పరదాల మహారాణిని ఇంటికి పంపే సమయం వచ్చేసింది

మహారాణి

• విద్యార్థులతో పెట్టుకుంటే ఏమవుతుందో జగన్ తెలుసుకోవాలి
• అయిదేళ్లుగా 38 కేసుల్లో బెయిల్ మీద ఉన్న పాలకుడు జగన్
• జగన్ అవినీతి విషయంలో ఎన్టీయే పాలనలో జైలుకెళ్లడం ఖాయం
• శ్రీ మోదీతో చెప్పి జగన్ కు ప్రత్యేక జైలు సదుపాయం కల్పిస్తాం
• క్రిస్టయన్ల హక్కులకు ఏ మాత్రం భంగం కలగనివ్వం
• కాపులకు మేలు చేసే ఈబీసీ రిజర్వేషన్లను అన్యాయంగా జగన్ తొలగించారు
• గంగా నది మాదిరి గోదావరి ప్రక్షాళనకు కట్టుబడి ఉన్నాం
• జగన్ తో చేరి జక్కంపూడి రామ్మోహన రావు గారి పిల్లలు అవినీతిమయం అయ్యారు
• రాజానగరం వారాహి విజయభేరి సభలో శ్రీ పవన్ కళ్యాణ్
‘రాష్ట్ర పరదాల మహారాణిని నిన్న ఆదిత్య కళాశాల విద్యార్థులు బస్సు యాత్రలో ఏదో అన్నారని కోపం వచ్చింది. విద్యార్థులతో పెట్టుకుంటే ఏమవుతుందో మహారాణి తెలుసుకుంటే మంచిది. ఈ పరదాల మహారాణి బయటకు వస్తే… విద్యార్థులంతా జేజేలు కొడతారని భావించారు. విద్యార్థులు వేరుగా స్పందించడంతో ఇప్పుడు వారిని ఇబ్బందులు పెట్టే చర్యలకు దిగారు. ప్రజలు అన్నీ చూస్తున్నారు. ఈ మహారాణిని ఇంటికి పంపడానికి ప్రజలు ఎప్పుడో సిద్ధమై ఉన్నార’ని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. శాడిస్టిక్ మనస్తత్వం ఉన్న జగన్ కలుగులో ఎలుక లాంటివాడు.. ఎవరికి పేరు వచ్చినా తట్టుకోలేని స్వభావం. ఒక విచిత్రమైన మెంటాలిటితో చిత్ర పరిశ్రమను సైతం రాజకీయాల్లోకి లాగాలని చూశారని వ్యాఖ్యానించారు. సినిమా టికెట్ల రేట్ల పెంపుదల విషయంలో ఎంతో హుందాగా ముఖ్యమంత్రితో మాట్లాడానికి వచ్చిన అభిమాన హీరోలను సైతం గేటు దగ్గర నుంచి నడిపించి, కనీసం భోజనం కూడా పెట్టకుండా కించపరిచి ఆనందం పొందిన వ్యక్తి అని అన్నారు. అజాత శత్రువుగా సినిమా పరిశ్రమలో ఉండే శ్రీ చిరంజీవి గారిని సైతం కించపరిచారన్నారు. శనివారం రాజానగరంలో వారాహి విజయభేరి బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ… “ఉదయం లేస్తే మనందరికీ నీతులు చెప్పే ముఖ్యమంత్రి గత ఐదేళ్లుగా బెయిల్ మీద ఉన్నాడు. 38 కేసులు ఎదుర్కొని 16 నెలలు చిప్పకూడు తిన్న వ్యక్తి. ప్రతి శుక్రవారం వాయిదా ఎలా ఎగ్గొట్టాలి అని వణుకుతూ ఉంటాడు. రాబోయే ఎన్డీఏ ప్రభుత్వంలో జగన్ అవినీతి విషయంలో మళ్లీ జైలుకెళ్లడం ఖాయం. జగన్ ఎక్కడ కోరుకుంటే అక్కడ.. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీగారితో చెప్పి ప్రత్యేక జైలు ఏర్పాటు చేస్తాం. అవినీతి పరులను వదలమని రాజస్థాన్ రాష్ట్రంలో నిర్వహించిన సభ సాక్షిగా చెప్పిన శ్రీ నరేంద్ర మోదీ గారి గ్యారెంటీతో జగన్ జైలుకు వెళ్లడం ఖాయం.
