• పేదలకు మరింత అదనంగా సంక్షేమం అందిస్తాం
• అప్పులు చేసి కాకుండా ఆదాయం సృష్టించి ఆదుకుంటాం
• జనసేన ఎన్టీయే కూటమిలోనే ఉంది
• వైసీపీని ఎదుర్కోవాలంటే అంతా కలిసి పోరాడాలన్నదే మా విధానం
• క్లాస్ వార్ అనే అర్హత కూడా జగన్ కు లేదు
• ఆక్వా రంగాన్ని పూర్తిగా నిలబెట్టే బాధ్యత తీసుకుంటాం
• పరీక్ష పాసైన పిల్లలకు సర్టిఫికెట్స్ ఇవ్వరు… ఆస్తి కొనుక్కొంటే దస్తావేజులు ఇవ్వరు… అన్నీ జగన్ దగ్గరే ఉంచుకొంటున్నాడు
• ప్రజల ఆస్తి కూడా జగన్ రెడ్డిదే అనేలా వైసీపీ విధానాలు
• ముదినేపల్లి వారాహి విజయయాత్ర సభలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్
‘జనసేన – తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తే ఏ ఒక్క సంక్షేమ పథకం నిలిపేది లేదు. పేదలు, బడుగు, బలహీనవర్గాలను ఆదుకుంటున్న ఏ పథకం ఆగిపోదు. ఇప్పుడున్న సంక్షేమ పథకాలకు మరింత అదనంగా జోడించి వారిని ఆదుకునేలా మా ప్రణాళికలు ఉంటాయి. అప్పుల ద్వారా కాకుండా ఆదాయం సృష్టించి ప్రజలకు మరింతగా ఇవ్వాలన్నదే మా ఆకాంక్ష. ఆంధ్రప్రదేశ్ అప్పుల వల్ల భవిష్యత్తు అంధకారం అవుతుంది. అలా కాకుండా రాష్ట్రంలోని వనరులను ఉపయోగించుకొని దాని ద్వారా ఆదాయాన్ని సృష్టించి ప్రజలకు సంక్షేమం ద్వారా అందించాలనే విధానానికి మేం కట్టుబడి ఉన్నామ’ని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు. గురువారం ముదినేపల్లిలో జరిగిన వారాహి విజయయాత్ర బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “వైసీపీ అధికారంలోకి రాకపోతే సంక్షేమ పథకాలు నిలిచిపోతాయని వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు. వారి మాటల్లో నిజం లేదు. సంక్షేమ పథకాలు నిలిపివేసే ఆలోచన జనసేన – తెలుగుదేశం కూటమికి లేదు. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన దానికి మరింత అదనంగా జోడించి ఇవ్వాలనే దానికి కట్టుబడి ఉన్నాం. జగన్ ప్రజలంతా కట్టిన పన్నులతో, చేసిన అప్పులతో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ … సొంత నిధులను పంచుతున్నట్లు చెప్పుకుంటున్నాడు. అధికారంలో లేని సమయంలోనే ఆపదలో ఉన్న ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు అండగా నిలబడ్డాను. అలాంటి నేను పేదలకు మేలు చేసే సంక్షేమ పథకాలు ఎందుకు నిలిపివేస్తాను..? వాహన మిత్ర పథకం కింద రూ.10 వేలు వస్తే ఇంకో రూ. 5 వేలు అదనంగా ఎలా ఇవ్వాలని ఆలోచిస్తాను. మత్య్సకార భరోసా పథకం కింద అదనంగా మరో రూ. 10 వేలు ఇవ్వాలని చూస్తాను. నేతన్నల ఆత్మహత్యలు ఆగిపోయేలా వారిని ఆదుకోవాలని చూస్తాను తప్ప… సంక్షేమ పథకాలను నిలిపివేసే ఆలోచన లేదు. దయచేసి వైసీపీ నాయకులు చెబుతున్న మాటలు నమ్మకండి. సంపద సృష్టించి సంక్షేమ పథకాలకు ఖర్చు చేయాలన్నదే మా ఆలోచన.
