ప్రజలు అధికారం ఇస్తే… జగన్ దోపిడీకి లైసెన్స్ అనుకున్నాడు

జగన్

• అయోధ్యలో రామాలయం కడితే… రామ తీర్ధంలో రాములోరి తల తీసేశారు
• 160 దేవాలయాల మీద దాడులు, విధ్వంసాలు మినహా ప్రజలకు చేసింది లేదు
• ఈ దోపిడీదారుడు ఎవరు అడ్డొచ్చినా వదలడు
• రాష్ట్రం కోసం మూడు పార్టీలు కలిశాం.. త్యాగాలు చేశాం
• సైకో పోవాలి.. రాష్ట్రం బాగవాలి అన్నదే మా ధ్యేయం
• నెల్లిమర్ల వారాహి విజయ భేరీ సభలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు
‘ఎన్డీఏ సర్కారు అయోధ్యలో రామాలయం కడితే.. రాష్ట్రంలో సైకో జగన్ రామ తీర్ధంలో రాముడి తల తీసివేశాడు. ఉత్తరాంధ్రకు ఒక్క ప్రాజెక్టు తేలేదు. శంకుస్థాపనల మీద శంకుస్థాపనలు చేయడం మినహా పని చేసింది లేదు. ప్రజలు అధికారం ఇస్తే అహంకారంతో విధ్వంసం సృష్టించి దోపిడికి లైసెన్స్ ఇచ్చినట్టు ఫీలయ్యాడు. అడ్డగోలుగా రాష్ట్రాన్ని దోచుకున్నాడు. అలాంటి వ్యక్తిని ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించాల’ని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారు. ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత దేవాలయాలపై దాడులు, విధ్వంసాలు మినహా ప్రజలకు చేసింది శూన్యమన్నారు. బుధవారం నెల్లిమర్ల నియోజక వర్గం సింగవరంలో నిర్వహించిన వారాహి విజయ భేరీ సభలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో కలసి పాల్గొన్నారు. సభకు హాజరైన ఆశేష జనవాహినిని ఉద్దేశించి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ప్రసంగిస్తూ… “2021లో రామతీర్ధంలో దుండగులు రాముడి తల నరికివేసిన సందర్భంగా నెల్లిమర్ల వచ్చాను. మరోసారి ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. ప్రజల ఉత్సాహం చూస్తుంటే నెల్లిమర్ల దశ దిశ మారడం ఖాయంగా కనబడుతోంది. రాష్ట్రంలో దేవాలయాల మీద, అర్చకుల మీద దాడులు చేస్తున్నారు. ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీసులు ముఖ్యమంత్రిపై విమర్శ చేస్తే గోడలు దూకి వచ్చి మరీ అరెస్టు చేస్తారు. దేవుడి తల తీసేస్తే మాత్రం మాట్లాడరు. చివరికి ప్రశ్నించినందుకు నా మీద కేసు పెట్టారు. దేవుడికి అన్యాయం జరిగిందని చెబితే కేసు పెట్టి లోపల వేస్తానన్న పిచ్చి తుగ్లక్ పాలన రాష్ట్రంలో ఉంది. ప్రజలు దీన్ని కొనసాగిస్తారా? నిన్న బస్సు యాత్రలో ఉత్తరాంధ్ర వచ్చాడు. ఉత్తరాంధ్రకు ఈ సైకో జగన్ చేసింది ఏంటి? ఒక్క ప్రాజెక్టు తెచ్చాడా? ఒక్కరికి ఉపయోగం ఇచ్చాడా? ఒక్క ఆడపడుచుకు న్యాయం చేశాడా? ఎవరికి న్యాయం చేసింది లేదుగాని కోతలు మాత్రం కోస్తున్నాడు. ఉత్తరాంధ్ర మీద ప్రేమతో భోగాపురంలో ఎయిర్ పోర్టు పెట్టాను. 2,750 ఎకరాల భూమి సేకరించి శంకుస్థాపన చేశాను. సైకో జగన్ శంకుస్థాపన మీద శంకుస్థాపన చేయడం మినహా పని మాత్రం చేసింది లేదు. టీడీపీ తిరిగి అధికారంలోకి వస్తే 2025కి భోగాపురం విమానాశ్రయం పూర్తి చేస్తాం. ఉత్తరాంధ్ర అభివృద్ధికి శ్రీకారం చుడతాం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు పూర్తి చేస్తే ఈ ప్రాంతం సశ్యశ్యామలం అవుతుంది. అది జరగాలంటే పోలవరం పూర్తి కావాలి. ఉత్తరాంధ్రకు నీరు రావాలి. ఈ దుర్మార్గ ముఖ్యమంత్రి అందరి కలలు చెరిపేసే పరిస్థితి తెచ్చాడు.
