తెలుగు రాష్ట్రానికి తెలుగు రాని ముఖ్యమంత్రి ఉండడం దురదృష్టం

ముఖ్యమంత్రి

• ఆయనకు వయోజన సంచార పాఠశాల పథకంలో తెలుగు నేర్పిస్తాను
• రోజుకోసారి తిట్టించుకోకపోతే వైసీపీ వారికి నిద్ర రాదు
• తవ్విన కొద్దీ బయటపడుతున్న వైసీపీ పాడు పనులు
• రాష్ట్రం బాగుపడాలంటే ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీకి ఒక్క సీటూ దక్కకూడదు
• ఎమ్మెల్యే అనుమతి లేకపోతే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా తీసుకోవడం లేదు
• భీమవరం నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్

               ‘ముఖ్యమంత్రికి తెలుగు సరిగ్గా పలకడం రాదు. తెలుగు అక్షరాలు, ఒత్తులు, దీర్ఘాలు చిన్నప్పుడు సరిగ్గా నేర్చుకోకపోవడం వల్లే వారాహికి, వరహికి తేడా తెలియకుండా మాట్లాడారు. తెలుగు రాష్ట్రంలో ఉంటూ తెలుగు ఉచ్ఛారణ సరిగా రాని నియంత, కంఠకుడు పాలనలో ఉన్నందుకు చింతిస్తున్నాను. జనసేన పార్టీ అధికారంలోకి వచ్చాక వయోజన సంచార పాఠశాల పథకంలో భాగంగా ఈ ముఖ్యమంత్రికి తెలుగు పదాలు ఎలా పలకాలో నేనే నేర్పిస్తాన’ని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. స్కూల్ విద్యార్థులు పాల్గొన్న కార్యక్రమంలో ఎలా మాట్లాడాలో ఈ ముఖ్యమంత్రికి తెలియకపోవడం దురదృష్టకరమన్నారు. వారాహి విజయయాత్రలో భాగంగా బుధవారం భీమవరం నియోజకవర్గ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “వైసీపీ నాయకులు తిట్టించుకోనిదే నిద్రపోరు. ఆ స్థాయిలో పాడు పనులు చేస్తారు. నేను మంగళగిరిలో చెప్పు చూపించాను అంటే దాని వెనుక చాలా కథ జరిగింది. పోరాటం, ఒత్తిడి తీసుకోనిదే రాజకీయాల్లో మార్పు రాదు. ధైర్యంగా నిలబడ్డ వాడే రాజకీయాలు చేయగలడు. ముఖ్యమంత్రి స్థాయి నుంచి పోలీస్ వ్యవస్థ వరకు అందరూ మనల్ని భయపెడతారు, కేసులు పెడతారు, వాటన్నింటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. మనం భయపడే కొద్ది వాళ్లు భయపెడుతూనే ఉంటారు. మనం ధైర్యంగా ఎదురు తిరిగితే వాళ్లు సైలెంట్ అయిపోతారు.
• ఎమ్మెల్యే గుత్తాధిపత్యం ఏంటి?
           నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా ఎమ్మెల్యే పర్మిషన్ ఎందుకు? పింఛన్ ఇవ్వాలన్నా… కుళాయి కనెక్షన్ కావాలన్నా… చివరకు పోలీస్ స్టేషన్ లో చిన్న ఫిర్యాదు చేయాలన్నా ఎమ్మెల్యే పర్మిషన్ ఉంటే తప్ప నమోదు చేయడం లేదు. నియోజకవర్గంపై ఎమ్మెల్యే గుత్తాధిపత్యం ఏంటి? నియోజకవర్గంలో ఉన్న ఒక కళాశాలకు కస్తూర్బాగాంధీ పేరు తొలగించి ఎమ్మెల్యే తండ్రి పేరు పెట్టుకోవడం ఏంటి? నిజంగా తల్లిదండ్రుల మీద ప్రేమ ఉంటే మీరే ఒక కాలేజీ ఏర్పాటు చేసి దానికి మీ తల్లిదండ్రుల పేరు పెట్టుకోండి.. ఎవడు కాదన్నాడు. డిఎన్ఆర్ కాలేజీకి దంతులూరి, గన్నబత్తుల కుటుంబీకులు సొంత ఆస్తులు ఇచ్చేశారు. ఉన్న ఆస్తులను లాక్కోలేదు. సమాజంలో ఇచ్చే గుణాన్ని పెంపొందించాలనే జనసేన పార్టీని స్థాపించాం. రాష్ట్రం, సమాజం బాగుపడాలంటే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక్క సీటు కూడా వైసీపీ గెలవకూడదు. భీమవరంలో జనసేన జయకేతనం ఎగురవేస్తుంది” అన్నారు.
• ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి జ్ఞానం లేదు… అసమర్థుడు : శ్రీ నాదెండ్ల మనోహర్
               పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ… “పాలనపై పట్టు, సమర్థత లేని వ్యక్తి పాలించడం వల్లే రాష్ట్రం అథోగతిపాలైంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి జ్ఞానం లేదు. ప్రభుత్వ కార్యక్రమాల కోసం ఏర్పాటు చేసిన సభలను విపక్ష నాయకులపై వ్యక్తిగత విమర్శల కోసం ఉపయోగించుకోవడం సిగ్గుచేటు. చిన్న పిల్లలు పాల్గొన్న సభలో వ్యక్తిగత విషయాలపై మాట్లాడకూడదన్న జ్ఞానం, ఇంగితం లేవు. ఇలాంటి మేనమామ ఏ ఇంట్లో ఉన్నా తన్ని వెళ్లగొడతారు. ప్రజాప్రతినిధులు వెళ్లలేని ప్రాంతాలకు కూడా వెళ్లి జనవాణి కార్యక్రమం ద్వారా అక్కడి ప్రజల సమస్యలు తెలుసుకొని దానిపై స్పందిస్తున్నది ఒక్క పవన్ కల్యాణ్ గారు మాత్రమే. బుద్ధి లేని ముఖ్యమంత్రి మాత్రం ప్రభుత్వ కార్యక్రమాల్లో వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. ఎంత మందిని దోచుకున్నాం… ఎన్ని కేసులు ఉన్నాయి… ఎన్ని లక్షల కోట్లు వెనకేసుకున్నాం అన్నది కాదు… అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏం చేశామని ఆలోచించాలి. దివ్యాంగులను ఈ ప్రభుత్వం ఎలా వేధిస్తోందో మన కళ్లారా చూస్తున్నాం. అనేక నిబంధనలు చూపించి పింఛన్లు పీకేస్తోంది.
• 30వ తేదీ బహిరంగ సభను విజయవంతం చేయండి
                 జనసేన పార్టీ నాలుగేళ్లలో అనేక కార్యక్రమాలు చేసింది. ముఖ్యంగా ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలబడింది. దీనికోసం అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సొంత నిధుల నుంచి రూ.5 కోట్లు విరాళంగా ఇచ్చారు. భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై భీమవరం, ఉండి నియోజకవర్గాల్లోనే సమావేశాలు నిర్వహించాం. ప్రజల్లో జనసేన పార్టీపై నమ్మకం పెరిగింది. జనసైనికులు, వీరమహిళలు ప్రజల్లోకి వెళ్లండి. కేసులు గురించి భయపడకండి. భీమవరంలో జనసేన జెండా ఎగరడానికి మనందరం కలిసికట్టుగా పనిచేద్దాం. వారాహి విజయ యాత్ర ప్రారంభమై 16 రోజులు గడిచింది. ఈ నెల 14వ తేదీన అన్నవరంలో యాత్ర మొదలైంది. 30వ తేదీన భీమవరం అంబేడ్కర్ సెంటర్లో జరగనన్న బహిరంగ సభతో మొదట విడత యాత్ర పూర్తవుతుంది. స్వల్ప విరామం తరువాత యాత్ర మళ్లీ మొదలవుతుంది. 30వ తేదీన జరగనున్న బహిరంగ సభను జనసైనికులు, వీరమహిళలు అందరూ కలసికట్టుగా విజయవంతం చేయాలి” అని కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ కొటికలపూడి గోవిందరావు, పీఏసీ సభ్యులు శ్రీ వేగేశ్న కనకరాజు సూరి, పార్టీ నాయకులు శ్రీ ఇర్రంకి సూర్యరావు, శ్రీ చనమల్ల చంద్రశేఖర్, శ్రీ మల్లినీడి తిరుమలరావు, శ్రీ గుండా జయప్రకాష్, శ్రీ కామన రామకృష్ణ, శ్రీమతి కారేపల్లి శాంతిప్రియ తదితరులు పాల్గొన్నారు.

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్