• మెగా మేనల్లుడు శ్రీ వైష్ణవ్ తేజ్
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని చిన్నప్పటి నుండి దగ్గరగా చూస్తున్నామని ఆయన ఏదైనా చేయాలని అనుకుంటే దానిని సాధించి తీరుతారని, ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేస్తోన్న పవన్ కళ్యాణ్ గారు ఈ నియోజకవర్గాన్ని ప్రపంచ గుర్తింపు లభించే స్థాయిలో అభివృద్ధి చేస్తారని మెగా మేనల్లుడు శ్రీ వైష్ణవ్ తేజ్ స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం అందరూ సహకరించాలని కోరారు. బుధవారం పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి మండలంలో వైష్ణవ్ తేజ్ నిర్వహించిన రోడ్ షోకు దారి పొడుగునా వీర మహిళలు మంగళ హారతులతో, జన సైనికులు గజమాలలతో స్వాగతం పలికారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పిఠాపురం శ్రీ కుక్కుటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కొండెవరం నుంచి ప్రారంభమైన రోడ్ షో భారీ జన సమూహంతో, బైక్ ర్యాలీతో కొనసాగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రోడ్ షో ఆద్యంతం గాజు గ్లాస్ గుర్తు చూపెడుతూ గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ సందర్భంగా శ్రీ వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ గారు జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూటమి కూర్పునకు కీలక పాత్ర పోషించారని వెల్లడించారు. కూటమి గెలుపు ప్రాధాన్యతను ప్రజలకు వివరించారు. ఏ పదవీ లేకుండానే తన సంపాదనను ప్రజలకు పంచిపెట్టిన పవన్ కళ్యాణ్ గారు ప్రజా ప్రతినిధిగా ప్రభుత్వ నిధులతో నియోజకవర్గాన్ని ఎంత అభివృద్ధి చేస్తారో చూడాలని అన్నారు. ప్రముఖ సినీ నటులు శ్రీ సుడిగాలి సుదీర్, శ్రీ గెటప్ శ్రీను, శ్రీ గిరీష్ వర్మ, జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ నేతలు, జన సైనికులు, వీర మహిళలు రోడ్ షోలో పాల్గొన్నారు.