ప్రజల ఆస్తులు లాక్కోవడానికి జగన్ పన్నాగం

జగన్

• కుటిల ఆలోచనలతో కొత్త విధానాలను తీసుకొస్తున్నాడు
• ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టిన వ్యక్తికి ప్రజల ఆస్తులు లాక్కోవడం పెద్ద విషయం కాదు
• ప్రజలు లోతుగా ఆలోచించి వచ్చే ఎన్నికల్లో జగన్ కు బుద్ధి చెప్పాలి
• వ్యక్తిగత విషయాలపై నిత్యం మాట్లాడే మూర్ఖుడు జగన్
• నవరత్నాల అమలు అనేది బూటకపు ప్రచారం మాత్రమే
• వైసీపీ… పందికొక్కుల గుంపు
• సంక్షేమంతో కూడిన అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వ పాలన
• భీమవరం ప్రజలను గుండెల్లో పెట్టుకుంటాను
• భీమవరం వారాహి విజయభేరి సభలో శ్రీ పవన్ కళ్యాణ్
‘జగన్ మెల్లగా ప్రజల ఆస్తులను లాక్కోవడానికి ప్లాన్ చేశాడు. ప్రజల ఆస్తి పత్రాలు జగన్ చేతిలో ఉండేలా స్కెచ్ వేశాడు. ప్రజలందరి ఆస్తి పత్రాలను ఇప్పటికే డిజిటలైజ్ చేశాడు. జగన్ తోపాటు అతడి అనుచరులు వాటిని ఆక్రమించడానికి, కొల్లగొట్టడానికి ప్రణాళికలు అమలు చేస్తున్నాడు. మొదట మన ఆస్తి పత్రాలు, పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మ వేసుకున్నాడు. తర్వాత సర్వే రాళ్లపైనా బొమ్మలు వేసుకొని మురిసిపోయాడు. ఇప్పుడు కొత్తగా తీసుకొస్తున్న చట్టాలను ఉపయోగించుకొని డిజిటలైజేషన్ పేరుతో ప్రజల ఆస్తిలో పాగా వేయడానికి కుట్రలు చేస్తున్నాడ’ని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వెల్లడించారు. ప్రభుత్వ భవనాలు, ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకున్న జగన్ కు ప్రజల ఆస్తులను బలవంతంగా లాక్కోవడం పెద్ద లెక్క కాదనే విషయాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు. జగన్ ను అతడి బృందాన్ని ఈ ఎన్నికల్లో తన్ని తగలేయకపోతే, చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ప్రజల పరిస్థితి అయిపోతుందని, తర్వాత మనల్ని ఎవరూ రక్షించలేరని హెచ్చరించారు. భీమవరంలో ఆదివారం నిర్వహించిన వారాహి విజయ భేరీ సభలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “నిజ జీవితంలో పవన్ కళ్యాణ్ దేశం, సమాజం కోసం చచ్చిపోవడానికి సిద్దమైన వ్యక్తి. రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్న రోజు నుంచి ఇప్పటి వరకు ఈ రోజు బతికితే చాలు అనుకునే బయటకు వస్తాను. ఇది హీరోయిజం కోసమో, మన్ననలు కోసమో చెప్పడం లేదు. ప్రజలందరి భవిష్యత్తు బాగుండాలంటే, అన్యాయం చేసే పాలకులపై ప్రాణాలకు తెగించే వ్యక్తి ఒకరు కావాలి. అది పవన్ కళ్యాణ్ అవుతాడు. గ్రంధి శ్రీనివాస్… నీ బాస్ జగన్ కు చెప్పు. నీ దగ్గర ఉన్న గంజాయి, బ్లేడ్ బ్యాచ్ సైన్యంతో వస్తారో, లేదా పులివెందుల బాంబులు విసిరే ఫ్యాక్షన్ వ్యక్తులతో వస్తారో రండి. నేను ఒక్కడినే వస్తా. మీరు చెప్పిన ప్రాంతానికి వస్తా. యుద్ధం అంటే యుద్ధం చేద్దాం రండి. మీలాంటి ప్రజాస్వామ్య ద్రోహులను నేను క్షమించను. మీ దాష్టీకాలను ఉపేక్షించను. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తే ఎవరినైనా కాళ్లు, కీళ్లు విరిచేయడానికి సిద్ధంగా ఉంటాను.