• వైసీపీ సలహాదారుల దుష్ప్రచారం
జనసేన పార్టీ ఎన్డీఏ కూటమి నుంచి బయటకు రాలేదు. వచ్చేసిందని వైసీపీ నాయకులు దేశమంతా దుష్ర్పచారం చేస్తున్నారు. వాళ్లందరికీ ఒకటే చెబుతున్నాను. ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వస్తే నేనే స్వయంగా ప్రకటిస్తాను. నా తరఫున వైసీపీ నాయకులు, సలహాదారులు కష్టపడనక్కర్లేదు. నేను బయటకు రావాలంటే అందరికీ చెప్పే వస్తాను తప్ప దొంగచాటుగా ఏ పని చేయను. ప్రస్తుతం జనసేన పార్టీ ఎన్డీఏ కూటమిలోనే ఉంది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, హోమంత్రి శ్రీ అమిత్ షా, బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నడ్డా గారు అంటే నాకు అపారమైన గౌరవం ఉంది. రాష్ట్ర భవిష్యత్తు కోసం వాళ్లు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను. బీజేపీ ఆశీస్సులతో జనసేన – తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుందనే నమ్మకం ఉంది. 2021 జనసేన పార్టీ ఆవిర్భావ సభలోనే చెప్పాను. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అనేది జనసేన లక్ష్యం. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వమని చెప్పాను. దానికి అనుగుణంగా కలిసివచ్చిన పార్టీలతో ముందుకు వెళ్తామని చెప్పాం. అధికార పార్టీల దాష్టీకం, దౌర్జన్యాలు పెరిగిపోయినప్పుడు అంతా సమష్టిగా కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది. 1970 దశకంలో అత్యవసర సమయంలో ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అన్ని పార్టీలు కలిసి సమష్టిగా ఎదుర్కొన్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో అలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. వైసీపీ ప్రభుత్వాన్ని కలిసి ఎదుర్కొనకపోతే రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిపోతుంది.
• మేమంటే ఎందుకంత భయం..?
జనసేనకు ఉన్న ఒక్క ఎమ్మెల్యే వైసీపీలోనే చేరిపోయాడు. తెలుగుదేశం పార్టీ బలం తగ్గిపోయిందని వైసీపీ నేతలే చెబుతున్నారు. మా రెండు పార్టీలకు ఏ మాత్రం బలం లేనపుడు మీరు మమ్మల్ని చూసి ఎందుకు భయపడుతున్నారు. మేం తీసుకునే నిర్ణయాలకు, మాటలకు మీకెందుకు ఉలికిపాటు..? మా రాజకీయ విధానపరమైన నిర్ణయాలు మేం తీసుకుంటాం. 175 సీట్లను గెలుస్తామని చెబుతున్న వైసీపీ నాయకులు మా రెండు పార్టీల నిర్ణయాలు, విధానాలపై ఎందుకు కంగారుపడుతున్నారో అర్థం కావడం లేదు. బటన్లు నొక్కుతూ ప్రజలకు మేలు చేస్తున్నాం అని చెబుతున్న మీ నాయకుడి ఓటమి భయమే మా బలం. మీ ఓటమి మీ కళ్ల ముందు కనిపిస్తోంది కాబట్టే మీకు మేం ఏం చేసినా, మాట్లాడినా వణుకు పుడుతోంది.
