భద్రత, అభివృద్ధి కావాలంటే కూటమి ప్రభుత్వం రావాలి

కూటమి

• వైసీపీకి ఓటమి భయం… అందుకే మనపై దాడులు
• ఓడిపోయేవాడే దాడులు చేస్తాడు… గెలిచేవాడికి అవసరం లేదు
• మూడు కబ్జాలు, ఆరు సెటిల్మెంట్లుగా వైసీపీ పాలన
• ప్రభుత్వ ఆస్తులనే వదలని జగన్ … మన ఆస్తులు వదులుతాడా..?
• జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ను రద్దు చేస్తాం
• మత్స్యకారులకు వేట విరామ సమయంలో రూ. 20 వేలు ఆర్థికసాయం
• 217 జీవో రద్దు చేస్తాం
• తుని నియోజకవర్గ వారాహి విజయభేరి బహిరంగ సభలో శ్రీ పవన్ కళ్యాణ్
‘వైసీపీకి ఓటమి భయం పట్టుకుంది. సార్వత్రిక ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోతారని తెలిసే కూటమి ఎంపీ అభ్యర్థులైన శ్రీ సీఎం రమేష్, శ్రీ బాలశౌరిపై దాడులకు పాల్పడింద’ని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు. వైసీపీ మనపై దాడులు చేస్తోంది అంటే … మనం ఎన్నికల్లో గెలవబోతున్నామని అర్ధం.. ఓడిపోయేవాడే దాడులు చేస్తాడని, గెలిచేవాడికి ఆ అవసరం లేదని అన్నారు. ఎంత మెజార్టీతో గెలుస్తున్నామో ఇప్పుడు చెప్పలేను కానీ కూటమి ప్రభుత్వం రావడం పక్కా అని అన్నారు. ఆదివారం తుని నియోజకవర్గంలో నిర్వహించిన వారాహి విజయభేరి బహిరంగ సభలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రసంగించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి దాడులు, దోపిడీలు పెరిగిపోయాయి. ఏదైనా మాట్లాడితే బూతులు తిడుతున్నారు. అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఈ ఐదేళ్లలో వైసీపీ పాలన మూడు కబ్జాలు, ఆరు సెటిల్మెంట్లుగా సాగింది. ఇలాంటి అరాచకపాలనకు చరమగీతం పాడాలనే 2021లోనే వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని చెప్పాను. ఇటువంటి దుర్మార్గ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలంటే మనమంతా కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా ఏకమవ్వాలి. భద్రత, అభివృద్ధి గల సమాజం కావాలంటే కూటమిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి.
• తోడబుట్టిన చెల్లికే ఆస్తి ఇవ్వలేదు… మన ఆస్తులను వదులుతాడా..?
వైసీపీ తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అత్యంత దుర్మార్గమైంది. అది ల్యాండ్ టైటిలింగ్ యాక్డ్ కాదు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. దీనికి సంబంధించి జీవో ఇవ్వలేదు, అభిప్రాయసేకరణ మాత్రమే జరుగుతుందని వైసీపీ నాయకులు చెబుతున్నారు. అదంతా అబద్ధం. యాక్ట్ కు సంబంధించిన జీవో విడుదల అయ్యింది. విశాఖలో ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి రూ.25 వేల కోట్లు అప్పు తీసుకొచ్చాడు. తోడబుట్టిన చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని ఇంటి నుంచి గెంటేశాడు. కన్న తల్లికి మర్యాద ఇవ్వని వ్యక్తి జగన్. 30 వేల మంది ఆడబిడ్డలు రాష్ట్రం నుంచి అదృశ్యమైపోతే ఒక్క ముక్క మాట్లాడలేదు. ప్రభుత్వ ఆస్తులనే దర్జాగా తాకట్టుపెట్టిన అలాంటి వ్యక్తి చేతిలో మన ఆస్తులు పెడితే గాల్లో దీపం పెట్టినట్లే. వైసీపీ మద్దతుదారులకు ఒకటే చెబుతున్నాను… మీ వరకు రాలేదని మీరు ఈ రోజు మౌనంగా ఉంటే ఏదో ఒక రోజు మీ వరకు వస్తుంది. మీ ఆస్తులను కూడా దోచేస్తాడు.
