* అధికార పార్టీ దాష్టికాలు.. దౌర్జన్యాలపై ప్రజాగ్రహం
* ఓపికగా ప్రతి సమస్యను విన్న జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్
* ప్రతి ఒక్కరికీ నేనున్నాంటూ భరోసా ఇచ్చిన జనసేనాని
జనం మధ్య.. జనం గోడు వింటూ.. ప్రతి సమస్యను ఓపికగా ఆలకిస్తూ.. పరిష్కారానికి భరోసా ఇస్తూ.. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ కాకినాడలో జనవాణి – జనసేన భరోసా కార్యక్రమంలో పాల్గొన్నారు.. వైసీపీ ఎమ్మెల్యేల దాష్టికాల బాధితులు.. జయలక్ష్మి బ్యాంకులో డిపాజిట్లు కట్టి దగా పడ్డ రిటైర్డ్ ఉద్యోగులు.. పారిశుధ్య కార్మికులు.. రజకులు.. భవన నిర్మాణ కార్మికులు.. కరెంటు బిల్లు ముసుగులో ఫించన్ కోల్పోయిన దివ్యాంగులు.. టిడ్కో గృహాల బాధితులు.. శాసనభ్యుల అరాచకాలకు ఇబ్బందులు పడుతున్న బాధితులు తమ కన్నీటి గాధలు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి చెప్పుకున్నారు. ప్రతి ఒక్కరి ఆవేదనను ఆలకించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు నేనున్నానంటూ జనవాణిలో సమస్యలు చెప్పుకొనేందుకు వచ్చిన అందరికీ ధైర్యం చెప్పారు. వైసీపీ ప్రభుత్వ అరాచకాలపై, ప్రజా సమస్యలపై గళం విప్పుతానని భరోసా ఇచ్చారు.
ఫించన్ కోల్పోయిన దివ్యాంగుడు శ్రీ మాడం శ్రీనివాస్ కి వీల్ చైర్ కొనివ్వడంతో పాటు ఆర్ధికంగా అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. సమస్యలతో వచ్చిన ప్రతి ఒక్కరు మీరు ముఖ్యమంత్రి కావాలి సర్ అంటూ నిండు మనసుతో శ్రీ పవన్ కళ్యాణ్ ని దీవించారు. కాకినాడ పట్టణ, రూరల్ నియోజకవర్గాల పరిధిలో శనివారం నిర్వహించిన జనవాణి – జనసేన భరోసా కార్యక్రమంలో 50కి పైగా సమస్యలపై అర్జీలు స్వయంగా స్వీకరించారు. జనసేనాని దృష్టికి వచ్చిన సమస్యల్లో ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి..
• రూ. 75 ఉన్నప్పటి నుంచి ఫించన్ తీసుకుంటున్నా. 2021లో కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని ఫించన్ తీసేశారు. రూ. 10 వేల ఫించన్ ఇస్తామని ఉన్న ఫించన్ తీసేశారు. ప్రభుత్వ పథకాలు ఎగ్గొట్టేందుకు కరెంటు బిల్లు సాకుగా చూపుతున్నారు. మీరు ముఖ్యమంత్రి అయితే మా బాధలు తీరుతాయి అంటూ కాకినాడ రూరల్ మండలం, స్వామినగర్ కి చెందిన దివ్యాంగుడు శ్రీ మాడం శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు.
• తమ్మవరం సెజ్ పేరిట 1994లో 300 ఎకరాలు తీసుకున్నారు. 1999లో రైతులకు ఇష్టం లేకున్నా 295 ఎకరాలు రెండో విడత భూసేకరణ అన్నారు. మూడు పంటలు పండే భూమిని బంజరు కింద చూపి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆ గ్రామానికి చెందిన రైతు శ్రీ గొల్లపల్లి నాగేశ్వరరావు జనవాణిలో చెప్పుకున్నారు.
• వైసీపీ ప్రభుత్వంలో రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏ నెలలోనూ 10వ తేదీ లోపు జీతాలు రావడం లేదు. రిటైర్డ్ అయ్యాక రెండేళ్లు గడచినా బెనిఫిట్స్ రావడం లేదు. రిటైర్డ్ ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నాం.
• ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్స్ లో కనీస మౌలిక వసతులు ఉండడం లేదు. వసతి దీవెన ఒక టర్మ్ ఇవ్వడం వల్ల కూలీలుగా మారుతున్న పరిస్థితి.