• మీ తాటాకు చప్పుళ్లకు భయపడను
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జగన్ ఓడిపోయేందుకు సిద్ధంగా ఉండాలి. మరో 5 నెలల సమయం ఉంది. అలా కాకుంటే ఢిల్లీ వెళ్లి తెలంగాణ ఎన్నికలతోపాటే డిసెంబరులో ఎన్నికలకు వెళ్తామని మీరు కోరినా మేం సిద్ధమే. దేనికైనా సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చాను. 2009లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డినే బలంగా ఎదుర్కొన్న వాడిని. మీ తాటాకు చప్పుళ్లకు భయపడే వాడిని కాను. 2014లో దేశం కోసం ఆలోచించే శ్రీ మోదీ గారికి, రాష్ట్ర క్షేమం కోసం అనుభవం ఉన్న శ్రీ చంద్రబాబు గారికి సంపూర్ణంగా మద్దతు తెలిపాను. అన్నిటికీ తెగించే అప్పట్లో మద్దతు ఇచ్చాను. ఆ రోజుల్లో ఆ రెండు పార్టీలు గెలవకపోయి ఉంటే జనసేన పరిస్థితి ఏంటి..? రాజకీయ ప్రస్థానం అప్పుడే మొదలు పెట్టిన పార్టీని మనుగడ సాగనిచ్చేవారా…? ఓటమి అయినా, గెలుపు అయినా స్థిరంగా ప్రజల కోసం నిలిచే వ్యక్తిని. నా ఆఫీసు మీద దాడి చేయడానికి వచ్చినా అక్కడ నిలబడిన వాడిని.
• దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేస్తే వైసీపీ దండలు
దళితులను చంపేసి డోర్ డెలివరీ చేసిన వారికి వైసీపీ దండలు వేస్తోంది. వారికి పార్టీ కార్యక్రమాల్లో సైతం పెద్దపీట వేస్తోంది. ఎస్సీ, ఎస్టీ వర్గాల భద్రత, అభ్యున్నతి కోసం ఉపయోగించాల్సిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని వైసీపీ నాయకులు సొంత ప్రయోజనాలకు ఉపయోగిస్తూ సామాన్యులను ఇబ్బందిపెడుతున్నారు. ప్రభుత్వ విధానాలను, ప్రజాప్రతినిధుల తీరును ప్రశ్నిస్తున్న జన సైనికుల మీద, సామాన్యుల మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్నారు. అత్యధికంగా కైకలూరులోనే అట్రాసిటీ కేసులు నమోదు అయినట్లు సమాచారం ఉంది. స్థానిక ఎమ్మెల్యేతోపాటు ఆయన కుమారుడు ప్రైవేటు సైన్యాన్ని పెంచి పోషిస్తూ తనకు అడ్డుగా వచ్చిన వారిపై దాడులు చేయిస్తూ, తిరిగి బాధితులపైనే అట్రాసిటీ కేసులు పెట్టిస్తున్నారని తెలిసింది. మేం జై భీమ్ నినాదాన్ని గుండెల్లో నింపుకొని పోరాటం చేయడానికి వచ్చాం. అంబేడ్కర్ స్ఫూర్తికి నిజమైన వారసులం. కులాలుగా, వర్గాలుగా యువతను విభజించి రాజకీయాలు చేయాలని చూస్తే ఊరుకునేది లేదు. మీ గుండాగిరీకి, మీ బెదిరింపులకు, కేసులకు భయపడేది లేదు. కచ్చితంగా జనసేన, తెలుగుదేశం ప్రభుత్వంలో తప్పు చేసిన నాయకులకు చట్ట పరిధిలోనే సమాధానం చెబుతాం. పెద్దింట్లమ్మ ఆలయానికి