• ప్రజల జీవన ప్రమాణాలు పెంచకుండా ఛార్జీల బాదుడు పాలకుడు జగన్
• అతని కుటుంబ గొడవలు రాష్ట్ర ప్రజల గొడవలు కాదు
• కూటమి ప్రభుత్వంలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణ ఉంటుంది
• రైల్వేకోడూరు వారాహి విజయభేరి యాత్రలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు
‘గత ఎన్నికల్లో తన స్వలాభం కోసం చెల్లిని, తల్లిని ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు వారు నీ నుంచి ఎందుకు దూరమయ్యారు..? ఉపయోగించుకోవడం, వదిలేయడం జగన్ కు అలవాటు. పులివెందుల కల్చర్.. కడప కల్చర్.. రాయలసీమ కల్చర్. ఇప్పుడు కొత్తగా తనను మేం ఎగతాళి చేస్తున్నాం అని నాటకం ఆడుతున్నాడు. నేను కూడా రాయలసీమ వాసినే. మేమెందుకు నిన్ను ఎగతాళి చేస్తాం. వాళ్ల ఇంట్లోని కుటుంబ కలహాలు, గొడవలు మన మీద నెట్టేసి సానుభూతి పొందాలన్నదే జగన్ కుట్ర’ అని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు. జగన్ ఇంట్లోని గొడవలు రాష్ట్ర గొడవలు కాదు… మీరు తేల్చుకోవాల్సిన తగాదాలు రాష్ట్ర ప్రజలకీ అవసరం లేదని చెప్పారు. గురువారం రాత్రి రైల్వే కోడూరులో నిర్వహించిన వారాహి విజయభేరీ యాత్ర సభలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు, కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ అరవ శ్రీధర్ గార్లతో కలిసి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ‘‘శ్రీ వైఎస్ రాజశేఖరరెడ్డి, శ్రీ వివేకానంద రెడ్డి రామలక్ష్మణులు మాదిరి ఉండేవారు. వివేకానంద రెడ్డిని ఎమ్మెల్సీగా ఓడించింది భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డిలు. కావాలని వారి రాజకీయ ఎదుగుదలకు అడ్డు వస్తున్నారనే ఆయనను అప్పట్లో ఎమ్మెల్సీగా ఓడించారు. కడప ఎంపీ సీటును తనకు ఇవ్వాలని, కుదరకపోతే షర్మిలకు ఇవ్వాలని వివేకానంద రెడ్డి అడిగితే చంపేశారు. అన్నలు, చెల్లెళ్లు, అక్కలు, బామ్మలు అని తియ్యగా మాట్లాడుతూ ఘోరంగా దగా చేసే వ్యక్తి జగన్. భార్య మాట విని, కన్నతల్లిని దూరం పెట్టిన వ్యక్తి జగన్. మీ కుటుంబ గొడవలు రాష్ట్ర గొడవలు కాదు.. గొడవలు ఏమైనా ఉంటే మీరు మీరు చూసుకోండి కాని రాష్ట్రం మీదకు తోయకండి. ప్రతి ఎన్నికల్లో అమాయకుడిగా ఫేస్ పెట్టి, తర్వాత ఘోరాలు చేసే వ్యక్తి జగన్ కాబట్టే ఇవన్నీ చెబుతున్నాను.
