రూ.25 లక్షల ఆరోగ్య బీమా… కూటమి హామీ

కూటమి

• డ్రైవర్లను ఓనర్లు చేసేలా ప్రత్యేక పథకం
• టాక్సీ, హెవీ లైసెన్స్ కలిగిన వారికి రూ.15 వేలు ఆర్థిక సాయం… ప్రమాద బీమా
• కూటమి ప్రభుత్వంతోనే అన్ని వర్గాల అభ్యున్నతి
• చెత్త పన్ను రద్దు… చెత్త పన్ను తెచ్చిన వైసీపీని చెత్తలో పడేద్దాము
• మూడు భూకబ్జాలు.. ఆరు భూ పంచాయితీలే వైసీపీ విధానం
• కళకళలాడే ఉత్తరాంధ్రను వైసీపీ గద్దలు కబళించాయి
• భూ దాహం తీరక కొత్తగా జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తెచ్చాడు
• 75 శాతం ఉద్యోగాలు అంటూ జగన్ పరిశ్రమలు రాకుండా చేశాడు
• వైసీపీ పాలనలో 23 లక్షల మంది యువత మాదక ద్రవ్యాలకు అలవాటుపడ్డారు
• యువశక్తిని జగన్ నిర్వీర్యం చేశాడు
• ఘాజీని విశాఖ సముద్రంలో తొక్కేసినట్లే వైసీపీని తొక్కేయాలి
• పెందుర్తి వారాహి విజయభేరి సభలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్
‘జనవాణిలో భాగంగా రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా ఏ వ్యక్తిని కలిసినా వైసీపీ నాయకులు చేసిన కబ్జాలు, ఆక్రమణల గురించి కథలు కథలుగా వారి వేదనను కన్నీటితో చెప్పారు. అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు ప్రతి చోటా వైసీపీ నాయకుల భూ దందాలు, బెదిరింపులకు అంతే లేదు. పచ్చగా కళకళలాడే ఉత్తరాంధ్రను వైసీపీ కీలక నేతలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి వంటి నేతలు తమ గుప్పెట్లో పెట్టుకున్నార’ని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో మూడు భూ కబ్జాలు, ఆరు భూ పంచాయితీల అన్న రీతిన సాగిందని చెప్పారు. ఇప్పుడు వీరి భూదాహం తీరక కొత్తగా జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు తీసుకువచ్చి ప్రజల ఆస్తుల మీద కూడా పడ్డారని తెలిపారు. మరోసారి వైసీపీ వస్తే ప్రజలకు సొంత ఆస్తులు అనేవి ఉండకుండా చేస్తారని చెప్పారు. బుధవారం సాయంత్రం పెందుర్తి జంక్షన్లో జరిగిన వారాహి విజయభేరీ బహిరంగ సభలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రసంగించారు. పెందుర్తి అసెంబ్లీ అభ్యర్థి శ్రీ పంచకర్ల రమేష్ బాబు, అనకాపల్లి లోక్ సభ అభ్యర్థి శ్రీ సి.ఎం.రమేష్ లను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ… “పేద ప్రజలు కాలుష్యం బారినపడి రకరకాలుగా ఇబ్బందులుపడుతున్న తాడి గ్రామాన్ని వేరే ప్రాంతానికి తరలించాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. వారి తరలింపునకు మాత్రం ఈ ప్రభుత్వానికి భూమి దొరకదు, స్థలాలు కనబడవు. వైసీపీవాళ్ళు ఆక్రమించుకోవడానికి మాత్రం వేలాది ఎకరాలు కనిపిస్తాయి. కూటమి ప్రభుత్వం రాగానే ఎప్పటి నుంచో వ్యధ అనుభవిస్తున్న తాడి గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించే బాధ్యత మేము తీసుకుంటాం. జగన్ గతంలో అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే తాడి గ్రామాన్ని తరలిస్తామని మాయ మాటలు చెప్పాడు. ఆయనలా కాకుండా తాడి గ్రామ వ్యధ విన్న వ్యక్తిగా వారికి తగు న్యాయం చేసే బాధ్యత వ్యక్తిగతంగా తీసుకుంటాను.
