* రాజోలులో నాయకుడు వెళ్లిపోయినా శ్రేణులు అండగా నిలబడ్డాయి.
* ఆ ప్రేరణతోనే వారాహి విజయ యాత్ర ఇక్కడ నుంచి ప్రారంభించాం
* పి.గన్నవరంలో జనసేన జెండా ఎగురవేస్తాం
* జనసేన గెలుపు ప్రజల గెలుపు
* పి.గన్నవరంలో నియోజకవర్గ నాయకుల సమావేశంలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్
వైసీపీ పాలన నుంచి అన్నపూర్ణలాంటి ఉభయ గోదావరి జిల్లాలను విముక్తి చేయగలిగితే రాష్ట్రం బాగుపడుతుందని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ అన్నారు. గోదావరి జిల్లాల ప్రజలు ఇచ్చే తీర్పు రాష్ట్రాభివృద్ధికి సూచికగా మారుతుందని చెప్పారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాజోలులో మార్పు కోసం చిరు దీపం వెలి గించారు…అది భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా అఖండ జ్యోతిగా మారి ప్రజలందరికీ వెలుగునిస్తుందన్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలోని 34 నియోజకవర్గాలపై జనసేన ప్రత్యేక దృష్టి సారించిందని… వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పి. గన్నవరం నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరడం ఖాయమన్నారు. శనివారం దిండిలో పి.గన్నవరం నియోజకవర్గ నాయకులు, ఎమ్.పి.టి.సి.లు, సర్పంచ్ లు, వార్దు సభ్యులతో ఆయన సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా సామాన్యుడికి అండగా ఉండాలని 2008లో కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ స్థాపించాను. బడుగు, బలహీన వర్గాలు, అధికారం చూడని వర్గాలకు అధికారం అందాలనే ఆశయంలో 2009లో పొలిటికల్ ప్రాసెస్ లోకి వచ్చాం. రాజకీయ పార్టీకి అన్ని వర్గాల నుంచి మద్దతు లభించింది. అయితే కొంతమంది కోవర్టుల వల్ల పార్టీని విలీనం చేయాల్సి వచ్చింది. రాజోలు జనసేన నాయకులు, కార్యకర్తల్లా ఆనాడు నాయకులు బలంగా నిలబడి ఉంటే పార్టీని విలీనం చేయాల్సిన అవసరం వచ్చేదే కాదు. 2014లో జనసేన పార్టీ స్థాపించినప్పుడు నేను ఒకటే చెప్పాను… ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢాంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు కాని గుండెల నిండా ధైర్యం ఉంది అనే కవి మాటలు చెప్పాను. 2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీని రాజోలు నియోజకవర్గంలో గెలిపించి మార్పు కోసం చిరు దీపం వెలిగించారు. మీరు వెలిగించిన ఆ దీపమే భవిష్యత్తులో అఖండ జ్యోతిగా ప్రజలందరికీ వెలుగులు పంచుతుంది.
అంబేద్కరిజం అంటే ఏమిటి జనసేన పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీ వదిలిపెట్టి వెళ్లిపోయారు. ఆయన చిన్నపిల్లాడు కాదు- రిసార్టులు, హోటల్స్ లో పెట్టి బుజ్జగించడానికి… బాగా చదువుకున్న వ్యక్తి. నిజమైన అంబేద్కరిజం అంటే ఎన్ని కష్టాలు ఎదురైనా నమ్ముకున్న ప్రజలకు అండగా నిలబడటం. అంతే తప్ప ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి జంప్ అవ్వడం కాదు. ఎమ్మెల్యే పక్క పార్టీకి వెళ్లిపోయినా ఈ ప్రాంత వాసులు ఇంతటి ఘన స్వాగతం పలికారు. ఓడిపోయిన తరువాత కూడా ప్రజలు భుజం తట్టి అండగా నిలబడటం ఒక్క జనసేన పార్టీ విషయంలోనే జరిగింది. నిజంగా ఈ రోజు పార్టీలోనే ఉండి ఉంటే భుజాలపై పెట్టుకొని చూసుకునేవాళ్లం. ఎమ్మెల్యే వెళ్లిపోయినా పార్టీకి అండగా ప్రజలు నిలబడ్డారు. ఆ ప్రేరణతోనే ముందుకు వెళ్తున్నాం. కష్టాలను తట్టుకొని నాయకులు నిలబడితే కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ప్రజలు అండగా నిలబడతారని వారాహి యాత్ర నిరూపిస్తోంది.
