• ఎవరి కలలనూ జగన్ నిజం చేయలేదు
• జగన్ ఏదైనా చేశాడు అంటే ఇసుక దోచుకోవడం, మందు రేట్లు పెంచడమే
• అన్ని వర్గాలను వైసీపీ ప్రభుత్వం ముంచేసింది
• గిరిజనుల స్వయం ఉపాధికి ట్రైకార్ రుణాలు అందిస్తాం
• పార్టీ రంగులకు రూ.2,300 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం… తోటపల్లి, జంపర కోట ఆధునికీకరణకు రూ. 214 కోట్లు ఖర్చు చేయలేకపోయింది
• ఓటు అనే ఆయుధంతో జగన్ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలి
• పాలకొండ నియోజకవర్గంలో వారాహి విజయభేరి యాత్ర సభలో శ్రీ పవన్ కళ్యాణ్
కలలు నిజం చేయడానికి సిద్ధం అంటూ జగన్ రాష్ట్రవ్యాప్తంగా పెద్ద పెద్ద పోస్టర్లు వేయించాడు. ఆయన ఎవరి కలలు నిజం చేశాడు..? యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాడా..? మెగా డీఎస్సీ ప్రకటించాడా..? తోటపల్లి ఆధునికీకరణ చేశాడా..? ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు సక్రమంగా ఖర్చు చేశాడా..? వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తానని చెప్పాడు… చేశాడా? ఆయన చేసింది ఏదైనా ఉంది అంటే రూ. 60 ఉన్న మద్యం బాటిల్ ను రూ.200 కు పెంచాడు. 30 వేల మంది ఆడబిడ్డలు అదృశ్యం కావడం.. వారి ఇళ్లల్లో కన్నీరు మిగిల్చాడు. ఇలాంటి వ్యక్తా మన కలలను నిజం చేసేది..? ఇంకోసారి జగన్ కు ఓటు అడిగే అర్హత ఉందా..?’ అని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు. గురువారం పాలకొండలో నిర్వహించిన వారాహి విజయభేరి సభలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రసంగించారు. పాలకొండ అసెంబ్లీ అభ్యర్థి శ్రీ నిమ్మక జయకృష్ణ, అరకు లోక్ సభ అభ్యర్థి శ్రీమతి కొత్తపల్లి గీతను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ… “ఉత్తరాంధ్ర అంటే నాకు పంచప్రాణాలు. ఇక్కడి భాష, యాసలు, మనుషుల స్వచ్చమైన మనసు నా గుండెను కదిలిస్తుంది. ఈ ప్రాంతం ఆట, పాటలు గుండెను ఊపేస్తుంది. ప్రముఖ విప్లవ కవి శ్రీశ్రీ, తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు రామూర్తి వంటి వారికి జన్మనిచ్చిన నేల. నాకు నటన నేర్పిన నేల ఉత్తరాంధ్ర. ఉత్తరాంధ్ర భాషా నాకు ఎంత ఇష్టమంటే… ఇక్కడ సరదగా పాడుకునే చిన్న చిన్న పాటలను నా సినిమాల్లో పెట్టాను. ఇక్కడి యువత కడుపు మంటను అర్ధం చేసుకున్నాను కనుకే రెండు చోట్ల ఓడిపోయినా దశాబ్ధ కాలంగా మీకోసం నిలబడి ఉన్నాను.
• గిరిజనులకు ట్రైకార్ రుణాలు అందిస్తాం
చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవాలనుకునే గిరిజనులకు ఐటీడీఏ ఆధ్వర్యంలో ట్రైకార్ రుణాలు అందించేది. గిరిజనులకు అందించే రుణాల్లో కేంద్రం 60 శాతం, రాష్ట్రం 35 శాతం సబ్సిడీ ఇచ్చేవి. మిగిలిన 5 శాతం లబ్ధిదారులు తిరిగి కడితే సరిపోయేది. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ రుణాలను నిలిపేసింది. అరకొర ఇచ్చిన వాళ్లకు కూడా రాష్ట్రం తన సబ్సిడీని 35 శాతం నుంచి 30 శాతానికి తగ్గించింది. నేను కూటమి తరఫున మాట ఇస్తున్నాను. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే గిరిజనులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడంతో పాటు స్వయం ఉపాధి చేసుకునే వాళ్లకు పాత సబ్సిడీకే ట్రైకార్ రుణాలు అందిస్తాం.
• రంగులకు రూ. 2,300 కోట్లు తగలేసింది
వైసీపీ అధికారంలోకి వచ్చాక తోటపల్లి రిజర్వాయర్ ఆధునికీకరణ పనులు పడకేశాయి. 32 వేల ఎకరాలకు సాగునీరు అందించే ఎడమ కాలువ పనులు నత్తనడకన సాగుతోంది. జంపర కోట రిజర్వాయర్ పనులు ముందుకు సాగడం లేదు. తోటపల్లి ఎడమకాలువకు రూ. 192 కోట్లు, జంపర కోట పనులు పూర్తవ్వడానికి రూ. 22 కోట్లు ఖర్చు చేస్తే చాలు… వేలాది ఎకరాలకు నీరందించి, రైతుల కన్నీరు తుడవొచ్చు. వైసీపీ ప్రభుత్వానికి మాత్రం పార్టీ రంగులు ప్రభుత్వ కార్యాలయాలకు వేయడం, తీయడంలో ఉన్న శ్రద్ధ… సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేయడంలో లేదు. కేవలం రంగులు వేయడానికి, తీయడానికి ఈ రంగుల ప్రభుత్వం ఖర్చు చేసింది అక్షరాల రూ. 2,300 కోట్లు. ఇందులో పదోవంతు రూ. 214 కోట్లు ఖర్చు చేస్తే తోటపల్లి ఎడమ కాలువ, జంపర కోట పనులు పూర్తయ్యేవి.