• చెరువులను లోయలుగా మార్చిన ఘనత ఆయనదే
తుని నియోజకవర్గంలో దాదాపు వందకు పైగా చెరువులు ఉన్నాయి. మట్టి అక్రమ తవ్వకాల కోసం చెరువులను తవ్వి తవ్వి పెద్ద లోయలుగా మార్చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఆర్ అండ్ బీ మంత్రిగా చేశారు. రాష్ట్రంలో ఏ రోడ్డు చూసినా గుంతలే. తాండవ నది ఇసుకను అడ్డగోలుగా దోచుకుంటున్నారు. ఆర్థర్ పేట నుంచి పెరుమాళ్ళపురం వరకు ఇసుక ర్యాంపుల్లో ఇష్టానుసారం తవ్వకాలు జరుపుతున్నారు. దశాబ్ధ కాలంపాటు తవ్వాల్సిన ఇసుకను ఐదేళ్లలో తవ్వేశారు. ఒక వైపు కోర్టు తవ్వకాలు నిలిపివేయాలని హెచ్చరించినా… మంత్రి అనుచరులు మాత్రం అక్రమ ఇసుక దందా ఆపడం లేదు. సముద్ర ఇసుక, తాండవ నది ఇసుకను గోదావరి ఇసుక అని చెప్పి ఎక్కువ రేటుకు అమ్మేస్తున్నారు. తాండన నది ఇసుకను దోచుకొని కోట్లు సంపాదించారు కానీ … ఏళ్ల తరబడి ప్రతిపాదనలకే పరిమితమైన రక్షణ గోడ నిర్మించలేకపోయారు. వాళ్ల అక్రమ దందాల గురించి మాట్లాడుతున్నాడనే తునిలో ఒక విలేఖరిని చంపేశారు. కూటమి ప్రభుత్వం రాగానే ప్రతికా స్వేచ్ఛకు విఘాతం కలగకుండా అండగా ఉంటాం.
• వేట విరామ సమయంలో రూ.20 వేలు ఆర్థిక సాయం
దివీస్ ఫార్మా వల్ల ప్రతి రోజు లక్షల లీటర్ల విషపూరిత రసాయన వ్యర్ధ జలాలు సముద్రంలో కలుస్తాయనీ, దీనివల్ల అక్కడ మత్స్య సంపద పూర్తిగా అంతరించి స్థానిక మత్స్యకార గ్రామాలు అన్నీ ఉపాధి కోల్పోతున్నాయి. వైసీపీ అధికారంలోకి రాగానే దివీస్ ను బంగాళాఖాతంలో కలిపేస్తానని జగన్ హామీ ఇచ్చారు. ఇప్పుడు మాట మార్చి కంపెనీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. జనసేన మూల సిద్ధాంతాల్లో ఒకటి పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రసాయన వ్యర్థాలు శుద్ధి చేశాకే సముద్రంలో కలిపేలా చర్యలు తీసుకుంటాం. అలాగే మత్స్యకారుల పొట్ట కొట్టే జీవో నెంబర్ 217ను రద్దు చేస్తాం. వేట విరామ సమయంలో రూ.20 వేలు ఆర్థిక సాయం అందిస్తాం. లంచాలకు తావులేకుండా హేచరీస్ కు అనుమతులు ఇస్తాం.
• లోకల్ ట్రైన్ సదుపాయం కల్పిస్తాం
తూర్పుకనుమల్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తలుపులమ్మ లోవ దేవస్థానంకు ప్రతి రోజు వేలాది మంది భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా ఆదివారాలు ఎక్కువగా భక్తులు వస్తారు. వేలాదిగా తరలి వస్తున్న భక్తుల నుంచి ఆలయానికి కోట్లాది రూపాయల ఆదాయం సమకూరుతున్నా ఆలయ అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది. పాలకులు, అధికారులు మారుతున్నా లోవలో అభివృద్ధి పనుల తీరు మారడం లేదు. వ్యయ ప్రయాసలకోర్చి అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు లేవు. దర్శనం అనంతరం ఇక్కడే చెట్ల కింద వంటలు చేసుకొని భోజనాలు చేసి వెళ్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వంటలు చేసుకునేలా షెడ్లు, వసతులు కల్పిస్తాం. స్థానిక మహిళలే వంట సామాగ్రి సప్లయ్ చేసేలా చర్యలు తీసుకుంటాం. పారిశుద్ధ్య లేమి, సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో మార్కెట్ యార్డు కంపుకొడుతుంది. తాగునీటి సమస్యలు గత పది ఏళ్లుగా వెంటాడుతున్నా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కూటమి ప్రభుత్వం రాగానే మార్కెట్ యార్డులో తాగునీరు, విశ్రాంతి గదులు ఏర్పాటు చేస్తాం. తుని నుంచి విశాఖకు లోకల్ ట్రైన్ కావాలని డిమాండ్ ఉంది. కూటమి ప్రభుత్వం రాగానే కేంద్రంతో మాట్లాడి డిమాండ్ నెరవేరుస్తాం. తాండవ, పంపా నది రిజర్వాయర్లు ఆధునికీకరణ చేయకపోవడంతో ఆయకట్టు శివారు భూముల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం రాగానే ఆంధ్రప్రదేవ్ జీవనాడి అయిన పోలవరంతో పాటు చిన్న చిన్న రిజర్వాయర్ల మరమ్మతులు చేసి ప్రతి ఎకరాకు నీరందిస్తాం. రైతు కన్నీరు తుడుస్తాం.