బలం ఉన్న చోట నుంచే యుద్ధం మొదలుపెట్టాలి బలం ఉన్న చోట నుంచే యుద్ధం మొదలు పెట్టాలి. జనసేన పార్టీకి ఉభయగోదావరి జిల్లాకు మంచి పట్టు ఉంది. దాదాపు 18 శాతం ఓటు బ్యాంకు ఉంది. ముందుగా వైసీపీ పాలన నుంచి ఉభయ గోదావరి జిల్లాలను విముక్తి చేయగలిగితే రాష్ట్రం బాగుపడుతుంది. మనల్ని పాలించే నాయకుడు మనకంటే నిజాయతీపరుడైతేనే మనకు న్యాయం జరుగుతుంది. నిన్న రాజోలు మెయిన్ రోడ్డులో ప్రయాణం పడవ ప్రయాణంలా సాగింది. అడుగుకో గుంతపడి ప్రయాణం నరకంగా మారింది. వాహనమిత్ర పేరుతో ఇస్తున్న పది వేల రూపాయలు ఆటోల రిపేర్లకు కూడా రావడం లేదని ఆటో డ్రైవర్లు వాపోతున్నారు. ఆక్వా పరిశ్రమ వల్ల భూగర్భ జలాలు నాశమైపోతున్నాయి. తాగటానికి నీళ్లు దొరకని పరిస్థితి నెలకొంది. ఆక్వా పరిశ్రమ వల్ల డబ్బులు వస్తాయి కానీ డబ్బులను తాగలేం కదా. కోనసీమ నుంచి ఒ.ఎన్.జి.సి., గెయిల్, రిలయన్స్, వేదాంత ఇలా అనేక ఆయిల్ కంపెనీలు ఇక్కడ నుంచి ఆయిల్ నిక్షేపాలను తరలిస్తున్నాయి. పైప్ లైన్ లీకులు వల్ల బ్లో అవుట్లు జరిగి వాతావరణ కలుషితమవుతుంది. ప్రజలు మృత్యువాత పడుతున్నారు. ఆయిల్ కంపెనీలు తమ లాభాల్లో 2 శాతం వాటాను ఇక్కడి ప్రాంతాల అభివృద్ధికి ఖర్చు చేయాలి. కానీ క్షేత్ర స్థాయిలో అలాంటి పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. పార్టీలో వర్గాలు ఉండటం తప్పు లేదు. అందరూ కలిసి జనసేన గెలుపుకు కృషి చేయాలి తప్పితే… వర్గాల పోరులో పార్టీ ఓడిపోకూడదు. జనసేన గెలుపు ప్రజల గెలుపు అది గుర్తు పెట్టుకొని నాయకులు పని చేయాలి.
మార్పు మొదలైంది కాబట్టే దాడులకు ప్రయత్నిస్తున్నారు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అందరికీ సమానంగా ఉండాలి. ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ ను చంపి డోర్ డెలివరీ చేశాడు. చట్టం బలంగా పనిచేసి ఉంటే ఆయన్ను వెంటనే పోలీసులు అరెస్టు చేయాలి. అలా జరగలేదు. అనంతబాబు అరెస్టు కాకుండా ముఖ్యమంత్రి సామాజికవర్గానికి చెందిన వ్యక్తి ఆశ్రయం ఇచ్చాడు. చంపిన వ్యక్తి కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. చనిపోయిన వ్యక్తి దళితుడు. చంపిన వ్యక్తి ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినా శిక్షపడాలి అదే రూల్ ఆఫ్ లా. అక్కను వేధించొద్దు అన్నందుకు 14 ఏళ్ల గౌడ కులానికి చెందిన బాలుడిని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన యువకుడు పెట్రోల్ పోసి తగలబెట్టాడు. రాజు నీతి తప్పితే నేల సారం తప్పుతుంది. తల్లిదండ్రులు తిట్టుకుంటూ లేస్తే పిల్లలు కొట్టుకుంటూ లేస్తారు. ఈ ప్రభుత్వం రౌడీలు, గుండాలను వెనకేసుకొస్తుంది. మనం మేల్కోపోతే ఇబ్బందిపడతాం. ప్రజలకు ముందు సత్యాన్ని ఉంచడానికి ప్రయత్నం చేస్తుంటే రాజోలులో నాపై రాళ్ల దాడి చేయడానికి ప్రయత్నించారు. దాడికి ప్రయత్నించారు అంటే సమాజంలో మార్పు మొదలైందని అర్థం.
రాజమండ్రిలో ప్రాంతీయ కార్యాలయం ఈ మధ్యనే ప్రారంభించాం. పిఠాపురం, అమలాపురంలో కూడా త్వరలోనే పార్టీ కార్యాలయాలు ప్రారంభించబోతున్నాం. రాజోలు, పి.గన్నవరంలో కూడా పార్టీ కార్యాలయాలుపెట్టి వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తాను. నా బలం, బలహీనత రెండూ నాకు బాగా తెలుసు. మండల, గ్రామ స్థాయిలో ప్రతి ఒక్క నాయకుడిని కలుస్తాను. నేను కదలాలి అంటే దాదాపు 400 మంది సిబ్బంది కదలాలి. అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. వైసీపీలా నియోజకవర్గానికి రూ. 25 లక్షలు ఖర్చు చెయ్ అని మన నాయకులకు మనం చెప్పం. మీరు ఎంత చేయగలిగితే అంత చేయండి అని మాత్రమే చెబుతాను. మనకు ఇసుక, మైనింగ్ దోపిడీ వల్ల వేలకోట్లు రావు. మన డబ్బు మనమే సంపాధించుకోవాలి అందుకే సినిమాలు చేస్తున్నాను. భూదందాలు ఆగాలన్నా, మట్టి, ఇసుక దోపిడిపై పోరాటం చేయాలన్నా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాలన్నా స్థానిక నాయకులు త్రికరణ శుద్ధిగా పని చేయాలి” అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు శ్రీ కందుల దుర్గేశ్, రాష్ట్ర కార్యదర్శి శ్రీ గడసాల అప్పారావు, జిల్లా నాయకులు శ్రీ శిరిగినీడి వెంకటేశ్వర రావు, శ్రీ వాసంసెట్టి కుమార్, శ్రీ మద్దా చంటిబాబు, శ్రీమతి మేడిచర్ల సత్యవాణి తదితరులు పాల్గొన్నారు.