• ఆర్ధిక రాజధానిగా విశాఖ.. హార్టికల్చర్ హబ్ గా రాయలసీమ..
• చెత్త పన్ను రద్దు.. విద్యుత్ ఛార్జీల కట్టడి..
• ఉచిత ఇసుక పాలసీ
• గంజాయి, డ్రగ్స్ అమ్మకాలపై ఉక్కుపాదం
• ప్రతి ఇంటికీ మంచినీరు.. ప్రతి ఎకరాకి సాగునీరు
• బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం
• సూపర్ సిక్స్ కి తోడుగా షణ్ముఖ వ్యూహం..
• రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకురావడమే కూటమి లక్ష్యం
• ఉమ్మడి మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు
‘సూపర్ సిక్స్ కి షణ్ముఖ వ్యూహం తోడయ్యింది. చెత్త చెత్త పన్నులు రద్దు చేస్తాం. ప్రజా రాజధాని పునరుద్దరిస్తాం. అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటాం. ప్రజలు గెలవాలి. రాష్ట్రం నిలదొక్కుకోవాలి. ప్రజల జీవితాల్లో మళ్లీ వెలుగులు రావాలి అన్న ఉద్దేశంతో మూడు పార్టీలు కలిశాం. రాష్ట్రానికి పూర్వ వైభవం తెచ్చేందుకే కలసి ముందుకు వచ్చామ’ని టీడీపీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు. ఉమ్మడి మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో శ్రీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ “ప్రస్తుతం రాష్ట్రానికి ఎవరూ అప్పు ఇచ్చే పరిస్థితి లేదు. సంపద సృష్టించే స్థితి లేదు. అప్పు ఇచ్చిన వారు జప్తు చేసే స్థితికి రాష్ట్రాన్ని తెచ్చారు. ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీ, జనసేన కసరత్తు చేసి బీజేపీ సూచనలు తీసుకుని మేనిఫెస్టో సిద్దం చేశాం.
• వైసీసీ ఓటమి ఖాయం అయిపోయింది
వైసీపీ ఓటమి ముందే నిర్ణయం అయిపోయింది. ఎన్నికలకు ముందే జగన్ అస్త్ర సన్యాసం చేశాడు. అప్పుడు చెప్పిన అమ్మ ఒడి.. నాన్న బుడ్డి ఇప్పుడూ చెబుతున్నాడు. మేము పూర్తిగా ప్రజల ఆకాంక్షల మేరకు మేనిఫెస్టో తీసుకువచ్చాం. మా మేనిఫెస్టోకి కేంద్ర సహకారం మెండుగా ఉంటుంది. మేనిఫెస్టోని అమలు చేసే బాధ్యతను జనసేన, టీడీపీ కలసి తీసుకుంటాయి. టీడీపీ సూపర్ సిక్స్ లోని ఆరు ప్రధాన అంశాలు మేనిఫెస్టోలో చేర్చాం. రాష్ట్రంలో యువత నిర్వీర్యం అయిపోయింది. అలాంటి యువతకు తిరిగి ధైర్యం నింపాలి. సూపర్ సిక్స్ లో ప్రధాన అంశంగా యువతకు 20 లక్షల ఉద్యోగాలు, రూ. 3 వేల నిరుద్యోగ భృతి అంశాలు చేర్చాం. స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్ధికి తల్లికి వందనం పథకం కింద రూ.15 వేల రూపాయిలు ఇస్తాం. 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసున్న ప్రతి మహిళకి నెలకు రూ. 1500 ఇస్తాం. తద్వారా ఐదేళ్లలో ప్రతి మహిళకు రూ. 90 వేలు ఇస్తాం. రాష్ట్రంలో నిత్యవసరాల ధరలు పెరిగిపోయాయి. గ్యాస్ ధరలు పెరిగాయి. మహిళల వంటింటి అవసరాల కోసం ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. ఇది మహిళల పురోభివృద్ధికి తోడ్పడుతుంది. ఉద్యోగాలు చేసే మహిళలకు హాస్టల్ సౌకర్యం కల్పిస్తాం. చదువు మధ్యలో ఆపేసిన ఆడపిల్లలకు కలలకు రెక్కలు పథకం కింద వడ్డీ లేని ఎడ్యుకేషన్ లోన్లు ఇప్పిస్తాం. పండుగ కానుకలు, పెళ్లి కానుకలు, అన్న క్యాంటిన్లు పునరుద్దరిస్తాం. పేదలకు అండగా ఉంటాం.
