ఉపవాస దీక్షలు ముగించుకొని రంజాన్ పండుగను పవిత్రంగా జరుపుకొంటున్న ముస్లిం మత విశ్వాసులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. మానవత్వపు విలువలను ప్రబోధించే దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసం ఎంతో పవిత్రమైనది. సమాజంలోని ప్రతి ఒక్కరూ సన్మార్గాన్ని అనుసరిస్తే ఆ సమాజం శాంతి సౌభాగ్యాలతో విరాజిల్లుతుంది. తద్వారా ఆ దేశంలో ప్రేమానురాగాలు పరిఢవిల్లుతాయి. ఇటువంటి సన్మార్గాన్ని చూపించేదే దివ్య ఖురాన్. సమాజంలో అసమానతలు తొలగినప్పుడే ఆ సమాజం ఆదర్శప్రాయంగా నిలుస్తుంది. తన సంపాదనలో కొంత మేర అవసరార్థులకు పంచినప్పుడే అసమానతలు తొలగిపోయేది. అటువంటి దాన గుణంతోపాటు సేవ, సత్య నిష్ఠ, ధార్మిక చింతన వంటి సుగుణాలను అందించిన ఈ రంజాన్ సందేశం ఇస్లాం మత విశ్వాసులకు ఒక గొప్ప వరం. వారందరికీ ఈ పండగ తరుణాన శాంతి, సౌభాగ్యం, ఆయురారోగ్యాలు కలగాలని మనసారా కోరుకుంటున్నానని జనసేనాని పేర్కొన్నారు.