* ఏ ఉద్యమం అయినా త్రికరణశుద్ధితో ముందుకు సాగాలి
* కిరాయిమూకలు రైలు తగలబెడితే అమాయకులైన యువత కేసుల్లో ఇరుకున్నారు
* రిజర్వేషన్ సాధ్యం కాదని తెలిసినా కుట్ర చేశారు
* రిజర్వేషన్లు ఇవ్వనని చెప్పిన జగన్ కు కాపు నాయకులు ఎందుకు అండగా నిలబడ్డారో ప్రశ్నించండి
* సినిమా నటులు నిజాయతీగా సంపాదించి రాజకీయాలు చేయకూడదా..?
* ఖాళీగా ఉన్న జాగాలన్నీ జగన్ వేనట…!
* అత్యంత భయంకరమైన జీవోలను జగన్ తీసుకొస్తున్నాడు
* నన్ను ప్రశ్నించే కాపు పెద్దలకు వైసీపీ నాయకుల అవినీతి కనిపించలేదా..?
* జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడిలో జరిగిన వారాహి విజయభేరి సభలో శ్రీ పవన్ కళ్యాణ్
ఏ ఉద్యమం అయినా త్రికరణశుద్దిగా జరగాలి. లేకుంటే అమాయకులు బలైపోతారు. కాపు రిజర్వేషన్ ఉద్యమంలో వైసీపీ నాయకులకు రిజర్వేషన్లు రావని ముందే తెలుసు. అయినా కాపులను మోసం చేయాలని, ఎగదోయాలని పన్నాగం పన్ని కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని అసంపూర్తిగా వారికి అనుకులంగా మలుచుకున్నారు. 2014లో జరిగిన కాపు రిజర్వేషన్ ఉద్యమం మొత్తం వైసీపీ నాయకుల కనుసన్నల్లో జరిగింది. కాకినాడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, తిరుపతికి చెందిన కరుణాకర్ రెడ్డి వంటి నాయకులు రిజర్వేషన్ రాదని తెలిసినా కాపులను కావాలని వారి అవసరానికి ఉద్యమం చేసేలా ఎగదోశారని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఏ ఉద్యమం అయినా ఒక దశ దిశతో అహింసాయుతంగా ముందుకు వెళ్లాలి. సమాజంలో ఉన్నవారందరినీ ఉద్యమం ప్రభావితం చేయాలి, వారి మద్దతు కూడగట్టుకోవాలి. కాపు రిజర్వేషన్ ఉద్యమం సమయంలో కొబ్బరి కిరాయి మూకలను పెట్టి వైసీపీ మూకలే ట్రైన్ తగలబెట్టించారు. కిరాయిమూకలు చేసిన పనికి అమాయకులైన కాపు యువత కేసులు ఎదుర్కొన్నారు. వారి జీవితమంతా ఫణంగా పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మార్పీఎస్ ఉద్యమం కానీ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కానీ అందరూ కలిసి పోరాడి సాధించుకున్నారు. ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు సాగారని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆదివారం జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడిలో వారాహి విజయభేరి యాత్ర బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ… “ శ్రీ మంద కృష్ణ మాదిగ రెండు దశాబ్ధాల పాటు సాగించిన ఉద్యమం ఫలితంగానే ఈ రోజు ఎస్సీ వర్గీకరణపై ప్రధాని మద్దతు తెలిపారు. ఒక కుల ఉద్యమం అయినా, రాష్ట్ర ఉద్యమం అయినా త్రికరణ శుద్ధిగా పనిచేయలి. లేకపోతే సమాజంలో అమాయకులైన యువత కల్లబొల్లి మాటలకు బలైపోతారు. నన్ను తిడుతున్న నాయకులు కాపులను తాకట్టు పెట్టేస్తున్నావు అని అంటున్నారు. నాకు ఆ స్థాయి ఉందని నేను అనుకోవడం లేదు. నేను పుట్టిన కులంతో సహా అన్ని కులాలను గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలనేదే నా ఆకాంక్ష. రెల్లి కులం తీసుకొని రెల్లి సోదరులను మనస్ఫూర్తిగా గుండెకు హత్తుకున్నానంటే అంతా ఒక్కటే అని చెప్పడమే. మత్సకారు సోదరులు నాకు గంగ స్నానం చేయించి ఎందుకు గుండెల్లో పెట్టుకుంటారు. నేను అందరినీ ఒకేలా చూస్తానని అన్ని వర్గాలు నమ్ముతాయి. అందుకే నాకు అంతా అండగా నిలుస్తారు.