• 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు
సూపర్ సిక్స్ కి తోడుగా షణ్ముఖ వ్యూహంలోని అంశాలను పరిగణనలోకి తీసుకున్నాం. ఇంటింటికి రక్షిత మంచి నీరు కుళాయిల ద్వారా అందచేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ సెన్సస్ నిర్వహిస్తాం. ఎవరికి ఎలాంటి స్కిల్ ఉందో తెలుసుకుని మెరుగైన అవకాశాలు కల్పించడం ద్వారా ఉత్పాదకత పెంచుతాం. అంకుర సంస్థలు, చిన్న, మధ్యతరహా సంస్థలకు ప్రాజెక్టు వ్యయంలో గరిష్టంగా రూ. 10 లక్షల సబ్సిడీ ఇచ్చి రుణ సదుపాయం కల్పిస్తాం.
• మెగా డీఎస్సీపై మొదటి సంతకం
ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిన 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేస్తాం. ఆర్ధికంగా వెనుకబడి ఉన్న వర్గాలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తాం. ప్రజా రాజధాని అమరావతిని కొనసాగించి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుస్తాం. యువత కోసం స్పష్టమైన మేనిఫెస్టో రూపొందించాం. మెగా డీఎస్పీ ఫైలుపై మొదటి సంతకం పెడతాం. ఏటా జాబ్ క్యాలెండర్ ఉంటుంది. అన్ని ప్రాంతాల్లో ఉద్యోగ కల్పన అవకాశాలు వినియోగించుకుంటాం. ఎంఎస్ఎంఈలను ప్రోత్సహిస్తాం. పరిశ్రమలు తీసుకువస్తాం. యువతలో క్రీడా నైపుణ్యాన్ని పెంపొందిస్తాం. రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ లైబ్రరీలు అందుబాటులోకి తీసుకువస్తాం.
• బీసీ డిక్లరేషన్ అమలు..
బీసీ డిక్లరేషన్ ద్వారా 50 సంవత్సరాలు నిండిన బీసీలకు నెలకు రూ. 4 వేల ఫించన్ ఇస్తాం. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకువస్తాం. బీసీ సబ్ ప్లాన్ ద్వారా రూ. లక్షా 50 వేల కోట్లు ఐదేళ్లలో ఖర్చు చేస్తాం. బీసీల అభివృద్ధికి పూర్తి సహకారం ఇచ్చి ఆర్ధికంగా వారిని ఉన్నత స్థితి కల్పిస్తాం. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు పునరుద్దరిస్తాం. చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ల అమలు అంశాన్ని కేంద్రానికి సిఫార్సు చేస్తాం. తక్కువ జనాభా కలిగి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేని వారికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చి రాజ్యాధికారంలో భాగస్వాముల్ని చేస్తాం. రాష్ట్రంలో 140 బీసీ కులాలు ఉన్నాయి. జనాభా దామాషా ప్రకారం వారికి కార్పోరేషన్లు ఏర్పాటు చేసి, నిధులు ఇచ్చి, ఆర్ధికంగా పైకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తాం. బీసీల స్వయం ఉపాధికి ఏటా రూ. 10 వేల కోట్లు ఖర్చు చేస్తాం. ఆధరణ పథకం కింద రూ. 5 వేల కోట్ల ఖర్చు చేసి వృత్తి ఆధారిత వర్గాలకు ఆదాయాన్ని పెంచుతాం. వారసత్వ వృత్తి, పాడి పరిశ్రమలకు భీమా సౌకర్యం కల్పించి ఎక్కువ రుణాలు ఇస్తాం. అత్యాధునిక రవాణా సౌకర్యాలు కల్పించి గొర్రెల పరిశ్రమను అభివృద్ధి చేస్తాం. చేనేతలకు పవర్ లూమ్స్ కి 500 యూనిట్లు, హ్యాండ్ లూమ్స్ కి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తాం. నేతన్నలకు రూ. 24 వేల భృతి ఇచ్చి ఆదుకుంటాం.
