సంక్షేమ పథకాలకు జగన్ తాత డబ్బులు ఇవ్వడం లేదు

జగన్

• జగన్ పంచుతున్నది ప్రజల డబ్బు, పన్నుల డబ్బు
• అప్పులు తెచ్చి.. అబద్దాలు ఆడుతూ ప్రచారం చేశాడు
• కూటమి ప్రభుత్వంలో సంపద సృష్టితో అద్భుత సంక్షేమం
• కులాలు, మతాల మధ్య గొడవలు పెట్టి ఆనందించే వ్యక్తి జగన్
• ఆఖరికి సొంత చెల్లి కట్టుకున్న చీర రంగు గురించీ దిగజారి మాట్లాడుతున్నాడు
• ఇలాంటి వ్యక్తి మన ఇంట్లోని వారికి ఎలా రక్షణ కల్పిస్తాడు?
• గులకరాయి నిందితులు దొరికినప్పుడు, అంతర్వేథి రథం నిందితులు ఎందుకు దొరకలేదు?
• రైతాంగం సమస్యలు తీర్చేలా కూటమి పాలన
• 30వ తేదీన విడుదల చేసే కూటమి మేనిఫెస్టోలో అన్ని వర్గాలకు న్యాయం
• రాజోలు నియోజకవర్గం మలికిపురం వారాహి విజయభేరి సభలో శ్రీ పవన్ కళ్యాణ్

        ‘కూటమి ప్రభుత్వం వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. ఇప్పటి కంటే మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం. జగన్ ఇప్పుడేమీ సొంత ఆస్తులు ప్రజలకు ఇవ్వడం లేదు. జగన్ తాతలు సంపాదించిన ఆస్తులు ప్రజలకు పెట్టడం లేదు. రాష్ట్రంలో సంపద సృష్టించకుండా, మన మీద అప్పులు చేసి పాలన సాగిస్తూ ఘన కార్యం చేస్తున్నట్లు చెబుతున్నాడ’ని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఆపదలో ఉన్నవారికి సహాయం చేయాలన్నా కచ్చితంగా సంపద సృష్టి ఉండాలని తెలిపారు. సంపద సృష్టించే బాధ్యత ప్రభుత్వానిది.. పాలకులది, దీన్ని మరిచి అప్పులు చేసి, సంక్షేమం అంటూ జగన్ ఊదరగొట్టడం ఆపాలని చెప్పారు. జగన్ పంచే డబ్బు ప్రజల డబ్బు.. ప్రజలు పన్నులు కడుతున్న డబ్బు.. కూటమి ప్రభుత్వంలో ఏ సంక్షేమ పథకం ఆగిపోదని భరోసా ఇచ్చారు. శుక్రవారం రాజోలులో నిర్వహించిన వారాహి విజయభేరీ యాత్ర సభలో కూటమి అమలాపురం ఎంపీ అభ్యర్థి శ్రీ హరీష్ మాధుర్, రాజోలు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ దేవ వరప్రసాద్ లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ… “యువతకు డీఎస్సీ నోటిఫికేషన్ లేదు. ఉపాధి లేదు. ఏమైనా అంటే సంక్షేమం అంటూ, బటన్ నొక్కానని కాలక్షేపం చేస్తూ రాష్ట్ర భవిష్యత్తును జగన్ నాశనం చేశాడు. వైఎస్ జగన్ పాలనలో ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నిస్తే వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు అడ్డగోలుగా నమోదు చేశారు. అమరావతి రాజధాని కావాలని మాట్లాడిన ఎస్సీల మీదనే ఏకంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిన చరిత్ర ఈ ప్రభుత్వానిది. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. గొంది గ్రామంలో మంచి నీటి చెరువు పక్కన రొయ్యల చెరువు తవ్వకాన్ని అడ్డుకుంటే యువతపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారు. తాటిపాక గ్రామంలో కొన్ని గొడవలు జరిగితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వేధించారు. అకారణంగా, అన్యాయంగా చట్టాన్ని వాడుకుని కేసులు పెట్టడం అన్యాయం, అక్రమం. రాజ్యాంగం అందరికి తగిన రక్షణ కల్పించింది. దాన్ని ఉల్లంఘించే హక్కు ఎవరికీ లేదు. జగన్ పాలనలో మాత్రం రాజ్యాంగ విరుద్ధమైన, విధ్వంసకరమైన పాలన సాగింది.