• రాష్ట్రాన్ని దోచుకున్న బందిపోటుని తరిమికొట్టాలి
ఒక ముఖ్యమంత్రి అధికారంలోకి వస్తే ప్రజలకు మంచి చేయాలనుకుంటాడు. ఈ ముఖ్యమంత్రి మాత్రం అధికారాన్ని విధ్వంసం, దోపిడికి లైసెన్స్ లా భావిస్తున్నాడు. ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నాడు. ప్రజల కోసం విలాసవంతమైన జీవితం వదులుకుని వచ్చిన వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వచ్చిన వ్యక్తి. జగన్ కి శ్రీ పవన్ కళ్యాణ్ గారికీ పోలిక ఉందా? తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతికి పాల్పడి జైలుకి వెళ్లి వచ్చిన వ్యక్తి జగన్. ప్రజల కోసం నిస్వార్థంగా రోడ్డెక్కి మీరు తిట్టినా వెనుదిరగకుండా దూసుకుపోతున్న వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. 44 ఏళ్ల అనుభవం ఉన్న నేను, శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ జగన్ తో ఎందుకు తిట్టించుకోవాలి. ఈ దోపిడిదారుడు ఎవరు అడ్డొచ్చినా వదలడు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను మాత్రం వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించి భూస్థాపితం చేసే వరకు వదిలిపెట్టం. సింహం సింగిల్ గా వస్తుందంటున్నాడు. ఈ ముఖ్యమంత్రి అహంకారం, అవినీతి డబ్బుతో ప్రజల ముందుకు వస్తున్నాడు. బందిపోటులా దోచుకున్న అవినీతి సొమ్ముతో వస్తున్నాడు. ఇలాంటి బందిపోటుని తరిమికొట్టడానికి అంతా ఏకం కావాలా లేదా? 2014లో తండ్రి శవంతో రాజకీయాల్లోకి వచ్చాడు. 2019లో బాబాయ్ శవంతో రాజకీయం చేశాడు. ఇప్పుడు గులకరాయి డ్రామాతో వస్తున్నాడు. 13వ తేదీ సాయంత్రం వరకు ఈ డ్రామా సాగుతుంది.
• రాష్ట్ర ప్రజల ఆదాయం తగ్గింది.. ఖర్చులు పెరిగాయి
ఉత్తరాంధ్ర ద్రోహి జగన్మోహన్ రెడ్డి. 24 రోజుల క్రితం ఇడుపులపాయలో బస్సు యాత్ర మొదలుపెట్టి రాష్ట్రం మొత్తం తిరిగాడు. యాత్ర మొత్తంలో ఈ ఊరికి ఇది చేశాను అని చెప్పిన దాఖలాలు లేవు. వైసీపీ పాలనలో చిన్న పరిశ్రమ వచ్చిందా? ఒక్క నీటిపారుదల ప్రాజెక్టు పూర్తి చేశాడా? ఇళ్లు కడుతున్నానని అడవుల్లో, శ్మశానాల్లో వసతులు లేకుండా కట్టాడు. తాను మాత్రం విశాఖలో రూ.500 కోట్లతో విలాసవంతమైన భవంతి కట్టుకున్నాడు. అందరూ బాగుపడిపోయారు అని చెబుతున్నాడు. రాష్ట్రంలో ప్రజల ఖర్చులు పెరిగాయి. ఆదాయం మాత్రం పెరిగింది లేదు. ప్రజల జీవన ప్రమాణం తగ్గిపోయింది. దీనికి ఈ అసమర్ధుడి చేతకాని పాలనే కారణం. పరిపాలన అంటే సంపద సృష్టించడం. ఆదాయం పెంచి సంక్షేమానికి ఖర్చు చేయాలి.