• జగన్ ను కాపు నాయకులు ఎందుకు ప్రశ్నించలేదు
కాపులకు రిజర్వేషన్ ఇవ్వడం కుదరదని జగన్ ఖరాకండీగా చెప్పాడు. అయినా కొంతమంది కాపు నాయకులు ఆయనకు మద్దతు తెలిపారు. కాపు రిజర్వేషన్ ఇవ్వనని చెప్పినా జగన్ కు మీరు ఎలా మద్దతు తెలుపుతారు..? రిజర్వేషన్ అంశం కేంద్రం పరిధిలో ఉందని అనుకుందాం. కనీసం ఈబీసీ రిజర్వేషన్ 5 శాతం తొలగించినా కాపు నాయకులు ఎందుకు మాట్లాడలేదు..? కాపులకు 5 శాతం కాదు రెండు, మూడు శాతమైనా ఇవ్వొచ్చు కదా..? అరశాతం కూడా రిజర్వేషన్ ఇవ్వని జగన్ కు ఎందుకు ఓట్లు వేయాలని నిలదీయండి. జగన్ కు ఓటు వేయాలని వచ్చే కాపు నాయకులను గట్టిగా నిలదీయండి.
• సినిమా నటులకు సామాజిక బాధ్యత ఉండకూడదా..?
పెద్దలు అంటే గౌరవం ఉంటుంది. వారి మాట కచ్చితంగా గౌరవిస్తాను. అయితే కొందరు కాపు పెద్దలు సినిమా నటులకు ఏమి తెలుసు అని మాట్లాడుతున్నారు. సినిమా నటులు మనుషులు కాదా..? మా సొంత శక్తితో నటనను నమ్ముకొని ప్రభుత్వానికి నిజాయతీగా పన్నులు కడుతున్నాం. మాకు ప్రజలపై ప్రేమ ఉండకూడదా..? వారికి ఏమైనా చేయాలనే తపన ఉండకూడదా..? సామాజిక బాధ్యత ఉండదా..? నేను సినిమాల్లోకి రావాలని ఏనాడు అనుకోలేదు. అలా కుదిరింది అంతే… మా నాన్న చిన్నప్పుడు ఒక్కటే చెప్పారు. స్వామి వివేకానంద చెప్పినట్లు ఇనుప కండరాలు, ఉక్కునరాలు, వజ్ర సంకల్పం ఉన్న యువతే దేశానికి కావాలి. అలాంటి యువతలో నేను ఒకడిని కావాలని కోరుకుంటే ఇంతవరకు వచ్చాను. దశాబ్ధ కాలంగా పనిచేస్తున్న నన్ను ప్రశ్నిస్తున్న పెద్దలకు మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి, వైవీసుబ్బారెడ్డి, జగన్ రెడ్డిల అవినీతి కనిపించడం లేదా..?
