీతనం తీసుకొస్తాను. కూటమి ప్రజలకు జవాబుదారీ గా ఉంటుంది” అన్నారు.