• గీత కార్మికులకు మద్యం షాపుల కేటాయింపులో రిజర్వేషన్
ఆలయాల్లో పని చేస్తున్న నాయి బ్రాహ్మణులకు రూ. 25 వేల గౌరవ వేతనం ఇస్తాం. సెలూన్లకు 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తాం. గీత కార్మికులకు మద్యం షాపుల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం. వడ్డెర్లకు క్వారీల్లో 15 శాతం రిజర్వేషన్లు కల్పించి, రాయల్టీలో రాయితీ ఇస్తాం. రజకులకు దోబీ ఘాట్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తాం. మత్స్యకారులకు వేట విరామ సమయంలో రూ. 20 వేలు ఆర్ధిక సాయం చేస్తాం. 217 జి.ఒ. రద్దు చేస్తాం. బోట్లు మరమ్మతులు చేస్తాం. పోర్టుల నిర్మాణానికి ప్రాధాన్యత. స్వర్ణకారుల అభివృద్ధికి ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేస్తాం. ఈ ప్రభుత్వంలో అతి క్రూరంగా హత్యకు గురైన బీసీ సోదరుల కేసులు రీ ఓపెన్ చేసి న్యాయం చేయడం ద్వారా వారి ఆత్మకు శాంతి కలిగేలా చేస్తాం. సూపర్ సిక్స్ లో నాలుగు అంశాల్లో మహిళలకే ప్రాధాన్యత ఇచ్చాం. డ్వాక్రా సంఘాలకు రూ. 10 లక్షల వడ్డీ లేని రుణాలు ఇచ్చి ఆదుకుంటాం. జగన్ ప్రభుత్వంలో రూ. 10 ఇచ్చి రూ. 1000 దోచేస్తున్నారు. సంపద సృష్టించడం తెలిసిన పార్టీలు మావి. శ్రీ పవన్ కళ్యాణ్ గారు సంపద సృష్టించి దాన్ని ప్రజలకు చేర్చాలనే ఆలోచనతో ఉన్నారు. మేము ఆదాయం పెంచి పేదలకు పంచుతాం. గతంలో పి3 పాలసర్ ఉంది. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ తో ఎన్నో ప్రాజెక్టులు వచ్చాయి. సంపాదన పెరిగింది. ఇప్పుడు పీ4 ఫార్ములాతో వస్తున్నాం. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టనర్ షిప్. దీన్ని భవిష్యత్తులో అమలు చేస్తాం. ఆర్ధికంగా ఎదిగిన వారు కింద ఉన్న వారిని పైకి తెచ్చే బాధ్యత తీసుకోవాలి. ఇలాంటి ఫార్ములాలు అమలు చేస్తే పేదరిక నిర్మూలన అనేది అసాధ్యం కాదు. మిషన్ 2047 గురించి హేళన చేస్తున్నారు. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ టీడీపీ.
• ఉద్యోగుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాం
వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగస్తులు నష్టపోయారు. వ్యవస్థలు చిన్నాభిన్నం అయిపోయాయి. ఉద్యోగులను భయపెట్టి మరీ అస్తవ్యస్తం చేశారు. ప్రజలంతా నిరాశా నిస్పృహల్లో ఉన్నారు. ఉద్యోగస్తులు నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితికి వచ్చారు. పాలసీలు పాలకులు రూపొందించినా దాన్ని అమలు చేయాల్సింది ఉద్యోగస్తులే. అలాంటి ఉద్యోగస్తుల పరిస్థితి దారుణంగా ఉంది. ఎంతో గౌరవంతో కూడిన ఉపాధ్యాయులను సైతం మద్యం షాపుల వద్ద కాపలాకు పెడితే చెప్పుకోలేని పరిస్థితి. హక్కుల కోసం నోరు విప్పలేని పరిస్థితి తెచ్చారు. పీఆర్సీ లేదు. పీఎఫ్ లేదు. సరెండర్ లీవులు లేవు. టి.ఎ.లు లేవు. వారికి ఇవ్వాల్సిన మొత్తంలో బకాయిలు పెట్టి అడిగిన వారిపై కేసులు పెట్టడం, సంఘ నాయకుల్ని అరెస్టులు చేయడం రాష్ట్రంలో ఆనవాయితీ అయిపోయింది. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగుల ఆత్మవిశ్వాసం, గౌరవం పెంచుతాం. పీఆర్సీ ఇస్తాం. ప్రతి నెలా జీతాలు వచ్చే పరిస్థితి తెస్తాం. ఆర్ధిక పరిస్థితి మెరుగు పరుస్తాం. సీపీఎస్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం. వాలంటీర్లకు రూ. 10 వేల గౌరవ వేతనం ఇస్తాం.