వెళ్లేందుకు, కొల్లేరు ప్రజలకు ఆసరాగా ఉండే వంతెనను నిర్మించకుండా అలాగే వదిలేశారు.. రూ.14 కోట్ల నిధులతో నిర్మించాల్సిన వంతెన 80 శాతం గత ప్రభుత్వంలో అయితే, దాన్ని ఇప్పటికీ పూర్తి చేయలేదు. కైకలూరు నియోజకవర్గంలో ఏ ఒక్క రోడ్డు సరిగా లేదు. ప్రధాన రహదారులు సుమారు 80 కిలోమీటర్ల మేర పూర్తిగా ధ్వంసం అయినట్లు తెలుస్తోంది. ముక్కు ఎక్కడ అంటే చుట్టూ తిప్పి చూపించినట్లు… ప్రధానమైన ప్రాంతాలకు రావాలంటే చుట్టూ తిరిగి రావాల్సిన పరిస్థితులు ఉన్నాయి. స్థానిక ప్రజాప్రతినిధికి ఇవేమి పట్టవు. ఓ వంతెన నిర్మించలేని, రోడ్డు వేయలేని మీరు బటన్లు నొక్కుతున్నానని కాలక్షేపం చేస్తున్నారు. ఎమ్మెల్యే కుమారుడు పోలీస్ స్టేషన్లోనే సెటిల్మెంట్లు చేస్తూ, ప్రత్యేకంగా గ్యాంగులను నిర్వహిస్తున్నట్లు సమాచారం ఉంది. భవిష్యత్తులో పోలీస్ రూల్ ఆఫ్ లాను అనుసరించి వారికి తగిన విధంగా బుద్ధి చెబుతాం. ఇప్పుడు చేసిన ప్రతి తప్పునకు లెక్క కట్టి మరీ చట్ట పరిధిలో బదులిస్తాం. కొల్లేరు ప్రజలకు పూర్తిగా న్యాయం చేస్తాం.
• మన సొంత ఆస్తి జగన్ లాక్కునేలా విధానం
ఇంటర్మిడియట్ పాస్ అయిన విద్యార్థులకు ఇప్పటి వరకు ధ్రువప్రతాలను ఈ ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. ప్రింటింగ్ ప్రెస్ లతో కమీషన్లు కుదరక ఇవ్వలేకపోయిందేమో తెలియదు కానీ… వీరి విధానాలన్నీ ఇలాగే ఉంటాయి. ఇంటర్ పాసైన పిల్లలు పొరుగు రాష్ట్రాల్లో ఉన్నత విద్యకు వెళ్ళి ఇబ్బందులుపడుతున్నారు. ప్రజల సొంత ఆస్తుల దస్తావేజులు, ఆస్తిపత్రాలు ఒరిజినల్ పత్రాలన్నీ ప్రభుత్వం దగ్గర ఉండేలా విధానం తీసుకొస్తున్నారు. అంటే మన సొంత ఆస్తి మీద కూడా మనకు హక్కు ఉండదు. ఆడబిడ్డలకు పసుపు కుంకుమకు ఆస్తి ఇవ్వాలంటే పత్రాలు జగన్ దగ్గరో, వైసీపీ వాళ్ళ దగ్గరో ఉంటాయి. వాహనం కొనుగోలు చేస్తే ఆర్.సి. కార్డు కూడా ఇవ్వరు. అదీ ప్రభుత్వం దగ్గరే. వైసీపీ నాయకులు క్రమక్రమంగా రాష్ట్రంలో తీసుకొస్తున్న విధానాలు చూస్తుంటే ప్రజలకు ఏమి మిగల్చకూడదనే రీతిలోకి తీసుకెళ్తున్నట్లు కనిపిస్తోంది. అసలు ప్రజల ఆస్తి మీద ప్రభుత్వానికి అజమాయిషీ.. అధికారం ఏమిటో అర్ధం కాని పరిస్థితికి ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది. ప్రజలందరిని అణిచివేసి, వారి జీవితాలు గుప్పెట్లో పెట్టుకోవాలని వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
• వైసీపీ నియంత పాలనకు చరమ గీతం
