ఆంక్షల కంచెలు తెంచుకుంటూ..

కంచెలు

• రుషికొండకు వెళ్లిన శ్రీ పవన్ కళ్యాణ్
• రుషికొండ పరిసరాల్లో తీవ్ర ఆంక్షలు
• నిషిద్ధ ప్రాంతంగా రుషికొండ
• అడుగడుగునా బారికేడ్లు.. పోలీసుల మోహరింపు
• అన్ని మార్గాలు మూసివేసిన పోలీసులు
• సామాన్య ప్రజలు నడవటానికి కూడా అనుమతి నిరాకరణ
• చెక్ పోస్టులు దాటుకుంటూ రుషికొండకు చేరిన జనసేనాని
• మీడియా వాహనంపై నుంచి అక్రమ నిర్మాణాల పరిశీలన

            విశాఖలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి వారాహి విజయ యాత్ర తీవ్ర ఆంక్షల మధ్య సాగుతోంది. శ్రీ పవన్ కళ్యాణ్ గారు హోటల్ నుంచి అడుగు బయటపెడుతున్నారంటే పోలీసులు పలు ఆంక్షలు విధిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రుషికొండకు గుండు కొట్టి, ధ్వంసం చేస్తూ వైసీపీ ప్రభుత్వం చేపట్టిన అక్రమ నిర్మాణాల పరిశీలనకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్న విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని అష్ట దిగ్భంధనం గావించారు. అడుగడుగునా చెక్ పోస్టులు పెట్టారు. భారీ ఎత్తున పోలీసులను మోహరించి ఆంక్షలు అమలు చేశారు. ఒకప్పుడు పర్యటక ప్రదేశంగా ఉన్న రుషికొండను నిషిద్ధ ప్రాంతంగా మార్చేశారు. బీచ్ రోడ్డుతో పాటు రుషికొండ వైపు వెళ్లే అన్ని రహదారులను పూర్తిగా మూసివేసి.. సామాన్య ప్రజలకు కూడా ప్రవేశం లేకుండా చేశారు. సామాన్యులు నడిచేందుకు కూడా అనుమతించ లేదు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి పర్యటనపై యధావిధిగా ఆంక్షలు అమలు చేశారు. వాహనం నుంచి బయటకు రాకూడదు, ప్రజలు వచ్చినా అభివాదం చేయకూడదు వంటి రూల్స్ తో రంగంలోకి దిగారు. అయితే పోలీసుల ఆంక్షల కంచెలు దాటుకుంటూ రుషికొండకు వెళ్లిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిబంధనలకు విరుద్దంగా కొండను తొలిచి చేస్తున్న అక్రమాలను బట్టబయలు చేశారు.
• నోవాటెల్ నుంచే ఆంక్షలు
            శ్రీ పవన్ కళ్యాణ్ గారి రుషికొండ పర్యటన ప్రకటన వెలువడిన వెంటనే పోలీసులు విశాఖలో అలర్ట్ ప్రకటించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు బస చేసిన నోవాటెల్ హోటల్ ప్రాంతాన్ని డీసీపీ నుంచి సీఐ స్థాయి అధికారులు ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి వాహనంతోపాటు సిబ్బంది వాహనాలు, నాయకుల వాహనాలు తాము చెప్పిన విధంగానే ముందుకు వెళ్లాలని ఒత్తిడి చేశారు. పరిమిత సంఖ్యలో మాత్రమే వాహనాలను అనుమతిస్తామని తేల్చేశారు. జోడుగుళ్లపాలెం నుంచి అయితే కేవలం శ్రీ పవన్ కళ్యాణ్ గారి వాహనాన్ని మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. తీవ్రమైన ఆంక్షల నేపధ్యంలో ఒక దశలో పరిస్థితులు పోలీసులు-పార్టీ నాయకుల మధ్వ వాగ్వాదానికి దారి తీశాయి. పోలీసు ఆంక్షల మధ్య 4.15 గంటల ప్రాంతంలో హోటల్ నుంచి శ్రీ పవన్ కళ్యాణ్ గారు రుషికొండకు బయలుదేరారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి వాహన శ్రేణికి ముందు, వెనుక కూడా పోలీసు వాహనాలను మోహరించి ముందుకు తీసుకువెళ్లారు. పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, ద్విచక్ర వాహనాలతో పార్టీ శ్రేణులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని అనుసరించాయి.
• కదిలేదిలేదన్న శ్రీ పవన్ కళ్యాణ్
