తండ్రి అధికారంతో అవినీతి అందలం ఎక్కిన జగన్ రెడ్డి

జగన్ రెడ్డి

• సెటిల్మెంట్లు, పైరవీలతోనే ఎదిగారు.
• ఎస్సైని పోలీస్ స్టేషన్లోనే కొట్టిన ఆ వ్యక్తికి పోలీసులు సెల్యూట్ చేస్తున్నారు
• ఆయన చేయిస్తున్న పనులకు డీజీపీ లాంటి అధికారులు వత్తాసు పలుకుతున్నారు
• బటన్ నొక్కాను అనే సీఎం రాష్ట్ర ప్రజావసరాల బటన్ నొక్కడం మర్చిపోయారు
• పనికిమాలిన సలహాదారులను భోపాల్ పంపండి.డంపింగ్ యార్డుల నిర్వహణ గురించి తెలుసుకుంటారు
• యువతకు ఉపాధి అవకాశాలు లేవు
• పాలకులు అవినీతికి పాల్పడి, అధికారులను బలి చేస్తున్నారు
• అన్ని వర్గాలను కలుపుకొని రాజ్యాధికారం సాధిస్తాం
• జనసేన ప్రభుత్వంలో గోదావరి జిల్లాల్లో ఆధ్యాత్మిక పర్యాటక సర్క్యూట్
• అందరికీ ఆమోదయోగ్య పాలన జనసేన లక్ష్యం
• నరసాపురం బహిరంగసభలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్

              ‘హీరో ప్రభాస్ గారు బాహుబలి, ఆదిపురుష్ వంటి సినిమాలు చేస్తే ఒక రోజు షూటింగ్ కు 500 నుంచి 1000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి చూపిస్తారు. ఎందరికో పరోక్ష ఉపాధి ఉంటుంది. వచ్చిన డబ్బుకు పన్నులు కట్టి నీతిగా పదిమందికి ఉపాధి చూపి సంపాదిస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభాస్ కాదు.. ఎలన్ మస్క్ అంతకంటే కాదు. మరి ఆయనకు ఇంత సంపద ఎక్కడ నుంచి వచ్చింది..? ఎలా వచ్చింది అంటే తండ్రి సీఎం పదవిని అడ్డం పెట్టుకొని రకరకాల పైరవీలు చేసి సంపాదించిన అవినీతి సొమ్ము ఇదీ. తండ్రి అధికారం అడ్డుపెట్టుకొని బెంగళూరు, ఇడుపుల పాయల్లో పంచాయితీలు చేస్తే వచ్చిన సంపాదన అది. హ్యూమన్ రైట్స్ కార్యకర్తలు రాసిన పుస్తకంలో- ఈ ముఖ్యమంత్రి యవ్వన దశలో ఓ పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ ను కొట్టి, పోలీసు సెల్ లోనే వేసిన విషయం ప్రస్తావించారు. అలాంటి వ్యక్తికి పోలీసులు సెల్యూట్ చేస్తున్నారు. డీజీపీ లాంటి అధికారులు ఆయన చేయిస్తున్న పనులకు వత్తాసు పలుకుతున్నారు’ అని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ అన్నారు. వారాహి విజయయాత్రలో భాగంగా సోమవారం రాత్రి పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు.
             ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “ఈ ముఖ్యమంత్రి మాట్లాడితే బటన్ నొక్కాను… బటన్ నొక్కాను అని చెప్పుకుంటారు. ఈ రాష్ట్రంలో ఎన్నో ప్రజావసర బటన్లు మాత్రం నొక్కకుండా వదిలేశాడు. పూర్తి కాని పోలవరం బటన్… ప్రతి ఏడాది రాని ఉద్యోగ నోటిఫికేషన్ల బటన్ … రైతులకు అందని పంట నష్టపరిహారం బటన్.. కొబ్బరి రైతుకు దక్కని మద్దతు ధర బటన్… ఉపాధి లేక వలసలు పోతున్న బతుకులకు దారి చూపని బటన్… దేవాలయాలపై దాడులు చేసిన వారిని పట్టుకునే బటన్… పూర్తికాని వంతెనల బటన్… ఆక్వా రైతుకు యూనిట్ రూ. 1.50 ఇస్తామన్న హామీ బటన్… దళితులను చంపిన హంతకులపై కఠిన చర్యల బటన్… అభివృద్ధికి నోచుకోని ఆంధ్రప్రదేశ్… మూతపడిన 8వేల బడులు.. పూడిక తీయని కాలువలు.. ఆరోగ్యశ్రీ… తాగునీరు అందక విలవిలలాడుతున్న గ్రామాలు… అప్పుల ఆంధ్ర… ఆడబిడ్డల మానప్రాణాల సంరక్షణ… ఎన్నో బటన్లు ముఖ్యమంత్రి నొక్కడం మర్చిపోయారు. జనసేన అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిలా బటన్లు నొక్కడం ఉండదు. రాష్ట్ర అభివృద్ధి కోసం ముఠా కూలీలా పనిచేస్తాం. రెల్లి సోదరుడు చెత్తను ఊడ్చేలా రాజకీయాల్లో అవినీతిని రొచ్చును ఊడ్చి పారేస్తాం అన్నారు.
• ఆయన సొంత డబ్బేమీ పంచడం లేదు
ప్రజలంతా ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ఈ ముఖ్యమంత్రి పంచే డబ్బులు ఆయన సొంత డబ్బులు ఏమీ కాదు. మన కష్టంతో, స్వేదంతో, రక్తంతో సంపాదించిన సొమ్ముకు పన్నుల రూపేణా ప్రభుత్వానికి చెల్లిస్తున్న డబ్బు. ప్రభుత్వం తన ఓటు బ్యాంకును పెంచుకునేందుకు మన డబ్బును వాడుకుంటోంది. సమాజంలో 30 మందికి సంక్షేమం అందిస్తూ.. 70 మందికి మొండిచేయి చూపుతున్నారు. కచ్చితంగా ఆ 70 మంది దగ్గర నుంచి తిరుగుబాటు మొదలువుతుంది. మన డబ్బు మనకు పంచుతూ దానికి వారేదో సొంత డబ్బు మనకు ఇస్తున్నట్లు సవాలక్ష నీతులు చెబుతున్నారు. ఇచ్చే సంక్షేమం కూడా అర్హులకు అందకుండా, తమ వారికి మాత్రమే అందేలా చేస్తున్నారు.

             అంబేద్కర్ విగ్రహం పెడుతున్నారంటే కచ్చితంగా రాజ్యాంగ విలువలకు కట్టుబడి పాలన చేయాలి. నరసాపురం నియోజకవర్గంలోని పసలదీవి పంచాయతీను 1400 ఓట్లు సాధించి జనసేన పార్టీ గెలుచుకుంది. ఇక్కడ సర్పంచితోపాటు ఎంపీటీసీల బలం ఉంది. అక్కడ జనసేన పార్టీ వాళ్లు గెలిచారనే నెపంతో నిధులు విడుదల చేయడం లేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి డబ్బు రాకుండా చేస్తున్నారు. ఇదేనా వైసీపీ నాయకులు చూపుతున్న రాజ్యాంగ స్ఫూర్తి..? అన్ని పదవుల్లోనూ మేమే ఉండాలి. మేమే పాలించాలి.. మేమే అధికారం చెలాయించాలి అనే వైసీపీ తీరు సరికాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు అందరికీ అధికారం చెందాలన్న ఆయన ఆశయాన్ని బతికించాలని జనసేన పోరాటం చేస్తుంది. అన్ని కులాలకు సమన్యాయం జరగాలన్నదే జనసేన లక్ష్యం. నామినేటెడ్ పోస్టుల్లో ఒకే కులంతో నింపేయడం మంచి పద్ధతి కాదు.
