* రాజ్యాంగ వ్యతిరేకంగా కొత్త వ్యవస్థలను నిర్మించుకున్నారు
* ప్రజల వ్యక్తిగత జీవితాలు వాలంటీర్లకు ఎందుకు?
* అదృశ్యమైన ఆడబిడ్డల పరిస్థితుల గురించి ఆలోచన చేయాలి
* ఉంగుటూరు నియోజకవర్గ పార్టీ శ్రేణుల సమావేశంలో శ్రీ పవన్ కళ్యాణ్
‘జగన్ తీసుకొచ్చిన సమాంతర ప్రభుత్వాన్ని న్యాయపరంగా, ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఎదుర్కొంటాం. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన డేటా ప్రొటెక్షన్ యాక్ట్ – 2022 ప్రకారం వ్యక్తిగత సమాచారం అనవసరంగా ఎవరు తీసుకున్నా దానికి బాధ్యత వహించాల్సిందే. మన వ్యక్తిగత సమాచారాన్ని దేవుడు అడిగినా ఇవ్వాల్సిన పనిలేదు. అలాంటిది జగన్ తన కోసం పెట్టుకున్న వాలంటీర్లకు ఎందుకు ఇవ్వాలి’ అని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు. ఉంగుటూరు నియోజకవర్గ పార్టీ శ్రేణుల సమావేశం ఏలూరు క్రాంతి కళ్యాణ మండపంలో మంగళవారం సాయంత్రం జరిగింది. శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ.. “నేను మహిళల అదృశ్యం మీద మాట్లాడితే ఇప్పుడు దీనిపై చర్చ మొదలైంది. అదృశ్యం అయిన మహిళల రికవరీ శాతం రాష్ట్రంలో చాలా బాగుందని కొందరు చెబుతున్నారు. వెనక్కు వస్తున్న మహిళలు ఎలా అదృశ్యమయ్యారు.. అదృశ్యమైన తర్వాత వారు పడిన బాధలు ఏమిటి..? వారి అదృశ్యం వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు అనేది కూడా తెలుసుకోవాలి. దారుణమైన పరిస్థితుల్లో అదృశ్యమైన మహిళలు మళ్లీ వెనక్కి వస్తున్నారు.
* 24 గంటల్లో తెలిస్తే..
హైదరాబాదులో నా స్నేహితుడి కుమార్తె ఒకరు అదృశ్యమైతే వెంటనే నాకు ఫోన్ చేశాడు. నేను తెలిసిన పోలీసు మిత్రులతో మాట్లాడితే వారు చెప్పింది ఏమిటి అంటే 24 గంటల్లో యువతి ఆచూకీ తెలిస్తే తెలిసినట్లు లేకుంటే 50 శాతం హోప్స్ లేనట్లేనని, 48 గంటలు దాటితే కచ్చితంగా యువతి ఆచూకీ లభ్యం కాకపోవచ్చు అని చెప్పడం నాకు ఆశ్చర్యం కలిగించింది. పెద్ద స్థాయి వ్యక్తులు కావడంతో నానా బాధలు పడి యువతి ఆచూకీని ముంబైలోని కామటిపుర ఏరియాలో కనుక్కున్నారు. అక్కడి పోలీసుల సహాయంతో యువతిని రక్షించగలిగారు. మరి పేద, మధ్యతరగతి కుటుంబాల్లోని యువతులు, మహిళలు అదృశ్యం అయితే ఎవరికి చెప్పుకోవాలి..? మన బాధల్ని ఎవరు పట్టించుకుంటారు..? అదృశ్యం అయిన తర్వాత వెనుకకు వస్తున్న యువతులు, మహిళల వేదన ఈ ప్రభుత్వం వింటుందా..?