• జగన్ అవినీతిని అరికడితే ఎలాంటి పథకాలు అయినా అమలు సాధ్యమే
రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా వైసీపీ నాయకుల అవినీతి, దోపిడీయే కనిపిస్తోంది. ఇసుక దోచేస్తున్నారు. మట్టిని మింగేస్తున్నారు. ప్రజలకు ఎలాంటి మేలు చేయని ఇలాంటి అరటిపండు తొక్క ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేద్దాం. జగన్ మాట్లాడుతూ కూటమి ప్రకటించిన పథకాలు అమలు సాధ్యం కాదని చెబుతున్నాడు. అవినీతిని అరికడితే పథకాలు సాధ్యమే. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి రూ. 450 కోట్లు పక్కదారి పట్టించారు. జాతీయ ఉపాధి హామీ నిధులు దోచేశారు. చివరకు చిన్నపిల్లలకు పంపిణీ చేస్తున్న చిక్కీల్లో కూడా రూ. 65 కోట్లు దోచేశారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం లేదు… గానీ వాలంటీర్లకు సత్కారం చేయడానికి రూ. 703 కోట్లు ఇచ్చారు. మద్యపాన నిషేధం అని చెప్పిన పెద్దమనిషి ఒక్క మద్యంలోనే రూ. 41వేల కోట్లు దోచుకున్నాడు. నాసిరకం మద్యం అమ్ముతూ ఆరోగ్యాలతో చెలగాటమాడుతూ ఆడబిడ్డల తాళిబొట్టులను తెంపేశాడు. జగన్ ముఖ్యమంత్రి కాదు సారా వ్యాపారి. ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడానికి రూ. 1300 కోట్లు ఖర్చు చేశారు. ఆ రంగులు తీయడానికి మరో వెయ్యి కోట్లు ఖర్చు చేశారు. ఇసుక దోపిడీలో రూ. 40 కోట్లు వెనకేసుకున్నారు. పంచాయతీ నిధులు రూ. 8వేల కోట్లు దారి మళ్లించారు. ఇలాంటివన్నీ ఆపితే కూటమి హామీలు అమలు చేయడం పెద్ద కష్టం కాదు.
• ఒక కులం మీద సమాజం నిర్మాణం కాదు
కాపు కులం అండ ఉందనే రాజకీయాల్లోకి వచ్చారా అని ప్రముఖ జర్నలిస్టు శ్రీ రాజదీప్ సర్దేశాయ్ నన్ను అడిగారు. దానికి నేను ఒకటే చెప్పాను. ఏ కులంలో పుట్టాలి..? ఏ రంగులో పుట్టాలి..? ఎంత ఎత్తులో పుట్టాలి..? మన చేతుల్లో లేదు. ఏ వ్యక్తి అయినా అన్ని కులాలను సమానంగా చుస్తూనే నాయకుడిగా ఎదుగుతాడు. ఆర్థిక, సామాజిక అసమానతలు సరిచేసుకుంటూ ముందుకు నడిపించాలి. సమాజం ఎప్పుడూ ఒక కులం పైన నడవదు. సమాజం ఒక కులం మీద నిర్మాణం కాదు. సమాజంపై అన్ని కులాలకు బాధ్యత ఉంటుంది. జ్ఞానం ఉన్న నాయకులు ఆచితూచి మాట్లాడతారు. నా వైపు యువత ఉందని నేను ఎప్పుడు వాళ్లని రెచ్చగొట్టి విధ్వంసం వైపు నడిపించలేదు. వారికి బంగారు భవిష్యత్తు ఉండాలని నిర్మాణాత్మకంగా మాట్లాడాను.
