జయహో జనసేనాని

జనసేనాని

* హోరెత్తించిన విశాఖ నగరం
* అడుగడుగునా అఖండ స్వాగతం
* గాజువాక వారాహి విజయ యాత్రకు అశేష జన వాహిని
* అభిమాన నేతపై పూల వర్షం
* హారతులిచ్చిన ఆడపడుచులు
* ఏడు కిలోమీటర్ల మేర సాగిన భారీ ర్యాలీ
* సింధియా నుంచి గాజువాక వరకూ జనమే జనం

           సముద్రం జనంగా మారి పుర వీధుల్ని ముంచెత్తిందా? గాజువాక ప్రజానీకం మొత్తం రోడ్ల మీదకు వచ్చేసిందా అన్న చందంగా సింధియా నుంచి పాత గాజువాక వరకు రహదారులు, భవంతులు మొత్తం జనంతో నిండిపోయాయి. వారాహి విజయ యాత్ర సభకు విచ్చేసిన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి గాజువాక ప్రజలు ప్రతి అడుగులో అపూర్వ స్వాగతం పలికారు. జనసైన్యపు సునామీ పురవీధుల్ని ముంచెత్తింది. జయ జయధ్వానాల మధ్య జనసేనాని వారాహి రథాన్ని అధిరోహించి విజయనాధం చేశారు. సింధియా ప్రాంతం నుంచి పాత గాజువాక వరకు.. ఏడు కిలోమీటర్ల మేర సాగిన మహా ర్యాలీ ప్రతి అడుగూ కనువిందుగా సాగింది.
• ప్రతి అడుగూ జన ప్రభంజనమే
              గాజువాక వారాహి విజయ యాత్ర సభ కోసం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సాయంత్రం 5 గంటలకు నోవాటెల్ నుంచి గాజువాకకు బయలుదేరారు. అప్పటికే నోవాటెల్ హోటల్ వద్దకు వేలాదిగా చేరుకున్న జనసేన శ్రేణులు, ప్రజలు పెద్ద పెట్టున జయజయ ధ్వానాలు చేస్తూ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఎదురొచ్చారు. వారాహి విజయ యాత్ర సందర్భంగా విశాఖ నగరంలో పోలీసులు ఆంక్షలు యధావిధిగా కొనసాగిస్తూ సిరిపురం జంక్షన్, ద్వారకానగర్ ఫ్లై ఓవర్, రైల్వే స్టేషన్, పోర్డు రోడ్డు మీదుగా శ్రీ పవన్ కళ్యాణ్ గారి వాహన శ్రేణిని ముందుకు తీసుకు వెళ్లారు. పోర్టు రోడ్డు నుంచి సింధియా ప్రాంతానికి చేరుకోగానే పెద్ద సంఖ్యలో ప్రజలు రోడ్ల మీదకు వచ్చి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలికారు. జన సైనికుల నినాదాలు, ఆడపడుచుల హారతులు, పూల వర్షంలో తడిసి ముద్ధవుతూ ముందుకు సాగారు. సింధియా నుంచి ప్రతి అడుగు జనప్రభంజనంగా వారాహి విజయ యాత్ర ర్యాలీ సాగింది. సింధియా, మల్కాపురం, శ్రీహరిపురం, కొత్త గాజువాక ప్రధాన రహదారి మొత్తం ఇసుక వేస్తే రాలనంతగా జనంతో నిండిపోయింది. ఏడు కిలోమీటర్ల ర్యాలీ మూడు గంటల పాటు సాగడం వారాహి విజయ యాత్రకు గాజువాక ప్రజల నుంచి వచ్చిన మద్దతుకు అద్దం పడుతుంది.
• కరచాలనాలు, సెల్ఫీలతో ఉత్సాహపరుస్తూ..
              వారాహి విజయ యాత్రకు స్వాగతం పలికేందుకు జనసేన శ్రేణులతోపాటు ప్రజలు కూడా స్వచ్ఛందంగా సంప్రదాయ వాద్యాలు, హల్లో ఏపీ.. బైబై వైసీపీ.. హల్లో ఏపీ.. వెల్కమ్ జేఎస్పీ.. నినాదాలతో హోరెత్తించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి రాకకు సూచకంగా ప్రతి అడుగులో బాణసంచా పేలుళ్ల శబ్దాలతో హోరెత్తించారు. ఆడపడుచులు గుమ్మడికాయలతో దిష్టి తీశారు. రహదారులు, భవనాల మీద నిలబడి తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన ప్రతి ఆడపడుచుకి, ప్రతి జనసైనికుడికి అభివాదం చేస్తూ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముందుకు సాగారు. అవకాశం ఉన్న చోట కరచాలనం చేశారు.. సెల్ఫీలు దిగి ఉత్సాహపరిచారు. గాజువాక బస్ డిపో వద్ద మిత్రపక్షం బీజేపీ శ్రేణులు రోడ్డు మీదకు వచ్చి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని హారతులతో స్వాగతించడం గమనార్హం.