* 50 కుటుంబాల వారూ వాలంటీర్ చెప్పినట్లు వినాల్సిందే
గ్రామాల్లో వాలంటీర్లు చెప్పినట్లు అతని పరిధిలో ఉన్న 50 కుటుంబాలూ కచ్చితంగా వినాల్సిందే. అతను చెప్పినట్లు నడుచుకోవాల్సిందే. ఏ సమాచారం అయినా నిమిషాల్లో తీసుకురావాల్సిందే. 50 కుటుంబాలకు ఒక జగన్ అన్నట్లు వారు తయారయ్యారు. బ్యాంకు ఎకౌంట్లు, పాన్ కార్డుల వివరాలు అన్నీ వారి వద్దనే ఉంటున్నాయి. వాలంటీర్లు చెబుతున్న ప్రకారం సమాచారం అంతా ఫోన్లో నిక్షిప్తం అవుతుంది అని అంటున్నారు.. అసలు మీ ఫోన్ పోతే పరిస్థితి ఏంటి లేదా మీ ఫోన్ హ్యాక్ అయితే ఆ సమాచారం పరిస్థితి ఏమైనట్లు..? ఏ సర్వర్ లో సమాచారం ఉంచుతున్నారు..? ఆ సర్వర్ అసాంఘిక శక్తులకు చిక్కితే పరిస్థితి ఏంటి? ఇలా ఎన్నో రకాల అనుమానాలు ఉన్నాయి. అసలు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని అడగడానికి మీరు ఎవరు..? మీ పరిధిలో ఉన్న 50 కుటుంబాల్లో ఏం జరిగినా మీకు చెప్పాలని ప్రత్యేకంగా రూల్ ఎందుకు? ఈ సమాంతర వ్యవస్థ ఇప్పుడిప్పుడే వేళ్ళునుకొని బలోపేతం అవుతోంది. ఇది మరింత ముదిరితే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు మనం ఆంధ్రప్రదేశ్లో చూడొచ్చు.
* వాలంటీర్లు దైవాంశ సంభూతులు కాదు
రాజ్యాంగ రచన కోసం ఎందరో మేధావులు మేధో మదనం చేసి, ఎన్నో సమావేశాలు నిర్వహించి ఒక గొప్ప రాజ్యాంగాన్ని రాశారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆధ్వర్యంలో రాసిన రాజ్యాంగంలో న్యాయ, పాలన, కార్యనిర్వాహక వ్యవస్థలకు విశిష్టమైన గుర్తింపు ఇచ్చారు. ప్రభుత్వ పాలన అనేది కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితం కాదు. మనకు జీవించే హక్కు, విద్యా హక్కు ఉన్నట్లే కచ్చితంగా ప్రభుత్వంతో పని చేయించుకునే హక్కు ఉంది. సంక్షేమ పథకాలు కొందరికి అందాలి అని రాజ్యాంగంలో ఎక్కడా లేదు. ప్రభుత్వ పాలనలో మనం బతుకుతున్నాం అంటే కచ్చితంగా అర్హులైన మనకు పథకాలు అందాల్సిందే. వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాతే సంక్షేమ పథకాలు ప్రారంభం కాలేదు. గతంలోని ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అమలు చేశాయి. ప్రభుత్వ పాలన చూసుకోవడానికి అన్ని శాఖల్లోనూ తగినంత సిబ్బంది ఉన్నారు. ఈ వాలంటరీ వ్యవస్థ అనేది జగన్ వ్యక్తిగత వ్యవస్థ. కేవలం తన కోసం నిర్మించుకున్న వ్యవస్థ. దీనికి ప్రజాధనాన్ని వినియోగించడమే నేరం అయితే ఏకంగా ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని కూడా ఏ భయం లేకుండా సేకరిస్తున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లాలన్న, మళ్లీ కొత్త వ్యక్తులు ఇంట్లోకి రావాలన్న వాలంటీర్ కు తెలియాల్సిందే. ఇంత సూక్ష్మ స్థాయిలో సమాచార సేకరణ ఎందుకు..? మా వ్యక్తిగత జీవితాల సమాచారం మీకెందుకు..? అసలు మేము మీకు ఎందుకు సహకరించాలి అనేది ప్రజలు ప్రశ్నించాలి. వాలంటీర్లు దైవాంశ సంభూతులు కాదు. వ్యక్తిగత ఆరాధన విపరీత పరిణామాలకు దారి తీస్తుందని అంబేద్కర్ ఎప్పుడో చెప్పారు. ప్రభుత్వ పథకాలు సంక్షేమం మీద ఉమ్మడి హక్కు ఉంది. ప్రజలు యాచకులు కాదు.. పౌరులు అనేది గుర్తుపెట్టుకోండి. అది భారత దేశ ప్రజాస్వామ్యం మనకు ఇచ్చిన బహుమతి అనేది తెలుసుకోండి.