వైసీపీ సంపూర్ణ గ్రామాలుగా కొల్లేరులోని 10 గ్రామాలను ఎమ్మెల్యే ప్రకటించి, అక్కడ వైసీపీ నాయకుడు చెప్పిందే వినాలనే నియంత పాలన చేస్తున్నారు. మీ వర్గ రాజకీయాలు, నియంత విధానం మానుకోకపోతే వచ్చే ప్రభుత్వంలో మీ కొమ్ములు విరగొట్టి కింద కూర్చొబెడతాం. వైసీపీరహిత రాష్ట్రంగా ఆంధ్రాను తీర్చిదిద్దుతాం. కొల్లేరు అభివృద్ధి, నియోజకవర్గ అభివృద్ధి మీద పట్టని ఎమ్మెల్యే కనీసం ఒక్క రోడ్డు వేయించలేకపోయాడు. వినాయక చవితి లడ్డూ వేలం పాట ద్వారా వచ్చిన డబ్బుతో కలిదిండి మండలంలో యువత రోడ్డు వేసుకుందామని ప్రయత్నిస్తే, వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. వారు అభివృద్ధి చేయరు.. చేసుకోనివ్వరు. కైకలూరు నియోజకవర్గంలోని 20 గ్రామాల్లో తీవ్ర నీటి ఎద్దడి ఉంది. కొల్లేరు కాలుష్యపు నీరంతా కాలువల్లోకి వస్తోందని, వాటిని తాగలేకపోతున్నామని ప్రజలు చెబుతున్నారు. చెరువుల్లోని నీరు తాగుదామని భావిస్తే, అక్కడ కనీసం ఫిల్టర్ బెడ్స్ మరమ్మతులకు గ్రామ పంచాయతీల దగ్గర నిధుల్లేని దుస్థితి ఉంది. రాష్ట్రంలోని పంచాయతీలకు చెందిన ఆర్థిక సంఘం నిధులు రూ.8,600 కోట్లను వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించింది. దీనిపై కచ్చితంగా సమాధానం చెప్పాలి. మేం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే కొల్లేరు ప్రజల తాగునీటి సమస్యను తీర్చే బాధ్యతను తీసుకుంటాను.
• భవన నిర్మాణ కార్మికుల సొమ్ము రూ.12 వందల కోట్లు ఏం చేశారు?
ముఖ్యమంత్రి ఏ సభలో మాట్లాడినా క్లాస్ వార్ అని మాట్లాడతారు. కష్టాల్లో ఉన్న పేద ప్రజలకు ఏనాడు తన జేబులో నుంచి రూపాయి కూడా పెట్టని వ్యక్తి క్లాస్ వార్ అంటుంటే నవ్వు వస్తోంది. కార్మికుల సంక్షేమ నిధికి చెందిన రూ.1200 కోట్ల నిధులను దారి మళ్లించిన వ్యక్తి, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పక్కదారి పట్టిన రూ.360 కోట్లు తిరిగి రాబట్టలేని నాయకుడు క్లాస్ వార్ అనడానికి అర్హత లేదు. ఉద్యోగుల పి.ఎఫ్. డబ్బులు మళ్లించేసుకున్న వ్యక్తి ఈ ముఖ్యమంత్రి. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు సొంత డబ్బులు ఇచ్చిన నాకు మాత్రమే క్లాస్ వార్ గురించి మాట్లాడే అర్హత ఉంది. సొంత సిమెంటు ఫాక్టరీలు, పత్రికలు, ఇతర వ్యాపారాలు ఉండి కూడా, సొంత డబ్బును పేదల కోసం ఖర్చు చేయని జగన్ క్లాస్ వార్ అనే పదం ఉపయోగించేందుకు కూడా సరిపడడు. ప్రజల సొమ్ము ప్రజలకే పంచుతూ నానా రకాల గొప్పలు చెప్పుకుంటున్న వ్యక్తి అసలు ఆ పదం పలకడానికి కూడా అనర్హుడు.