• సొంత చెల్లినీ, తల్లినీ వదలని దిగజారుడు వ్యక్తి జగన్
          సొంత చెల్లి శ్రీమతి షర్మిల గారు ఏ రంగు చీర కట్టుకున్నారో మాట్లాడే నీచమైన దిగజారుడు స్థితికి జగన్ వచ్చాడు. ఆమె వేసుకున్న వస్త్రాలపై బహిరంగ సభల్లో మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. ఏ రంగుల చీర కట్టుకోవాలో చెబుతున్నాడు. వివేకానంద రెడ్డి గారి హత్య గురించి అడిగితే సొంత చెల్లిని తిట్టిస్తున్నాడు. ఆమె వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నాడు. ఇలాంటి వ్యక్తి రేపు మన ఇంట్లోని మహిళలకు ఎలా రక్షణ కల్పిస్తాడు. వైసీపీ మళ్లీ వస్తే రాష్ట్రంలో మహిళలకు భద్రత ఉండదు. రైతులకు బతుకు ఉండదు. మహిళల అదృశ్యం మీద మాట్లాడని వ్యక్తి, మహిళల మీద అఘాయిత్యాలు జరిగినా మాట్లాడని వ్యక్తి మహిళలకు ఏం రక్షణ కల్పిస్తాడో ఆలోచించాలి.
• కోనసీమ గొడవల్లో ఎ1 నిందితుడు మంత్రి వెనుక తిరుగుతున్నాడు
         ఎప్పుడో మంచి చేసిన బ్రిటీష్ అధికారి, శ్వేత జాతీయుడు సర్ అర్థర్ కాటన్ నే గుండెల్లో పెట్టుకుంటాం. అలాంటిది దేశం కోసం, జాతి కోసం తుది వరకు ఆలోచించిన గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును జిల్లాకు పెట్టొద్దని ఎందుకు గొడవలు చేస్తాం. వైసీపీ నాయకుడి ఆలోచనలు మొదటి నుంచి కులాల మధ్య, మతాల మధ్య గొడవలు పెడితే పాలన గురించి ప్రజలు పట్టించుకోరు. ఏం చేసినా చెల్లుతుంది అనేలా ఉన్నాయి. దీంతో కోనసీమ గొడవల్లో రెండు సామాజిక వర్గాలకు గొడవలు పెట్టడానికి పన్నాగం పన్నారు. అమలాపురం వేదికగా కుల గొడవలు పెట్టాలని వైసీపీ ప్రయత్నించింది. పెద్ద విధ్వంసం చేయాలని పన్నాగం పన్నారు. కోనసీమ గొడవల్లోని ఏ1 నిందితుడు సాయి అనే వ్యక్తి నేడు వైసీపీ మంత్రి విశ్వరూప్ వెనుక ఎన్నికల ప్రచారంలో ఉన్నాడు. అంటే వాళ్లే గొడవలు సృష్టించి, మనలో అలజడి రేపాలని చూశారు. సమాజాన్ని విచ్ఛిన్నం చేసే వారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాల్సిందే.
