* రైతులు, యువత, మత్స్యకారులు, దివ్యాంగులు..
* భిన్న వర్గాల ప్రజల ఆవేదనలు విన్న జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్
ఏలేరు, సుద్దగడ్డ ఆధునీకరణను పాలకులు అటకెక్కించేశారు.. అయితే అతివృష్టి లేకుంటే అనావృష్టితో రైతులు, గొల్లప్రోలు మండల పరిధిలో పలు గ్రామాల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.. ఉన్న పళంగా వరదలు వస్తే సుమారు 6 వేల మంది ప్రజలు కట్టుబట్టలతో రోడ్డున పడాల్సి వస్తోంది.. ఓ ముంపు బాధితుడి ఆవేదన ఇది… ఏలేరు ఆధునీకరణ పేరిట భూ సేకరణకు నోటిఫికేషన్ జారీ చేశారు. పరిహారం అడుగుతుంటే ఇప్పుడు నోటిఫికేషన్ గడువు ముగిసిందంటున్నారు.. మరో నిర్వాసితుడి వ్యధ.. మత్స్యకారుల్ని ముందుకు నడిపిస్తానన్న ముఖ్యమంత్రి మా జీవితాలను ఏడెనిమిది అడుగులు వెనక్కి పోయేలా చేశారు.. సముద్రపు కోతకు బలవుతున్న ఉప్పాడ తీర ప్రాంత వాసుల గోడిది.. విద్యాలయాల్లో గంజాయి మాఫియా రాజ్యమేలుతోంది సర్.. ఇంకో యువకుడి మనోవేదన.. దివ్యాంగుల పట్ల పాలకులు చులకన భావంతో ఉన్నారు సర్.. మాకు జనసేన నుంచి భరోసా కావాలి.. దివ్యాంగుల వేదన… శ్మశానం లేక రోడ్డు పక్కనే అంత్యక్రియలు చేసుకోవాల్సి వస్తోంది సర్.. జనసేన వారాహి విజయ యాత్రలో భాగంగా గురువారం మధ్యాహ్నం పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ నిర్వహించిన జనవాణి – జనసేన భరోసా కార్యక్రమంలో ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న సమస్యలు జడివానలా వెల్లువెత్తాయి. శ్రీ పవన్ కళ్యాణ్ తో స్వయంగా తమ సమస్యలు చెప్పుకొనేందుకు ప్రజలు తరలివచ్చారు. పిఠాపురం నియోజకవర్గ పరిసరాల నుంచి వివిధ సమస్యలపై 34 మంది అర్జీలు సమర్పించారు. ప్రతి సమస్యను ఓపికగా విన్న శ్రీ పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని బాధితులకు భరోసా ఇచ్చారు. శ్రీ పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చిన ప్రధాన సమస్యలు చూస్తే…
• మేము ఏలేరు బాధితులం సర్..
ఏలేరు ఆధునీకరణ పేరిట ‘భూసేకరణకు మా భూములు తీసుకుంటామంటూ నోటిఫికేషన్ ఇచ్చారు. అప్పటి లెక్క ప్రకారం ఎకరాకి రూ. 9 లక్షల పరిహారం చెల్లిస్తామన్నారు. ఇప్పుడు నోటిఫికేషన్ గడువు తీరిపోయింది పరిహారం రాదు అంటున్నారు. ప్రాజెక్టు ఆధునీకరణ పేరిట తీసుకున్న భూములకు పరిహారం ఇవ్వకపోగా ఇప్పుడు జగనన్న శాశ్వత భూహక్కు పేరిట సర్వే చేపట్టి ఉన్న పట్టాలో ఉన్న భూమిని తగ్గించి చూపుతున్నారు. స్పందనలో ఫిర్యాదు చేసినా, స్థానిక శాసనసభ్యుడికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదు’ అని శ్రీ కె. పవన్ కుమార్ అనే భూ నిర్వాసితుడు తమకు జరుగుతున్న అన్యాయంపై శ్రీ పవన్ కళ్యాణ్ కి అర్జీ సమర్పించారు. అప్పటికీ ఇప్పటికీ ధరల్లో భారీగా మార్పు వచ్చిందని.. ఇప్పుడు అసలు ఉన్న భూమే లేదంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే అతివృష్టి.. లేకుంటే అనావృష్టి.. ఏలేరు, సుద్దగడ్డ ప్రాజెక్టు కింద ఉన్న రైతులు, గ్రామాల వాసుల సమస్య ఇది. సాగునీటి వ్యవస్థ సరఫరా నియంత్రణ లేక వరదలు వస్తే వేలాది ఎకరాలు ముంపు బారిన పడుతున్నాయి. వరదలు వస్తే ముంపు గ్రామాల్లో ఏటా సుమారు 7 వేల మంది కట్టుబట్టలతో ఇళ్లు ఖాళీ చేసి పోవాల్సి వస్తోంది. రూ. 240 కోట్లతో ఆధునీకరణ చేపట్టనున్నట్టు చెప్పారు. ప్రభుత్వాలు మారుతున్నా సమస్య పరిష్కారం మాత్రం దొరకడం లేదు.. శ్రీ గుండివిల్లి పోలీసు అనే మరో బాధితుడు ఏలేరు, సుద్ధగడ్డ ఆధునీకరణ పనుల నిరవధిక వాయిదా కారణంగా పడుతున్న ఇబ్బందులు తెలియచేశారు.
