కాకినాడలో కదం తొక్కిన వారాహి రథం.. పదం కలిపిన జనసైన్యం

కాకినాడ

• కాకినాడ వీధుల్లో వారాహి విజయ యాత్ర
• వారాహి వెంట నడచిన వేలాది మంది జనసైనికులు, వీర మహిళలు

        కాకినాడ నగరం నడిబొడ్డున వేలాదిగా జన సైనికులు పదం కదపగా జనసేన ప్రచార రథం వారాహి కదం తొక్కింది. నగర వీధుల్లో విజయనాదం చేస్తూ పరుగులు తీసింది. కాకినాడ తీరాన ఉన్న సముద్రం జన ఉప్పెనగా మారి నగరంపై విరుచుకుపడిందా అనిపించే స్థాయిలో జనసేన శ్రేణులు గర్జించాయి. వారాహి విజయ యాత్రతో నాగమల్లి తోట జంక్షన్ వద్ద గల ముత్తా క్లబ్ నుంచి సర్పవరం జంక్షన్ వరకు రహదారిని ఇసుక వేస్తే రాలనంతగా జనప్రవాహం ముంచెత్తింది. ఆదివారం సాయంత్రం గం. 6.30 నిమిషాలకు శ్రీ పవన్ కళ్యాణ్ వారాహి రథాన్ని అధిరోహించి సమరనాదం చేసి యాత్ర మొదలు పెట్టారు. ప్రతి అడుగులో జనసేన శ్రేణుల హర్షాతిరేకాల నడుమ ఆడపడుచులు హారతులతో స్వాగతం పలికారు. ప్రతి హారతిని స్వీకరించి కళ్లకు అద్దుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. వారాహి విజయ యాత్ర ఆద్యంతం వారాహి రథానికి వెనుకా, ముందు కూడా రెండు కిలోమీటర్ల మేర రహదారి ఇసుక వేస్తే రాలనంత జనంతో కిక్కిరిసింది. ఆ జనప్రవాహం మధ్య తన కోసం వచ్చిన ప్రతి జనసైనికుడికి, వీర మహిళలకు అభివాదం చేస్తూ శ్రీ పవన్ కళ్యాణ్ ముందుకు కదిలారు.
• జనసేన జెండాల రెపరెపలు
         కాకినాడ పురవీధులు జనంతో నిండిపోవడంతో శ్రీ పవన్ కళ్యాణ్ ని సమీపం నుంచి చూసేందుకు జనసైనికులు రహదారికి ఇరువైపులా ఉన్న చెట్లు, వాహనాల ఆశ్రయించారు. మరికొందరు వారాహి విజయ యాత్ర సాగుతున్న రహదారికి ఇరువైపులా ఉన్న భవనాల మీదకు ఎక్కారు. జయహో జనసేనాని అంటూ నినాదాలతో హోరెత్తించారు. దారి పొడుగునా పూల వర్షం కురిపించారు. శ్రీ పవన్ కళ్యాణ్ కి రాకకు సంకేతంగా వీర మహిళలు ఎరుపు రంగు బెలూన్లు గాలిలోకి వదిలారు. జనసైనికులు పూల వర్షం కురిపించారు. వారాహి విజయ యాత్ర సభకు వేదిక అయిన సర్పవరం జంక్షన్ వద్ద పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి ఆహ్వానం పలికారు. వారాహి విజయ యాత్ర సందర్బంగా జనసేన నాయకులు కాకినాడ రూరల్, అర్బన్ నియోజకవర్గాల్లో రహదారులు మొత్తం జనసేన జెండాలు, బ్యానర్లతో ముంచెత్తారు. నాగమల్లి తోట జంక్షన్ నుంచి సర్పవరం జంక్షన్ మధ్య ప్రాంతం మొత్తం వారాహి స్వాగత తోరణాలు, హోర్డింగులతో నిండిపోయింది. పలువురు మహిళలు కాబోయే ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ కి స్వాగతం అంటూ ఏర్పాటు చేసిన జనసైనికులు చేతబూనిన ప్లకార్డులు, మినీ హోర్డింగులు ఆకట్టుకున్నాయి. సర్పవరం జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన సభలో శ్రీ పవన్ కళ్యాణ్ ప్రసంగం సాగుతున్నంతసేపు పార్టీ శ్రేణులు మద్దతుగా ఆయనపై పూల వాన కురిపించారు. సభ తర్వాత కూడా సర్పవరం జంక్షన్ నుంచి ముత్తా క్లబ్ వరకు వారాహి విజయ యాత్ర కొనసాగింది. కాకినాడ పట్టణంలో వారాహి విజయ యాత్రతో పార్టీ నాయకులు, శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. పి.ఎ.సి. సభ్యులు శ్రీ పంతం నానాజీ, శ్రీ ముత్తా శశిధర్, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు శ్రీ కందుల దుర్గేశ్ తదితరులు పాల్గొన్నారు.

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్