• వ్యక్తిగత గొడవలు కులానికి ఆపాదించొద్దు
            వ్యక్తిగతంగా కొందరు వ్యక్తులు గొడవ పడితే ఆ మొత్తం గొడవను రెండు కులాల మధ్య గొడవలుగా చేయడం సరికాదు. రామచంద్రపురం నియోజకవర్గంలో గతంలో తోట త్రిమూర్తులుకు, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ కు పడేది కాదు. అలాగే విజయవాడలో గతంలో శ్రీ వంగవీటి రంగా గారికి, నెహ్రూ గారికి పడేది కాదు. ఇలాంటి వ్యక్తిగత గొడవలన్నీ కులాల మధ్యకు తీసుకొస్తే సమాజం విచ్ఛిన్నమవుతుంది. వారికి ఉన్న వ్యక్తిగత విషయాలు ప్రజలందరి సమస్య ఎలా అవుతుంది. కులాల మధ్య విచ్ఛిన్నత వస్తే సమాజం ముందుకు నడవడం కష్టమవుతుంది. మనుషులుగా పుట్టింది ఒకరికి ఒకరు సాయం చేసుకుంటూ ముందుకు నడవడానికి మాత్రమే. కులాల మధ్య చిచ్చులాటలతో గొడవలు పడటానికి మాత్రం కాదు. మనుషుల మధ్య పరస్పర సహకారం అవసరం.
• జగన్ పట్టుకోవాలనుకుంటే నిమిషాల్లో నిందితులను పట్టుకోగలడు
       జగన్ కు చిన్న గులకరాయి తగిలితే నిందితులను పట్టకోగలిగారు. ఆఘమేఘాల మీద గుర్తించారు. అలాంటిది ఎంతో ప్రాశస్త్యం ఉన్న అంతర్వేది రథం తగులబెట్టిన వారిని ఇప్పటి వరకు ప్రభుత్వం పట్టుకోలేకపోయింది. కొన్ని రోజులు ఎవరో పిచ్చోడు తగులబెట్టాడు అన్నారు.. కొన్నిరోజులు తేనెపట్టు కోసం కొట్టారని చెప్పారు. బాధ్యత గల ప్రజా ప్రతినిధులు దీన్ని మరుగునపెట్టేలా ప్రయత్నించారు. జగన్ గులకరాయి నిందితుడిని వెంటనే పట్టుకున్న యంత్రాంగం.. అంతర్వేది రథం దగ్ధం విషయంలో ఎవరినీ ఎందుకు గుర్తించలేదు. అంటే జగన్ పట్టుకోవాలంటే పట్టుకోగలడు. కాని అతడు మత, కుల గొడవలు పెట్టి ఆనందించాలి కాబట్టి పట్టుకోరు. మనలో మన మధ్య గొడవలు పెట్టే దుష్ట పరిపాలన ఆగాలి. జగన్ వెళ్లిపోయే సమయం అయింది. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా ప్రభుత్వం మారుతోందని ప్రజలు స్వచ్ఛందంగా చెబుతున్నారు.
• రైతు సమస్యలను ఏడాదిలోగా తీరుస్తాం