• నన్ను తిడితే కాదు… ప్రజలను వేధిస్తే కోపం వస్తుంది
జగన్ ప్రతిసారి నన్ను వ్యక్తిగతంగా దూషిస్తే కోపం వస్తుందని భావిస్తాడు. అందుకే నోటికి ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడతాడు. నన్ను వ్యక్తిగతంగా దూషించినా నాకు కాస్త అయినా కోపం ఉండదు. ఒక దళిత డ్రైవర్ ను చంపి డోర్ డెలివరీ చేస్తే కోపం వస్తుంది. అణగారిన వర్గాలకు అకారణంగా అన్యాయం చేస్తే కోపం వస్తుంది. బస్సు యాత్రలో చిన్న పూల మూట తగిలితే డ్రామాలు చేసి కంటిపైన పెద్ద స్టిక్కర్ వేసుకొని తిరుగుతున్న జగన్ కు 30 వేల మంది మహిళలు అదృశ్యమైతే ఏమాత్రం పట్టదు. ప్రతిసారి నా మీద పడి వ్యక్తిగతంగా ఏడవడం తప్ప పాలన కూడా చేతకాదు.
* వైసీపీ రహిత రాష్ట్రం కోసమే కూటమి
ఈసారి రాష్ట్రంలో వైసీపీ పరిపాలన వస్తే రాష్ట్రం పూర్తిగా నాశనం కావడం ఖాయం అని తెలిసే మొదట నుంచి వైసీపీ రహిత రాష్ట్రం కోసం ప్రయత్నిస్తున్నాను. 2019 తర్వాత జనసేన పార్టీ బలం భారీగా పెరిగింది అని తెలిసినా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు.. మళ్లీ జగన్ రాకూడదు.. రాష్ట్రం నాశనం కాకూడదు అనే లక్ష్యంతోనే ఎన్నికలకు వెళ్తున్నాం. గోదావరి జిల్లాల్లో చాలా నియోజకవర్గాల్లో జనసేన నెంబర్ వన్ స్థానంలో ఉండి కూడా వెనక్కి తగ్గాం. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసుకొని పదునైన వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాం.
• క్రిస్టియన్లపై ఈగ వాలనివ్వను
అన్ని మతాలను సంపూర్ణంగా నమ్మేవాడిని. అన్ని కులాలను గౌరవించే వాడిని. నా భార్య కూడా రష్యన్ క్రిస్టియన్ ఆర్థోడక్స్ విధానాలు పాటిస్తారు. నా పిల్లలకు సైతం మీరు ఏ మతాన్ని ఎంచుకున్న పర్వాలేదని, దానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పిన వ్యక్తిని. జగన్ ఇప్పుడు రాష్ట్రంలో కొత్త పుకారు తీసుకొస్తున్నాడు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే… క్రిస్టియన్లకు కష్టకాలం తప్పదని తన బృందంతో ప్రచారం చేయిస్తున్నాడు. నేను మనస్ఫూర్తిగా అన్ని కులాలను సమంగా చూసే వ్యక్తిని. జగన్ జెరూసలెం ఎప్పుడు వెళ్లాడో తెలియదు కానీ నేను ఆయన కంటే ముందే జీసస్ నడియాడిన ప్రాంతాన్ని ఎంతో భక్తిశ్రద్ధలతో దర్శించినవాడిని. పిఠాపురం నియోజక వర్గానికి మొదటసారి వచ్చిన సందర్భంగా కూడా చారిత్రక ఆంధ్రా బాప్టిస్ట్ చర్చ్ ను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశాను. క్రిస్టియన్ సోదరులకు మనస్ఫూర్తిగా ఒకటే చెబుతున్నాను. మీ హక్కులకు, రక్షణకు ఏమాత్రం భంగం కలిగినా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం సాక్షిగా పూర్తిగా అండగా నిలబడే బాధ్యత నేను తీసుకుంటాను. క్రిస్టియన్ సోదరులు జగన్ చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పి కొట్టాలి.
