• 23 బీసీ కులాలను తెలంగాణలో బీసీ జాబితా నుంచి తొలగిస్తే కనీసం మాట్లాడరు
• తూర్పుకాపుల జనాభాపైనా వైసీపీ వింత లెక్కలు
• ఉత్పత్తి కులాలకు రాజ్యాధికారం రావాలి
• తూర్పుకాపుల సమస్యలను జనసేన ప్రభుత్వంలో పరిష్కరిస్తాం
• భీమవరంలో తూర్పుకాపుల సమావేశంలో మాట్లాడిన శ్రీ పవన్ కళ్యాణ్
• జనసేనలో చేరిన అఖిల భారత తూర్పు కాపు సంక్షేమ సంఘం నేతలు
జగన్ రెడ్డి తెలంగాణలోని తన రూ.300 కోట్ల ఆస్తిని కాపాడుకోవడానికి.. తెలంగాణలో ఉన్న ఏపీ ఆస్తులను మొత్తం ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్నాక, తెలంగాణకు వదిలేసి వచ్చేశాడు. విభజన సమయంలో ఆంధ్ర ప్రదేశ్ కు చెందాల్సిన రూ.వేల కోట్ల ఆస్తులు అవి. తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చేశాడు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలోని 23 కులాలను తెలంగాణ ప్రభుత్వం బీసీ జాబితా నుంచి తొలగించింది. దాని గురించి మాట్లాడని ఈ వైసీపీ పాలకులు తమ ఆస్తులను కాపాడుకోవడానికి ప్రజల ఆస్తులను వదిలేశారు… కానీ బీసీలను జాబితా నుంచి తొలగిస్తే కనీసం నోరెత్తలేదు. ఇలాంటి ద్వంద్వ నీతి కలిగిన వైసీపీ నాయకులు అంటే నాకు కోపం. అందుకే నా గొంతు బలంగా మారుతుంద’ని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. మంగళవారం భీమవరంలో తూర్పు కాపు సంక్షేమ సంఘం నాయకులు జనసేన పార్టీలో చేరారు. ఆల్ ఇండియా తూర్పు కాపు సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీ పిసిని చంద్రమోహన్, సంఘం నేతలు శ్రీ పల్లా వెంకట్రావు, శ్రీ గడి ఝాన్సీ, శ్రీ ధనుకొండ లక్ష్మణ నాయుడు, శ్రీ మామిడి విష్ణు, శ్రీమతి భూపతి జయలక్ష్మి, శ్రీ లోగేషి బాలకృష్ణ తదితరులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ‘‘బీసీ కుల గణన అనేది అవసరం అని జనసేన పార్టీ భావిస్తోంది. జనాభా ప్రతిపాదిక లెక్కల వల్ల సమాజానికి మేలు జరుగుతుంది. దామాషా పద్ధతి ప్రకారం ఎవరు ఎంతమంది ఉన్నారో తెలిస్తే, వారికి అన్ని విషయాల్లోనూ తగిన న్యాయం జరుగుతుంది. జనసేన పార్టీ బీసీ కుల గణన జరగాలని ఆకాంక్షిస్తుంది. గణన కోసం అన్ని పార్టీలు కలిసి రావాల్సిన అవసరం ఉంది. సివిల్ సోసైటీ బలంగా మారాలి. చైతన్యవంతం కావాలి. అప్పుడే పాలకులకు భయం ఉంటుంది. ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా మాట్లాడినా, ప్రశ్నించినా, వారి తీరుకు ఎదురు తిరిగినా పోలీసులు బతకనీయడం లేదు. ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా చిన్న ఫిర్యాదు ఇచ్చినా ఇదే పరిస్థితి. వ్యవస్థలు సరిగా పనిచేయక, కుల సమూహాలు పెరిగిపోయాయి. చట్టం సరిగా పనిచేస్తే, అందరికీ సమాన న్యాయం జరిగితే కచ్చితంగా కులాల నిర్మూలన సాధ్యమే. అంబేద్కర్ మహానుభావుడు కలలు కన్న వ్యవస్థ కూడా సాధ్యమే. మొదటి నుంచి ఆంధ్రా ప్రాంతంలో అలాంటి పరిస్థితి ఉంది కాబట్టే కుల ప్రభావం బలంగా పెరిగిపోయింది. భారతదేశ సమాజంలో కులాల పాత్ర చాలా ఎక్కువ అని లోతైన అధ్యయనం తర్వాత తెసుకున్నాను. నేను కులాల గురించి మాట్లాడుతున్నాను అంటే అవి అన్ని కులాలు సమాన అభివృద్ధికి ఎందుకు నోచుకోలేకపోతున్నాయి.. అనే ఆవేదన, ఆలోచన నుంచి వస్తున్న మాటలే అని గుర్తించాలి. వీటన్నింటిపై ప్రశ్నించే వారు బయటకు రావాలన్నదే నా ఆకాంక్ష.
