• అవసరమైతే రాజకీయ పోరాటాలకు సిద్ధం
• ఏలూరు “జనవాణి – జనసేన భరోసా” కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్
‘వేదిక మీదకు పిలవలేదని అంతిమ సంస్కారాలకు ఉచిత సేవలు అందిస్తున్న మా సంస్థపై స్థానిక శాసనసభ్యుడు కక్షగట్టారు..’ ఫ్లాష్ సంస్థ ప్రతినిధుల వేదన. ‘ఇళ్లు ఉన్న చోట రోడ్లు లేవు.. రోడ్లు ఉన్న చోట ఇళ్లు లేవు..’ ఇందిరమ్మ కాలనీ వాసుల వెతలు. ‘డిగ్రీ కాలేజీలో పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయి..’ విద్యార్ధుల గోడు. ‘కల్లు గీత కార్మికుడైన నా భర్త చెట్టు మీదనుంచి పడి చనిపోతే మూడేళ్లుగా ప్రభుత్వం నుంచి పరిహారం అందలేదు..’ ఓ కల్లు గీత కార్మికుని భార్య ఆవేదన.. ఇలా పలు సమస్యలు వెల్లువలా ఏలూరులో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్వహించిన జనవాణి – జనసేన భరోసా కార్యక్రమానికి వచ్చాయి. దివ్యాంగులు.. విశ్రాంత ఉద్యోగులు.. ఆక్వా రైతులు.. వివిధ వర్గాల ప్రజలు తమ సమస్యలపై శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అర్జీలు సమర్పించారు. వివిధ వర్గాలకు చెందిన 24 మంది నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు. ప్రతి సమస్యను సావధానంగా విన్న జనసేనాని- తన దృష్టికి వచ్చిన సమస్యకు తాను చేయగలిగిన సాయం చేస్తానని హామీ ఇచ్చారు. మరికొన్నింటిని పార్టీ నుంచి సంబంధిత శాఖలకు పంపుతామని, అవసరం అయిన చోట రాజకీయ పోరాటాలు చేస్తామని భరోసా ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణ అంశంలో దళిత సమూహాల మధ్య ఐక్యత దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జనసేన ప్రభుత్వం ఏర్పాటు తర్వాత అత్యంత ఎత్తయిన శ్రీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఏర్పాటు చేస్తామని తెలిపారు. జనవాణి – జనసేన భరోసా కార్యక్రమానికి వచ్చిన ప్రధాన సమస్యలు..
* ఏలూరు పట్టణ పరిధిలో ఫ్లాష్ అనే స్వచ్చంద సంస్థ ద్వారా నిరు పేదల అంతిమ సంస్కారాలకు తమవంతు సహాయ సహకారాలు అందిస్తున్నాం. శ్మశానంలో శాంతివనం పేరిట ఓ షెడ్డు ఏర్పాటు చేసుకుని వైకుంఠయాత్ర వాహనం, ఫ్రీజర్లు అక్కడ అందుబాటులో ఉంచాము. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యుడికి మా సంస్థ తగిన గౌరవం ఇవ్వలేదన్న నెపంతో నిరు పేదలకు ఉపయోగపడుతున్న శాంతివనాన్ని ధ్వంసం చేసి, ఫ్రీజర్లు బయటికి విసిరేశారు. కార్పోరేషన్ పరిధిలో శ్మశానంలో శవదహనానికి రూ. 5 వేల రుసుము పెట్టారు. నిరుపేదలకు అండగా నిలుస్తున్న మా సంస్థ సామాగ్రి పెట్టుకోవడానికి స్థలం కేటాయించే ఏర్పాటు చేయండి.
– ఫ్లాష్ సంస్థ సభ్యులు
* రాష్ట్రవ్యాప్తంగా 29 వేల మంది రేషన్ డీలర్లు ఉన్నాము. ఆహార భద్రత చట్టం కింద ప్రజాపంపిణీ వ్యవస్థను మేమే ముందుకు నడిపించాలి. వైసీపీ ప్రభుత్వం ఆహార భద్రత చట్టానికి విరుద్దంగా ఎండీఓలను తీసుకువచ్చింది. ప్రభుత్వ నిర్ణయంతో ప్రజా పంపిణీ వ్యవస్థ పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టయ్యింది. పంచదార, కందిపప్పు మీద ప్రజల నుంచి నెలకు రూ. 9 కోట్లు అదనంగా దోచుకుంటున్నారు. ఎండీఓలు ప్రభుత్వానికి దత్తపుత్రులుగా మారగా, రేషన్ డీలర్లు సవతిపుత్రులుగా మారాము. ఆహార భద్రత చట్టం నిబంధనల మేరకు మా హక్కులు కాపాడాలి. ఎండీఓ వ్యవస్థను రద్దు చేసి, మాకు కనీస గౌరవ వేతనం ఇవ్వాలి.