• కాపులకు ఈబీసీ రిజర్వేషన్లు తొలగించిన వ్యక్తి జగన్
ఆర్థికంగా బలహీనంగా ఉన్న వర్గాలకు కేంద్ర ప్రభుత్వం కల్పించిన 5 శాతం రిజర్వేషన్లను జగన్ అధికారంలోకి రాగానే తొలగించిన వ్యక్తి. కాపులకు ప్రతి అంశంలోనూ అన్యాయం చేసిన వ్యక్తి. ఏటా కాపు కార్పొరేషన్ కు రూ. 2 వేల కోట్లు ఇస్తానని చెప్పి నిధులను దారి మళ్లించిన పాలకుడు. ఆఖరికి కాపు కార్పొరేషన్ కార్యాలయంలో టైపిస్ట్ కు కూడా జీతం ఇవ్వలేని దుస్థితికి తీసుకొచ్చాడు. తూర్పుగోదావరి లో జగన్ పర్యటించినప్పుడు కాపులకు రిజర్వేషన్ కల్పించలేను అని చెప్పినా కాపు నాయకులు మద్దతు ఇచ్చారు. 2014 -19 మధ్య అమలైన ఈబీసీ రిజర్వేషన్లు జగన్ పాలన మొదలు కాగానే ఎందుకు రద్దయ్యాయో జగన్ ను కాపు నాయకులు అడగాలి. ప్రతి దానికి నన్ను తిట్టడం మానేసి … కాపుల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు మంచి చేసే 5 శాతం రిజర్వేషన్ ఎందుకు తీసేశావు జగన్ అని అడగాలి. దీనికి జగన్ తో పాటు వైసీపీలో గెలిచిన కాపు ఎమ్మెల్యేలు సమాధానం చెప్పాలి. కాపు నేస్తం లబ్ధిదారులను కూడా భారీగా తగ్గించారు. 65 లక్షల మందికి పథకం అమలు కావాల్సి ఉండగా కేవలం 2.35 లక్షల మందికి మాత్రమే పథకం అమలవుతోంది. కాపు నేస్తంలో రూ. 354 కోట్లు లబ్ధిదారులకు అందించి ప్రచారానికి రూ. 200 కోట్లు ఖర్చు చేశారు. లబ్ధిదారుల నుంచి దరఖాస్తును తీసుకొని వాటిని మూలన పడేశారు.