• రైతన్న చేతి నాగలి నాగుపాము అవుతోంది
కవి శేషేంద్ర గారు చెప్పినట్లుగా నాగలి నా చేతికి నాగుపాము అవుతోంది… పొలం పనులు నా కాళ్లకు సంకెళ్లను వేస్తున్నాయి.. అన్నట్లుగా రాష్ట్రంలోని రైతుల పరిస్థితి కనిపిస్తోంది. ఉభయ గోదావరి జిల్లాలను ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా పిలిచేవారు. అయితే ఇప్పుడు పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. మద్దతు ధర రాక, ప్రతి సీజన్ లో నష్టాలు పాలై రైతులు సాగు చేయడానికి కూడా ముందుకు రాని దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వానికి ఇవేవీ కనిపించవు. వినిపించవు. ఆరుగాలం శ్రమించి రైతు పండిస్తున్న పంటలో ప్రతి బస్తాకు రూ.100లు ద్వారంపూడి కుటుంబానికి వెళ్తోంది. కష్టపడి పంట పండించేది రైతు అయితే, ఇంట్లో ఉండి వారి కష్టాన్ని మింగుతోంది మాత్రం పాలకులు. రైతుల కన్నీటితో వచ్చే డబ్బును ఏం చేసుకుంటారు..? ఇదే పరిస్థితి కొనసాగితే మొత్తం సాగు చేయడానికి కూడా ఎవరూ మిగలరు.

• పులివెందుల రౌడీ రాజకీయం ఇక్కడ చెల్లదు
రాత్రి వేళ నిద్రపోయే చెట్టును ముట్టుకుంటే అది పాపమని గోదావరి జిల్లాల్లోని ప్రజలు భావిస్తారు. ఆ సమయంలో కనీస చెట్టును పట్టుకునేందుకు కూడా సాహసించరు. అలాంటిది పచ్చటి గోదావరి జిల్లాల్లో మామిడి చెట్లను నరికే సంస్కృతిని తీసుకొచ్చారు. వీళ్లను ఎదిరించి ఎవరూ మాట్లాడకూడదు. ప్రశ్నించకూడదు. అలా ప్రశ్నిస్తే దాడులు చేస్తారు..? కేసులు పెట్టి వేధిస్తారు. పులివెందుల రౌడీ రాజకీయాలు అక్కడ పెట్టుకోండి. గోదావరి జిల్లాల్లోకి వాటిని తీసుకొస్తే తన్ని తగలేస్తాం. ఇక్కడి సంప్రదాయాలు, సంస్కృతిని పాడు చేయొద్దు. పదిమందికి అన్నం పెట్టే మనుషులే తప్ప గొడవలు చేసే వ్యక్తులెవరూ ఉండరు. ఇలాంటి ప్రాంతాన్ని కలుషితం చేయొద్దు.
యువతలో మార్పు కనిపిస్తోంది. అక్రమాలను, దౌర్జన్యాలను ప్రశ్నించేతత్వం వస్తోంది. 15 ఏళ్ల బాలుడు అమర్నాథ్ తన అక్కను వేధిస్తున్న వ్యక్తిని ప్రశ్నిస్తే పెట్రోలు పోసి తగులబెట్టేశారు. ఆడపిల్లలు అత్యాచారాలకు గురవుతుంటే వైసీపీ పాలకులు – తల్లిదండ్రుల పెంపకం బాగాలేదని మాట్లాడతారు. ఎమ్మెల్యేలు పోలీసుల్ని కొడుతున్నారు. కోనసీమలో ఓ డీఎస్పీ స్థాయి అధికారిని మంత్రి కొడుకు దాడి చేశాడు. ఇవన్నీ చూస్తే యువతలో కోపం కాక, ఆవేదన రాక ఏమొస్తుంది..? పోలీసులు పట్టించుకోరు.. న్యాయస్థానాల మాటలను అమలు చేయరు. వ్యవస్థ గాడి తప్పుతున్నపుడు, కళ్లెదుటే వ్యవస్థలన్నీ నాశనం అవుతుంటే యువతలో విప్లవ భావం రావాలి. విప్లవం అంటే ఆయుధాలు చేతపట్టడం కాదు. మన గళమే పెద్ద ఆయుధం కావాలి. మన ప్రశ్నే తూటాలా తగలాలి. మన నిరసనే వేయి ఫిరంగుల మోత మోగేలా వినిపించాలి.
