బీసీలను వైసీపీ విడగొడితే… జనసేన బీసీలను నిలబెడుతుంది

బీసీ

• వైసీపీది బ్రిటీష్ వాళ్ల పద్ధతి.. కులాలను ఉప కులాలను విభజించి పలుచన చేస్తోంది
• బీసీల సర్వతోముఖాభివృద్ధికి జనసేన కట్టుబడి ఉంది
• కల్లు గీత సొసైటీలకు ప్రభుత్వ మద్యం దుకాణాల్లో వాటా
• ప్రతి జిల్లా కేంద్రంలో శెట్టిబలిజ, గౌడ, ఉప కులాలకు కమ్యూనిటీ హాల్
• ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో తాటి, ఈత చెట్లు పెంపకానికి ప్రణాళిక
• భీమవరంలో శెట్టిబలిజ, గౌడ నాయకుల సమావేశంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్

                దేశంలో సగానికి పైగా ఉన్న బీసీ కులాలకు సంపూర్ణ రాజ్యాధికారం అందాలని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆకాంక్షించారు. స్థానిక ఎన్నికల్లో 33 శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లను వైసీపీ ప్రభుత్వం 24 శాతానికి తగ్గించడంతో దాదాపు 16వేల మంది బీసీలకు అన్యాయం జరిగిందన్నారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో తగ్గించిన బీసీ రిజర్వేషన్లు పెంచడంతోపాటు ప్రభుత్వ మద్యం దుకాణాల్లో కల్లుగీత సొసైటీలకు వాటా కల్పిస్తామన్నారు. ఖాళీ ప్రభుత్వ స్థలాల్లో తాటి, ఈత చెట్లు పెంచేలా చర్యలు తీసుకోవడంతోపాటు… శెట్టిబలిజ, గౌడ, సంబంధిత కులాలకు కమ్యునిటీ హాల్స్, కళ్యాణ మండపాలు నిర్మించేందుకు ప్రతి జిల్లా కేంద్రంలో స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. వారాహి విజయయాత్రలో భాగంగా భీమవరంలో శెట్టిబలిజ, గౌడ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “బీసీల కోసమంటూ 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం… వాటిని రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చేశారు. వైసీపీ సానుభూతిపరులు, మద్దతుదారులను కార్పొరేషన్లకు ఛైర్మన్లు, డైరెక్టర్లుగా నియమించారు తప్ప బీసీలకు ఎలాంటి మేలు చేయలేదు. శెట్టిబలిజ, గౌడ, శ్రీశైన, ఈడిగ, యాత ఇలా ప్రాంతాలను బట్టి విభిన్న పేర్లతో పిలుస్తున్న ఈ సామాజికవర్గాన్ని ఏకీకృతం చేసి గౌడ సామాజికవర్గంగా గుర్తించాలని సామాజికవర్గ పెద్దలు కోరుతున్నారు. ప్రాంతాల బట్టి విడిపోయి పలుచన అయ్యే బదులు కలిసి బలంగా ఉండాలనే జనసేన పార్టీ కోరుకుంటుంది. ఐదు కులాలను కలిపి సర్దార్ గౌతు లచ్చన్న గారు ప్రతిపాదించిన విధంగా గౌడు సామాజికవర్గంగా గుర్తించాలన్న పెద్దల కోరికకు జనసేన మద్దతు తెలుపుతుంది.