• 2019లో నేను చెప్పినట్టే జగన్ కొండలు, గుట్టలు దోచేశాడు
జగన్ ఒక్క ఛాన్స్ అని అడిగితే ఇచ్చారు. ఇక చాలు. ఎన్నికల ముందు వైసీపీని గెలిపిస్తే ఈ కొండలు, గుట్టలు అన్నీ ఆక్రమించేస్తారని చెప్పాను. ఇప్పుడు అదే జరుగుతోంది. ప్రజలంతా కళ్లు అప్పగించి చూడడం మినహా ఏమీ చేయలేని పరిస్థితి. కొత్తగా జగన్ తీసుకువస్తున్న ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు వస్తే ఎవరి దగ్గర సొంత ఆస్తులు, ఒరిజినల్ పత్రాలు కూడా ఉండవు. అన్ని ఆస్తులు జగన్ గారి వద్దే ఉంటాయి. నానక్ రామ్ గూడాలో వారి కంపెనీల్లో ఉంటాయి. వీరికి పంచ గ్రామాల సమస్య పరిష్కారం కుదరదు. సింహాద్రి అప్పన్న భూములు ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసేస్తారు. ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నిలదీయకపోతే మార్పు రాదు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఇంటికి పంపడానికి మనకు మరో 12 రోజులు మాత్రమే సమయం ఉంది. జాగ్రత్తగా ఆలోచించండి. ఇది మన భవిష్యత్తుని నిర్ణయించే అతి కీలకమైన నిర్ణయం అని గుర్తు పెట్టుకుని ఓటు వేయండి. మీకు ఉద్యోగం ఇవ్వని జగన్ కి మీరు ఓటు వేస్తారా? ఫీజు రీఎంబర్స్ మెంటు ఇవ్వని జగన్ కి ఓటు వేస్తారా? ఉపాధి ఇవ్వని జగన్ కి ఓటు వేస్తారా? యువత ఆలోచించుకోండి. ఈ ప్రభుత్వాన్ని మారుద్దాం. జగన్ ని గద్దె దించుదాం. కూటమి ప్రభుత్వాన్ని నిలుపుదాం. బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దాం.
• యువత మత్తులో తూగేలా వైసీపీ పాలన
జగన్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానిక యువతకే అన్నారు. పరిశ్రమలు చూస్తే ఉద్యోగాలు ఇవ్వడానికి స్కిల్ లేదు అంటాయి. యువతకు అవసరం అయిన స్కిల్స్ అందించాలి కదా. ఓట్లు వేయించుకుని రూ. 5 వేలకి వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తే సరిపోతుందా? రాష్ట్రంలో 23 లక్షల మంది యువత మాదక ద్రవ్యాలకు అలవాటుపడ్డారు. 23 లక్షల మంది శక్తియుక్తులున్న యువతను ఈ ప్రభుత్వం గంజాయిలాంటి మాదక ద్రవ్యాలకు అలవాటు చేసింది. దేశంలోనే రాష్ట్రం గంజాయిలో నంబర్ వన్ అయ్యింది. విశాఖ పోర్టులో 25 వేల కిలోల హెరాయిన్ దొరికింది. యువతను ఇలాంటి వ్యసనాలకు బానిస చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని సముద్రంలో తొక్కేద్దాం. పాకిస్థాన్ సబ్ మెరైన్ ఘాజీని ముంచినట్టు సముద్రలో తొక్కేద్దాం. ఎమ్మెల్యే అదీప్ రాజ్ యువకుడు, భవిష్యత్తుకు బాగా చేస్తాడు అని ఓటు వేస్తే కరప్షన్ కింగ్ అయ్యాడు. రాష్ట స్థాయిలో జగన్ అరాచకాలు చేస్తుంటే ఇక్కడ అదీప్ రాజ్ దోపిడీలు చేస్తున్నారు. పరవాడలో నిర్మాణం చేపట్టాలంటే డబ్బులు కట్టాలి. అపార్టు మెంటు కొనాలన్నా, లే అవుట్ వేయాలన్నా ఈ ఎమ్మెల్యేకి డబ్బులు కట్టాలి. ప్రజలు ప్రభుత్వానికి టాక్సులు కడుతున్నారు. ఈ ఎమ్మెల్యేకి దేనికి భయపడాలి. ఈ దోపిడీలు ఆగాలంటే కూటమి ప్రభుత్వం రావాలి. అనకాపల్లి పార్లమెంటు నుంచి ఎంపీగా శ్రీ సీఎం రమేష్, పెందుర్తి ఎమ్మెల్యేగా శ్రీ పంచకర్ల రమేష్ బాబులను గెలిపించాలి. నాకు పదవి ఇవ్వకపోయినా మీ గుండెచప్పుడు అయ్యాను. ఓటు అడుగుతున్నావు కావాల్సిన పనులు చేయకపోతే ఎవర్ని అడగాలని మీరు అడగవచ్చు. మీకు నేనున్నాను. నేను పని చేస్తాను ఇద్దరితో పని చేయిస్తాను.
