* ప్రజా సమస్యల పరిష్కారంలో జనసేన వీర మహిళల తెగువ ప్రశంసనీయం
* పిఠాపురం నియోజకవర్గ వీరమహిళల సమావేశంలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన జెండా పట్టుకున్నానని, వార్డు మెంబర్ గా పోటీలో ఉన్నానని మా ఇంటికి రెండు సార్లు వైసీపీ గుండాలు వచ్చి, దళిత మహిళనని చూడకుండా నా మీద దాడి చేశారు. పోటీ నుంచి పక్కకు తప్పుకోవాలని లేకుంటే నా ఒక్కగానొక్క కొడుకును చంపేస్తామని బెదిరించారు. నాపైనే దాడులు చేసి పోలీసు కేసులతో వేధించారు.. నేనెక్కడా బెదరలేదు. పోటీ నుంచి వెనకడుగు వేయలేదు. చివరకు 45 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి మీద వార్డు మెంబర్ గా గెలిచాను.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, రామేశ్వరం పంచాయతీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేసిన గెలిచిన కె.సూర్యకుమారి తెగువ ఇదీ..
ఇది కేవలం ఒక్క సూర్యకుమారి విజయమే కాదు.. ఇలాంటి తెగువ చూపి, జనసేన పార్టీకి ప్రతికూల పరిస్థితుల్లో సైతం అండగా నిలిచిన వీర నారీలెందరో.. ఇంకెందరో ఉన్నారు. వారందరినీ వారిని విడతల వారీగా కలుస్తానని గతంలోనే ప్రకటించిన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ జనసేన వారాహి విజయయాత్రలో భాగంగా వారిని కలుసుకుంటున్నారు. గురువారం గొల్లప్రోలులో పిఠాపురం నియోజకవర్గం పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన వీర మహిళలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుండి పార్టీని నడిపించిన వీర మహిళల వివరాలను, వారి రాజకీయ ఆకాంక్షలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి గల కారణాలు, ఆ సమయంలో ఎదురైన అనుభవాలను వీర మహిళలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “జనసేన పార్టీకి వీర మహిళల బలం విలువైనది. ఎన్నికల్లో ఓటమి, గెలుపు అనేది కాదు. పోరాటం ముఖ్యం. ప్రజల తరఫున గళమెత్తడమే ప్రధానం. ఓటమి నుంచి వచ్చే గెలుపు స్ఫూర్తి పాఠాలు నింపుతుంది. చేసిన గొప్ప ప్రయత్నం ఎప్పుడు వృథా కాదు. గొప్ప ఆశయ సాధన కోసం మీరు ముందుకు నడిచారు అన్నదే ప్రధానం. జనసేన పార్టీ మధ్యతరగతి పార్టీ. సాధారణ యువత, మహిళలు మన పార్టీకి ప్రధాన ఆస్తి. జనసేన పార్టీ ఆశయాలు, విధానాలు మధ్యతరగతి వారికి అనుగుణంగా ఉంటాయి. చాలా తొందరగా పార్టీని వారు సొంత పార్టీగా భావిస్తారు. దీనికి అనుగుణంగానే వీర మహిళలు సైతం తెగువచూపి ముందుండి నడుస్తారు. ప్రజా పోరాటాలు చేయడంలో వీర మహిళా స్ఫూర్తి జనసేన పార్టీకి ప్రధానం.
నాయకత్వం అనేది బాధ్యత. ప్రజలకు ఏదైనా మేలు చేయాలని తలంపుతో మీరంతా జనసేన పార్టీని వేదిక చేసుకున్నారు. దానిని కచ్చితంగా సాధించి తీరుతాం. ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆడపిల్ల రక్షణకు జనసేన ప్రభుత్వంలో తప్పనిసరిగా భరోసా ఉంటుంది. ఓటమి చెందిన సమయంలోనే సుగాలి ప్రీతి కుటుంబానికి అండగా నిలిచి, ఆడబిడ్డకు ఆపత్కాలంలో జనసేన పార్టీ అండగా నిలబడింది. మీ అందరి సూచనలు సలహాలతో మహిళలు, ఆడపిల్లల రక్షణకు ఎలాంటి విధానాలు తీసుకురావాలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ఎంతో నైపుణ్యం ఉన్న యువతులు నేటి సమాజంలో లెక్కకు మించి కనిపిస్తున్నారు. విభిన్న రంగాల్లో వారు చూపుతున్న ప్రతిభ అమూల్యం.. అపురూపం. అలాంటి వారికి కచ్చితంగా జనసేన పార్టీ ప్రభుత్వంలో దారి చూపిస్తాం. మహిళల ఆర్థిక స్వావలంబనకు బాటలు వేసే బాధ్యత తీసుకుంటాం” అన్నారు.