* నా ఆవేశం పేదవాడి గుండె ఘోష
ప్రతిసారి పవన్ కళ్యాణ్ ఆవేశంతో మాట్లాడతాడు.. ఊగిపోతాడు అని అందరూ అంటారు. నా వేదన వెనుక పేదోడి ఆవేదన దాగుంది. నా ఆవేశం వెనుక బలహీన వర్గాలపై అన్యాయం దాగుంది.. నా ఆక్రోశం వెనుక దళిత వర్గాలను దగా చేసిన ప్రభుత్వ అన్యాయం దాగుంది. నేను ప్రజల్ని నా కుటుంబ సభ్యులుగా భావిస్తాను. వారికి అన్యాయం జరిగితే నాకు జరిగినట్లే అనుకుంటాను కాబట్టే నాకు వారి వెతలు విన్నపుడు రక్తం మరిగిపోతుంది. ఎన్నాళ్లు ఇంకా పాలకులు దోచుకుంటారు..? ఎంత భూమిని లాక్కుంటారు..? అన్న కోపం వస్తుంది. ఎంత సంపాదించినా చివరికి భూమాత వారిని తనలో కలిపేసుకుంటుందన్న కనీస స్పృహ లేని వారిని చూస్తేనే బాధేస్తుంది.
* కొత్త నాయకత్వాన్ని తయారు చేయండి
నేను గతంలో భీమవరం ప్రాంతం వచ్చినపుడు నవీన్ అనే యువనాయకుడు నాతో మాట్లాడుతూ ఏదైనా మాట్లాడితే మా కుల పెద్దలు మీరు చిన్నపిల్లలు అంటున్నారు. 2009లో పిల్లలం అన్నారు.. 2014లోనూ పిల్లలు అనే పక్కన పెట్టారు. ఆఖరికి 2019 వచ్చినా ఇంకా పిల్లలు అనే చెబుతున్నారు. ఇలా అయితే మా గొంతు ఎప్పుడు వినిపించేది..? మా ఆలోచనలు ఎప్పుడు పంచుకునేది అని ప్రశ్నించాడు. నాయకుడు అనే వాడు మరో కొత్త నాయకత్వాన్ని తయారు చేయాలి. ఉత్తరాంధ్రను శాసించే బొత్స వంటి నాయకులు కనీసం వారు ఎదిగిన తర్వాత అయినా కులం కోసం, దానిలో వెనుకబడిన వారి అభ్యున్నతి కోసం ఆలోచించాలి. కులాలను అడ్డు పెట్టుకొని నాయకులు మాత్రమే పైకెదుగుతున్నారు. ఆయా కులాల్లోని పేదల బతుకులు మాత్రం మారడం లేదు. కుల సంఘాల నాయకులు కొత్త నాయకత్వాన్ని తీసుకురావాలి.. మారుతున్న కాలానికి తగినట్లుగా నవ ఆలోచనలు స్వీకరించాలి. అలాంటిదేమీ లేనపుడు యువతలోనూ మొదలయ్యే అసంతృప్తి కోపానికి దారి తీస్తుంది.
* ఒక్కొక్కరికీ ఒక్కో న్యాయమా..?
ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు దాటితే తూర్పుకాపులకు బీసీ ధ్రువీకరణ పత్రం ఇవ్వరు. కేవలం ఆ మూడు జిల్లాల్లోనే వారికి బీసీ కార్డు పనికొస్తుంది. తెలంగాణ వెళితే అసలు వారిని బీసీలుగా గుర్తించరు. యాదవ సమాజానికి ఎక్కడికి వెళ్లినా బీసీ ధ్రువీకరణ పత్రం ఇచ్చినపుడు, తూర్పు కాపులకు ఎందుకు ఇవ్వరు..? ఒకరికి ఒక న్యాయం… మరొకరికి మరో న్యాయం సరికాదు. అందరికీ ఒకే న్యాయం ఉండాలని జనసేన భావిస్తోంది. తూర్పు కాపులు 46 లక్షల జనాభా ఉంటారని కుల సంఘాల నాయకులు చెబుతున్నారు. టీడీపీ ప్రభుత్వంలో వారిని 26 లక్షలుగా గుర్తిస్తే, వైసీపీ వారిని కేవలం 16 లక్షలే అని లెక్కలు చెబుతోంది. బీసీలుగా ఉన్న వారిని గుర్తిస్తే సంక్షేమ పథకాలు అందించాలనే అక్కసుతోనే వారి జనాభాను తక్కువ చేసి చూపుతున్నారు. ఈ పద్ధతి సరికాదు. వారిని తక్కువ చేసి చూపించడంలో ఎలాంటి పద్ధతులు అవలంబించారు.. ? ఏ ప్రాతిపదికన 16 లక్షలుగా చూపుతున్నారు..? ఏ విధానం దానికి అనుసరించారు అన్నది బయటపెట్టాలి. లేకుంటే కుల సంఘాలు చెప్పిన లెక్కలను బట్టి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు వారికి అందేలా చూడాలి. ఉత్తరాంధ్ర వెన్నెముక తూర్పుకాపులు.
* స్వేదం నమ్ముకున్న సంపన్నులు
దేశంలో ఎక్కడికి వెళ్లి అయినా ఎత్తయిన ప్రదేశాల్లో భయం లేకుండా పని చేసే సత్తా తూర్పు కాపులకు ఉంది. వలస బాట పట్టే తూర్పుకాపులు ఎక్కడ నిర్మాణ పనులు జరిగినా అందులో తప్పనిసరిగా ఉంటారు. గతంలో తెలంగాణలో పర్యటిస్తున్నపుడు పదిమందితో మాట్లాడితే అందులో ఇద్దరు తూర్పు కాపులు కనిపించేవారు. పని ఎక్కడ ఉంటే అక్కడకు పొట్ట చేత పట్టుకొని వెళ్లి బతుకు బండి సాగించే స్వేదం నమ్ముకున్న సంపన్నులు వాళ్లు. వారికి చాలా సమస్యలు ఉన్నాయి. వారి సమస్యలన్నీ నేను తెలుసుకున్నాను. వాటిని ఎలా పరిష్కరించవచ్చో పూర్తి అధ్యయనం చేసిన తర్వాత జనసేన మేనిఫెస్టోలోనూ పొందుపరుస్తాం. జనసేన ప్రభుత్వం రాగానే వాటిని పూర్తిస్థాయిలో పరిష్కరించే బాధ్యత తీసుకుంటాం. నాకు ఇష్టమైన నాయకులు శ్రీ రామ్ మనోహర్ లోహియా దేశంలోని కులాల గురించి పూర్తి అధ్యయనం చేశారు. ఆంధ్రాలోనూ ఆయన పరిశీలించిన అంశాల్లో బీసీల వెనుకబాటు గురించి రాశారు. బలహీన వర్గాల వెనుకబాటుకు చాలా కారణాలను ఆయన చూపించారు. వాటిని కచ్చితంగా అధిగమించాల్సిన అవసరం ఉంది. నేను గోదావరి జిల్లాలకు ప్రాధాన్యం ఇస్తాను అని చెబుతున్నాను అంటే ఇతర ప్రాంతాల మీద దృష్టి పెట్టను అని కాదు… యుద్ధం ఒక దగ్గర నుంచి మొదలుపెట్టాలి కాబట్టి గోదావరి జిల్లాలను ఎంచుకున్నాను అని గుర్తించండి. ఉత్తరాంధ్రకు నా ప్రాధాన్యం ఎప్పుడూ ఉంటుంది. నా పోరాటయాత్రను గంగమ్మ తల్లి ఆశీస్సులతో ఉత్తరాంధ్రలోనే మొదలుపెట్టాను. నాకు ఉత్తరాంధ్రతో విడదీయరాని అనుబంధం ఉంది. అడిగే స్థాయి నుంచి ఇచ్చే స్థాయికి ఉత్పత్తి కులాలు చేరువాలన్నదే జనసేన పార్టీ లక్ష్యం. నేను కూడా మీకిచ్చే హామీలను అమలు చేయకపోతే నన్ను కూడా నిలదీసే చైతన్యం మీలో రావాలి. కచ్చితంగా దానికి నేను సమాధానం చెబుతాను కానీ పారిపోను. రాజకీయాల్లో జవాబుదారీతనం రావాలన్నదే జనసేన పార్టీ పెట్టిన అసలు ఉద్దేశం. ఇప్పటి వరకు మోసం చేసిన వారిని నమ్మారు… ఒక్కసారి జనసేన పార్టీని నమ్మండి. అందరికీ కచ్చితంగా నిజాయతీతో కూడిన న్యాయం చేస్తాం’’ అన్నారు.
