• ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించిన ముస్లిం మత పెద్దలు
పిఠాపురం నియోజకవర్గం, యు.కొత్తపల్లి మండలం పొన్నాడ గ్రామంలో చరిత్ర ప్రసిద్ధి గాంచిన బషీర్ బీబీ ఔలియా (బంగారు పాప) దర్గాను జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సందర్శించారు. దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మంగళవారం మధ్యాహ్నం దర్గా వద్దకు చేరుకుని ముస్లింల ఆచార వ్యవహారాలను గౌరవిస్తూ ఉర్సు దగ్గరకు వెళ్ళారు. మొదట ఉర్సు వద్ద కొబ్బరికాయ కొట్టి దర్గా చుట్టూ ప్రదక్షిణ చేశారు. దర్గా మూల స్థానం వద్ద ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం మూల స్థానానికి చందనం పూసి, వస్త్రం సమర్పించారు. అంతకు ముందు ముస్లిం మత పెద్దలు వారి ఆచారాల ప్రకారం టోపి అలంకరించి, పవిత్ర వస్త్రంతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కాకినాడ పార్లమెంట్ అభ్యర్ధి శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, దర్గా ముజావర్లు పాల్గొన్నారు.