         చాలామంది బయట నుంచి చూసేవారు పచ్చని కోనసీమకు లోటేముంది అనుకుంటారు. పక్కనే గోదారి పారుతోంది కాని పుష్కలంగా మంచి నీళ్లు దొరకడం లేదు. రైతాంగం క్రాప్ హలీ డే పరిస్థితి వచ్చింది. అందరికీ పట్టెడన్నం పెట్టే అన్నపూర్ణకు కష్టకాలం నన్ను కదిలించింది. అన్నం పెట్టే రైతాంగానికి కూటమి ప్రభుత్వం బలంగా నిలబడుతుంది. 2022లో కోనసీమలో రైతులు పంట విరామం ప్రకటించారు. 13 మండలాల్లో క్రాప్ హాలీ డే ప్రకటించారు. సాగు పెట్టుబడులు పెరిగి, గిట్టుబాటు ధర రాక ఎకరాకు రూ.25 వేలు నష్టం వస్తోందని, అదే కౌలు రైతుకు రూ.45 వేల నష్టం వస్తోందని వారు పంట విరామం చేశారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న రైతు భరోసా కేంద్రాలు పనిచేయడం లేదు. కౌలు గుర్తింపు కార్డులు లేవు. కాలువల్లో పూడిక తీతలు లేవు. ఏటిగట్ల పటిష్టికరణ లేదు. ధాన్యం రంగు మారితే తీసుకోవడం లేదు. కాలువ గట్ల మీద చెత్త పోస్తున్నారు. దీంతో నది కలుషితం అవుతోంది. కాలువలు పూడిక తీయక మురుగునీరు అంతా పంటల మీదకు వస్తోంది. దీంతో అన్ని విధాలా రైతులు నష్టపోతున్నారు. ఓ రైతుగా రైతు కష్టం నాకు తెలుసు. కూటమి ప్రభుత్వం రాగానే సంవత్సరంలోగా రైతులకు కావాల్సిన పనులు చేస్తాం. వారికి సాగును లాభదాయకంగా చేసే బాధ్యత తీసుకుంటాం. గతంలో చక్కగా పనిచేసిన నీటి తీరువా సంఘాలను జగన్ చంపేశాడు. కూటమి ప్రభుత్వంలో వాటిని పునరుద్ధరిస్తాం. వాటికి ఎన్నికలు పెడతాం. పూడికలు, కాలువ మరమ్మతులు చేసేవారు. ఆయా కాలానికి తగినట్లుగా సాగునీటి సంరక్షణ ఎలా చేయాలనేది చర్చించి, నిర్ణయం తీసుకునేవారు. ఆ వ్యవస్థను చంపేసి ఇష్టానుసారం జగన్ నిర్ణయాలు తీసుకున్నాడు. ధవళేశ్వరం అంతర్వేది కాలువలో డ్రైనేజీ కలవడం వల్ల పంటలు చచ్చిపోయే పరిస్థితి. పంటలకు తగిన మద్దతు ధర పెంచే బాధ్యత తీసుకుంటాం. వైసీపీ ప్రభుత్వంలో పండించిన పంటకు డబ్బులు ఎప్పుడిస్తారో తెలియడం లేదు. కూటమి ప్రభుత్వం రాగానే సకాలంలో రైతులకు సొమ్ము అందించేలా బాధ్యత తీసుకుంటాం. రైతు సమ్మె చేస్తే కనీసం ప్రజాప్రతినిధులు రాలేదు. ప్రభుత్వం పట్టించుకోలేదు. రైతులకు రుణాలిచ్చే కో ఆపరేటివ్ సెక్టార్ ను వైసీపీ భ్రష్టు పట్టించింది. రైతాంగానికి సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి ఆగ్రో సంస్థకు ఛైర్మన్ ను చేశారు. రైతు బిడ్డగా నేను మాట ఇస్తున్నాను. మీకు అందుబాటులో ఉంటూ ప్రతి సమస్యకు క్షేత్రస్థాయి పరిశీలన చేసి, పరిష్కరించేలా చూస్తాను.