* తూర్పు కాపుల వెంట జనసేన ఉంటుంది: శ్రీ నాదెండ్ల మనోహర్
పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “తూర్పు కాపుల అంశం శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్లినప్పుడు ఓటు బ్యాంకు రాజకీయాలు కాకుండా నిజాయతీగా వారి కోసం ఎలా నిలబడగలం అనే అంశంపై చర్చిద్దామన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు చూస్తే స్పందించలేని స్పందన.. జగనన్నకు చెబుదామన్నారు ఎవరికి చెప్పాలో రాష్ట్ర ప్రజలకు అర్ధం కావడం లేదు. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి చెబితే మాత్రం ఆయన నుంచి వచ్చే స్పందన నిజాయతీగా ఉంటుంది. మీ అందరి సమస్యల పరిష్కారానికి కలసి కట్టుగా ముందుకు వెళ్దాం. మీకు సమస్య వస్తే జనసేన పార్టీ మీ వెంట ఉంటుంది. ప్రభుత్వం నుంచి స్పందన వచ్చే విధంగా నిలబడుతుంది. అంతా కలసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్దాం. వారాహి విజయ యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. గత 15 రోజులుగా సాగుతున్న యాత్రలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు గ్రామ స్థాయి సమస్యలపై కూడా స్పందిస్తూ ప్రజల మనసులకు చేరువయ్యారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వస్తే ఖచ్చితంగా సమస్యకు పరిష్కారం లభిస్తుందన్న నమ్మకం ప్రజల్లో బలపడింది. వారాహి విజయ యాత్రలో అధికార యంత్రాంగం, రైతులు, సామాన్యులు, విద్యార్ధులు, మహిళలు కలుస్తూ తాము ఎదుర్కొంటున్న సమస్యలు ప్రస్తావించడమే అందుకు నిదర్శనమ”న్నారు.
* ప్రభుత్వాలు మారుతున్నా మా సమస్యలు తీరడం లేదు
ఆల్ ఇండియా తూర్పు కాపు సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీ పిసిని చంద్రమోహన్ “తూర్పు కాపులు దశాబ్దాలుగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా మా సమస్యలు తీరడం లేదు. అన్ని రంగాల్లో తూర్పు కాపులు అన్యాయానికి గురవుతున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారిచ్చిన భరోసాతో జనసేనతో కలసి ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నాం. శ్రీ పవన్ కళ్యాణ్ గారి సూచన మేరకు కాపులు పెద్దన్న పాత్ర పోషించి ఆయన నాయకత్వంలో బడుగు బలహీన వర్గాల రాజ్యాధికార సాధనకు కృషి చేస్తాం. శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన నాడే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంది. తూర్పు కాపుల సమస్యలకు జనసేన మేనిఫెస్టోలో చోటు కల్పించాలి. శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేసేందుకు తూర్పు కాపులంతా కంకణ బద్దులై ఉంటార”న్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ కొటికలపూడి గోవిందరావు, ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి, పీఏసీ సభ్యులు శ్రీ కనకరాజు సూరి, పార్టీ నాయకులు శ్రీ రెడ్డి అప్పలనాయుడు, శ్రీ గిరడా అప్పలస్వామి, శ్రీ చనమల్ల చంద్రశేఖర్, శ్రీ ఆకుల అప్పలసూరి నాయుడు, శ్రీమతి గడి ఝాన్సీ, శ్రీ ధనుకొండ లక్ష్మణ నాయుడు, శ్రీ సతివాడ నవీన్ పాల్గొన్నారు.