* వారసత్వ సంపదగా ఉన్న ఎర్ర మట్టి దిబ్బల రూపురేఖలు మార్చేస్తున్నారు
* ప్రకృతి వనరుల దోపిడీయే వైసీపీ లక్ష్యం
* ఉత్తరాంధ్రను ఖాళీ చేయడమే వైసీపీ అసలు ఉద్దేశం
* ఎర్రమట్టి దిబ్బల చుట్టూ బఫర్ జోన్ ఏర్పాటు చేసి, ఫెన్సింగ్ వేయాలి
* ఎర్రమట్టి దిబ్బల ఆక్రమణలను పరిశీలించిన అనంతరం మీడియాతో శ్రీ పవన్ కళ్యాణ్
‘వారసత్వంగా వచ్చిన ప్రకృతి సంపదను రక్షించాలని, దాన్ని భావి తరాలకు భద్రంగా అందించాలని ఈ వైసీపీ నాయకులకు లేదు. కనిపించిన మేరకు ప్రకృతి వనరులను దోచుకోవడం, దాని నుంచి వచ్చే సొమ్ములను దాచుకోవడం మాత్రమే తెలుసు. గతంలోనూ ఈ వైసీపీ ముఠా తెలంగాణలో సహజ సిద్ధమైన శిలా సంపదను దోచుకుంది. కర్నూలు విమానాశ్రయం పక్కనున్న విలువైన సహజ సంపదను దోచేశారు. కంటికి కనిపించిన ప్రతి సంపదను కొల్లగొట్టడం వైసీపీ నైజంగా మారింద’ని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. భీమిలి నియోజకవర్గంలో సహజ సిద్ధంగా ఏర్పడిన ఎర్రమట్టి దిబ్బలను విధ్వంసం చేస్తున్న వైనాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు బుధవారం సాయంత్రం పరిశీలించారు. ఈ పర్యటనలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి వెంట పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు. ఎర్ర మట్టి దిబ్బలను పరిశీలించిన అనంతరం అక్కడే మీడియా ప్రతినిధులతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “సుమారు 20 వేల సంవత్సరాల క్రితం ఎంతో సహజ సిద్ధంగా ఏర్పడిన ఎర్రమట్టి దిబ్బలను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సైతం దేశ వారసత్వ సంపదగా గుర్తించింది. 262 ఎకరాలను వారసత్వ సంపదగా గుర్తించి దీనిని కాపాడుకోవాలని సూచించింది. దక్షిణాసియాలో కేవలం తమిళనాడు, శ్రీలంక తర్వాత ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రమే ఈ వారసత్వ సంపద ఉంది. ప్రకృతి ప్రసాదితంగా దీనిని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి.
* రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే
ఇంతటి కీలకమైన వారసత్వ సంపదను ఆనుకొని ఇప్పుడు రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసి, ఎర్ర మట్టి దిబ్బల స్వరూపాన్ని మార్చేయాలని చూడడం దుర్మార్గం. చుట్టూ ఉన్న ఎన్నో చెట్లను సైతం నరికేశారు. ఆస్తులను రక్షించాల్సిన వీఎంఆర్డిఏ సైతం ఎర్రమట్టి దిబ్బలను ధ్వంసం చేసేలా ఇక్కడ ప్రాంతాన్ని చదును చేయడం సరికాదు. ఉత్తరాంధ్రను పూర్తి స్థాయిలో దోపిడీ చేయడం, ఇక్కడున్న అద్భుతమైన సహజ సంపదను కాజేయడానికి వైసీపీ పక్కా ప్రణాళిక వేసింది. దాన్ని ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. కచ్చితంగా ఎర్రమట్టి దిబ్బలను ప్రకృతి ప్రసాదిత పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భావితరాలకు ఏం మిగిల్చాం అంటే కచ్చితంగా వారసత్వ సంపద వారికి అందించాల్సిన బాధ్యత నేటి తరంపైన, పాలకులపైన ఉంది. ఎర్రమట్టి దిబ్బలకు కచ్చితంగా బఫర్ జోన్ వదిలి, రక్షణగా పూర్తిస్థాయిలో కంచె వేసి పరిరక్షించాల్సిన బాధ్యత ఉంది. వైసీపీ నాయకులు ప్రకృతి విధ్వంసం మీద పెడుతున్న శ్రద్ధ, ఆంధ్రప్రదేశ్ ప్రజల బాగుపైన పెడితే రాష్ట్రం పురోగతి సాధిస్తుంది.
* జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్ కి ఫిర్యాదు
వేల ఏళ్ల తరబడి ఉన్న ఎర్రమట్టి దిబ్బలు అత్యంత సున్నితమైనవి. వీటికి సమీపంలో ఇష్టానుసారం రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసి నిర్మాణాలు సాగిస్తే, ఆ స్వల్ప ప్రకంపనలకు కూడా ఎర్రమట్టి దిబ్బల స్వరూపం మారిపోతుంది. దీనిని పాలకులు గుర్తించి, వెంటనే ఎర్రమట్టి దిబ్బల సమీపంలో చేస్తున్న విధ్వంసాన్ని ఆపాలి. జరుగుతున్న మొత్తం తతంగంపై జనసేన పార్టీ కేంద్ర ప్రభుత్వానికి, అలాగే జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్ కు ఫిర్యాదు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ తీరులో మార్పు రాకపోతే భవిష్యత్తులో ఎర్రమట్టి దిబ్బల పరిరక్షణకు జనసేన పార్టీ కచ్చితంగా అన్ని విధాలా ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడుతుంది” అన్నారు.