• మా నమ్మకం జనసేన
‘ఉప్పాడ తీర ప్రాంతంలో గ్రామాలకు గ్రామాలు సముద్ర గర్బంలో కలసి పోతున్నాయి. తుఫానులు, భారీ వర్షాల సమయంలో సముద్రపు నీరు ఇళ్లలోకి వచ్చేస్తోంది. ఉప్పెన సినిమాలో చిత్రించిన ఇల్లు ఇప్పుడు నామ రూపాలు లేకుండా పోయింది.. గతంలో శ్రీ పల్లంరాజు కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో జియో ట్యూబ్ ద్వారా కోతకు అడ్డుకట్ట వేశారు. తుపానుల తాకిడికి అది కాస్తా దెబ్బతినిపోయింది. ఇప్పుడు కనీసం దాన్ని పట్టించుకునే వారు లేరు. పాదయాత్ర సమయంలో మత్స్యకారుల జీవితాలను ముందుకు తీసుకువెళ్తానన్న ముఖ్యమంత్రి.. సముద్ర తీరం నుంచి మమ్మల్ని ఏడెనిమిది అడుగులు వెనక్కి పొయేలా చేస్తున్నారు. సమస్య గురించి ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పుకున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. తుఫాను షెల్టర్లు నిర్మాణం అవసరం ఉంది. ఉన్నవాటినీ వైసీపీ ప్రభుత్వం సచివాలయాలు, కమ్యునిటీ హాల్స్ పేరిట కబ్జా చేసేసింది. ఎమ్మెల్యేకి చెప్పినా ప్రయోజనం శూన్యం. ఉప్పాడ నుంచి కాకినాడ వరకు ఉన్న బీచ్ రోడ్డు దారుణంగా దెబ్బతింది. మా మత్స్యకారులంతా జనసేనని నమ్ముతున్నాం సర్. మీ ప్రభుత్వంలో మా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపండి’ అంటూ ఉప్పాడ తీర ప్రాంతాల్లో నివసించే మత్స్యకార గ్రామాల ప్రజలు తమ సమస్యలు శ్రీ పవన్ కళ్యాణ్ ఎదుట ఏకరువు పెట్టారు.
• మట్టి మాఫియాతో వేదనలు
‘మట్టి మాఫియా పేట్రేగిపోతోంది. 60-70 టన్నుల లోడుతో వెళ్తున్న లారీల కారణంగా మా గ్రామాల్లో రహదారులు దారుణంగా దెబ్బతింటున్నాయి. రహదారి పక్కన ఉన్న చిన్న చిన్న పెంకుటిళ్లు కూడా పాడైపోతున్నాయి. అడ్డుకుంటే కొట్టించి కేసులు పెడుతున్నారు. క్యుబిక్ మీటర్ లెక్కన పది వేల క్యుబిక్ మీటర్లు తవ్వుకునేందుకు వర్క్ ఆర్డర్ తెచ్చుకుని 50 ఎకరాలు 40 అడుగుల లోతు తవ్వేశారు. మాట్లాడితే శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తాలూకా వ్యక్తులు తవ్వుతున్నారని చెబుతున్నారు. జగనన్న కాలనీలకు తోలుతున్నామని చెబుతున్నారు. అక్రమాలను ప్రశ్నిస్తే అధికారుల విధులు అడ్డుకున్నారంటూ వీఆర్వోతో కేసు పెట్టించారు’. అంటూ మట్టి మాఫియా అరాచకాలు తాటిపర్తి గ్రామానికి చెందిన శ్రీ అడబాల వీర్రాజు అనే వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు.
