పిఠాపురంలో జనసేనాని ప్రభంజనం

• ప్రతి అడుగులో జనహారతులు
• గ్రామ గ్రామాన ఆత్మీయ స్వాగతం పలికిన ప్రజలు
• గొల్లప్రోలు – దొంతమూరు మధ్య గ్రామాల్లో అశేష జనాదరణ
• అడుగడుగునా పూల వర్షం, హారతులు
• ఆత్మీయంగా కరచాలనం చేస్తూ.. అప్యాయంగా పలుకరిస్తూ సాగిన శ్రీ పవన్ కళ్యాణ్
• జనసేన శ్రేణులతో కలసి పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చిన టీడీపీ శ్రేణులు
• టీడీపీ ఇంఛార్జ్ శ్రీ ఎస్.వి.ఎస్.ఎన్.వర్మతో మర్యాదపూర్వక భేటీ

           జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి జన ప్రభంజనం మధ్య శనివారం అడుగుపెట్టారు. నియోజకవర్గ ప్రజల ఘన స్వాగతం నడుమ మూడు గంటల పాటు గ్రామాల్లో రోడ్ షో నిర్వహించారు. జనహారతులు, పూల వర్షంలో తడిసి మద్దవుతూ ఈ పర్యటన సాగింది. వారాహి విజయ భేరీ యాత్ర నిమిత్తం శనివారం మధ్యాహ్నాం పిఠాపురం నియోజకవర్గం, గొల్లప్రోలు వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ కు ప్రత్యేక హెలీకాప్టర్ లో చేరుకున్నారు. అక్కడి నుంచి మాజీ శాసనసభ్యులు, టీడీపీ ఇంఛార్జ్ శ్రీ ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ గారి నివాసానికి వెళ్లారు. మార్గమధ్యంలో గ్రామ గ్రామాన పిఠాపురం నియోజకవర్గ ప్రజలు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని అక్కున చేర్చుకున్నారు. ఆత్మీయ స్వాగతం పలికారు. గొల్లప్రోలు నుంచి బి.ప్రత్తిపాడు, భోగాపురం, రాపర్తి, పి.రామవరం, వెల్దుర్తి గ్రామాల మీదుగా శ్రీ వర్మ గారి స్వగ్రామం పి.దొంతమూరుకు వెళ్లారు. ఎమ్మెల్యే అభ్యర్ధిగా తొలిసారి నియోజకవర్గంలో పర్యటిస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రతి గ్రామంలో ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. గ్రామ గ్రామాన మహిళలు, వృద్ధులు, యువత రహదారికి ఇరువైపులా నిలబడి జయజయ ధ్వానాలు చేస్తూ శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద పూల వర్షం కురిపించారు. అడుగడుగునా హారతులు పడుతూ, ఆడపడుచులు విజయోస్తు అంటూ ఆశీర్వచనాలు అందించారు. భారీ మెజారిటీతో శ్రీ పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీకి పంపుతామంటూ నినదించారు. మేమంతా మీతోనే ఉన్నామని తెలియచేస్తూ రహదారికి ఇరువైపులా ఉన్న ప్రతి ఇంటి మీద, ప్రహరీ గోడల మీద ప్రజలు జనసేన జెండాలు కట్టి తమ ఉద్దేశాన్ని చాటిచెప్పారు. రోడ్లకు ఇరువైపులా నిలబడి స్వాగతం పలికిన ఆడపడుచులకు, అన్నదమ్ములకు అభివాదం చేస్తూ, అవకాశం ఉన్న ప్రతి ఒక్కరితో కరచాలనం చేస్తూ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముందుకు కదిలారు. ప్రతి గ్రామంలో జనసేనతో పాటు టీడీపీ, బీజేపీ శ్రేణులు సైతం శ్రీ పవన్ కళ్యాణ్ గారిని నియోజకవర్గానికి ఆహ్వానిస్తూ బారులు తీరారు. కొన్ని గ్రామాల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారి రాక సందర్బంగా బాణ సంచా పేల్చి ప్రజలు సంబరాలు చేసుకున్నారు. టీడీపీ ఇంఛార్జ్ శ్రీ వర్మ గారి స్వగ్రామంలో టీడీపీ శ్రేణులు డప్పుల చప్పుళ్లు, చిందులతో శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించారు.
• పొత్తుదే పీఠం.. ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం: శ్రీ పవన్ కళ్యాణ్
వారాహి విజయ భేరీ యాత్ర నిమిత్తం శనివారం పిఠాపురం నియోజకవర్గానికి వచ్చిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మధ్యాహ్నం మాజీ శాసన సభ్యులు, టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ గారి నివాసానికి వెళ్లి ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “రాష్ట్రంలో అధికార పీఠం పొత్తుదే. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని స్థాపించబోతోంది. దానికి సంకేతమే పిఠాపురం నియోజకవర్గం ప్రజల నుంచి వస్తున్న అపూర్వ స్పందన. రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు పెట్టుకున్నాము. రాష్ట్రం మొత్తం జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు తెలుగుదేశం పార్టీ అభ్యర్ధుల విజయం కోసం కృషి చేస్తుంటే పిఠాపురంలో టీడీపీ శ్రేణులు జనసేన విజయం కోసం పని చేస్తున్నార”న్నారు. తన విజయం కోసం నేనున్నానంటూ నిలబడిన శ్రీ వర్మ గారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ.. తన కోసం త్యాగం చేసిన శ్రీ వర్మ గారిని భవిష్యత్తులో బలమైన స్థానంలో నిలపుతామన్నారు.
• శ్రీ పవన్ కళ్యాణ్ కి భారీ మెజారిటీ రావాలి: శ్రీ ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ
శ్రీ వర్మ గారు మాట్లాడుతూ.. “పిఠాపురం నియోజకవర్గం తెలుగుదేశం కుటుంబం తరఫున శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఘనస్వాగతం పలుకుతున్నాము. నా కంటే పది రెట్ల మెజారితో శ్రీ పవన్ కళ్యాణ్ గారిని గెలిపిద్దాం. పిఠాపురంలో జనసేన, టీడీపీ జెండా ఎగరాలి” అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, టిడిపి నేత శ్రీ సుజయ్ కృష్ణ రంగారావు, జనసేన నేతలు శ్రీ బి. మహేందర్ రెడ్డి, శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, శ్రీ కొత్తపల్లి సుబ్బారాయుడు, శ్రీ తుమ్మల రామస్వామి, శ్రీ వరుపుల తమ్మయ్య బాబు తదితరులు పాల్గొన్నారు.

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్