• కులంలోనే చిచ్చుపెడుతోంది
            విభజించు పాలించు అనే బ్రిటిష్ వాడి పద్దతిని వైసీపీ ప్రభుత్వం ఫాలో అవుతుంది. మనలో మనకు గొడవలు పెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తుంది. ఒక కులంలోనే ఉన్న ఉప కులాలను విడగొట్టి పలుచన చేస్తోంది. గోదావరి జిల్లాల్లో శెట్టిబలిజలకు, కాపులకు పడదని చెప్పారు. కులాలను కలిపే ఆలోచన విధానంలో భాగంగా రెండు సామాజికవర్గాలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించి వారిలో ఐక్యత వచ్చేలా చేశాం. రామ్ మనోహర్ లోహియా అగ్రకులానికి చెందిన వ్యక్తి… అయినా దేశంలో అత్యధికంగా ఉన్న బీసీల గురించి ఆయన తపన పడ్డారు. నేను కోరుకుంటుంది కూడా అదే. అత్యధికంగా ఉన్న బీసీలు రాజ్యాధికారానికి చేరువగా వెళ్లాలి. అందుకు నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. బీసీల సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. బీసీలకు రక్షణ కల్పించడంలోనూ వైసీపీ విఫలం అవుతోంది. బాపట్ల జిల్లాలో అమరనాథ్ గౌడ్ అనే 15 ఏళ్ల బాలుడిని తగులబెట్టి చంపేశారు. న్యాయం జరగని చోట కచ్చితంగా కులం సంఘటితం అవుతుంది. ఆ బాలుడిని చంపేస్తే రూ.లక్ష విలువ కట్టిన ప్రభుత్వ తీరుని నిరసించాలి.
• పార్టీ తెలంగాణ ఇంఛార్జి గౌడ సామాజికవర్గానికే ఇచ్చాం
               బీసీలకు రాజకీయ సాధికారిత రావాలని కోరుకునే వ్యక్తుల్లో నేను మొదటి వరుసలో ఉంటాను. పార్టీ తెలంగాణ ఇంఛార్జిగా గౌడ సామాజికవర్గానికి చెందిన శ్రీ శంకర్ గౌడ్ ను నియమించాం. ఆయనకు సంపూర్ణ మద్దతు ఇస్తూ తెలంగాణ రాష్ట్రంలో బలమైన నేతగా ఎదిగేలా చేయగలిగాం. సంఖ్యాబలం ఎక్కువ ఉన్న కులాల్లో ఐక్యత ఉండదు. తక్కువ ఉన్న కులాల్లో ఐక్యత ఉంటుంది కాబట్టే వాళ్లు రాజ్యాధికారం చేపట్టగలుగుతున్నారు. బీసీలు ఐక్యంగా ఉంటే రాజ్యాధికారం ఏ సామాజికవర్గానికి వెళ్లదు. బీసీ నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంది. వారికి సంపూర్ణ రాజ్యాధికారం దక్కేలా నా వంతు సహాయం చేస్తాను” అన్నారు.
• బీసీల రిజర్వేషన్ తగ్గించడంతో 16వేల మందిని అన్యాయం : నాదెండ్ల మనోహర్
                పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ… “స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ 33 శాతం నుంచి 24 శాతానికి వైసీపీ ప్రభుత్వం తగ్గించడంతో దాదాపు 16 వేల మంది బీసీలు రాజకీయంగా నష్టపోయారు. చాలా చోట్ల వైసీపీ నాయకులు బెదిరింపులు, దౌర్జన్యాలతో బీసీలు నామినేషన్లు వేయడానికి కూడా భయపడ్డారు. కొన్ని చోట్ల వేయడానికి వెళ్లే వారిపై దాడులు చేసి నామినేషన్ పత్రాలు చించేశారు. ఏదైనా చట్టం శాసనసభలో ప్రవేశపెట్టే ముందు లోతుగా అధ్యయనం చేయాలి. మేథావులతో చర్చించి సలహాలు, సూచనలు తీసుకోవాలి. పరిపాలన దక్షత లేని ఈ నియంత ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఎవరి సూచనలు తీసుకున్న దాఖలాలు లేవు. గీత కార్మికులకు ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా అన్ని విధాలా ఆదుకుంటాం అన్నారు. లోన్లు ఇస్తామని మభ్య పెట్టారు. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. బాపట్లలో తన అక్కను ఎందుకు వేధిస్తున్నారని అడిగినందుకు ఒక అబ్బాయిని పెట్రోల్ పోసి తగలబెట్టారు. వైసీపీకి చెందిన ఒక పెద్ద మనిషి లక్ష రూపాయలు పట్టుకొని వెళ్తే… గ్రామస్థులే మేమే మీకు లక్ష ఇస్తాం అని చెప్పి ఆయన్ను వెళ్లగొట్టారు. ప్రతి విద్యార్ధికి అమ్మ ఒడి అందిస్తామని చెప్పిన ప్రభుత్వం తరువాత మాట మార్చి ఎంతమంది పిల్లలున్నా ఒక్కరికి మాత్రమే అమ్మఒడి అన్నారు. ఇప్పుడు ఇస్తున్న వాటిలో కూడా కోతలు విధిస్తున్నారు. నిన్న ఇచ్చిన అమ్మఒడి పథకంలో దాదాపు 1.42 లక్షల మంది అర్హులకు కోత విధించింది” అని అన్నారు.