• గ్రామం నుంచి సంగ్రామానికి ఎక్కువ సమయం పట్టదు
సిక్కోలు అంటే ఉద్యమాల పురిటి గడ్డ. ఈ ప్రాంతంలో అన్యాయాన్ని ఎదిరించే తత్వం ఉంది. 1960ల్లో భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గడ్డ ఇది. ఇప్పుడు జగన్ లాంటి దోపిడీ దారుడిని నిలువరించలేమా..? సూర్యుడు నుంచి సూర్యుడికి మధ్య 24 గంటల దూరం .. మనిషి నుంచి మనిషికి రెండు గుండెలే దూరం .. గ్రామం నుంచి సంగ్రామానికి ఎంతో కాలం పట్టదని జగన్ కు చెప్పాలి. దోపిడీ, దౌర్జన్యాలు, అన్యాయాలు చేస్తే చూస్తూ ఊరుకుంటామా..? తిరగబడతాం. ఎదిరిస్తాం. మన హక్కుల కోసం పైకి లేచి నిలబడి పోరాటం చేస్తాం. వంశధార, నాగావళి నదుల నుంచి ఇసుకను అడ్డగోలుగా దోచుకుంటున్నారు. ఉత్తరాంధ్ర భూములు స్థానికుల నుంచి లాక్కుంటున్నారు. తప్పు జరిగినప్పుడు ఎదిరించకపోతే భవిష్యత్తు తరం నలిగిపోతుంది. 1960లో జరిగిన పోరాటం గుర్తుకు తెచ్చుకోండి. అన్యాయంపై తిరగబడటానికి కత్తులు, కటారులు అవసరం లేదు. ఒక్క ఓటు అనే ఆయుధంతో వైసీపీని అంతం చేయండి. తండ్రి లేని బిడ్డను ఒక్క ఛాన్స్ … ఒక్క ఛాన్స్ అంటే జాలి పడి మీరు ఛాన్స్ ఇచ్చారు. ఇక చాలు ఆయన అడిగిన ఛాన్స్ అయిపోయింది. రాష్ట్ర భవిష్యత్తు కోసం కూటమికి మద్దతుగా నిలబడండి.
• భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధికి రూ. కోటి విరాళం
ప్రతి చేనుకు నీరు- ప్రతి చేతికి పని ఇదే కూటమి లక్ష్యం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. నిరుద్యోగులకు రూ. 3 వేల భృతి ఇస్తాం. ఏడాదిలోపు మెగా డీఎస్సీ నిర్వహిస్తాం. వృద్ధాప్య పెన్షన్ రూ. 4 వేలు చేస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ అందిస్తాం. ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల హెల్త్ ఇన్సురెన్స్ చేస్తాం. ప్రతి మహిళకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లతో పాటు, ఆర్టీసీ ప్రయాణం ఉచితం చేస్తాం. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి రూ. 450 కోట్లను వైసీపీ ప్రభుత్వం దారిమళ్లించింది. సంక్షేమ నిధిని తిరిగి పునరుద్ధరిస్తాం. దానికి నా తరఫున కోటి విరాళం అందిస్తాను. సీతంపేటలో మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి, డాక్టర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటాం. ఏనుగుల దాడుల వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం. దానికి శాశ్వత పరిష్కార మార్గం కనుగొంటాం. ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ కార్డ్స్ అందిస్తాం. విద్యార్థులకు సకాలంలో ఫీజురీయంబర్స్ మెంట్ చేసే బాధ్యత తీసుకుంటాం. సీపీఎస్ రద్దుకు ఏడాదిలోగా బలమైన పరిష్కారం తీసుకొస్తాం. ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు వచ్చేలా చర్యలు తీసుకుంటాం.
• పాలకొండను బంగారు కొండగా మారుస్తాం
పాలకొండ నియోజకవర్గంలో వాగులు, వంకలు, జలపాతాలు ఎక్కువ ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం. సీతంపేట, భామిని మండలాల్లో తాగునీటికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించేలా బాధ్యత తీసుకుంటాం. ఉద్ధానం సమస్యకు సంపూర్ణ పరిష్కారం దొరికే వరకు ఆ ప్రాంత ప్రజలకు అండగా నిలబడతాం. ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పిస్తాం. వైసీపీ ప్రభుత్వం ఎస్టీలకు చెందిన 16 పథకాలను తొలగించింది వాటిని పునరుద్ధరిస్తాం. మొత్తంగా పాలకొండను బంగారు కొండగా మారుస్తాం. కూటమి తరఫున అరకు ఎంపీ అభ్యర్థిగా శ్రీమతి కొత్తపల్లి గీత పోటీ చేస్తున్నారు. పాలకొండ ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీ నిమ్మక జయకృష్ణ పోటీ చేస్తున్నారు. వారిని భారీ మెజార్టీతో గెలిపించాల” ని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి, పార్టీ నాయకులు శ్రీ పిసిని చంద్రమోహన్, శ్రీ గర్భాన సత్తిబాబు, శ్రీ వంపూరి గంగులయ్య, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం, బీజెపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.