• ఏపీ మద్యంతో మరణాలే
సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి అధికారంలోకి వచ్చిన వ్యక్తి.. ఏకంగా కల్తీ మద్యాన్ని అధికారికంగా ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్మడం అనేది దుర్మార్గమైన చర్య. కల్తీ మద్యం వల్ల ఎంతటి అనర్ధాలు జరుగుతాయో నాకు తెలుసు. ఇటీవల హైదరాబాద్ లో నాకు పరిచయం ఉన్న వైద్యులతో మాట్లాడుతున్న సందర్భంగా ఆంధ్రాలో కల్తీ మద్యం ప్రభావంతో కేసులు ఎక్కువవుతున్నాయని చెప్పారు. ఆంధ్రా నుంచి హైదరాబాద్ కు వస్తున్న కేసుల్లో కల్తీ మద్యం ప్రభావం అధికంగా కనిపిస్తోందని, కిడ్నీ, లివర్, నరాలకు సంబంధించిన వ్యాధులతోపాటు మానసిక స్థితి పాడైన వారు ఉంటున్నారని తెలిపారు. పథకం కింద ఉదయం డబ్బులు ఇచ్చి… సారా కింద సాయంత్రం పట్టుకుపోతున్న జగన్- కల్తీ మద్యంతో ప్రాణాలు తీస్తున్నాడు. ఎన్నో కుటుంబాలకు వేదన మిగులుస్తున్నాడు. జనసేన, తెలుగుదేశం ప్రభుత్వంలో కచ్చితంగా మహిళలంతా సమష్టిగా మా ప్రాంతంలో మద్యం వద్దు అంటే అక్కడ మద్యం దుకాణాలు తీసేస్తాం. కొత్త ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోపే పాత మద్యం ధరలనే అమలు చేస్తాం. దీంతో పాటు నాణ్యమైన మద్యం సరఫరా అయ్యేలా చూస్తాం.
• ఆక్వా రైతులకు అండగా నిలుస్తాం
ఎన్నికల ముందు ఆక్వా రైతులకు ఎన్నో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ వారిని నిలువునా ముంచేశాడు. ఆక్వా ఉత్పత్తుల్లో దేశానికి వచ్చే విదేశీ మారకద్రవ్యం వాటాలో 40 శాతం రాష్ట్రం నుంచి వస్తుంది. అలాంటి కీలక రంగాన్ని ప్రొత్సహించాల్సింది పోయి ఆక్వా రైతులను నిలువునా ముంచేస్తున్నాడు. నాణ్యమైన సీడు దొరక్క, ఫీడు ధరలు పెరిగి ఆక్వా రైతులు బాధలు పడుతుంటే, మూలిగే నక్కపై తాడిపండు పడిన చందంగా విద్యుత్ రాయితీలను ప్రభుత్వం ఎత్తేసింది. ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ రూ.1.50కే ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఆక్వా జోన్ల పేరుతో అర్హులకు రాయితీ విద్యుత్ ఎత్తేసింది. ధరల స్థిరీకరణ నిధితో ఆక్వా రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆ నిధిని పూర్తిగా వాడుకోలేకపోయింది. ఎగుమతులు తగ్గిపోయి, కరోనా దెబ్బకు విలవిల్లాడిన ఆక్వా రైతులపై వైసీపీ ప్రభుత్వం ఛార్జీల పిడుగు వేసింది. జనసేన, తెలుగుదేశం ప్రభుత్వంలో కోల్డు స్టోరేజీల నిర్మాణం, విద్యుత్ రాయితీల పునరుద్ధరణతో పాటు కచ్చితంగా ఆక్వా రంగానికి అండగా నిలబడతాం. ఆక్వా రైతుల డిమాండ్లను సానుకూలంగా