సత్య సూర్య, విద్యార్ధి.
• భవన నిర్మాణ కార్మికులు గా చాలా ఇబ్బందులుపడుతున్నాం. కరోనా సమయంలోనూ, ఇసుక కొరత ఉన్న సమయంలోనూ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందలేదు. మా కార్మిక సంక్షేమ నిధి నుంచి రూ. 900 కోట్లు దారిమళ్లించారు. 50 ఏళ్లకే మా భవన నిర్మాణ కార్మికులకు ఫించన్ ఇప్పించే ఏర్పాటు చేయండి.
– శ్రీ సత్యనారాయణ, భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం
• కాకినాడ ప్రభుత్వ పెద్దాసుపత్రిలో సౌకర్యాల లేమి ఇబ్బంది పెడుతోంది. పురుడు పోసుకున్న వారిని, శస్త్ర చికిత్స చేయించుకున్న వారిని కూడా చూడకుండా ఒకే మంచంపై ఇద్దరు ముగ్గురు రోగుల్ని వేస్తున్నారు. సిబ్బంది నిర్లక్ష్యం కూడా తారా స్థాయికి చేరింది.
• ప్రభుత్వ విధానాలతో రజకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. చెరువులన్నీ అధికార పార్టీ నాయకులు కబ్జా చేసేయడంతో వృత్తిపరమైన ఇబ్బందులు ఉన్నాయి. 50 ఏళ్లు దాటిన రజకులకు ఫించన్లు ఇప్పించండి.
– శ్రీ మణికంఠ, రజక సంఘం
• ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని రైతు బజారులో సబ్బవరంకు చెందిన 146 మంది రైతులు దుకాణాలు నిర్వహించుకుంటున్నాం. రూరల్ నియోజకవర్గానికి చెందిన మీ వల్ల నాకు ఓటు కూడా రాదంటూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి రైతు బజార్ ఖాళీ చేయమని ఇబ్బంది పెడుతున్నాడు. రోడ్డు పేరిట ఖాళీ బలవంతంగా ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారు. హైకోర్టుకి వెళ్లి ఆపుకున్నాం సర్. రైతు బజార్ ని రెడ్డి బజార్ చేయాలని చూస్తున్నారు.
– శ్రీ కామి శ్రీనివాస్, రైతు, సబ్బవరం
• మా మేదర కులం దేశం మొత్తం ఎస్సీ జాబితాలో ఉంటే.. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రం బీసి ఏ కేటగిరిలో ఉన్నాం. రిజర్వేషన్ పరంగా మా కేటగిరిలో ఉన్న కులాలతో పోటీ పడలేకపోతున్నాము. రోడ్ల పక్కన నివశించే మా ఇళ్లు రోడ్డు వైండింగ్ పేరిట పీకేసి పరిహారం ఇవ్వడం లేదు.
– శ్రీ ధర్మారావు, కాకినాడ
• ఫించన్ సొమ్ము రూ.11 లక్షలు జయలక్ష్మి బ్యాంకులో డిపాజిట్ చేశాము. ఇప్పుడు ఆ సంస్థ బోర్డు తిప్పేసింది. డీసీసీబీలో మ్యానేజర్ గా పని చేసిన నాకు రిటైర్మెంట్ తర్వాత ఫించన్ కూడా రాదు. మా డబ్బు మాకు వచ్చేలా చూడండి.
– శ్రీ సుబ్రహ్మణ్య శర్మ, మాజీ డీసీసీబీ ఉద్యోగి
• మాకున్న 9 సెంట్ల భూమిలో సచివాలయం నిర్మాణం పేరిట 400 గజాలు మొదట లాక్కున్నారు. ఇవ్వకపోతే కోర్టుకు వెళ్లి కేసులు పెడతామని భయపెట్టారు. ఇప్పుడు ఆరోగ్య కేంద్రం కోసం ఉన్న స్థలం కూడా ఇచ్చేయమని బెదిరిస్తున్నారు.
• జూనియర్ న్యాయవాదులకు లానేస్తం పథకం కింద రూ. 5 వేల స్టయ్ ఫండ్ ఇస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఇచ్చిన మామీ మేరకు బటన్ నొక్కారు గాని మా ఖాతాల్లో సొమ్ము జమ కాలేదు. న్యాయవాదుల మీద దాడులు పెరిగిపోయాయి. వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలి.