• బీసీ రక్షణ చట్టం అందుకే అవసరం
ప్రతి వర్గాన్ని వైసీపీ నాయకులు వేధించారు. దళితుడిని చంపి డోర్ డెలివరీ చేశారు. జగ్గంపేట నియోజకవర్గంలో శివ అనే దళిత యువకుడిని కారుతో గుద్ది, ఇనుపరాడ్డుతో కొట్టి చంపారు. ఎస్సీలకు చెందిన 27 పథకాలను తొలగించారు. విదేశీ విద్య పథానికి అంబేద్కర్ పేరును తొలగించారు. అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీలందరికీ నెలకు 200 యూనిట్ల దాకా ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తామని జగన్ ఇచ్చిన హామీ అటకెక్కింది. ఇప్పుడు ఒక్కో కుటుంబానికి ఒక కనెక్షన్ కు మాత్రమేనంటూ షరతు విధించారు. అంతేగాక ఎస్సీ, ఎస్టీ కాలనీలు, తండాల్లో నివసించాలని మెలికపెట్టారు. అలాగే అమర్నాథ్ అనే బీసీ కులానికి చెందిన పిల్లాడిని పెట్రోల్ పోసి తగలబెట్టి అతి కిరాతకంగా చంపారు. కోనసీమ జిల్లాలో శెట్టిబలిజలు, దేవాంగులు, మత్స్యకారులపై అక్రమంగా 9 వేలకు పైగా కేసులు పెట్టి వేధించారు. అందుకు ఈ రోజు కూటమి ప్రభుత్వం బీసీ రక్షణ చట్టం అవసరం అని భావిస్తోంది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం ఉన్న రిజర్వేషన్ 24 శాతానికి తగ్గించడంతో చాలా మంది బీసీ నాయకులు రాజకీయ ప్రాధాన్యం కోల్పోయారు. తిరిగి రిజర్వేషన్ పునరుద్ధరిస్తాం. యువతకు ఫీజు రీయింబర్స్ మెంట్ జరగలేదు. 2014-19 మధ్య కాలంలో 16 లక్షల మందికి ఫీజు రీయంబర్స్ మెంట్ జరిగితే… జగన్ హయాంలో కేవలం 8 లక్షల మందికి మాత్రమే ఇచ్చారు. అంబేద్కర్ విదేశీ విద్యా పథకం కింద తెలుగుదేశం పార్టీ హయాంలో 4923 మంది విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదువుకుంటే… జగన్ హయాంలో 116 మంది మాత్రమే విదేశాలకు వెళ్లి చదువుకుంటున్నారు.
• ప్రమాదకరమైన జీవోలు తీసుకొస్తున్నాడు జాగ్రత్త
జగన్ మన భూములు దోచుకోవడానికి ప్రమాదకరమైన జీవోలు తీసుకొస్తున్నాడు. ఇదివరకు దున్నేవాడిదే భూమి అనే వారు. ఇప్పుడు వైసీపీకి ఓటు వేస్తే దున్నని భూమి వైసీపీ నాయకులకు వెళ్లిపోయేలా ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ తీసుకొస్తున్నాడు. మన భూమి మన హక్కు కాదా..? జగన్ తాతల ఆస్తినా ఇది..? రేపు భూమిని పసుపు కుంకుమ కింద ఇవ్వాలన్నా, తాకట్టు పెట్టాలన్నా ఒరిజనల్ పత్రాలు కావాలి. ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ కింద మన ఒరిజినల్స్ ప్రభుత్వం వద్ద ఉంటాయి. మన దగ్గర కేవలం జిరాక్స్ లు మాత్రమే ఉంటాయి. సంక్షేమ పథకాలు కూడా ఆయన డబ్బుతో ఇస్తున్నట్లు బిల్డప్ ఇస్తున్నాడు. ఇదంతా మన కష్టం. మనం కష్టపడి ట్యాక్సులు కడితేనే జగన్ సంక్షేమ పథకాలు ఇవ్వగలుగుతున్నాడు. పెన్షన్ పథకాన్ని శ్రీ దామోదరం సంజీవయ్య గారు తీసుకొచ్చారు. జగన్ ఏదో తీసుకొచ్చినట్లు చెబుతున్నాడు.
