ఘనంగా మొదలైన జనసేన వారాహి విజయ యాత్ర

వారాహి విజయ యాత్ర

• వారాహి రథాధీశుడై సమరనాదం చేసిన జనసేనాని
• జన సంద్రం మధ్య పరుగులు తీసిన వారాహి రథం
• ప్రతి అడుగులో శ్రీ పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం
• జయజయధ్వానాల మధ్య సాగిన శ్రీ పవన్ కళ్యాణ్ యాత్ర
• అన్నవరం నుంచి కత్తిపూడి వరకు భారీ ర్యాలీ
• సభ అనంతరం వారాహిలో ముందుకు

            నభూతో నభవిష్యత్ అనేలా జనసేన వారాహి విజయయాత్ర ఘనంగా మొదలయ్యింది. అన్నవరం శ్రీ సత్యదేవుని ఆశీస్సులు స్వీకరించిన అనంతరం బుధవారం సాయంత్రం జన సంద్రం మధ్య వారాహి రథం తొలి విజయపు అడుగులు వేసింది. వారాహి విజయ యాత్రలో పాలు పంచుకునేందుకు తరలి వచ్చిన ఆశేషజన వాహిని అన్నవరం – కత్తిపూడి మధ్య జాతీయ రహదారిని ముంచెత్తడంతో వారాహి రథాన్ని కత్తిపూడి సభా ప్రాంగణానికి ముందుగానే పంపాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనంతరం అభిమానుల జయజయ ధ్వానాల నడుము శ్రీ పవన్ కళ్యాణ్ గారు సాయం సంధ్య వేళ అన్నవరం నుంచి భారీ ర్యాలీగా కత్తిపూడికి బయలుదేరారు. కత్తిపూడి బయలుదేరేందుకు రత్నగిరి నుంచి కిందికి దిగిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అన్నవరంలో వేలాదిగా తరలివచ్చిన జన సైనికులు, వీర మహిళలు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. వారాహి రథంపై సమరశంఖం పూరించడానికి బయలుదేరిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఆడపడుచులు హారతులు పట్టి ఆహ్వానం పలుకగా.. అన్నవరం నుంచి కత్తిపూడి వరకు వందలాది బైకులు, కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. జాతీయ రహదారికి ఇరువైపులా బారులు తీరిన జనసైనికులు దారి పొడుగునా పార్టీ జెండాలు రెపరెపలాడిస్తూ స్వాగతం పలికారు.
• వారాహి విజయనాదం
          అన్నవరం నుంచి కత్తిపూడి వరకు రహదారి మొత్తం జనసేన శ్రేణులు ఏర్పాటు చేసిన భారీ కటౌట్లు, బ్యానర్లతో నిండిపోయింది. శ్రీ పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్రకు మద్దతుగా బుధవారం ఉదయం నుంచే రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో జనసేన శ్రేణులు అన్నవరం చేరుకున్నాయి. మధ్యాహ్నాన్నికే వారాహి సభా ప్రాంగణానికి వేలాదిగా జనసైనికులు తరలివచ్చారు. సభా ప్రాంగణానికి మొదట వారాహి రథం చేరుకోగానే పార్టీ శ్రేణులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. వారాహి విజయోస్తు అంటూ విజయనాధం చేశారు. సభా ప్రాంగణానికి ఏర్పాటు చేసిన ప్రాంతంలో రహదారితో పాటు చుట్టు పక్కల భవనాలను కూడా జనప్రవాహం ముంచెత్తింది.
• జనసేనానికి శుభం.. శుభం..
      వారాహి రథాన్ని అధిరోహించడానికి వచ్చిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కత్తిపూడి సభా ప్రాంగణం వద్ద సంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. పార్టీ అధినేత రాకకు సూచకంగా పెద్ద ఎత్తున బాణసంచా పేల్చారు. కత్తిపూడి పై వంతెన నుంచి అభిమానులు కురిపించిన పూల వర్షంలో తడిసి ముద్దయ్యారు. మధ్యాహ్నం నుంచే వేదిక వద్ద మోత మోగించిన కేరళా డప్పు, నృత్య కళాకారులు జనసేనానిని ఆహ్వానించారు. అనంతరం అచ్చ తెలుగు సంప్రదాయంలో మంగళవాద్యాల నడుమ సుమారు 50 మంది ఆడపడుచులు గుమ్మడి కాయలతో హారతులు పట్టి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి దిష్టి తీసి వారాహి వైపు దారి చూపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కదిలిన జనసేనానికి శుభం కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఆడపడుచుల ఆత్మీయ స్వాగతాన్ని స్వీకరించిన ఆయన వేలాది మంది జనసైనికుల కేరింతల మధ్య వారాహి రథాన్ని అధిరోహించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారితో పాటు పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు సభా ప్రాంగణానికి తరలివచ్చారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నేతలతోపాటు రాష్ట్రం నలుమూలల నుంచి వివిధ జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, నియోజవకర్గాల ఇంఛార్జులు, రాష్ట్ర, జిల్లాల కార్యవర్గ సభ్యులు తరలి వచ్చి జనసేన వారాహి విజయయాత్ర తొలి అడుగు ఘనంగా వేసేలా తమ వంతు కృషి చేశారు.

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్