• కోనసీమను కొంగుబంగారంగా తీర్చిదిద్దుతాం
         కోనసీమ సమస్యలను పరిశీలించే సమయం ఇవ్వండి. మీ ఇంట్లోవాడిగా రాజకీయాల్లోకి వచ్చాను. మోరి, మోరిపాడు గ్రామాల నుంచి జీడిపిక్కల కుటీర పరిశ్రమ గుర్తించి వసతులు కల్పిస్తాం. వశిష్ట వారధి కోనసీమ వాసుల 40 ఏళ్ల నాటి కల. కోనసీమలో రైలు కూత వినిపించాలి. కోటిపల్లి, నరసాపురం రైలు లైను పూర్తయ్యేలా చూస్తాం. కోటిపల్లి – నరసాపురం రైల్వే లైనులో పచ్చటి కొబ్బరి చెట్ల మధ్య నుంచి రైలు వెళ్తుంటే కేరళ, రాజస్థాన్ తరహాలో పర్యాటకం అభివృద్ధి అవుతుంది. అంతర్వేదిలో మత్స్యకారులకు ఫిషింగ్ హార్బర్ వచ్చేలా కృషి చేస్తాం. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఇండియా రీజినల్ కార్యాలయం ఇక్కడే నెలకొల్పేలా యువతకు ఉపాధి మెరుగయ్యేలా చూస్తాం. ఆధ్యాత్మిక క్షేత్రాల టూరిజం డవలప్ చేస్తాం. లాభాలు లేకుండా లంచాలు లేకుండా పనిచేసే ప్రభుత్వం తెస్తాం. గల్ఫ్ దేశాలకు వెళ్లే వారు రాజోలులో ఎక్కువ. వారు ఏజెంట్ల చేతిలో మోసాలకు గురి కాకుండా వారికి ప్రత్యేకంగా ఓ సహాయక కేంద్రం తీసుకొస్తాం. గల్ఫ్ వెళ్లేవారికి ఎలాంటి నైపుణ్యం నేర్చుకుంటే మంచి ఉపాధి దొరుకుతుందో గుర్తించి వారికి తగిన విధంగా నైపుణ్యవంతులుగా తయారు చేస్తాం. కోనసీమలో సినిమా స్టూడియోలు అభివృద్ధి కావాలి. గోదావరి తీరాన్ని అభివృద్ధి చేస్తే సినిమాలు చేసుకోవడానికి చాలామంది వస్తారు. దీంతో ఇక్కడ ఉపాధి పెరుగుతుంది షూటింగ్ అవసరాలకు అనువుగా తీర్చిదిద్దుతాం. అంతర్వేది దేవస్థానం భూములు అన్యాక్రాంతం అవుతున్నా యి. దేవుడి మాన్యాలు ఎవరు ముట్టుకున్నా వారి తలలు ఎగిరిపోతాయి. రాజోలును స్మార్ట్ సిటీ చేస్తామని ఓఎన్జీసీ, గెయిల్ చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదు. దీనిపై మేం బాధ్యత తీసుకుంటాం. ఓఎన్టీజీసీ, గెయిల్ పైపులైన్లు లీకులను ఎప్పటికప్పుడు పరిశీలన చేసి ప్రజల ఆరోగ్యానికి నష్టం కలగకుండా చూస్తాను. అవసరం అయితే నేను ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలతో మాట్లాడుతాను. లీకులు ఎక్కడున్నాయో పరిశీలన చేసి, దానికి ఓ పరిష్కారం చూపించే బాధ్యత తీసుకుంటాను. ఆయిల్ కాలుష్యాన్ని తగ్గించే బాధ్యత, ఆరోగ్యం కాపాడే బాధ్యత మేం తీసుకుంటాం.
• వైసీపీ పెట్టే ఉప్మాలకు, కాఫీలకు ఆశపడకండి
          జగన్ ప్రజల సొంత ఆస్తులను దోచుకోవడానికి ప్లాన్ వేశాడు. మన సొంత పట్టా పాస్ పుస్తకాల మీద ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉండాలి కానీ ఈయన చిత్రం వేసుకున్నాడు. డిజిటలైజ్ పేరుతో చాలా అక్రమాలు జరుగుతాయి. ఎవరి ఆస్తి ఎవరి పేరు మీద ఉంటుందో తెలియని పరిస్థితి ఉంటుంది. వైసీపీకి ఓటేస్తే మన నాశనం మనం కొనితెచ్చుకున్నట్లే. మన మీద మనం పెట్రోలు పోసుకొని తగులబెట్టుకున్నట్లే. 