• వారాహి రథంలో భారీ రోడ్ షో
           గాజువాక కన్యశ్రీకన్య థియెటర్ సెంటర్ నుంచి పాత గాజువాక సెంటర్ నుంచి వారాహి రథాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధిరోహించారు. జనసముద్రం మధ్య.. జనానికి అభివాదం చేస్తూ.. ప్రజాభిమానంలో తడిసి ముద్దవుతూ.. కిలోమీటర్ మేర వారాహి రథం నుంచి రోడ్ షో నిర్వహించారు. కిలోమీటర్ లోపు వారాహి రథయాత్రకు సుమారు గంట సమయం పట్టింది. వారాహి విజయ యాత్ర సభా ప్రాంగణ పరిసరాలు మొత్తం కిలోమీటర్ల మేర సభకు తరలి వచ్చిన లక్షలాది మంది ప్రజలతో నిండిపోయాయి. గాజువాక నియోజకవర్గం పరిధిలోని ప్రతి వీధి వారాహి విజయ యాత్ర స్వాగత తోరణాలు, జనసేన జెండాలతో నిండిపోయాయి.
• సమస్యలు చెప్పుకొనేందుకు ముందుకు వచ్చిన జనం
          వారాహి విజయ యాత్ర కోసం శ్రీ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని తెలిసి దారి పొడవునా ప్రజలు తమ సమస్యలు చెప్పుకొనేందుకు పోటీ పడ్డారు. సింధియా నుంచి గాజువాక వరకు ఎన్నో సమస్యలు జనసేనాని దృష్టికి ప్ల కార్డులు, వినతి పత్రాల రూపంలో వచ్చాయి. పారిశ్రామికవాడల్లో స్థానికులకు ఉపాధి కరవయ్యిందని, కార్మికుల వలసలు ఆపేందుకు కృషి చేయాలని సింధియా ప్రాంతంలో పలువురు మహిళా కార్మికులు ప్లకార్డులు ప్రదర్శించారు. ఆ ప్లకార్డులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వీకరించారు. సింధియా-గాజువాక డిపో మధ్య పారిశ్రామికవాడల్లో నివసిస్తున్న రెండు లక్షల మంది ప్రజలు పారిశ్రామిక వ్యర్ధాల కాలుష్యంతో పడుతున్న ఇబ్బందులు, హెచ్.పి.సి.ఎల్. ప్రమాదాలతో పొంచివున్న ముప్పును, కోరమండల్ పరిశ్రమ కాలుష్యం, గంగవరం పోర్టు బ్లాక్ డస్ట్ వల్ల వస్తున్న రోగాలు, తదితర సమస్యలపై వినతి పత్రాలు సమర్పించారు. తమ సమస్యల మీద గళం విప్పాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారిని వేడుకున్నారు. స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు తమ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం చొరవ చూపాలని కోరుతూ న్యూ గాజువాకలో ప్ల కార్డులు ప్రదర్శించారు. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని మారుమ్రోగించారు. గంజాయిరహిత రాష్ట్రం కావాలంటూ యువత ప్రదర్శించిన ప్లకార్డులు ఆకట్టుకున్నాయి. వారాహి విజయ యాత్ర సభలో రోడ్ షోలో తన దృష్టికి వచ్చిన అన్ని సమస్యలపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు గళం విప్పారు.

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్