• పట్టా ఇచ్చి నాలుగేళ్లయ్యింది.. స్థలం ఎక్కడ?
‘పేదలందరికీ ఇళ్ల పథకం.. జగనన్న కాలనీల పేరిట ఇళ్ల పట్టాలు ఇచ్చి మాకు నాలుగేళ్లు గడచింది. మా స్థలం ఎక్కడ అంటే చూపించే పరిస్థితి లేదు కాని ఆ స్థలం పేరు చెప్పుకుని వేల ట్రక్కుల మట్టి తోలుకుంటున్నారు. ఇలా మా పరిసరాల్లో సుమారు 5 వేల మందికి పట్టాలు ఇచ్చారు. ఇప్పటికీ స్థలం మాత్రం చూపడం లేదు. జగనన్న కాలనీల ముసుగులో తోలుతున్న మట్టి ఎక్కడికి వెళ్తుందో ఓ డ్రోన్ ఎగరేస్తే తెలుస్తుంది సర్..’ అని శ్రీ మిర్యాల మంగరాజు అనే వ్యక్తి మరో సమస్యపై అర్జీ సమర్పించారు.
• అంత్యక్రియలకు ఆరడుగుల స్థలం కూడా లేదు
‘ఉప్పాడ పరిసరాల్లోని కొత్తపట్నం, సుబ్బంపేట తదితర గ్రామాల ప్రజలు శ్మశాన వాటిక లేక అంతిమ సంస్కారాలకు నానా ఇబ్బందులు పడుతున్నాం. శవదహన కార్యక్రమం చేపట్టేందుకు కనీసం ఆరడుగుల స్థలం కూడా లేదు. వర్షం కురుస్తున్నా అలగే అంత్యక్రియలు చేసుకోవాలి. ఉన్న భూములన్నీ వైసీపీ వాళ్లు కబ్జా చేసేశారు. స్పందనలో అర్జీలు సమర్పించాం. స్థానిక శాసనసభ్యుడి దృష్టికి సమస్య తీసుకువెళ్లాం స్పందన లేద’ని ఉప్పాడ గ్రామానికి చెందిన శ్రీ శివశంకర్ జనసేనాని ఎదుట వాపోయారు.
• యూనివర్సిటీలే గంజాయి అమ్మకాలకు అడ్డాలు
‘వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్ధులకు స్కాలర్ షిప్పులు, ఫీజు రీఎంబర్స్ మెంట్లు చేయడం లేదు. చదువులు పూర్తయ్యాక కూడా ఫీజు చెల్లించలేని పరిస్థితుల్లో సర్టిఫికెట్లు రాక నానా ఇబ్బందులు పడుతున్నాం. యానివర్శిటీ క్యాంపస్ లను గంజాయి అమ్మకాలకు అడ్డాగా మార్చేసి ఈ ప్రభుత్వం విద్యార్ధుల జీవితాలు నాశనం చేస్తోంది. వైసీపీ నేతలు ఆధ్వర్యంలో రాష్ట్ర మొత్తం గంజాయి వ్యాపారం సాగుతోంది. సిగరెట్ల రూపంలో గంజాయి విద్యార్ధులకు సరఫరా చేస్తున్నారు. విద్యార్ధులందరికీ ఈ వ్యసనాన్ని అంటించే ప్రయత్నాలు చేస్తున్నారు’ అంటూ పిఠాపురంకి చెందిన శ్రీ అరుణ్ కుమార్ అనే యువకుడు విద్యార్ధుల సమస్యల మీద అర్జీ సమర్పించారు.