* అతనికి… శ్రావణ శుక్రవారానికీ శ్రాద్ధానికీ తేడా తెలియదు
ఈ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ముఖ్యమంత్రికి- అ కి.. ఆ కి తేడా తెలీదు. శ్రాద్ధానికీ, శ్రావణ శుక్రవారానికి తేడా తెలియదు. పిండా కూడుకి, పిండి వంటలకు తేడా తెలియదు. తద్దినానికి, అట్లతద్దికి తేడా తెలియదు. వారాహికి, వరాహికి తేడా అసలు తెలీదు. ఈ పెద్ద మనిషి పెళ్లికి వెళ్లినా ఒకటే చిరునవ్వు పెద్ద కర్మ కు వెళ్లిన ఒకటే చిరునవ్వు. ఎక్కడ ఎలా ప్రవర్తించాలో కూడా తెలియని గొప్ప సంస్కారి పాలనలో మనం బతుకుతున్నాం. జగన్ దగ్గర ఉన్న కోట్లు, క్రిమినల్స్ నా దగ్గర లేరు. లాయర్లు, లీగల్ సిస్టం కూడా లేదు. ఏమీ లేకపోయినా ఇంత బలంగా జగన్ లాంటి దాష్టికుడికి ఎలా ఎదురు వెళ్తున్నామంటే అది జ్ఞానానికి ఉన్న బలం. మెదడు నిండా జ్ఞానం నిండితే, భయానికి చోటు ఉండదు. అజ్ఞానం ఉన్నవాడు విషయ పరిజ్ఞానం లేని వాడు మాత్రమే భయపడతాడు. నిరంతరం చదవడం వల్ల వచ్చిన జ్ఞాన జ్యోతి నన్ను ముందుకు నడిపించింది. ఇంత అభిమాన శక్తిని నీకు ఇస్తే నువ్వు పిరికివాడిగా మిగిలిపోతే ఎలా అనే అంతర్మథనం నన్ను నడిపించింది. చావు అనేది ప్రతి మనిషికి కచ్చితంగా వచ్చేది. దానికోసం భయపడకుండా, పిరికివాడుగా చావకుండా ముందుకు వెళ్లాలని భావించాను. అలా మొదలైందే కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్. తర్వాత రాజకీయాల్లోకి కేవలం 150 మందితో వచ్చి.. ఇప్పుడు బలమైన సిద్ధాంతం కలిగిన సమూహాన్ని తయారు చేయగలిగాం. వాలంటీర్ల గురించి మాట్లాడిన తర్వాత చాలామంది నన్ను అడిగారు. జగన్ లాంటి వ్యక్తి గురించి, వైసీపీ అనే పార్టీ గురించి అలా ఎలా మాట్లాడారు అని భయపడ్డారు. చిన్న స్థాయి వ్యక్తులు కాదు ఖండాంతరాల్లో ఉన్న వ్యక్తులు, చాలా ఉన్నత విద్యావంతులు సైతం ఈ ప్రభుత్వానికి భయపడుతున్నారు. నేను ఒకటి చెప్పాను వాళ్లది ఆరు లక్షల మంది సైన్యం అయితే, నా సైన్యం లెక్క వేరే ఉంటుంది. నా చిటికెన వేలు గోరును కూడా ముట్టుకోలేరు. అసలు జగన్ అనే దుష్టశక్తికి ఎందుకు భయపడాలి. వంద తలలు ఉన్న కార్తవీర్యార్జునుడే పరశురాముడి చేతిలో మట్టి కరిచాడు. జగన్ కు భయపడాల్సిన అవసరం లేదు.