• జగన్… నువ్వో మూర్ఖుడివి
ప్రజలందరికీ ఏదో మేలు చేస్తాడని 151 మంది ఎమ్మెల్యేలు, 30 మంది ఎంపీలను జనం జగన్ కు ఇస్తే ఏం మాట్లాడాలో కూడా తెలియకుండా అదుపు తప్పి మాట్లాడుతున్నాడు. నేను జగన్ తోపాటు అతడి కుటుంబ సభ్యులను ప్రశ్నిస్తున్నాను. నేను ఎప్పుడైనా మీ ఇంట్లో వారి గురించి తప్పుగా మాట్లాడానా..? మీ ఇంట్లోని ఆడపడుచుల గురించి మాట్లాడానా..? మీరు మాత్రం మా ఇంట్లో వారి గురించి ఏమైనా మాట్లాడవచ్చా..? నోరు ఎలా ఉంది జగన్..? మీ సతీమణి భారతి గారిని పెళ్లాం అంటే నీకు ఫర్వాలేదా..? నీకు బాధ కలగదా..? నువ్వు మాత్రం మా వ్యక్తిగత జీవితాలపై నోటికి ఏది వస్తే అది మాట్లాడతావు. నోటికి ఏ మాటొస్తే ఆ మాట వాడతావు. అసలు నీకు బుద్ధుందా..? నీవు ముఖ్యమంత్రివేనా..? ఎవరి వ్యక్తిగత జీవితంలో బాధలు, వెతలు ఉండవు. అందరి జీవితాలు సాఫీగా సాగిపోతాయా..! మా వ్యక్తిగత జీవితాల్లో సమస్యలు వస్తే అది రాజకీయానికి సంబంధం ఏంటి? నా నుంచి విడిపోయిన ఆడపడుచులను కూడా నువ్వు వదలకుండా తిడుతున్నావు. ముగ్గురు పెళ్లాలనే మూర్ఖుడివి.. దిగజారి మాట్లాడే మూర్ఖుడివి. జగన్ ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నీకు భయపడటానికి నేను రాజకీయాల్లోకి రాలేదు. ప్రజలు కూడా జగన్ వాడుతున్న భాషపై ఆలోచించాలి. ఇలాంటి వారిని వదిలేస్తే తర్వాత ప్రజలను కూడా వదలడు. శ్రీమతి నారా భువనేశ్వరి గారిని, సొంత చెల్లెళ్లు శ్రీమతి షర్మిళ గారిని, డా.సునీత గారినే వదలకుండా ఇష్టానుసారం తిట్టించిన వ్యక్తి. రేపు జగన్ తోపాటు అతడి రౌడీ బ్యాచ్ కూడా మన ఇళ్ల మీద పడి ఇష్టానుసారం మాట్లాడితే, మన ఇంట్లో వారిపై దాడులు చేస్తే ఏమవుతుందో ఆలోచించండి. నాయకుడిని బట్టే కార్యకర్తలు తయారు అవుతారు. జగన్ ను చూసి అతడి కార్యకర్తలు కూడా మన ఇంట్లోని వారిని దుర్భాషలాడితే మనం తట్టుకోగలమా..? ఏమైనా చేస్తే ఏంటి పరిస్థితి..? అనేది ఆలోచించండి.