• అవినీతి పరులు అందలం ఎక్కితే బాధేసింది
2019లో ఓ సమోన్నత లక్ష్యం కోసం నేను ఎన్నికల బరిలో దిగితే రెండు చోట్లా ఓడిపోయాను. అప్పుడు కించిత్ బాధేసింది. అవినీతి చేసిన వాళ్లు అందలం ఎక్కుతుంటే, ఆశయం కోసం వచ్చినవాడికి ఇలాంటి పరిస్థితి వచ్చిందే అని కాస్త సమయం బాధపడ్డాను. కానీ వెంటనే తేరుకున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా, ఆయన స్ఫూర్తిని అణువణువూ నింపుకున్న వ్యక్తిగా రాజకీయాల్లోకి వచ్చాను. అంబేద్కర్ వంటి మహానుభావుడికే మొదటిసారి ఓటమి వచ్చింది. ఆయన స్ఫూర్తినే తీసుకున్న నేను వెంటనే ప్రజాక్షేత్రంలోకి దిగేందుకు సిద్ధమయ్యాను. ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచించాలి.. ఎన్నికల వేళ డబ్బు తీసుకుని ఓటు వేయడం వల్ల రాజకీయ నాయకులు మన మీద దర్పం చూపిస్తున్నారు. మనలో ప్రశ్నించే గుణం రావాలంటే ఎన్నికల వేళ డబ్బు కాకుండా, మనిషిని చూసి ఓటు వేయండి. మనకు నిలబడతాడా లేదా..? మన పనులు చేస్తాడా.. నాటకం ఆడతాడా? అనేవి గమనించి నాయకులను ఎన్నుకోండి.

• ఎమ్మెల్యే మాట్లాడాల్సిన మాటలా అవి..?
             నరసాపురం మున్సిపాలిటీ ఛైర్మన్ అవినీతి మీద కొందరు స్థానికులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేస్తే, మున్సిపల్ ఛైర్మన్ కావడానికి బోలెడు ఖర్చు పెట్టాడు.. సంపాదించుకోవద్దా..? అని ఎమ్మెల్యే ప్రజల వద్ద అనవచ్చా..? అదేనా పాలన. నరసాపురం డంపింగ్ యార్డు సమస్య తీవ్రంగా వేధిస్తోంది. చెత్త పన్ను వసూలు చేస్తున్న ముఖ్యమంత్రి డంపింగ్ యార్డులను నిర్మించలేకపోతున్నారు. గోదావరి గట్టున చెత్తను పెద్ద కొండలా పోసేస్తున్నారు. వరద వచ్చిననప్పుడు గోదావరిలోకి గెంటేస్తున్నారు. చెత్త సముద్రంలోకి వెళ్లి ఎదురు తన్ని ఆ మురుగు మళ్లీ పట్టణంలోకి వస్తూ ప్రజలను రోగాల బారిన పడేలా చేస్తోంది. భోపాల్ వంటి మహా నగరాల్లో చెత్త ద్వారా ఎరువులు, మిథైన్ గ్యాస్ వంటివి ఉత్పత్తి చేస్తారు. పనికిమాలిన సలహాదారులను, మన అధికారులను కూడా అలాంటి వాటి పరిశీలనకు పంపితే ప్రయోజనకరంగా ఉంటుంది. పారిశుద్ధ్య కార్మికుల హాజరులో అవినీతి, నీటి మీటర్లలో అవినీతి, భూముల కబ్జాలు రాజ్యమేలుతున్నాయి. దీనిని నివారించి నరసాపురం ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు జనసేన ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వస్తుంది. ఇసుక కాంట్రాక్టులు గతంలో 55 వేల మందికి ప్రత్యక్షంగా దారి చూపేవి. పంచాయతీలకు సీనరేజీ కింద ప్రత్యేక నిధులు అందేవి. ఇసుక కాంట్రాక్టులన్నీ ఒక్కరికే కట్టబెట్టడం వల్ల ఇసుక కొరత ఏర్పడి 32 మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇసుకను నిలువునా వైసీపీ నాయకులు దోచుకుంటున్నారు. 217 జీవో తెచ్చి ఇన్ ల్యాండ్ మత్స్యకారుల హక్కులను కాలరాసేలా చేశారు. మత్స్యకారుల తరఫున జనసేన పార్టీ పోరాడింది. జీవో కాపీలను నరసాపురం వేదికగా చింపివేసి, మత్స్యకారులకు అండగా నిలిచాం.