* పెగాసస్ గురించి దేశస్థాయిలో గొడవ జరిగింది
భారతీయ జనతా పార్టీ పెగాసస్ సాఫ్ట్వేర్ ద్వారా వ్యక్తిగత విషయాలను రహస్యంగా వింటుందని దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు కలిపి గొడవ చేశాయి. అప్పట్లో ప్రభుత్వాన్ని పార్టీలన్నీ నిలదీశాయి. వ్యక్తిగత స్వేచ్ఛకు ఉన్న పవర్ అలాంటిది. ఆడపిల్లలకు కనీస భద్రత కోసం మనం తపించిపోతాం. అలాంటిది ఆడపిల్లల పూర్తి సమాచారాన్ని తెలిసీ తెలియని వ్యక్తులకు ఎలా ఇవ్వగలుగుతున్నాం. దీనిని ప్రజలంతా ఆలోచించాలి. నాయకుడు వ్యవస్థలను బలోపేతం చేయాలి. కేవలం తన వ్యక్తిగత స్వార్థం కోసం కొత్త వ్యవస్థలను పుట్టించకూడదు. తమ పరిధిలో ఉన్న 50 కుటుంబాల వ్యక్తిగత సమాచారాన్ని వాలంటీర్ల దగ్గర పెట్టుకొని వారిని రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. జనవాణి కార్యక్రమానికి వస్తున్న వారిని కూడా వాలంటీర్లు భయపెడుతున్నారు. దీనిపై మాకు రకరకాల ఫిర్యాదులు వస్తున్నాయి. వాలంటీర్ల కడుపు కొట్టే ఆలోచన నాకు లేదు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న అసలు విషయాన్ని ప్రజలకు తెలియజేయాలన్నది నా అభిమతం.
* నా మనస్సాక్షి కుదురుగా ఉండనీయలేదు
అనుకోకుండా సినిమా ప్రయాణం మొదలైంది. ఎంతో సిగ్గుతో ఉండే నేను సినిమాల కోసం డాన్సులు చేయడం చాలా ఇబ్బందిగా అనిపించేది. అయినా నా అభిమాన గణం పెరుగుతూ వచ్చింది. ఇంత పెద్ద అభిమానులను నీకు ఇచ్చింది ఎందుకంటే వారందరికీ నీవు ఓ భరోసాగా నిలిచిపోవాలి అని దేవుడు ఎప్పుడు నాతో చెప్పినట్లు భావిస్తుంటాను. అందుకోసమే ఇంత పేరు వచ్చిందేమో. నిజ జీవితంలో జగన్ లాంటి విలన్లను ఎదుర్కోవాలి అంటే గుండె ధైర్యం కావాలి. మన ఇంట్లోని వాళ్లను పిల్లలను కూడా తిట్టించే నైజం ఉన్న విలువ లేని రాజకీయాలు ఇవి. వాళ్ళ ఇంట్లోని వారిని మాత్రం మేడం అని సంబోధించే సంస్కారం మనది. కనీస సంస్కారం లేని వాడు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం రాజ్యాంగ హక్కులను కాలరాసి ఎవరినీ కనీసం నామినేషన్ వేయకుండా చేసిన ప్రభుత్వం ఇది. నా భార్యను, అమ్మను ఇష్టానుసారం వైసీపీ నాయకులు తిట్టినప్పుడు మా ఇంట్లోని వారు బాధపడ్డారు. నాకు సంబంధం లేని రాజకీయాల్లోకి నన్ను ఎందుకు లాగుతున్నారు అని నా భార్య ప్రశ్నించినప్పుడు క్షమించమని అడిగాను. మా అమ్మ సైతం ఈ రాజకీయాలు మనకెందుకురా అని అన్నప్పుడు మనలాంటి వాళ్ళు కూడా వెనకడుగు వేస్తే ఎలా అని చెప్పాను. సుగాలి ప్రీతి తల్లి శ్రీమతి సుగాలి పార్వతి ఒక దివ్యంగురాలు. తన 14 ఏళ్ల కూతురుని అత్యాచారం చేశారు అని, న్యాయం కోసం ఇప్పటికీ పోరాడుతున్న గొప్ప మాతృమూర్తి. అలాంటి వారికి నిలబడకపోతే మనం ఎందుకు. నీకు పుట్టిన ఐదుగురు బిడ్డల్లో ఒక బిడ్డను దేశం కోసం ఇచ్చేసాను అనుకోమని మా అమ్మకు చెప్పాను. నా భూమి కోసం, నా నేల కోసం బలంగా నిలబడాలని నిర్ణయించుకునే రాజకీయాల్లోకి వచ్చాను. జనసేన పార్టీ శ్రేణులకు కూడా నేను చెప్పేది ఒక్కటే… వైసిపి దాష్టికాలపై దౌర్జన్యాలపై ఎదిరించి పోరాడండి. మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డువేసి కాపాడుకుంటాను” అన్నారు.