పరిష్కరిస్తాం. కొల్లేరు గురించి కానీ, కాంటూరు పరిధుల గురించి కానీ జగన్ కు ఏ మాత్రం అవగాహన లేదు. కాంటూరు పరిధి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఓ లెక్క చెబితే… ఇప్పుడు కాంటూరు పరిధిలోనే జగన్ చేపల చెరువులను తవ్విస్తున్నాడు. కొల్లేరు పరిధిలో చేపల చెరువుల తవ్వకం అధికారికం అయిపోయింది. కొల్లేరు మత్స్యకార సొసైటీలన్నీ మూతపడి సంప్రదాయ వేట మీద ఆధారపడే వారు వలసలు వెళ్లిపోతున్నారు. గతంలో జీరో పాయింట్ సంప్రదాయ వేట కూడా ఇప్పుడు పూర్తిగా కనుమరుగయిపోయింది. మత్స్యకారులకు ఇచ్చిన ప్రోత్సాహకాలు కూడా లేవు. దీంతో కొల్లేరు సగటు మత్స్యకారులు విధి లేక వేర్వేరు పనులకు వెళ్లే పరిస్థితులు ఉన్నాయి. 60 కాలువల ద్వారా కొల్లేరులోకి నీరు కలుస్తోంది. 17 వేల టన్నుల కాలుష్యం నిత్యం కొల్లేరులోకి వెళ్తోంది. ఈ కాలుష్యంతో కొల్లేరు ప్రజలు తాగునీరు కూడా కలుషితం అవుతోంది. ఇంతటి గొప్ప ప్రాంతాన్ని ఎకో టూరిజంకు నిలయంగా మార్చాలనేది మా ప్రణాళిక. కైకలూరు ఇప్పటి వరకు కనీసం నగర పంచాయతీ కూడా కాలేకపోయింది. కైకలూరును అద్భుతమైన పట్టణంగా తీర్చిదిద్ది, కొల్లేరు వాసులకు పూర్తిస్థాయి జీవనోపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటాం. వైసీపీ నాయకులకు ఎవరైనా ఒకటే. ఎదుటవారిని మెచ్చుకుంటే వారు ఓర్చుకోలేరు. ఆఖరికి తమిళ్ సూపర్ స్టార్ శ్రీ రజనీకాంత్ గారిని అనరాని మాటలు అన్నారు. శ్రీ యోగానంద ప్రియశిష్యుడుగా ఉన్న రజనీకాంత్ గారు ఏనాడు ఎవరినీ ఒక మాట అనలేదు. అయితే వైసీపీ నాయకుడి రాజకీయ శత్రువులను పొగిడారు అనే అక్కసుతో ఆయనను అనరాని మాటలు అన్నారు. వైసీపీ నాయకులకు వారి నాయకుడి భజన చేసే వారు మాత్రమే మనుషులుగా కనిపిస్తారు.
• హిందూ మతాన్ని ఆచరిస్తాను… ఇతర మతాలను గౌరవిస్తాను
భారతదేశపు సనాతనధర్మం చాలా గొప్పది. మసీదు నుంచి నమాజ్ వినిపిస్తే ప్రసంగం ఆపేయమని నాకు ఎవరూ చెప్పలేదు. నా సనాతనధర్మం నాకు నేర్పిన సంస్కారం అది. ఇలాంటి నేల మీద కొందరు అయ్యప్పస్వామి, ఆంజనేయస్వామి, హిందూ దేవతలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. సనాతన ధర్మాన్ని తప్పుపడుతున్నారు. నేను హిందువుని నా మతాన్ని ఆచరిస్తాను. పరమతాలను గౌరవిస్తాను. కొందరు వైసీపీ నాయకులు విజయవాడ దుర్గమ్మ గుడిలో వెండి సింహాలు దొంగతనానికి గురైతే… వాటితో మేడలు, మిద్దెలు కడతారా అంటూ వెటకారంగా మాట్లాడారు. 219 ఆలయాలు కూల్చేశారు. రథాలు తగలబెట్టారు. ఇప్పటి వరకు ఒక్కడిని కూడా వైసీపీ ప్రభుత్వం పట్టుకోలేకపోయింది.