• కాపుల సంక్షేమానికి రూ. 15 వేల కోట్ల ఖర్చు
కాపుల సంక్షేమానికి రూ. 15 వేల కోట్లు ఖర్చు చేస్తాం. ఈబీసీ పది శాతం రిజర్వేషన్ కూడా కాపులకు అందుబాటులో ఉంటుంది. దామాషా ప్రకారం కాపులకు ఈబీసీ కోటాలో ప్రాధాన్యత. ఐదేళ్లకోసారి సమీక్షించుకుంటూ ఈబీసీ రిజర్వేషన్ ముందుకు తీసుకువెళ్తాం. కాపు యువతకి నైపుణ్యాభివృద్ధి చేస్తాం. కాపు భవనాల నిర్మాణం చేపడతాం. ఆర్య వైశ్యుల సంక్షేమం కోసం పని చేస్తాం. అగ్ర వర్ణాల్లో ఉండే ఇతర పేదలకు న్యాయం చేస్తాం. ఏప్రిల్ నుంచి రూ. 4 వేల పింఛన్ అమలు చేస్తాం. దివ్యాంగులకు రూ. 6 వేల పింఛన్, పూర్తిగా లేవలేని వారికి రూ. 15 వేలు, కిడ్నీలు, తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ. 15 వేలు చొప్పున పింఛన్లు అందచేస్తాం. ఇళ్లు లేని పేదలకు రెండు సెంట్ల స్థలం ఇచ్చి నాణ్యమైన ఇళ్లు కట్టిస్తాం. గతంలో మంజూరైన పట్టాలు రద్దు చేయం. అదే జాగాల్లో ఇళ్లు కట్టించి ఇస్తాం. పేదలకు టిడ్కో ఇళ్లు ఇస్తాం. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. జిల్లాలవారీగా ఎస్సీ వర్గీకరణ చేపడతాం. 50 ఏళ్లకే పింఛన్ అమలు చేస్తాం. ఏజెన్సీలో ఆదివాసీ ఉపాధ్యాయుల నియామకం చేపడతాం. జీవో 3ను రివైజ్ చేస్తాం. సంక్షేమ పథకాలు తీసుకు వచ్చి ఎస్సీ, ఎస్టీలపై దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.
• మైనారిటీ, క్రిస్టియన్ సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
మైనారిటీలకు 50 ఏళ్ల కే పింఛన్ ఏర్పాటు చేస్తాం. ఈద్గాలు, ఖబరస్థాన్ లకు స్థలాలు కేటాయిస్తాం. విజయవాడ సమీపంలో హజ్ హౌస్ నిర్మిస్తాం. నూర్ బాషా కార్పోరేషన్ కి ఏటా రూ. 100 కోట్లు ఏర్పాటు చేస్తాం. కార్పోరేషన్ ద్వారా రూ. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు. ఇమామ్ లకు స్థాయిని బట్టి రూ. 10 వేలు, రూ. 5 వేల గౌరవ వేతనం అందిస్తాం. మసీదుల నిర్వహణకు ఆర్ధిక సాయం. హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు రూ. లక్ష ఆర్ధిక సాయం. క్రిస్టియన్ సంక్షేమానికీ కట్టుబడి ఉన్నాం. వ్యవసాయానికి 9 గంటల విద్యుత్. రైతులకు సోలార్ పంపు సెట్లు ఇచ్చి మిగిలిన కరెంటు గ్రిడ్డుకి అమ్ముకునే వెసులుబాటు కల్పిస్తాం. కేంద్రం ఇచ్చిన రూఫ్ టాప్ సోలార్ ఎనర్జీ పథకాన్ని వినియోగించుకుంటాం. గ్రామ గ్రామాన్ని విద్యుత్ ఉత్పాదక యూనిట్ గా తయారు చేస్తాం. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇస్తాం. పార్లమెంటు పరిధిలో వెయ్యి ఎకరాలు సేంద్రియ వ్యవసాయానికి కేటాయించి మోడల్ ఫామ్ తయారు చేస్తాం. గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజ్ లు ఏర్పాటు చేస్తాం. డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేస్తాం. వైసీపీ తీసుకువచ్చిన ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్… ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. 