              జోడుగుళ్లపాలెం వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టు వద్ద పోలీసుల ఆంక్షలతో కాసేపు హైడ్రామా నడిచింది. శ్రీ పవన్ కళ్యాణ్ గారితో పాటు వచ్చిన వాహనాలను నియంత్రించి అక్కడే నిలిపివేసే ప్రయత్నం చేశారు. దీంతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు, పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు వాహనం నుంచి కిందికి దిగి పోలీసులతో మాట్లాడారు. ప్రతి వాహనాన్ని తనతో వదిలితేనే ముందుకు కదులుతానని శ్రీ పవన్ కళ్యాణ్ గారు తేల్చి చెప్పారు. అప్పటికే అక్కడికి పెద్ద సంఖ్యలో జన సైనికులు చేరుకుంటుండడంతో పోలీసులు దిగి వచ్చారు. అన్ని వాహనాలను ముందుకు వెళ్లేందుకు అనుమతిచ్చారు. మార్గమధ్యంలో మరో మూడు చెక్ పోస్టులు పోలీసులు ఏర్పాటు చేయగా అన్ని చోట్లా శ్రీ పవన్ కళ్యాణ్ గారు వాహనం నుంచి కిందికి దిగాల్సి వచ్చింది. రాడిసన్ బ్లూ హోటల్ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టు వద్ద జనసైనికుల ద్విచక్ర వాహనాల తాళాలు, సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకోగా, శ్రీ పవన్ కళ్యాణ్ గారు పోలీసులతో మాట్లాడి వాటిని వెనక్కి ఇప్పించారు.
• మీడియా వాహనం పైకి ఎక్కి…
            అక్కడి నుంచి రుషికొండకు గుండు కొట్టిన ప్రాంతానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేరుకున్నారు. రుషికొండ పైకి వెళ్లే మార్గాన్ని మూసివేసి అటువైపు వెళ్లకుండా వందల సంఖ్యలో పోలీసులను మోహరించారు. అక్కడ వాహనం నుంచి దిగి రోడ్డు వెంట నడుస్తూ రుషికొండలో వైసీపీ ప్రభుత్వ ధ్వంస రచనను పరిశీలించారు. పార్టీ నాయకులను అడిగి అక్కడ జరుగుతున్న విధ్వంసంపై ఆరా తీశారు. స్థానిక యువత కూడా పచ్చటి రుషికొండను వైసీపీ ఎలా మార్చేసిందో శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వివరించారు. న్యాయ స్థానాల ఆదేశాలను పట్టించుకోకుండా అక్కడ నిర్మించిన ప్యాలెస్ ను పరిశీలించారు. రోడ్డు పైనుంచి పూర్తిగా భవనాలు కనబడక పోవడంతో మీడియా కోసం ఏర్పాటు చేసిన వాహనం పైకి ఎక్కి నిర్మాణాలను పరిశీలించారు. అక్రమ నిర్మాణాలపై మీడియా మిత్రులను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు.
• దారి పొడుగునా జనమే జనం
            జనసేనాని రుషికొండ రాక విషయం తెలుసుకున్న పార్టీ శ్రేణులు, ప్రజలు దారిపొడుగునా ఆయనకు స్వాగతం పలికేందుకు ఎగబడ్డారు. కైలాసగిరి, జోడుగుళ్లపాలెం, విశాఖ వ్యాలీ రోడ్డు, సాగర్ నగర్ తదితర ప్రాంతాల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ప్రజలు పెద్ద సంఖ్యలో రోడ్ల మీదకు వచ్చారు. పోలీసు ఆంక్షల నేపధ్యంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు వాహనం లోపలి నుంచే అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. అయితే కైలాసగిరి వద్ద, జోడుగుళ్లపాలెం తదితర ప్రాంతాల్లో జనసైనికులు, ప్రజలు వాహనానికి అడ్డుగా నిలబడి శ్రీ పవన్ కళ్యాణ్ గారు బయటికి రావాలంటూ పట్టుబట్టారు. ప్రజల కోరిక మేరకు బయటకు వచ్చి వారికి అభివాదం చేశారు. కొంత మందితో ఫోటోలు దిగారు.
• వందల సంఖ్యలో పోలీసుల మోహరింపు
          శ్రీ పవన్ కళ్యాణ్ గారు రుషికొండ పర్యటన నేపధ్యంలో ఆర్కే బీచ్ నోవాటెల్ హోటల్ నుంచి గీతం కాలేజీ మధ్య వందల సంఖ్యలో పోలీసులను మోహరించారు. పోలీసుల తీరు పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమయ్యింది.

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్