సమష్టి పోటీ.. ఐకమత్య పోరు… ఉమ్మడి విజయమే లక్ష్యం

విజయమే

• 175 నియోజకవర్గాల్లో మూడు పార్టీలు పోటీ చేసినట్లు భావించాలి
• మూడు పార్టీల కలివిడితనం పోలింగ్ బూతుల్లోనూ కనిపించాలి
• జనసేన రిస్క్ తీసుకొని మరీ తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచింది
• శ్రీ చంద్రబాబు లాంటి నాయకుడిని కావాలని వేధించిన వైసీపీ ప్రభుత్వం
• నా వంతుగా ఆయనకు కీలక సమయంలో అండగా నిలిచాను
• పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో శ్రీ పవన్ కళ్యాణ్
‘పిఠాపురంలో కేవలం పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నట్లు భావించాల్సిన అవసరం లేదు. ఇక్కడ వ్యక్తి విజయం కంటే కూటమి విజయం ముఖ్యం. నేను గెలిస్తే శ్రీ వర్మ గారు గెలిచినట్లే. ఈ ఎన్నికలు సమష్టి పోటీ అని మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు భావించాల’ని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. శనివారం మధ్యాహ్నం యు.కొత్తపల్లిలో పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ముందుగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడి గారి జన్మదినం సందర్భంగా తెలుగుదేశం పార్టీ పిఠాపురం ఇంఛార్జి శ్రీ ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ గారు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన కేక్ ను శ్రీ పవన్ కళ్యాణ్ గారు కత్తిరించి చంద్రబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “దార్శనికుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడి గారి జన్మదినం రోజున పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొనడం ఆనందంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో మూడు పార్టీలు 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నట్లు భావించాలి. ప్రతి చోట జనసేన పోటీ చేసినట్లు జన సైనికులు, వీర మహిళలు భావిస్తే… ప్రతి చోట తెలుగుదేశం పార్టీ పోటీ చేసినట్లు తెలుగుదేశం కార్యకర్తలు భావించాలి. అలాగే బీజేపీ కార్యకర్తలు కూడా తాము 175 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు భావించి, మూడు పార్టీల కార్యకర్తలు ఐకమత్యంగా పోరాడితేనే ఉమ్మడి విజయం అద్భుతంగా ఉంటుంది. కూటమి ప్రభుత్వం బలంగా ఏర్పడుతుంది.
• వైసీపీ పాలనకు ముగింపు పలకాలనేదే లక్ష్యం
రాష్ట్రంలో వైసీపీ పాలన ముగిసి సుస్థిరమైన పాలన ప్రజలకు అందాలనే ఆకాంక్షతోనే తెలుగుదేశం పార్టీ క్లిష్ట సమయంలో ఆ పార్టీకి జనసేన అండగా నిలిచింది. అటు ఇటు అయితే జనసేన పార్టీ ఉనికికే ప్రమాదం అని తెలిసినా ఆ రోజు రాజమండ్రి జైలుకు వెళ్లి శ్రీ చంద్రబాబు గారిని పరామర్శించిన వెంటనే పొత్తు నిర్ణయం తెలియజేశాం. బీజేపీ సైతం తరువాత కూటమిలోకి రావడంతో వైసీపీ పతనం ఖాయమైంది. తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ కాబట్టే కీలక సమయంలో ఆ పార్టీకి అండగా నిలిచిచాం. శ్రీ చంద్రబాబు గారి లాంటి వ్యక్తిని వైసీపీ వేధిస్తూ.. కావాలని జైల్లో పెట్టిన సమయంలో ఆయనకు వెన్నుదన్నుగా నిలిచాం. ఈ రాష్ట్రంలో వైసీపీ పాలనకు అంతం పలకాలి అన్నదే దీని వెనకున్న అర్థం. దీనిని రెండు పార్టీల కార్యకర్తలు సూక్ష్మంగా ఆలోచించి సమష్టిగా ముందుకు కదలడం చూస్తే ముచ్చటగా ఉంది. ఇదే స్ఫూర్తిని పోలింగ్ బూత్ వరకు తీసుకెళ్లి కూటమి ప్రభుత్వానికి బలమైన పునాది కార్యకర్తలు వేయాల”ని అన్నారు. పిఠాపురం టిడిపి ఇంచార్జ్ శ్రీ వర్మ గారు మాట్లాడుతూ “పొత్తులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 144 స్థానాల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు టీడీపీని మోస్తుంటే, 21 స్థానాల్లో శ్రీ చంద్రబాబు నాయుడు గారు జనసేనను మోస్తున్నారు. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన ఎమ్మెల్యే అభ్యర్ధిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఎంపీ అభ్యర్ధిగా శ్రీ ఉదయ్ శ్రీనివాస్ బరిలో ఉన్నారు. టీడీపీ అధినేత ఆదేశాలను పాటిస్తూ ప్రతి కార్యకర్త వీరిరువురినీ భారీ మెజారిటీతో గెలిపించాల”ని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జనసేన పార్టీ లోక్ సభ అభ్యర్థి శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు శ్రీ తుమ్మల బాబు, జనసేన, టిడిపి నేతలు డా. జ్యోతుల శ్రీనివాస్, శ్రీ మర్రెడ్డి శ్రీనివాస్, శ్రీ గిరిష్ వర్మలు పాల్గొన్నారు.

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్