• మద్యం కోసం కల్లు గీత వృత్తిని దెబ్బ కొట్టారు : పాకా సత్యనారాయణ, బీజేపీ నేత
              బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం ఛైర్మన్, శెట్టిబలిజ, గౌడ నాయకులు శ్రీ పాకా సత్యనారాయణ మాట్లాడుతూ “ప్రభుత్వం మద్యం విచ్చలవిడిగా అమ్ముకోవడం కోసం కల్లు గీత వృత్తిని దెబ్బకొట్టారు. ప్రభుత్వంలోని పెద్దలే ఒక్కొక్కరూ నాలుగు డిస్టలరీలను నడుపుకొని రాష్ట్రంలో మద్యం అమ్ముకుంటున్నారు. బీసీలపై వైసీపీ కపట ప్రేమను చూపుతోంది. బీసీ కమిషన్ లకు రాజ్యాంగబద్ధత కల్పించినా దానిని ఉపయోగించుకోలేకపోతోంది. ప్రభుత్వం పెట్టిన కుల కార్పొరేషన్లకు రాజ్యాంగబద్ధత లేదు. బీసీల తలసరి ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. బీసీల ఉపకార వేతనాలు, వసతి గృహాల్లో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. జనసేన ప్రభుత్వంలో బీసీల అభ్యున్నతి కోసం ప్రత్యేక ప్రణాళిక తయారు చేసి, దాన్ని కచ్చితంగా అమలు చేస్తారని కోరుకుంటున్నాం” అన్నారు. జనసేన పార్టీ నాయకుడు శ్రీ జూత్తిగ నాగరాజు మాట్లాడుతూ “శెట్టిబలిజ, గౌడ సంబంధిత కులాలు ఎదుర్కొంటున్న సమస్యలపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు చర్చించడం ఎంతో సంతోషంగా ఉంది. కులాల ఐక్యత కోసం కృషి చేస్తున్న జనసేన ద్వారా కచ్చితంగా శెట్టిబలిజ, గౌడలకే కాదు ప్రతి బీసీ కులానికీ సముచిత న్యాయం జరుగుతుంది” అన్నారు. నరసాపురానికి చెందిన శ్రీ గుబ్బల మర్రాజు మాట్లాడుతో “జనసేన తొలి నుంచీ కార్మిక, రైతు, వెనకబడిన వర్గాల పక్షాన నిలుస్తోంది. భవన నిర్మాణ కార్మికులు, కౌలు రైతుల్లో ఎక్కువగా బీసీలే ఉంటారు వారికి జనసేన బాసటగా నిలుస్తోంది” అన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, పీఏసీ సభ్యులు కనకరాజు సూరి, పార్టీ మత్స్యకార విభాగ ఛైర్మన్ బొమ్మిడినాయకర్, బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం ఛైర్మన్ పాకా సత్యనారాయణ, జనసేన పార్టీ నాయకుడు జూత్తిగ నాగరాజు పాల్గొన్నారు.
• జనసేనలో చేరిన ఆర్య వైశ్య ప్రముఖుడు
        భీమవరం పట్టణానికి చెందిన ఆర్య వైశ్య ప్రముఖుడు వబిలిశెట్టి రామకృష్ణ ఈ రోజు సాయంత్రం జనసేన పార్టీలో చేరారు. పవన్ కళ్యాణ్ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. మకృష్ణతోపాటు పలువురు వ్యాపారులు జనసేనలో చేరారు.

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్