• సహవాస దోషంతో…
6 నెలలు స్నేహం చేస్తే వారు వీరైపోతారు అన్నట్లుగా జగన్ సహవాసంలో కార్మిక నాయకుడుగా పేరున్న శ్రీ జక్కంపూడి రామ్మోహనరావు గారి పిల్లలు ఇద్దరూ పాడైపోయారు. ప్రకృతి వనరుల దోపిడీలో, లే అవుట్లు పేరుతో 15 శాతం కమీషన్ల దందాలో ఆరితేరారు. ఆవ భూములతో సహ 600 ఎకరాలకు పైగా భూములను అత్యంత తక్కువ ధరకు కొని ఎక్కువగా పరిహారం పొందిన వ్యక్తులుగా చరిత్రలో మిగిలారు. ఆఖరికి కేంద్రం ప్రకటించిన భూసేకరణ చట్టం దుర్వినియోగం అవుతున్న నియోజకవర్గాలలో రాజానగరం ముందుంది. రాజానగరం నియోజక వర్గాన్ని గంజాయికీ, బ్లేడ్ బ్యాచ్ లకీ, బెట్టింగులకు కేంద్రం చేశారు. ఇరిగేషన్ ఏఈ మీద బహిరంగంగా దాడి చేయడం వీరి అహంకారానికి తార్కాణం. గ్రావెల్, మట్టి అమ్మకాల్లో ఆరితేరిపోయారు. ఒక్క ఇసుకలో రూ. 100 కోట్లు… జగనన్న ఇళ్ల పట్టాల పథకంలో రూ. 300 కోట్లు వెనకేసుకున్నారు. ఆఖరికి గ్రీన్ ట్రిబ్యూనల్ వీరి ఆగడాలు భరించలేక రూ. 3.03 కోట్ల జరిమానా విధించినా వీరి దోపిడీ ఆగలేదు. గోదావరిలో అందమైన ఇసుక తిన్నెలను మాయం చేశారు. ప్రకృతి సహజ సంపదను పూర్తిగా కాజేశారు. రాజానగరాన్ని పూర్తిగా అక్రమాలకు కేరాఫ్ గా మార్చారు.
* పోలవరం పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాము
కేంద్ర జలశక్తి శాఖ మంత్రి శ్రీ గజేంద్ర షెకావత్ గారు ఓ సందర్భంలో నాతో మాట్లాడుతూ పోలవరాన్ని జగన్ ప్రభుత్వం ఏటీఎం మాదిరి వాడుకుందని చెప్పారు. పోలవరం అనేది ఆంధ్రుల జీవనాడి. పోలవరం పూర్తయితే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది. అన్ని ప్రాంతాల్లోనూ భూగర్భ జలాలు పెరుగుతాయి. పోలవరం పూర్తిచేసే బాధ్యతను ఎన్డీఏ ప్రభుత్వం కచ్చితంగా తీసుకుంటుంది. ఉత్తరాదిలో గంగానది ప్రక్షాళన మాదిరి శ్రీ నరేంద్ర మోదీ గారితో మాట్లాడి గోదావరి ప్రక్షాళన కు నడుం బిగించాలని కోరుతాం. నదిలో కలుస్తున్న మురుగునీటిని శుద్ధి చేసి పునర్ వినియోగం చేసేలా చూస్తాం. అలాగే విషపూరిత నీరు గోదావరిలో కలవకుండా చర్యలు తీసుకుంటాం. రాజమండ్రి – భద్రాచలం పాపికొండల పర్యాటక సర్క్యూట్ ను కేంద్రం అమలు చేసేలా చూస్తాం. జగన్ కు ఒకటే చెబుతున్నాను… పదే పదే వ్యక్తిగత దూషణలకు వెళితే నాకు కోపం రాదు. నువ్వు నా సతీమణిని పెళ్లాం అని సంభోదిస్తే … నేను నిన్ను నా నాల్గో పెళ్లాం అని అనాల్సి ఉంటుంది. నా నాల్గో పెళ్లానికి కాకినాడలో అవమానం జరిగింది అని ప్రజలకు చెప్పాల్సి ఉంటుంది. 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే అగ్రగామి కావడానికి ప్రణాళిక ప్రకారం సన్నద్ధం అవుతోంది. దానిలో యువశక్తే ప్రధాన బలం. రాష్ట్రంలోని యువశక్తిని పూర్తి నైపుణ్యంతో తీర్చిదిద్ది 2047 నాటికి దేశానికి వెన్నుముకగా తయారు చేస్తాం. ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తాం. ఆంధ్రప్రదేశ్ లో రానున్నది కూటమి ప్రభుత్వం. వైసీపీ పీఠాన్ని బద్దలు కొట్టడం ఖాయం. రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా శ్రీమతి పురందేశ్వరి గారిని, రాజానగరం ఎమ్మెల్యే అభ్యర్థిగా బత్తుల బలరామకృష్ణ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలి’’ అని కోరారు.

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్