• మా జీతం కంటే కరెంటు బిల్లులు ఎక్కువస్తున్నాయి
‘నేను సాఫ్ట్ వేర్ ఉద్యోగిని. బెంగళూరులో విప్రో సంస్థలో పని చేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వ విధానాల కారణంగా పక్క రాష్ట్రానికి వెళ్లి పని చేసుకోవాల్సి వస్తోంది. కర్ణాటకలో 2000, హైదరాబాద్ లో 1500 సాఫ్ట్ వేర్ కంపెనీలు ఉంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం కలిపినా 100 సంస్థలు కూడా లేవు. ఈ దుర్మార్గ పాలనలో సంస్థలు స్థాపించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేవు. పక్క రాష్ట్రాలలో ఉద్యోగాల్లో చేరి సొంతూళ్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుందామంటే మాకొచ్చే జీతం కంటే కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయి. సొంత రాష్ట్రంలో బతకాలనుకోవడం తప్పా’ అంటూ శ్రీ గొల్లపల్లి రాజేష్ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు.
• 40 ప్రాణాలు పోయినా ప్రభుత్వంలో చలనం లేదు
జయలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంకు పేరిట డిపాజిట్లు సేకరించి రూ. 480 కోట్లు దోచుకున్నారు. 20 వేల మంది ఖతాదారులు మోసపోయారు. అందరికీ జవాబుదారీగా ఉండాల్సిన ప్రభుత్వం నుంచి స్పందన లేదు. స్వయానా ముఖ్యమంత్రి శ్రీ జగన్ రెడ్డి దృష్టికి సమస్య తీసుకువెళ్లినా ఉపయోగం లేదు. బ్యాంకులో దాచుకున్న వారంతా రిటైర్డ్ ఉద్యోగులు, చిన్న చిన్న ఉద్యోగులు. మా పోరాటానికి జనసేన మద్దతు తెలిపితే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. జయలక్ష్మి బ్యాంక్ బాధితులు ఒత్తిడితో ఇప్పటికే 40 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా కొంత మంది ఆరోగ్యం పాడై చికిత్స చేయించుకోవడానికి డబ్బులు లేని పరిస్థితుల్లో చందాలు వేసుకుని వైద్యంసాయం చేస్తున్నాం. ప్రభుత్వంలో మాత్రం చలనం లేదు. మాకు న్యాయం చేయండి’ అంటూ జయలక్ష్మి బ్యాంక్ ఖాతాదారులు అర్జీ సమర్పించారు.
• భూమిని కాజేసేందుకు పిచ్చిదని ముద్ర వేశారు
‘మంత్రి దాడిశెట్టి రాజా పీఏ భూమి ఆక్రమించుకున్నారని పోరాటం చేస్తున్న ఆరుద్ర అనే మహిళను పిచ్చిదని ముద్ర వేసి ఆసుపత్రిలో చేర్చారు. పిచ్చి ఉందని చెప్పి ఆస్తిలాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ పర్యటన ఉందని తెలిసే ఆమెని పిచ్చాసుపత్రిలో పెట్టారు. ఆరుద్ర తల్లి చేస్తున్న పోరాటానికి మీ మద్దతు అవసరం. వారికి న్యాయం జరిగేలా చూడండి. 2016 దివ్యాంగుల చట్టాన్ని అమల్లోకి తేవాలి. దివ్యాంగులకు రూ. 10 వేల ఫించన్ ఇవ్వాలి. ఇప్పుడు మూడు వేలు మాత్రమే వస్తోంది. మమ్మల్ని ముట్టుకోవడానికి కూడా ఇష్ట పడడం లేదు. వైకల్యం మాకు శాపమా? ప్రతి వికలాంగుడికీ రేషన్ కార్డు ఇవ్వాలి. అన్నింటిలో సమాన అవకాశాలు కల్పించాలి’ అంటూ దివ్యాంగులు తమ సమస్యలు శ్రీ పవన్ కళ్యాణ్ ఎదుట ఏకరువు పెట్టారు. ఇలా ఎన్నో సమస్యలు శ్రీ పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చాయి. కార్యక్రమంలో పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేష్, జనవాణి సమన్వయ కర్త శ్రీ డి. వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.