• భీమవరం బాధ్యత నాది
జగన్ మాట్లాడితే నేను భీమవరం నుంచి పారిపోయానని ప్రచారం చేస్తున్నాడు. రాబోయే ఎన్నికల్లో ఎవరు ఉంటారో ఎవరు పారిపోతారో చూపిస్తాను. ఎందరో మహనీయులు పుట్టిన భీమవరం నేలను గ్రంధి శ్రీనివాస్ అనే రౌడీ ఎమ్మెల్యే ఏలుతున్నాడు. నేను భీమవరం నుంచి పారిపోలేదు. భీమవరాన్ని మరింత బలోపేతం చేయడానికి ఉన్నాను. బలమైన నాయకుడు శ్రీ అంజిబాబు గారికి అండగా నిలిచి, భీమవరంలో ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించే బాధ్యతను తీసుకొంటాను. ఇక్కడే ఇల్లు కట్టుకొని, అవసరం అయితే అంజిబాబు గారితోపాటు భీమవరం వాసుల సమస్యలు తీర్చే బాధ్యత తీసుకుంటాను. భీమవరం అనే అద్భుతమైన నగరానికి కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు లేకుండా చేసిన వ్యక్తి గ్రంధి శ్రీనివాస్. నీకు రోజులు దగ్గర పడ్డాయి. నీ రౌడీయిజం ఎక్కువ అయింది. గ్రంధి శ్రీనివాస్ చేస్తున్న ఆగడాలు, అనుచరులు చేస్తున్న పనులు ప్రజలకు నచ్చడం లేదు. వచ్చే ఎన్నికల్లో గ్రంధి శ్రీనుకి డిపాజిట్లు రాకుండా చేయడమే మనందరి లక్ష్యంగా పనిచేద్దాం. వైసిపి.. ఓ పందికొక్కుల గుంపు. వాటిని లాగి పడేయాలి.
• సంక్షేమంతో కూడిన అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యం
సంక్షేమంతో పాటు అభివృద్ధి లక్ష్యంగా కూటమి పని చేస్తుంది. ఎన్నికల్లో ప్రతి వాగ్దానాన్ని, హామీని అమలు అయ్యేలా చూస్తాం. హామీలకు జవాబుదారీగా పనిచేస్తాం. నదుల అనుసంధానం ప్రక్రియకు శ్రీకారం చుట్టి, రాష్ట్రంలోని ప్రతి చేనుకూ నీరు అందేలా చూస్తాం. రాష్ట్రాన్ని మళ్లీ కళకళలాడే అన్నపూర్ణలా తయారు చేస్తాం. సముద్రంలోకి వృధాగా పోయే ప్రతి నీటి బొట్టు వాడుకుంటాం. పోలవరం తక్కువ సమయంలో పూర్తి చేస్తాం. యువతకు నైపుణ్యం కల్పించి ప్రతి చేతికి పని ఉండేలా చూస్తాం. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ అందిస్తాం. అన్నా క్యాంటీన్లతోపాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్లను తీసుకొస్తాం. జగన్ లా నేను మూడో తరం రాజకీయ నాయకుడ్ని కాదు.. మొదటితరం నాయకుడిని. జగన్ మాదిరి వేల కోట్లు ఉన్న జీవితం నాది కాదు. సగటు మధ్య తరగతి మనుషుల ఆలోచనలున్న వాడిని. కచ్చితంగా సగటు మనుషుల వేదనలు మనసుతో విని వాటిని పరిష్కరిస్తాను. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే భీమవరం డంపింగ్ యార్డు సమస్యను మొదట తీరుస్తాం. చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా దాన్ని శుద్ధి చేసేలా చూస్తాం. అలాగే నియోజకవర్గంలో అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జిలు, రింగు రోడ్డు, సాగునీటి కాలువలకు మరమ్మతులు, రోడ్లు నిర్మాణం చేసే బాధ్యత తీసుకుంటాం. వీరవాసరం తాగునీటి కష్టాలు అలాగే ఉండిపోయాయి. 3 వేల టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు ఇవ్వలేదు. ఆక్వా యూనివర్సిటీ ఊసే లేదు. నిరుద్యోగ యువతను మోసం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీల నుంచి పారిపోయిన వ్యక్తి జగన్. భీమవరం అభివృద్ధికి పూర్తిస్థాయిలో కట్టుబడి పనిచేస్తానని హామి ఇస్తున్నాను.
