• బాబాయిని అసెంబ్లీకి పంపండి… దేశం మొత్తం పిఠాపురం వైపు చూసేలా చేస్తారు
• నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తారు
• పిఠాపురం నియోజకవర్గంలో శ్రీ పవన్ కళ్యాణ్ కి మద్దతుగా ప్రముఖ సినీ హీరో మెగా ప్రిన్స్ శ్రీ వరుణ్ తేజ్ ప్రచారం
శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఒక్కసారి అవకాశం ఇవ్వండి… దేశం మొత్తం పిఠాపురం వైపు చూసేలా అభివృద్ధి చేస్తారని ప్రముఖ సినీ హీరో మెగా ప్రిన్స్ శ్రీ వరుణ్ తేజ్ గారు స్పష్టం చేశారు. పిఠాపురం నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసి ఒక స్థాయిలో ఉండేలా చేస్తారని తెలిపారు. తాతగారి ఉద్యోగరీత్యా మా కుటుంబం రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో నివసించింది.. బాబాయ్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్న పిఠాపురాన్ని మా కుటుంబం మొత్తం సొంత ఊరుగా చేసుకుంటామని తెలిపారు. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఆయన పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో శనివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గొల్లప్రోలు మండల పరిధిలోని పలు గ్రామాల్లో భారీ రోడ్ షో నిర్వహించారు. తాటిపర్తిలో శ్రీ వరుణ్ తేజ్ గారు మాట్లాడుతూ “పడి లేచిన కెరటంలా బాబాయ్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఓటమిని తట్టుకుని ప్రజల కోసం పదేళ్లపాటు నిలబడ్డారు. శ్రీ చిరంజీవి గారితో సహా మా కుటుంబం మొత్తం బాబాయ్ వెనుకే ఉన్నాం. జనసేన పార్టీ ప్రస్థానంలో పార్టీ కోసం పని చేస్తున్న ప్రతి జన సైనికుడికి ధన్యవాదాలు. నేను మీ లాంటి జన సైనికుడినే. అధికారం చేతిలో లేకున్నా కౌలు రైతుల కష్టాలు తీర్చారు. మత్స్యకారులకు అండగా నిలిచారు. అన్ని వర్గాలకు అండగా నిలచిన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గ ప్రజలు గాజు గ్లాసు గుర్తు మీద ఓటు వేసి ఎమ్మెల్యేగా మా బాబాయ్ శ్రీ పవన్ కళ్యాణ్ గారిని, ఎంపీ అభ్యర్ధి శ్రీ ఉదయ్ శ్రీనివాస్ గారిని గెలిపించాలి” అని కోరారు.
గ్రామాల్లో మెగా ప్రిన్స్ రోడ్ షో
శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేస్తున్న శ్రీ వరుణ్ తేజ్ గారికి గ్రామ గ్రామాన ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. ప్రధాన రహదారి నుంచి తాటిపర్తి, వన్నెపూడి గ్రామాల మీదుగా శ్రీ వరుణ్ తేజ్ గారు రోడ్ షో నిర్వహించారు. జన సైనికులు వందల సంఖ్యలో బైకులతో ర్యాలీగా తరలిరాగా, ఆడపడుచులు దారిపొడుగునా హారతులు పట్టారు. ప్రజలు పూల వర్షంతో ముంచెత్తారు. గ్రామాల్లో ప్రజలు మొత్తం రోడ్ల మీదకు వచ్చి గాజు గ్లాసు గుర్తులు ప్రదర్శిస్తూ జనసేనకు మద్దతు తెలిపారు. పూల వర్షంలో ముంచెత్తారు. శ్రీ వరుణ్ తేజ్ గారు ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ, గాజు గ్లాసు గుర్తును చూపిస్తూ ముందుకు సాగారు. పర్యటనలో భాగంగా తాటిపర్తిలో శ్రీ అపర్ణాదేవి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి అమ్మవారి ఆశీస్సులు స్వీకరించారు. కొడవలి మీదుగా ఈ ప్రచార యాత్ర దుర్గాడ వరకు సాగనుంది. ఈ ఎన్నికల ప్రచారంలో పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, కాన్ ఫ్లిక్ట్ మేనేజ్ మెంట్ కన్వీనర్ శ్రీ వి. అజయ్ కుమార్, పార్టీ నాయకుడు, నటుడు శ్రీ సాగర్, బీజేపీ నియోజకవర్గ ఇంఛార్జ్ శ్రీ కృష్ణంరాజు, టీడీపీ యువ నాయకులు శ్రీ గిరీష్ వర్మ తదితరులు పాల్గొన్నారు.