• రాజకీయాలు అవసరమా అన్న భావన తెచ్చారు : శ్రీ నాదెండ్ల మనోహర్
పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ.. “జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారాహి ప్రస్తానం ప్రారంభిస్తారని తెలియగానే ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం మొదలు పెట్టారు. జనసేన పార్టీ, అధినేత లక్ష్యంగా వ్యక్తిగత విమర్శలు చేస్తూ ప్రజల్లో అయోమయానికి గురిచేయాలన్న ప్రయత్నాలు మొదలుపెట్టారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ప్రతి అడుగులో రాష్ట్ర భవిష్యత్తు కోసం భరోసా కల్పిస్తూ.. సురక్షాంధ్రప్రదేశ్, అభివృద్ధి ఆంధ్రప్రదేశ్, సంక్షేమాంధ్రప్రదేశ్ దిశగా ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. ప్రజా సమస్యల పరంగా మాత్రమే ఆయన విమర్శలు ఉంటాయి. వ్యక్తిగతంగా ఎవరినీ విమర్శించరు. వైసీపీ అధికారంలోకి వచ్చాక గ్రామ స్థాయి నుంచి ఇలాంటి రాజకీయాలు అవసరమా? మా బిడ్డలు రాజకీయాల్లోకి వెళ్లొద్దు అనే భావన సమాజంలో తీసుకువచ్చేశారు. వ్యవస్థలో మేము మాత్రమే ఉండాలనే దుర్మార్గమైన ఆలోచన వైసీపీ చేస్తోంది. డీఎస్పీ స్థాయి అధికారులు నామినేషన్ పత్రాలు చించేసే పరిస్థితి.. ముఖ్యమంత్రి కేబినెట్ భేటీలోనే ఏకగ్రీవాల కోసం ఆదేశాలిస్తారు. ఇలాంటి దుర్మార్గ ఆలోచనలు కలిగిన వారు పాలకులుగా ఉన్నారు. గ్రామాల్లో 20 అడుగుల రోడ్ల మీద కూడా టన్నుల కొద్ది ట్రక్కులతో గ్రావెల్ దోచేస్తున్నారు. పోలవరం కాలువ మట్టి మొత్తం తవ్వేశారు. ఉంగుటూరు నియోజకవర్గం గణపవరంలో రోడ్డు చూసే కార్యక్రమం రద్దు చేసుకున్నాం. రోడ్లు మాత్రమే కాదు గ్రామాల్లో రక్షిత మంచినీరు కూడా అందించలేని దుస్థితి. మంచినీరు సరఫరా చేసే ప్రాంతాన్ని డంపింగ్ యార్డుగా మార్చి అక్కడి నుంచే తాగునీరు సరఫరా చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య శ్రీ పత్సమట్ల ధర్మరాజు గారు ఇప్పటికీ ట్యాంకర్ల ద్వారా నీరందిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులన్ని మారాలి. జనసైనికులు, వీర మహిళల స్ఫూర్తితో ముందుకు వెళ్లి పార్టీని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాల”ని అన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ కొటికలపూడి గోవిందరావు, ఉంగుటూరు బాధ్యులు శ్రీ పత్సమట్ల ధర్మరాజు పాల్గొన్నారు.