• నవరత్నాల అమలు… ఓ అబద్ధపు ప్రచారం
జగన్ మాట్లాడితే నవరత్నాలను పూర్తిస్థాయిలో అమలు చేశామని గ్లోబెల్ ప్రచారం చేసుకుంటున్నాడు. జగన్ చెప్పినవన్నీ చేస్తే ప్రజల నుంచి ఇంతటి తిరుగుబాటు ఎందుకు వస్తుంది..? ఏం చేయకుండానే ప్రచారం చేసుకొని పాలన సాగించడం మొదటి నుంచి అలవాటుగా చేసుకున్నాడు. పింఛన్ల తొలగింపులు దారుణంగా చేశాడు. ఎన్నికల ముందు రూ.3 వేలకు పింఛను పెంచి, మంచి చేశానని చెబుతున్నాడు. మధ్యలో పెంచాల్సిన పింఛను మీద మాట్లాడడు. డ్వాక్రా మహిళలకు ఇచ్చే రూ.5 లక్షల సున్నా వడ్డీ రుణాన్ని జగన్ రూ.3 లక్షలకు కుదించాడు. డిఫాల్డ్ కాని డ్వాక్రా సంఘాలను కూడా రుణాలు ఇవ్వకుండా రకరకాలుగా నలిపేస్తున్నాడు. ఓటీఎస్ పేరుతో బలవంతపు వసూళ్లు చేశాడు. ఆరోగ్య మిత్ర, కళ్యాణమిత్రలను తీసేశారు. మహిళలకు ఉన్నతి పథకం తీసేశారు. కొత్త లోను ఇవ్వలేదు. కేంద్రం అమలు చేస్తున్న దీన్ దయాల్ విద్యాయోజన కింద ప్రతి విద్యార్థికి రూ.30 వేల నుంచి రూ.40 వేలు ఖర్చు చేస్తోంది. ఆ నిధులు ఏమయ్యాయో తెలీదు. యువతకు చెందిన నైపుణ్యాభివృద్ది నిధులను సజ్జలకు, అతడి సలహాదారులకు జీతాలుగా చెల్లిస్తున్నాడు.
• యువతలో నైపుణ్యాలు వెలికి తీస్తాం
కూటమి ప్రభుత్వం యువతను నైపుణ్యవంతులుగా తయారు చేసి, వారికి దారి చూపించే బాధ్యతను తీసుకుంటుంది. యువతకు ఏం కావాలో.. వారిలో ఉన్న నైపుణ్యం ఏంటో తెలుసుకుంటాం. ఎన్నో ఉన్నత ఆలోచనలున్న యువశక్తిని రూ.5 వేలకు కట్టిపడేసేలా పాలన ఉండదు. కూటమి ప్రభుత్వం ఇంటికి పెద్దన్నలా పని చేస్తుంది. నాకు నెల రోజులుగా నిత్యం వైరల్ జ్వరం వస్తూనే ఉంది. అయినా బలంగా నిలబడే ఉన్నాను. ఎందుకంటే కచ్చితంగా ప్రజల కోసం నిలబడాల్సిన సమయం ఇది. జగన్ లాంటి ఫాక్షన్ నాయకుడ్ని తన్ని తగలేయడానికి నాలాంటి విప్లవ భావాలున్న వ్యక్తి కావాలి. సమాజానికి స్వేచ్ఛ కోసం నిజాయతీగా పోరాడుతాను. జగన్ నువ్వు రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కితే నిన్ను జనం కాళ్లతో తొక్కుతారు. కొత్త కూటమి ప్రభుత్వంలో ఏ పథకాన్ని తీసేయం. యువతకు ఉద్యోగాలు, మహిళలకు భద్రత కల్పిస్తాం. అసెంబ్లీలో సీపీఎస్ పై చర్చ నేనే మొదలుపెట్టిస్తాను. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యపై పరిష్కారం చూపిస్తాం. బూతుల రాజకీయం కాకుండా బాధ్యత రాజకీయం ఆంధ్రప్రదేశ్ లో ఇక మొదలుకాబోతోంది’’ అన్నారు.

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్