40, 50 ఏళ్లు కష్టపడి ప్రజలు సంపాదించిన ఆస్తులు లాగేసుకునే పరిస్థితి. ప్రతి ఒక్కరు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికే స్థాయికి వచ్చారు. ఈ జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రద్దు చేస్తాం. భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి పులివెందులలో స్వయానా జగన్ సతీమణిని అడిగారు. మా తాత ఇచ్చిన భూమి మీద మీ ఆయన ఫోటో ఎందుకు పెట్టుకున్నారని. ఆంధ్రప్రదేశ్ రాజముద్ర వేయాల్సిన స్థానంలో ఎందుకు మీ ఫోటో వేసుకుంటున్నారు? ఈ ఆస్తి మీరు ఇచ్చారా? ప్రజల్ని నిస్సహాయ స్థితికి నెట్టేసి పోలీసుల్ని అడ్డు పెట్టుకుని అరెస్టులు చేసి దుర్మార్గ పనులు చేశారు. వైసీపీ అరాచకాలు తట్టుకోలేక ప్రజలు రాష్ట్రం వదిలి పారిపోతున్న పరిస్థితి. ఆరుద్ర అనే అమ్మాయి వారణాసికి వెళ్లిపోయింది. ఈ ప్రభుత్వం పోతేనే తిరిగి వస్తాను అని చెబుతున్న పరిస్థితి. శ్రీమతి రంగనాయకమ్మ పొట్టకూటి కోసం ఈ రాష్ట్రం వదిలి వేరే రాష్ట్రానికి పోవడం వైసీపీ అరాచకాలకు పరాకాష్ట.
• భవన నిర్మాణ కార్మికులకు ప్రత్యేక బోర్డు
సాగునీటి ప్రాజెక్టులు పెద్ద సమస్య ఉంది. కాలువలు తవ్వలేదు. పంట కాలువలు లేవు. రిజర్వాయర్లు కొట్టుకుపోతున్నాయి. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే ఏం చేస్తారో చెప్పలేని పరిస్థితి. కూటమి ప్రభుత్వంలో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. నదుల అనుసంధానం చేస్తాం. డ్రైవర్లుకు రూ. 4 లక్షల సబ్సిడీతో వాహన రుణాలు ఇప్పిస్తాం. ప్రమాద బీమా వంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాం. బ్యాడ్జి లైసెన్స్ కలిగిన డ్రైవర్లకు ఏడాదికి రూ. 15 వేల ఆర్ధిక సాయం అందచేస్తాం. వాహనాలపై గ్రీన్ టాక్స్ తగ్గిస్తాం. అసంఘటిత కార్మికులకు చంద్రన్న బీమా పథకం పునరుద్దరిస్తాం. భవన నిర్మాణ కార్మికుల కోసం ప్రత్యేక బోర్డు పునరుద్దరిస్తాం. ముఠా కార్మికులకు ప్రత్యేక బోర్డు తెస్తాం. సహజ మరణానికి రూ. 5 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ. 10 లక్షలు పరిహారం అందచేస్తాం. దేశంలోనే మొదటిసారి ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల ఆరోగ్య బీమా. ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ కార్డులు పెడతాం. బీపీ, షుగర్ లాంటి వ్యాధులకు ఉచితంగా జనరిక్ మందులు అందచేస్తాం. విద్యుత్ ఛార్జీలు కట్టడి చేస్తాం. అవినీతి అరికడతాం. చెత్త పన్ను రద్దు చేస్తాం. ఇంటి పన్నుల మీద సమీక్ష చేస్తాం. పెట్రోల్, మద్యం ధరల నియంత్రణ చేపడతాం. విషపూరిత మద్యంపై సమీక్ష చేస్తాం. రాష్ట్రంలో కల్తీ లిక్కర్ లేకుండా చేస్తాం. విద్యార్ధులకు ఫీజు రీఎంబర్స్ మెంటు ఇప్పిస్తాం. నేరుగా కాలేజీలకే చెల్లించే ఏర్పాటు చేస్తాం. ఉచిత ఇసుక పాలసీ తీసుకువస్తాం. కేజీ టూ పీజీ సిలబస్ రివ్యూ చేస్తాం. 