* జగన్ లాంటి అవినీతిపరుణ్ణి ఇంటికి పంపేద్దాం
* ప్రజా స్పందన చూస్తుంటే కూటమి విజయం ఖాయమైపోయింది
* వైసీపీ అవినీతి కోట బద్దలవుతోంది
* ప్రజలు మార్పు కోరుకొంటున్నారు
* డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ అత్యవసరం
* కూటమి ప్రభుత్వం ప్రజల కోసం నిండు మనసుతో పని చేస్తుంది
* విజయనగరం ప్రజాగళం బహిరంగసభలో శ్రీ పవన్ కళ్యాణ్
“విజయనగరం జిల్లాలో లభించిన అపూర్వ స్వాగతం చూస్తే కూటమి విజయం ఖాయమైపోయిందని అర్ధమైంది. మీ ప్రేమాభిమానాలు చూసి జగన్ వెన్నులో వణుకు పుట్టింది. జగన్ లాంటి అవినీతి పరుడు, గూండాను బంగాళా ఖాతంలో కలిపేయాలంటే కూటమి అధికారంలోకి రావాలి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అవినీతి కోటను బద్ధలు కొట్టి… కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామ”ని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం విజయనగరంలో నిర్వహించిన ప్రజా గళం బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ… “విజయనగరం ప్రజలు చూపించిన ప్రేమ, అభిమానం జీవితాంతం గుండెల్లో పెట్టుకుంటాను. ఉత్తరాంధ్ర యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోసం రోడ్ల మీదకు వచ్చారు. మీ గుండె చప్పుడు వినే… 2022లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని మాట్లాడాను. అందులో భాగంగానే తెలుగుదేశం- జనసేన- బీజేపీ పార్టీలు కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్తున్నాము. మూడు పార్టీలు కలిసి వస్తే జగన్ లాంటి అవినీతిపరుణ్ణి గద్దె దించవచ్చు. దానికి గుండె బలం, మేధస్సు కావాలి. ఈ జనసమూహాన్ని చూస్తే మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ మార్పును ఎన్నికల్లో చూపించి వైసీపీని ఇంటికి పంపిద్దాం.
• రాష్ట్ర భవిష్యత్తు కోసం కలిశాం
జనసేన- తెలుగుదేశం- బీజేపీలు కూటమిగా ఏర్పడి కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. ఈ కలయిక మా స్వార్థం కోసం కాదు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం. నిన్న పిఠాపురంలో నామినేషన్ వేశాను. నా అఫిడవిట్ లో నాకు ఎంత ఆస్తి ఉందో చూపించాను. దాదాపు రూ. 75 కోట్లు వరకు పన్నులు కట్టాను. నాకు డబ్బులు అవసరం లేదు. ప్రజలకు మంచి భవిష్యత్తు ఉండాలని సేవా నాయకత్వం ఇవ్వడానికి మీ కోసం నిలబడ్డాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒడిదుడుకుల్లో ఉంది. అప్పుల్లో కూరుకుపోయింది. విద్య, వైద్య, ఉపాధి అవకాశాల్లో వెనుకబడిపోయింది.
ఒక్క గంజాయి స్మగ్లింగ్ లోనే నెంబర్ వన్ గా వెలుగుతోంది. చాలా మంది యువత గంజాయి మత్తులో పడి జీవితాలను, భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. కన్నవారికి కన్నీరు మిగులుస్తున్నారు. ఈ మహమ్మారిని రాష్ట్రం నుంచి తరిమేయాలంటే యువతకు బలమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఉద్యోగ, ఉపాధి కల్పిస్తే ఎలాంటి మాదకదవ్యాల అవసరం లేదు. డ్రగ్స్ రహిత ఆంధ్ర ప్రదేశ్ అత్యవసరం. యువతకు సరైన ప్రోత్సాహం ఇస్తే వారికి విజయమే వ్యసనంగా మారుతుంది. అలా జరగాలంటే కేంద్రంలో మోదీగారి లాంటి బలమైన నాయకత్వం… రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలి. రాష్ట్రానికి సుస్థిర పాలన అందాలంటే కూటమి ప్రభుత్వమే రావాలి. కూటమి తరఫున విజయనగరం లోక్ సభ అభ్యర్థిగా శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు, విజయనగరం శాసనసభ నియోజకవర్గం నుంచి శ్రీమతి అదితి గజపతిరాజు పోటీ చేస్తున్నారు. వీరిని భారీ మెజార్టీతో గెలిపించాల”ని కోరారు.