• సకాలంలో జీతాలు ఇవ్వని అసమర్ధత
యువతకు ఉద్యోగాలు ఇచ్చే ఉద్దేశం వైసీపీ ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు నెలవారీ సకాలంలో జీతాలు ఇవ్వరు. వారు దాచుకున్న జీపీఎఫ్ డబ్బులను ప్రభుత్వం వాడేసుకుంటోంది. ప్రతి ఏడాది రావల్సిన ఏరియర్స్ బకాయిలు, సరెండర్ లీవుల సొమ్ములు ఇవ్వడానికి ప్రభుత్వానికి మనసు రావడం లేదు. మధ్య తరగతి ఉద్యోగులు ఆ డబ్బు మీద ఎన్నో ప్రణాళికలు వేసుకుంటారు. ఆశగా ఎదురు చూస్తారు. అలాంటి వారికి ప్రభుత్వం జీతాలు చెల్లించక, పనులు చేయాలని చెబితే ఎలా..? ఎమ్మెల్యేలు అవినీతి చేసి, వ్యవస్థలను మాత్రం అధికారుల మీదకు వదులుతున్నారు. రాష్ట్రంలో ఉద్యోగాల జాడ లేదు. ఉన్న ఐటీ కంపెనీలు కూడా రాష్ట్రం నుంచి వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది. బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో నానాటికీ ఐటీ కంపెనీలు పెరుగుతుంటే, వైజాగ్ నుంచి వెళ్లిపోతున్నాయి. ఇలాంటి అన్యాయాల మీద, ప్రభుత్వ నిర్లక్ష్యం మీదనే, అందరి కోసమే పవన్ కళ్యాణ్ గొంతెత్తుతాడు. లక్షలాది మంది ఆవేదనల గొంతులను కలుపుకొని పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు. ముఖ్యమంత్రికి మళ్లీ చెబుతున్నా నేటి యువతరం దాష్టీకాలపై పోరాడేతత్వం, పోరాడే గుణం ఉన్న యువతరం గుర్తుపెట్టుకోండి. ప్రాథమిక హక్కుల రక్షణ కోసం పోరాడాలి. విద్యా, వైద్యం, ఉపాధిని కల్పించాలి. గొప్ప నాయకుల స్ఫూర్తితో జనసేన రాజకీయాలు చేస్తుంది.

• కాపులకు – బీసీలకు గొడవ పెట్టాలని చూసింది
జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా అభివృద్ధి చేస్తాం. ఈ నెల కోసం 25 ఏళ్లు గొడ్డు చాకిరి చేయడానికి సిద్ధంగా ఉన్నాను. పుట్టుకతో ఎవరూ కూడా వైసీ సుబ్బారెడ్డిలా తెల్లగెడ్డంతో పుట్టరు. కిందపడి మీదపడి నలిగితే అనుభవం వస్తుంది. ఈ రోజు పెద్ద పెద్ద నాయకులం అని చెప్పుకుంటున్న సోకాల్డ్ నాయకులు అందరూ కూడా నలిగి నలిగి ఈ స్థాయికి వచ్చిన వాళ్లే. రాజకీయ ప్రస్థానం 2008లో ప్రారంభించాను. అనుభవం తెచ్చుకున్నాను.