• ఈ ఎన్నికల్లో కూటమి గెలవాలి… రాష్ట్రానికి మంచి రోజులు రావాలి
‘రాజకీయ ప్రయాణంలో ఎన్ని దెబ్బలు తగిలినా వెనకడుగు వేయని నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. డబ్బు కోసం ఆశించని నాయకుడాయన. ప్రజలకు ఏదో చేయాలని రాజకీయాల్లోకి వచ్చిన ఏకైక నాయకుడు శ్రీ పవన్ కల్యాణ్ గారు’ అని ప్రముఖ హీరో, మెగా ప్రిన్స్ శ్రీ వరుణ్ తేజ్ గారు స్పష్టం చేశారు. అలాంటి నాయకుడిని అసెంబ్లీకి పంపితే మనందరి కోసం మరెంతో చేస్తారని అన్నారు. రెండు వారాల్లో ఎన్నికలు ఉన్నాయి.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయం సాధించాలి.. రాష్ట్రానికి మంచి రోజులు రావాలి అన్నారు. శనివారం సాయంత్రం పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలంలోని తాటిపర్తి, వన్నెపూడి, కొడవలి, చందుర్తి, దుర్గాడ తదితర గ్రామాల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ వరుణ్ తేజ్ గారు మాట్లాడుతూ “బాబాయి పవన్ కల్యాణ్ గారు పదేళ్లుగా జనానికి మంచి చేయాలన్న తపనతో రాజకీయాలు చేస్తూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎన్నో మాటలు పడ్డారు. ప్రజల కోసం ఎన్ని దెబ్బలు తగిలినా వెనుకడుగు వేయకుండా నిలబడ్డారు. కౌలు రైతు కుటుంబాలకు అండగా నిలిచారు. మత్స్యకారుల కోసం నిలబడ్డారు. రాష్ట్రంలో ఎవరికి ఇబ్బంది వచ్చినా నేనున్నానంటూ పోరాటం చేశారు. ప్రజలందర్నీ సొంత కుటుంబ సభ్యులుగా భావించే శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మీ కోసం పండుగల సమయంలో కూడా మా కుటుంబ సభ్యులకు దూరమయ్యారు. ప్రతి ఓటరుకి మా తరఫున చేస్తున్న విన్నపం ఒకటే, ప్రజల కోసం పోరాటం చేసే శ్రీ పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించండి. ఇక మీదట ఎవరు అడిగినా బాబాయ్ పోటీ చేస్తున్న పిఠాపురమే మా ఊరు అని చెబుతాం. ఏ పండుగ వచ్చినా మా సొంతూరు పిఠాపురం వచ్చి జరుపుకుంటాం. మే 13వ తేదీన ప్రతి ఓటరు గుర్తు పెట్టుకుని అసెంబ్లీ ఓటు శ్రీ పవన్ కళ్యాణ్ గార్కి, పార్లమెంటు ఓటు శ్రీ ఉదయ్ శ్రీనివాస్ గారికి గాజు గ్లాసు గుర్తు మీద వేసి భారీ మెజారిటీతో గెలిపించాలి” అన్నారు.
• అపూర్వ స్వాగతం
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఎన్నికల ప్రచారానికి వచ్చిన మెగా ప్రిన్స్ శ్రీ వరుణ్ తేజ్ గారికి పిఠాపురం గ్రామీణ ప్రజలు అడుగడుగునా అద్భుత స్వాగతం పలికారు. తాటిపర్తి, వన్నెపూడి, కొడవలి, చందుర్తి, దుర్గాడ గ్రామాల్లో ప్రజలంతా జనసేన నినాదాలతో హోరెత్తించారు. ఆడపడుచుల హారతులు, జనసైనికుల పూలాభిషేకం మధ్య శ్రీ వరుణ్ తేజ్ గారు రోడ్ షో నిర్వహించారు. రోడ్ షో ఆధ్యంతం జనసైనికులు, టీడీపీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. కార్యకర్తలు, ప్రజల హర్షాతిరేకాల మధ్య ప్రతి ఒక్కరికీ గాజు గ్లాసు గుర్తును చూపుతూ, గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేయాలని కోరుతూ శ్రీ వరుణ్ తేజ్ గారు ముందుకు సాగారు. గ్రామాల్లో ప్రజలు స్వచ్చందంగా గాజు గ్లాసు గుర్తుతో కూడిన ప్లకార్డుల ప్రదర్శించి తమ మద్దతు శ్రీ పవన్ కళ్యాణ్ గారికేనని చెప్పారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా రోడ్డు మీదకు వచ్చిన ప్రతి ఒక్కరికీ శ్రీ వరుణ్ తేజ్ గారు ధన్యవాదాలు తెలిపారు.