30వ తేదీన కూటమి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేస్తాం. అన్ని వర్గాలకు, అన్ని రంగాలకు ఊతమిచ్చేలా మేనిఫెస్టో ఉంటుంది. మేనిఫెస్టో హామీలన్నీ పూర్తిగా అమలు అయ్యేలా నేను బాధ్యత తీసుకుంటాను. మన సొంత ఆస్తి పత్రాల మీద ఆయన చిత్రాలు వేసుకున్నాడు అంటే.. వాళ్లు పెట్టేవాళ్లు.. మనం వాళ్ల కింద అడుక్కునే వాళ్లు అనే నియంత తరహా ఆలోచన జగన్ ది. రాష్ట్రం గురించి ఆలోచించి ముందుకు రండి.. వైసీపీ వాళ్లు పెట్టే ఉప్మాకో, కాఫీకో అమ్ముడయ్యే వాళ్లు కొందరు ఉంటారు. వాళ్లలాగే మనం అమ్ముడుపోవద్దు. ప్రజలకు అభయం ఇచ్చే నాయకత్వం వస్తే, ప్రజలు బలంగా నిలబడటానికి ముందుంటారు. భీమ్లానాయక్ సినిమాకు జగన్ చాలా అవాంతరాలు సృష్టించాడు. ఈయనను బతిమిలాడితే, తలవంచితే అప్పుడు రిలీజ్ చేయడానికి సిద్ధపడ్డాడు. అన్నా జగనన్న అని నేను అంటానని అనుకున్నాడు. కాని నేను ఆత్మగౌరవంతో బతికేవాడిని. ఆత్మగౌరవం తగ్గితే తల తెంచుకునేవాడిని కాబట్టే బలంగా నిలబడ్డాను.
• రాపాక ఇల్లు తప్ప రాజోలుకు ఒరిగిందేమీ లేదు
          40 మంది ఎర్రచందనం స్మగ్లర్లను పిఠాపురంలో దింపారని తెలుస్తోంది. మిథున్ రెడ్డి కొందరితో మాట్లాడుతూ పుంగనూరు నియోజకవర్గంలో ఎవరు వేలు పెట్టినా ఊరుకోం అంటున్నాడు. వీళ్లు మాత్రం అన్ని చోట్ల వేలు పెట్టొచ్చు. మీరు ఓ చేయి ఎత్తితే మేం లక్ష చేతులు ఎత్తుతాం. వైసీపీ పాలనలో స్థానిక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ 5 ఎకరాల్లో ఇళ్లు కట్టుకోవడం మినహా రాజోలుకు చేసిందేమీ లేదు. సెంటు స్థలం భూములు విషయంలో 4, 5 రెట్లు ఎక్కువకు పరిహారం పొందారు. రూ.కోట్ల అవినీతి జరిగింది. నది పరివాహక ప్రాంతాల్లో ఇళ్లు ఇచ్చారు. ఇసుక బెదిరింపులు, ఇనుము కూడా ఈ ఎమ్మెల్యే బెదిరించి తీసుకున్నాడు. అంతర్వేది రథం దగ్ధం అయితే కనీసం మాట్లాడలేదు. సఖినేటిపల్లికి అగ్నిమాపక వాహనం కావాలని అడగలేకపోయాడు. మలికిపురం కళాశాల భూములపై కన్నేశాడు. రూ.500 కోట్లు విలువున్న భూములు దోచేయడానికి మెల్లగా ప్రయత్నం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రతి అవినీతిపరుడ్ని రోడ్డు మీదకు లాక్కొస్తాం. చింతలమోరిలో చెరువులు తవ్వకాలు చేస్తున్నారు. దీంతో తాగునీటి కాలుష్యం అధికం అవుతోందని తెలుస్తోంది. కనీస అవసరాలు తీర్చని దుస్థితి ఈ ప్రభుత్వంలో ఉంది. రాబోయేది కూటమి ప్రభుత్వం. ప్రజల ప్రభుత్వం. ప్రతి ఒక్కరికీ అండగా నిలిచే ప్రభుత్వాన్ని తెచ్చుకొందాం. కూటమి అభ్యర్థులకు సంపూర్ణంగా నిలబడదాం. ఎంపీగా సైకిల్ గుర్తుకు, ఎమ్మెల్యేగా గాజుగ్లాసు గుర్తుకు బలంగా ఓటేయాలి’’ అని కోరారు.

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్