గౌడ, శెట్టిబలిజ, బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు.. ఇలా ఏ వర్గాలు అయితే రాజ్యాధికారానికి దూరంగా ఉన్నాయో వాటన్నింటిని కలుపుకొని రాజ్యాధికారం దిశగా అడుగులు వేస్తాం. వైసీపీవాళ్లు అకారణంగా బీసీలకు – కాపులకు మధ్య గొడవలుపెట్టాలని చూశారు. విజ్ఞులైన ఆయా వర్గాల ప్రజలు పరిస్థితిని అర్థం చేసుకున్నారు. తుని రైలు ఘటన వెనుక ఏ శక్తులు పని చేసాయో అందరికీ తెలిసింది.
• ఆరోగ్యశ్రీకి మించిన హెల్త్ పాలసీ తీసుకొస్తాం
ఉభయ గోదావరి జిల్లాలు పచ్చని పంట పొలాలు, కాలువలతో కళకళలాడుతాయి. కేరళ తరహా బోటు రేసులు ఇక్కడ ఏర్పాటు చేస్తే పర్యాటకంగా ఈ ప్రాంతం చాలా అభివృద్ధి చెందుతుంది. ఈ రెండు ఉమ్మడి జిల్లాల్లో 28 పైగా ప్రసిద్ధి పుణ్య క్షేత్రాలు ఉన్నాయి. వాటన్నింటినీ కలుపుతూ ఆధ్యాత్మిక పర్యాటక సర్క్యూట్ గా తీర్చిదిద్దుతాం. నరసాపురంలో షిప్ యార్డు ఇండస్ట్రీని అభివృద్ధి చేస్తాం. ప్రతి నియోజకవర్గానికి 500 మంది చొప్పున యువతను, దామాషా పద్ధతి ప్రకారం ఎంపిక చేసి రూ. 10 లక్షలు ఆర్థికసాయం అందించి వారిని పారిశ్రామివేత్తలుగా మార్చడంతో పాటు పదిమందికి ఉపాధి కల్పించేలా తీర్చిదిద్దుతాం. ఆరోగ్యశ్రీ కంటే మంచి హెల్త్ పాలసీ తీసుకొస్తాం. ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల హెల్త్ ఇన్సురెన్స్ చేయిస్తాం. దీనికి ప్రీమియం ప్రభుత్వమే చెల్లించేలా ఆలోచన చేస్తున్నాం. ఔత్సాహిక పారిశ్రమిక వేత్తల కోసం సింగల్ విండో పథకాన్ని తీసుకొస్తాం. లాయర్లు, డాక్టర్లపై దాడి చేయాలంటే భయపడే చట్టాలను తీసుకొచ్చి వారికి రక్షణ కల్పిస్తాం. ఆడబిడ్డల మాన ప్రాణాలను సంరక్షించే బలమైన చట్టాలు తీసుకొస్తాం.

• రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే జనసేన రావాలి
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలను వైసీపీ విముక్త ప్రాంతాలుగా మారుస్తాం. 34 శాసనసభ నియోజకవర్గాల్లో ఒక్క సీటు కూడా వైసీపీ గెలవకుండా చూసుకుంటాం. పులివెందుల రౌడీయిజం, గూండాయిజం, దౌర్జన్యాలు ఈ ప్రాంతానికి ససేమిరా రానివ్వం. వస్తే తన్ని తగలేస్తాం. అభివృద్ధి ఒక్క జనసేన పార్టీతోనే సాధ్యం. బీసీలకు రాజ్యాధికారం రావాలన్నా… కాపులకు న్యాయం జరగాలన్నా… కులాల మధ్య ఐకత్య… మతాల మధ్య సామరస్యత పెరగాలన్నా జనసేన అధికారంలోకి రావాలి. అన్నింటికంటే ముఖ్యంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే జగన్ పోవాలి… జనసేన రావాలి” అన్నారు.

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్