• ఎన్నికలు రావడంతో పరదాలు తీసి వస్తున్నాడు
జగన్ అనే అహంకారి విధ్వంసం చేసి రాష్ట్రాన్ని దోపిడీ చేశాడు. అలాంటివాడిని ప్రజలంతా ఇంటికి పంపాలి. అయిదేళ్లుగా పరదాలు కట్టుకొని తిరిగాడు. నేను, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేశాం. ఎప్పుడు అయినా పరదాలు కట్టుకొని వచ్చామా..? ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి పరదాలు తీసేసి వస్తున్నాడు. జగన్ తన పాలనలో రైల్వే కోడూరుకు ఏమైనా చేశాడా..? కడపకు ఏమైనా చేశాడా..? ఏమైనా చేస్తే చెప్పమని సవాల్ విసురుతున్నాను. అన్నమయ్య డ్యాం ను కాపాడలేని వ్యక్తి మూడు రాజధానులు కడతాడంట. చేతకాని ముఖ్యమంత్రి. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని అడ్రస్ లేకుండా చేశాడు. ఈ సైకో పోవాలి.. కూటమి రావాలి. గత అయిదేళ్లలో ప్రజల జీవితాల్లో మార్పు లేదు. ఖర్చులు పెరిగాయి. ఆదాయం పెరగలేదు. జీవితం భారమైంది. దీనికి ఈ పాలకుడే కారణం. ఇంత చెత్త ముఖ్యమంత్రిని జీవితంలో చూడలేదు. కరెంటు ఛార్జీలు తొమ్మిదిసార్లు పెంచాడు. గత ఎన్నికల ముందు కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పిన ఈయన అధికారంలోకి వచ్చాక 9 సార్లు ఛార్జీలు పెంచాడు. సామాన్యుడికి రూ.200 కరెంటు బిల్లు, వైసీపీ పాలనలో రూ.1000 అయింది. నిత్యావసరాలు, బస్సు ఛార్జీలు, మద్యం ధరలు పెంచాడు. అన్నిట్లో బాదుడే. నాసిరకమైన మద్యంతో ప్రాణాలు తీస్తున్నాడు. రూ.60 మద్యం రూ.200 చేశాడు. ఆ డబ్బు జగన్ కే పోతోంది. నాసిరకం మద్యం తో ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేసి ఆడపడుచుల మాంగల్యం తెంచేసిన వ్యక్తి ఈ జలగ. ఇచ్చేది రూ.10 అయితే, దోచేది రూ.1000 ఇదే జగన్ స్కీం. రాజకీయాల్లో కిరణ్ కుమార్ రెడ్డి నేను విభేధించాం. వ్యక్తిగత విబేధాలు లేవు. సిద్ధాంతపరంగా పోరాటం ఉంటుంది. సమైక్యంగా రాష్ట్రం ఉండాలని ముఖ్యమంత్రిగా కిరణ్ రాజీనామా చేశాడు. అదే జగన్ సోనియా వెనుక దాక్కుని సమైక్యాంధ్ర పేరుతో నాటకాలు ఆడాడు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు జగన్ రెడ్డి అసలు ఎప్పుడూ రాష్ట్రంలోనే లేడు. ఎవరికీ కనిపించలేదు. తండ్రి కూడా నిన్ను భరించలేకపోయాడు. నువ్వు ఉంటే ఏదో తప్పు చేసి ఆయనకు చెడ్డపేరు వస్తుందని బెంగళూరు పంపేశాడు. అదీ నీ చరిత్ర.
• పాపాల పెద్దిరెడ్డి లెక్కలు బయటకు తీస్తాం
పాపాల పెద్దిరెడ్డి కుటుంబం ఈ ప్రాంతంలో విలువైన బెరటీస్ దోచుకుంది. ఎర్రచందనం ముఠా నాయకుడు ఎవరు అని ప్రజలు అడుగుతున్నారు..? మేం అధికారంలో ఉన్నపుడు ఎర్రచందనం స్మగ్లర్లను నియంత్రించాం. ప్రజల ఆస్తి అయిన ఎర్రచందనం అమ్మి రాష్ట్రం అభివృద్ధికి పెట్టాలని అనుకున్నాం. వీళ్లు మాత్రం స్మగ్లర్లను ప్రోత్సహించి ఎర్రచందనం దోచుకుంటున్నారు. రాత్రికి రాత్రి స్మగ్లర్లను దించుతున్నారు. మద్యం డబ్బులు, ఇసుక, గనులు, ఎర్రచందనం దోచేసిన డబ్బులతోనే ఇప్పుడు మళ్లీ ఎన్నికలకు వస్తున్నారు. పెద్దిరెడ్డి అరాచకాలు నాకే అర్ధం కావడం లేదు. నేను కన్నెర్ర చేసి ఉంటే అసలు ఈ పెద్దిరెడ్డి ఇలా బయటకు వచ్చే వాడా..? ఆవలపల్లి రిజర్వాయర్ పేరుతో పని చేయకుండా రూ.600 