• క్షేత్రస్థాయిలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి
• కోనసీమ అల్లర్ల కేసు తీసివేయడంలో వైసీపీ నిజాయతీగా వ్యవహరించాలి
• అమలాపురం జనవాణి కార్యక్రమంలో ప్రజా సమస్యలు విన్న శ్రీ పవన్ కళ్యాణ్
నాడు – నేడు పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేస్తున్నామని పాలకుల ప్రచార ఆర్భాటం తప్ప క్షేత్రస్థాయిలో కనీసం ఆడబిడ్డలకు మరుగుదొడ్లు కూడా లేవని, ఇది ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయమని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లి పాఠశాలలో నాలుగేళ్ల క్రితం మరుగుదొడ్లు కూల్చేసి ఇప్పటి వరకు నిర్మించలేదని ఆ పాఠశాలకు చెందిన బాలికలు శ్రీ పవన్ కళ్యాణ్ ఎదుట మొరపెట్టుకున్నారు. టాయిలెట్స్ లేకపోవడంతో కాలకృత్యాలు తీర్చుకోవడానికి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. వారాహి విజయయాత్రలో భాగంగా గురువారం అమలాపురంలో “జనవాణి- జనసేన భరోసా” కార్యక్రమం నిర్వహించారు. వందలాది మంది తరలివచ్చి వారి సమస్యలను శ్రీ పవన్ కళ్యాణ్ కి విన్నవించారు. తొలుత తపస్వి శ్రీ భగవాన్ బాలయోగీశ్వరులు, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ చిత్రపటాలకు శ్రీ పవన్ కళ్యాణ్ పుష్పాంజలి ఘటించారు. అనంతరం ప్రజాసమస్యలను స్వయంగా విన్నారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… “కోనసీమ అల్లర్ల సమయంలో దాదాపు 250 మంది అమాయకులపై కేసులు పెట్టి వేధించారు. కనీసం కుటుంబ సభ్యులకు కూడా చెప్పకుండా యువతను అరెస్టు చేశారు. ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకో కేసు పెట్టి తీవ్రంగా వేధించారు. కేసులు తీసేశామని ఇటీవల ప్రకటించిన వైసీపీ ప్రభుత్వ మాటలో ఏ మాత్రం నిజం లేదని తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో అప్పటి కేసుల వల్ల ఇంకా చాలామంది ఇబ్బందుల్లోనే ఉన్నారు. దివ్యాంగులకు పెన్షన్ ఇవ్వడానికి కూడా ఈ ప్రభుత్వానికి మనసు రావడం లేదు. కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయని, రకరకాల నిబంధనల పేరు చెప్పి పెన్షన్లు పీకేస్తున్నారు. ఉద్యోగాల విప్లవం తీసుకొస్తాం… ప్రతి ఏడాది జనవరి 1వ తేదీ జాబ్ క్యాలెండర్ విడుదల చేసి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.50 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు కనీసం నోటిఫికేషన్లు ఇవ్వలేకపోయార”ని వైసీపీ తీరును ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు శ్రీ కందుల దుర్గేశ్ పాల్గొన్నారు. పార్టీ నేత శ్రీ డి. వరప్రసాద్ సమన్వయకర్తగా వ్యవహరించారు.