• పులివెందుల ప్రజల్ని ఏ ముఖం పెట్టుకుని ఓటడుగుతావు జగన్
మేము జనసేన, బీజేపీ, టీడీపీ కలిశాం. మేము ముగ్గురం కలిసేది పదవుల కోసం కాదు. ప్రజలు గెలవాలి. రాష్ట్రం నిలబడాలి అని మూడు పార్టీలు తగ్గాం. త్యాగాలు చేశాం. మా త్యాగాల ధ్యేయం ఒక్కటే సైకో పోవాలి. రాష్ట్రం బాగవాలి. ప్రజలు మా మీద అభిమానాన్ని ఓట్ల రూపంలో వేసి మూడు పార్టీల అభ్యర్ధులను గెలిపించాలి. ఈ రోజు మరోసారి జగన్ 175కి 175 అని చెబుతున్నాడు. నెల్లిమర్ల నుంచి సవాలు విసురుతున్నా వై నాట్ పులివెందుల. పులివెందులలో ఈ ముఖ్యమంత్రి ఏ ముఖం పెట్టుకుని ఓటు అడుగుతాడు. బాబాయ్ ని చంపానని అడుగుతాడా?
• నెల్లిమర్లలో కొండలు మింగేసిన అనకొండ
జగన్ విశాఖలో రుషికొండను ఆక్రమించుకుంటే.. ఇక్కడ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు నెల్లిమర్ల నియోజకవర్గంలో కొండలన్నీ అనకొండలా మింగేశాడు. తంగుడబిల్లిలో 10 ఎకరాల విస్తీరణలో ఉన్న కొండను తవ్వేసి గ్రావెల్ విచ్చలవిడిగా దోచేశాడు. శ్రీమతి లోకం మాధవికి గాజు గ్లాసు గుర్తు మీద ఓటు వేసి గెలిపించండి. సీటు త్యాగం చేసిన బంగార్రాజు భవిష్యత్తు మేము చూసుకుంటాం. అలాగే త్యాగాలు చేసిన జనసేన నాయకులను గుర్తించి ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పిస్తాం. జనసేన, టీడీపీ, బీజేపీల్లో ఉన్న సమర్ధ నాయకత్వాన్ని గుర్తించి ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసే బాధ్యత తీసుకుంటాం.
• రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నదుల అనుసంధానం బాధ్యత తీసుకుంటాం. పోలవరం పూర్తి చేస్తాం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేస్తాం. తారక రామతీర్ధ సాగర్ ప్రాజెక్టు వచ్చే ప్రభుత్వంలో పూర్తి చేస్తాం. భోగాపురంలో విమానాశ్రయ నిర్మాణం పూర్తి చేస్తాం. నెల్లిమర్లను పారిశ్రామిక హబ్ గా మారుస్తాం. జూట్ మిల్ బాధితుల్ని ఆదుకుంటాం. సూపర్ సిక్స్ తో ప్రజలందరికీ న్యాయం చేస్తాం. కూటమి అభ్యర్ధుల్ని గెలిపించండి. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటాం” అన్నారు. ఈ సభలో నెల్లిమర్ల ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి లోకం మాధవి, విజయనగరం ఎంపీ అభ్యర్థి శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు, మూడు పార్టీల నేతలు శ్రీ కర్రోతు బంగార్రాజు, శ్రీమతి పడాల అరుణ, శ్రీ బి. శ్రీధర్ పాల్గొన్నారు.

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్