కోట్లు దోచేసిన వ్యక్తి పెద్దిరెడ్డి. ఎన్జీటీ అభ్యంతరం తెలిపి రూ.100 కోట్ల ఫైన్ వేస్తే, రూ.25 కోట్ల ప్రజాధనం కట్టారు. హంద్రీనీవా పనులు పూర్తి చేయలేదు. గాలేరి నగరి పనులు పూర్తి చేయలేకపోయారు. ఇక్కడ నీళ్లు తేకుండా హంద్రీనీవాకు గండి కొట్టించి డబ్బు కొట్టేశారు. మేం పోరాడితే అంగళ్లలో 600 మందిపై కేసులు పెట్టారు. పెద్దిరెడ్డి పని అయిపోయింది. నీ కుటుంబ పాలన అయిపోయింది. నీ దోపిడీకి అంతం పలుకుతాం. నీ దగ్గర డబ్బులుంటే నా దగ్గర ప్రజాబలం ఉంది. ప్రజల డబ్బు కొట్టేసి ఎన్నికల్లో రూ.10 వేలు ఇవ్వడానికి వస్తున్నాడు. పెద్దిరెడ్డి నీకు కొవ్వు ఎక్కింది. బలిసి ఉన్నాడు. ఇది బలుపు కాదు… వాపు అని మేం నిరూపిస్తాం. పెద్దిరెడ్డి కొడుకు పిల్ల బచ్చా మిథున్ రెడ్డి పిఠాపురం వెళ్లాడు. అక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తానని ప్రగల్భాలు పలుకుతున్నాడు. పెద్దిరెడ్డి నన్ను ఓడిస్తాడని చెబుతున్నాడు. నడమంత్రపు సిరి వచ్చి, కొవ్వు ఎక్కి ఇష్టానుసారం ప్రవర్తిస్తే, ప్రజలంతా తిరగబడతారు. నీ అంతానికి జనసైనికులు, తెలుగు తమ్ముళ్లు, బీజేపీ దళం సిద్దంగా ఉంది. పెద్దిరెడ్డి కుటుంబాన్ని రాజకీయంగా భూస్థాపితం చేస్తాం.
• సునీత పోరాడితేనే హత్య అని తేలింది
హూ కిల్డ్ బాబాయ్… అని అడుగుతున్నాను. సొంత బాబాయిని చంపిన హంతకుడ్ని పక్కన పెట్టుకొని అంతా దేవుడికే తెలియాలి అని జగన్ అంటాడు. ప్రజలందరికీ తెలుసు కాని, జగన్ కే తెలీదా..? బాబాయి హత్య ను మొదట గుండెపోటు అని, తర్వాత నారాసుర రక్త చరిత్ర అని సాక్షిలో రాయించాడు. వివేకానంద పోస్టుమార్టం కోసం కూడా వివేకా కూతురు సునీత గట్టిగా పట్టు పడితేనే పోస్టుమార్టంలో హత్య అని తెలిసింది. ఇంట్లో గొడవలు మాకు చుట్టాలని చూస్తావా..? ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలన్నదే మా ఉద్దేశం. అందుకే కూటమి గా ప్రజలకు మంచి చేసేందుకు వస్తున్నాం. కూటమి వస్తూనే జగన్, పెద్దిరెడ్డి గ్యాంగులు చేసిన అవినీతిపై విచారణ చేసి, బేడీలు వేస్తాం. చిత్తూరులో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వ్యక్తికి టిక్కెట్ ఇచ్చిన దివాళాకోరు పార్టీ వైసీపీ. చెయ్యేరు నది నుంచి ఇసుక దోపిడీ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం రాగానే కోడూరు వెంకటగిరి రోడ్డు విస్తరణ చేస్తాం. బొప్పాయి, అరటి సాగు ఎక్కువ. ప్రాసెసింగ్ పరిశ్రమలు పెడతాం. జిల్లాల విభజనలో రాజంపేటకు అన్యాయం చేసి, పుంగనూరును చిత్తూరులో కలిపేలా చేశాడు. రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని, మదనపల్లి చేయాలని కోరితే దాన్ని పక్కన పెట్టేశారు. కనీసం వారి అభ్యర్థన ఆలకించలేదు. కూటమి ప్రభుత్వంలో అవసరం అయితే మళ్లీ జిల్లాలను పునర్ వ్యవస్థీకరణ ఉంటుంది. రెండు జిల్లాలు అధికం అయినా ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తాం. అందరికీ తగిన న్యాయం చేస్తాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర కార్యదర్శి శ్రీ తాతంశెట్టి నాగేంద్ర, టీడీపీ నేతలు శ్రీ ముక్క రూపానందరెడ్డి, శ్రీ బత్యాల చెంగల్రాయుడు తదితరులు పాల్గొన్నారు.