• దివ్యాంగులకు అండగా కూటమి ప్రభుత్వం
పెందుర్తి నియోజకవర్గం వేదికగా దివ్యాంగులకు మాటిస్తున్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి మీకు అండగా ఉంటుంది. దివ్యాంగులను అవహేళన చేసే వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ వంటి కఠిన చట్టాన్ని దివ్యాంగుల కోసం కూడా తీసుకువస్తాం. చాలా సంవత్సరాల నుంచి మీరు కోరుకుంటున్నట్లు.. కూటమి ప్రభుత్వంలో ప్రతి నెలా రూ. 6 వేల పింఛన్ అందిస్తాం. పూర్తి స్థాయిలో వైకల్యానికి గురైన వారికి నెలకి రూ. 15 వేల పింఛను, కిడ్నీ, తలసేమియా లాంటి దీర్ఘ కాలిక వ్యాధుల బారినపడిన వారికి రూ. 10 వేలు అందిస్తాం. మేనిఫెస్టోలో ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల ఆరోగ్య బీమా కూటమి ప్రభుత్వం తీసుకువస్తోంది. ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చే బాధ్యత మాది. యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఇస్తాం. ప్రధాన మంత్రి గారి అండతో ప్రతి ఇంటికీ రక్షిత మంచినీరు పథకాన్ని తీసుకువస్తాం. యువత ప్రతిభను వెలికి తీసేందుకు ప్రతిభా గణాంకాలు చేపడతాం. 2047 నాటికి ఇండియా సూపర్ పవర్ అవుతుంది. అలా కావాలి అంటే యువతలో ఉన్న ప్రతిభా పాటవాలు వెలుగులోకి రావాలి. రవాణా కార్మికులకు డ్రైవర్స్ సాధికార సంస్థ ఏర్పాటు చేసి ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తాం. డ్రైవర్లను ఓనర్లను చేస్తాం. 4 లక్షలు పైబడిన వాహన కొనుగోలు రుణాలకు 5 శాతం వడ్డీ సబ్సిడీ. టాక్సీ డ్రైవర్లు, హెవీ లైసెన్స్ కలిగిన వారికి ఏటా రూ. 15 వేల ఆర్ధిక సాయం. జి.ఒ. 21 రద్దు చేస్తాం. గ్రీన్ టాక్స్ తగ్గిస్తాం. అసంఘటిత రంగానికి బీమా సదుపాయం కల్పిస్తాం. భవన నిర్మాణ బోర్డు ఏర్పాటు చేసి భవన నిర్మాణ కార్మికులకు అండగా ఉంటాం. చెత్త పన్ను రద్దు చేస్తాం. చెత్త పన్ను తెచ్చిన ఈ ప్రభుత్వాన్ని చెత్తలో పడేద్దాం. కేంద్ర ఆర్ధిక సంఘం నుంచి పంచాయితీలకు వచ్చిన నిధుల్ని జగన్ దోచేశాడు. కేంద్రం ఇచ్చే నిధులు నేరుగా పంచాయతీలకు అందేలా చర్యలు తీసుకుంటాం. జగన్ ప్రభుత్వంలో 30 వేల మంది ఆడబిడ్డలు అదృశ్యం అయితే ఒక్కరు మాట్లాడరు. విశాఖ జనవాణిలో తల్లిడండ్రులు తమ బిడ్డ కనబడడం లేదని ఫిర్యాదు చేస్తే బలంగా స్పందించాను. వారం రోజులకే ఆ బిడ్డ దొరికింది. బాధ్యత గల వ్యక్తులు సమాజంలో ఉంటే దొంగతనం చేసే వారు కూడా భయపడతారు. రేపటి రోజున అదీప్ రాజ్, జగన్ లాంటి వాళ్లు ఓట్లు అడిగేందుకు వస్తే గెట్ లాస్ట్ అని చెప్పండి. మన ప్రాణాలకు రక్షణ కావాలి అంటే. మన ఆస్తిపాస్తులు గాల్లో దీపాలు కాకుండా ఉండాలి అంటే యువత మార్పు వైపు అడుగులు వేయండి. కూటమి ప్రభుత్వాన్ని స్థాపిద్దాం. భావితరాలకు బలమైన భవిష్యత్తు నిర్మిద్దాం” అన్నారు.

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్