– శ్రీ ప్రదీప్, న్యాయవాది
• డంపింగ్ యార్డుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. వర్షం వచ్చినప్పుడు తడికి, ఎండ వచ్చినప్పుడు వేడికీ దుర్ఘంధం వెదజల్లుతూ ఆరోగ్యాలు పాడవుతున్నాయి. వారాహి విజయాత్రను కాకినాడలోకి స్వాగతిస్తూ బోర్డులు అంటిస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారు. నిన్న రాత్రి బాబుతో బయటకు వెళ్తే కొంత మంది బైకులపై వెంబడించారు.
– శ్రీమతి వై. సునీత
• ఆర్టీసీ ఉద్యోగులకు బస్సులో టిక్కెట్ ఉండదు సర్.. రైల్వే ఉద్యోగులకు రైల్లో టిక్కెట్ ఉండదు.. పారిశుధ్య కార్మికులుగా చెత్త ఊడ్చే మాకు మాత్రం వైసీపీ ప్రభుత్వంలో చెత్తపన్ను నుంచి మినహామింపు లేదు. మాకు సెలవలు ఉండవు.. మర్యాద ఉండదు.
– రెల్లి కులస్తులు
• టీడీపీ ప్రభుత్వంలో టిడ్కో ఇళ్లు వచ్చాయి. ఈ ప్రభుత్వం తర్వాత వాటిని రద్దు చేసి జగనన్న కాలనీలో స్థలం ఇస్తామన్నారు. ఎక్కడో యు.కొత్తపల్లి మండలంలో సముద్ర తీరాన తీసుకువెళ్లి పడేశారు. ఇప్పటికే సముద్రపు కోతకు అక్కడ ఉన్న గ్రామాలు బిక్కు బిక్కు మంటూ గడుపుతుంటే, ఇప్పుడు మా ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు సిద్దమయ్యారు.
– శ్రీమతి నాగలక్ష్మి, సూర్యనారాయణపురం
• శ్రీ జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు కాబట్టి మా క్రైస్తవులకు మేలు చేస్తాడని నమ్మి మద్దతిచ్చాం. దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తిస్తామని చెప్పి ఇప్పుడు తూతూ మంత్రంగా అసెంబ్లీ తీర్మానం చేసి చేతులు దులుపుకున్నారు. ఈ సారి మా క్రైస్తవుల మద్దతు జనసేనకే ఇస్తాం.
– ఇండియన్ క్రిస్టియన్ ఫెడరేషన్ సభ్యులు
• అర్చకులు, పురోహితులు, వేద పండుతుల జీవితాల్లో వెలుగులు లేవు. ఎప్పుడో ప్రకటించిన రూ. 5 వేల జీతమే పురోహితులకు ఇస్తున్నారు. మిగిలిన వారికి ఆరు నెలలు మాత్రమే సీజన్ ఉంటుంది. ఆలయాల్లో దానం ఇచ్చేందుకు కూడా ఈ ప్రభుత్వం టిక్కెట్లు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతోంది.
– శ్రీ కోటమర్తి మహాదేవశాస్త్రి, అర్చక సంఘం
• కుంబాభిషేకం రేవు వద్ద ఉన్న శివాలయంపై ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కన్ను పడింది. మధ్య నుంచి ప్రహరీ కట్టి కొంత తీసేసుకున్నారు. ఇప్పుడు శివాలయం ముందు నుంచి ప్రహరీ కడుతున్నారు. అడిగితే మాపై కేసులు పెడుతున్నారు. మత్స్యకారులకు చెందిన 20 ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి లాక్కున్నారు. మత్స్యకారులకు అన్యాయం జరుగుతున్నా మా గోడు వినేవారు లేరు. వీరితో పాటు ఎంతో మంది బాధితులు తమ సమస్యలపై జనవాణి – జనసేన భరోసా కార్యక్రమంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అర్జీలు సమర్పించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్, జిల్లా అధ్యక్షుడు శ్రీ కందుల దుర్గేశ్, పిఎసి సభ్యులు శ్రీ పంతం నానాజీ, శ్రీ ముత్తా శశిధర్, పార్టీ నేతలు శ్రీ కళ్యాణం శివ శ్రీనివాస్, శ్రీ డి. వరప్రసాద్ పాల్గొన్నారు.