• కలిసి కట్టుగా పోరాడితేనే వైసీపీని ఇంటికి పంపించగలం
2014లో ఏమీ ఆశించకుండా తెలుగుదేశం, బీజేపీ పార్టీలకు మద్దతు ఇచ్చాను. దేశంలో బీజేపీ, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రావడానికి మా వంతు కృషి చేశాం. నేను ఏ రోజు కూడా నా వల్లే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది అని మాట్లాడలేదు. నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న ఆ పార్టీని తక్కువ అంచనా వేయను. టీడీపీ దగ్గర ఉన్న అనుభవానికి, జనసైనికుల యువరక్తం, పోరాట పటిమ తోడైతేనే వైసీపీని ఇంటికి పంపించగలం. రాజకీయాల్లో అభియోగాలు, కేసులు పెట్టడం సహజం. విశాఖలో మా జనసైనికులు, వీరమహిళలపై హత్యాయత్నం కేసులు పెట్టారు. చంద్రబాబు గారిపై పెట్టిన కేసులు నుంచి ఆయన నిర్దోషిగా విడుదలవుతారని నమ్ముతున్నాను. జగన్ తన మీద 30కి పైగా కేసులు ఉన్నాయని, ఇతరుల మీద కూడా కేసులు పెట్టాలని చూస్తున్నారు. రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా ఈ రోజు ముందుకు వెళ్తున్నాను. వైసీపీ అరాచకాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారికి, హోమ్ మంత్రి అమిత్ షా గారికి చెప్పాను. వలసలు పెరిగిపోయాయి, ఆడబిడ్డల అదృశ్యం, పరిశ్రమలు రావడం లేదు.. ఉపాధి లేదు, దేశంలోనే అత్యధికంగా రాజద్రోహం కేసులు పెడుతున్నారని చెప్పాను. అందరం కలిసి వెళ్తే తప్ప వైసీపీని ఎదుర్కొలేమని చెప్పాను. వాళ్లు సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను. రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక అడుగు వెనక్కి వేయడానికి కూడా వెనుకాడను. 2014లో ఏ పదవి ఆశించకుండా బీజేపీ, టీడీపీ పార్టీలకు మద్దతు ఇచ్చాను. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడి అభివృద్ధి జరగాలంటే జనసేన- తెలుగుదేశం ప్రభుత్వం రావాలి. టీడీపీ నాయకులకు నా విన్నపం ఒక్కటే గతంలో మాట మాట అనుకున్నాం మనసులో పెట్టుకోకండి. జనసేన కార్యకర్తలను ప్రేమగా పలకరించండి. మీ అనుభవానికి వాళ్ల పోరాట పటిమ తోడైతేనే వైసీపీని గద్దె దించగలం.
• జగన్ నొక్కని బటన్లు ఇవీ…
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యవసాయాన్ని చంపేసింది. యువతకు ఉపాధిని దూరం చేసింది. కనీసం రోడ్లు కూడా వేయలేని ప్రభుత్వం ఇది. మాట్లాడితే జగన్ బటన్లు నొక్కాను.. బటన్లు నొక్కాను అని మాట్లాడుతున్నారు. ఆయన నొక్కని బటన్లు చాలా ఉన్నాయి. రాష్ట్ర అభివృద్ధి జగన్ నొక్కని బటన్… పూర్తికాని పోలవరం జగన్ నొక్కని బటన్.. యువతకు ఉపాధి జగన్ నొక్కని బటన్.. మెగా డీఎస్సీ జగన్ నొక్కని బటన్.. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం జగన్ నొక్కని బటన్.. కోడూరు – అవనిగడ్డ రోడ్డు జగన్ నొక్కని బటన్.. బందర్ పోర్టు జగన్ నొక్కని బటన్ … పెడన టెక్స్ టైల్ పార్క్ జగన్ నొక్కని బటన్… కైకలూరు రోడ్డు జగన్ నొక్కని బటన్.. కైకలూరు డంపింగ్ యార్డు జగన్ నొక్కని బటన్ … కొల్లేరు కోట వంతెన జగన్ నొక్కని బటన్ … ఆక్వా రంగానికి విద్యుత్ సబ్సిడీలు జగన్ నొక్కని బటన్… ఇన్ని బటన్లు నొక్కని జగన్ ను ఇంటికి పంపించే సమయం ఆసన్నమైందని అన్నారు.. అంతా ఉమ్మడిగా ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలి’’ అని పిలుపునిచ్చారు.