– శ్రీ లీలా మాధవరావు, రేషన్ డీలర్ల సంఘం
* సీడ్ అందుబాటులో లేక, మేతలు, మందుల ధరలు పెరిగిపోయి ఆక్వా రైతులు నానా ఇబ్బందులు పడుతున్నాం సర్. మద్దతు ధర విషయంలో కూడా రొయ్య రైతుకి అన్యాయం జరుగుతోంది. 10 ఎకరాలు పైబడి ఉన్న రైతులకు విద్యుత్ రాయితీ ఈ ప్రభుత్వం కట్ చేసింది.
– శ్రీ పండు నాని, శ్రీ తరుణ్, ఆక్వా రైతులు
* 16 ఏళ్లుగా ఆశా వర్కర్లుగా పని చేస్తున్నాము. 2018 తర్వాత ఫిక్స్ డ్ వేతనమంటూ 6.500 మాత్రమే ఇస్తున్నారు. మాకు సెలవులు ఉండవు, కనీసం మెటర్నిటీ లీవులు కూడా లేవు. ఆరోగ్య శాఖ కింద పని చేసే మమ్మల్ని సచివాలయాలకు అనుసంధానం చేయడంతో సమస్యలు పెరిగాయి. సచివాలయ వ్యవస్థ నుంచి మమ్మల్ని తప్పించేందుకు సాయం చేయండి.
– శ్రీమతి ప్రమీల, శ్రీమతి విజయలక్ష్మి, ఆశా వర్కర్లు
* ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన శ్రీ పొట్టి శ్రీరాములు గారికి తగిన గౌరవం దక్కడం లేదు. జనసేన పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర అసెంబ్లీలో శ్రీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఏర్పాటు చేయాలని ఆర్యవైశ్య సంఘం సభ్యులు శ్రీ సత్యదేవ్ అర్జీ సమర్పించారు. ఆంధ్ర రాష్ట్రం శ్రీ పొట్టి శ్రీరాములు గారికి రుణపడి ఉంటుందని, రాష్ట్రంలోనే ఎత్తయిన విగ్రహం ఏర్పాటు చేస్తామని శ్రీ పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు.
* రవాణ శాఖలో పన్నులతోపాటు వాహన రిజిస్ట్రేషన్, లైసెన్సు కార్డులకు ఫీజులు చెల్లిస్తున్నా కార్డులు జారీ కావడం లేదు. గత 16 నెలల నుంచి లక్షల సంఖ్యలో కార్డులు పెండింగ్ లో ఉన్నాయి. ఒక్క ఏలూరు జిల్లా పరిధిలోనే 50 వేల ఆర్సీలు, 30 వేల డ్రైవింగ్ లెసెన్స్ కార్డులు జారీ చేయాల్సి ఉంది. ఈ సమస్య పరిష్కారానికి కృషి చేయండి.
– శ్రీ సుంకర ఈశ్వర్, శ్రీ చందు
* ఎస్.ఎస్.సి. జి.డి కానిస్టేబుల్ నోటిఫికేషన్ వ్యవహారంలో నక్సల్ ప్రభావిత జిల్లాలు అయిన పార్వతిపురం మన్యం, అల్లూరి జిల్లాలకు ప్రభుత్వ తప్పిదం వల్ల యువత రిజర్వేషన్ కోల్పోతున్నారు. దాన్ని సవరించాలని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. 17వ తేదీ నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ ఉంది. ఈ లోపు ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని సవరించేలా ఒత్తిడి తీసుకురండి.
– శ్రీ అవ్వా సంతోష్, శ్రీ మరిపి రవి
* నా భర్త కల్లు గీత కార్మికుడు. 2020 ఏప్రిల్ 5వ తేదీన చెట్టు మీద నుంచి పడి చనిపోయారు. మూడు సంవత్సరాలుగా కాళ్లు అరిగేలా తిరిగినా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదు. కుటుంబ పోషణ చాలా ఇబ్బందిగా ఉందని కృష్ణా జిల్లా, చల్లపల్లికి చెందిన శ్రీమతి మురాలి ఈశ్వరి తన బాధను శ్రీ పవన్ కళ్యాణ్ గారికి విన్నవించారు. పార్టీ తరఫున ఆమెకు ఆర్ధిక సాయం అందించారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన పరిహారం వచ్చేలా ఒత్తిడి తీసుకువస్తామని చెప్పారు.
* ఏలూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ విద్యార్థులు తమకు తరగతి గదులు లేకపోవడం వల్ల చెట్ల కిందా, ఆరు బయటా చదువుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 300 మంది విద్యార్థులు, 5 రకాల డిగ్రీ కోర్సులు ఉన్నా ఇబ్బదులు ఉన్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, జనవాణి కో ఆర్డినేటర్ శ్రీ డి. వరప్రసాద్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ కొటికలపూడి గోవిందరావు, ఏలూరు ఇంఛార్జ్ శ్రీ రెడ్డి అప్పలనాయుడు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఘంటసాల వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.