• ఉద్యమానికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తాను
ఒకప్పుడు తుని అంటే ఎవరికైనా అద్భుతమైన తూర్పు కనుములు, తలుపులమ్మ లోవ దేవాలయం గుర్తుకు వచ్చేవి. ఇప్పుడు రైలు దుర్ఘటన గుర్తుకు వస్తోంది. దానిని చెరిపేయాలనే పోరాట యాత్ర సమయంలో విజయవాడ నుంచి తుని వరకు రైలులో ప్రయాణం చేశాను. ఏ ఉద్యమం అయినా త్రికరణ శుద్ధిగా జరగాలి. లేకుంటే అమాయకులు బలైపోతారు. రెండు దశాబ్ధాలుగా ఎమ్మార్పీఎస్ ఉద్యమం జరిగింది. ఇన్నాళ్లకు ఎస్సీల వర్గీకరణకు ప్రధాన మంత్రి మద్దతు కూడగట్టారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కోసం అందరూ కలిసి పోరాడి సాధించుకున్నారు. వీళ్లంతా ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు సాగారు. నా వెనుక ఇంతమంది యువత ఉన్నా ఏనాడు వారిని రెచ్చగొట్టలేదు. వారిని వాడుకొని నా భవిష్యత్తును నిర్మించుకోలేదు. ఉద్యమానికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తాను. త్రికరణ శుద్ధి గా చేయగలమా..? లేదా అన్నది ఆలోచించాలి. ఉద్యమం పక్కదారి పడితే అమాయకులైన యువత బలైపోతారు” అన్నారు.
• శ్రీ ముద్రగడ గౌరవం తగ్గించను
మాజీ మంత్రి శ్రీ ముద్రగడ పద్మనాభం గారి అమ్మాయి శ్రీమతి క్రాంతి, ఆయన అల్లుడు శ్రీ చందు గారు జనసేన పార్టీలో జాయిన్ అవ్వడానికి వస్తే శ్రీ పవన్ కళ్యాణ్ గారు సున్నితంగా తిరస్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… “నేను కులాల ఐక్యత కోరుకునే వ్యక్తిని, సమాజంలో మనుషులు అందరూ కలిసి ఉండాలని కోరుకునేవాడిని. అలాంటిది నేను తండ్రి బిడ్డలను వేరు చేస్తానా..? ముద్రగడ గారు పెద్దాయన… పది మాటలు అంటారు. మనం భరించాలి. మీ మెడలో ఈ రోజు కండువా వేస్తే ఆయన గౌరవాన్ని తగ్గించినట్లు అవుతుంది. ఎన్నికల కోసం తండ్రి బిడ్డలను వేరు చేసి వాడుకున్నట్లు ఉంటుంది. మనలో మనకి ఎన్ని అభిప్రాయభేదాలు అయినా ఉండొచ్చు. మనందరం కలిసే ప్రయాణం చేయాలి. సగటు రాజకీయ నాయకుడిగా కాకుండా మీ ఇంట్లో ఒకడిగా చెబుతున్నాను. మీకు గౌరవం ఇచ్చే బాధ్యత నాది. పద్మనాభం గారిని ఒప్పించే మిమ్మల్ని పార్టీలో చేర్చుకుంటాను” అన్నారు. తుని నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా శ్రీమతి యనమల దివ్య, పాయకరావు పేట నుంచి శ్రీమతి వంగలపూడి అనిత, కాకినాడ ఎంపీ అభ్యర్థిగా శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ లు పోటీ చేస్తున్నారు. వారిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్