• జగ్గంపేటకు పూర్వవైభవం తీసుకొస్తాం
జగ్గంపేట నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఏలేరు రిజర్వాయర్ నుంచి నీటిని ఎత్తిపోసి జగ్గంపేట, రంపచోడవరం నియోజకవర్గాల పరిధిలోని మెట్టప్రాంతాలైన మెల్లేరు, మల్లవరం, గోవిందపురంలోని దాదాపు 10వేల ఎకరాలకు సాగునీటిని అందించాలనే ఉద్దేశంతో ప్రారంభించిన మల్లవరం – గోవిందపురం ఎత్తిపోతల పథకం రద్దయ్యింది. రూ.132.79 కోట్లు అంచనా వ్యయంతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు పనులు 8 శాతం పూర్తయ్యాక రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. దానిని తిరిగి ప్రారంభిస్తాం. పుష్కర ఎత్తిపోతలకు నిధులు విడుదల కాకపోవడంతో దాదాపు 60 వేల ఎకరాలు బీడుగా మారిపోయాయి. పుష్కర ఎత్తిపోతలకు నిధులు విడుదల చేస్తాం. పోలవరం ఎడమ కాలువ మట్టి వైసీపీ నాయకులకు కాసులు కురిపిస్తోంది. వారు దోచుకుంటున్నా జలవనరులు శాఖ అధికారులు ఏమీ చేయలేకపోతున్నారు. మట్టి దోచుకున్న ప్రతి ఒక్కరిని బయటకు లొక్కొచ్చి ప్రతిపైసా కక్కిస్తాం. స్థానిక వైసీపీ నాయకులు వందల ఎకరాల చెరువులను కబ్జా చేశారు. కొండలను కూడా మిగల్చలేదు. సెంటు భూమి పేరిట కోట్లు దోచుకున్నారు. వాళ్లుతిన్న ప్రతిపైసా కక్కిస్తాం. కిర్లంపూడిలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ నిర్మిస్తాం. ఏలేరు రిజర్వాయర్ ఆదునీకీకరణ చేపడతాం. రైతాంగానికి తాగు, సాగు నీరుకు ఇబ్బంది లేకుండా చూస్తాం. ఫుట్ పాత్ వ్యాపారులను వడ్డీ వ్యాపారుల నుంచి కాపాడతాం. మన దగ్గర ఫైన్లు వేసిన డబ్బునే వాహన మిత్ర అని జగన్ రూ. 10 వేలు ఇస్తున్నాడు. 20 పడకల ఆస్పత్రిని 50 పడకల ఆస్పత్రిగా మారుస్తాం. రైతు తన కష్టాలు చెప్పుకోవడానికి వస్తే గండేపల్లి మండలం రామాయపాలెంలో బూతులు తిట్టారు. గోకవరంలో జలవనరుల శాఖ స్థలంలో ఎమ్మెల్యే అనుచరులు పర్మిషన్ లేకుండా లాడ్జ్ కట్టారు. పేదలు ఇళ్లు కట్టుకోవాలంటే పర్మిషన్ కావాలి. ఇది మారాలంటే కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలి. నేను ఈ రోజు మాట ఇస్తున్నాను. నా భవిష్యత్తులో కూడా నా అంత కష్టపడే నాయకుడు లేడు అనేలా మీ కోసం పనిచేస్తాను. రాష్ట్రాన్ని గంజాయి స్మగ్లింగ్ కు కేరాఫ్ గా మార్చేశారు. యువత జీవితాలతో ఆడలాడుకుంటున్నారు. రాష్ట్రంలో మద్యం ఏరులైపారుతోంది. రెండు రోజుల క్రితమే పిఠాపురంలో రూ.1.27 కోట్ల మద్యం దొరికింది. 30 వేల మంది ఆడబిడ్డలు అదృశ్యమైపోయారు. మహిళ కన్నీరు గోదారిలా పారుతోంది. ఆడబిడ్డలకు రక్షణ కల్పించి కన్నీరు తుడిచే కూటమి ప్రభుత్వం వస్తోందని హామీ ఇచ్చారు. కాకినాడ లోక్ సభ స్థానం నుంచి కూటమి అభ్యర్థిగా శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, జగ్గంపేట శాసనసభ స్థానం నుంచి కూటమి అభ్యర్థిగా శ్రీ జ్యోతుల నెహ్రూ పోటీ చేస్తున్నారు. వీరిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.