117 జీవోతో మూతపడిన స్కూళ్లకు ఏం చేయాలో చేస్తాం. విదేశీ విద్య పున: ప్రారంభిస్తాం. 100 రోజుల్లో గంజాయి, డ్రగ్స్ కంట్రోల్ చేస్తాం. ఉక్కుపాదంతో అణచివేస్తాం. రాష్ట్రంలో డ్రగ్స్ ఉండడానికి వీల్లేదు. ఐదేళ్లలో ఒక్కసారి కూడా ఈ వ్యవహారంపై సమీక్ష చేయని బాధ్యత లేని ముఖ్యమంత్రి జగన్. రాష్ట్రంలో మంచినీరు దొరకడం లేదు గాని గంజాయి దొరుకుతోంది. గ్రామం, మండల హెడ్ క్వార్టర్స్ లో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. ప్రజా రాజధానిని పునరుద్దరిస్తాం. ప్రజల రాజధానిగా ప్రతి ఒక్కరికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ప్రాంతాల ఆధారంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తాం.
• ఆలయ ట్రస్టు బోర్డుల్లో బ్రాహ్మణులకు చోటు
దేవాలయాలు, బ్రాహ్మణుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. హిందూ దేవాలయాల్లో సత్రాల ఏర్పాటుకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు. హిందూ ఆస్తులు కబ్జాకు గురికాకుండా రక్షణ కల్పిస్తాం. వార్షిక ఆదాయం రూ. 50 వేలు మించిన ఆలయాల్లో అర్చకులకు రూ.15 వేల వేతనం. తక్కువ ఆదాయం ఉన్న ఆలయాల్లో అర్చకులకు రూ. 10 వేలు ఇవ్వాలని నిర్ణయించాం. వైదిక, ఆగమ శాస్త్ర సంబంధాల్లో ఆలయాలే ఫైనల్. ప్రతి ఆలయ ట్రస్ట్ బోర్డులో బ్రాహ్మణులకు చోటు కల్పిస్తాం. తిరుమల తిరుపతి దేవస్థానం సహా. తిరుపతి, ఒంటిమిట్ట లాంటి క్షేత్రాల్లో సంప్రదాయాలు కాపాడుతాం. బ్రాహ్మణులు కర్మలు చేసుకోవడానికి నియోజకవర్గానికి ఒక భవనం కట్టిస్తాం. విశాఖను ఆర్ధిక రాజధాని చేస్తాం. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. విశాఖకు పూర్వ వైభవం తెస్తాం. రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మారుస్తాం. రాయలసీమను ఆటోమొబైల్ హబ్ గా మారుస్తాం. పంచాయితీ రాజ్ డిక్లరేషన్ తీసుకువచ్చి స్థానిక సంస్థలకు పూర్తి అధికారాలు ఇస్తాం. మీడియాకి పూర్వ వైభవం తెస్తాం. జర్నలిస్టులకు ఉచితంగా నివాసాలు కట్టించి ఇస్తాం. న్యాయవాదులకు ప్రభుత్వ స్టైఫండ్ కింద రూ. 10 వేలు, జూనియర్ న్యాయవాదులకు ఫండ్ ఏర్పాటు చేస్తాం. లా అండ్ ఆర్డర్ ను కాపాడి సమర్ధవంతమైన పాలన తీసుకువస్తాం అని అన్నారు. రాష్ట్రానికి ఆదాయం పెంచి సంక్షేమ పథకాలు అందచేస్తాం. గతంలో మాదిరి సంస్కరణలు తెచ్చి సంపద పెంచుతాం. అభివృద్ధి మార్గాలు సృష్టించి ఆదాయ మార్గాలు పెంచుతాం. అందుకు మూడు పార్టీలకు ఉన్న బ్రాండ్ వినియోగిస్తాం” అన్నారు. బీజేపీ జాతీయ నాయకులు శ్రీ సిద్ధార్ధ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ మేనిఫెస్టోకి బీజేపీ మద్దతు ఉంటుందని తెలిపారు.